ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్: విహారయాత్ర విషాదం మిగిల్చింది. ఆరుగురు స్నేహితులు సరదాగా గడుపుదామని వెళ్లగా జలపాతంలో పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో ఆదిలాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీకి చెందిన ఆరుగురు స్నేహితులు ఆదివారం మహారాష్ట్రలోని సాసర్‌కుండ్ జలపాతాన్ని సరదాగా చూడటానికి వెళ్లారు. వీరిలో షేక్ సల్మాన్ (20), సయ్యద్ సల్మాన్ (21)లు జలపాతం వద్ద కొండపై ఫొటోలు దిగుతున్నారు. వీరు ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతం గుంతలో పడి మునిగిపోయారు. స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలపాటు జాలరులు గాలించగా మృతదేహాలు దొరికాయి. మహారాష్ట్ర పోలీసులు పోస్టుమార్టం చేయించి ఆదిలాబాద్‌కు తరలించారు.
రెండు కుటుంబాల్లో విషాదం
షేక్ సల్మాన్ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హైదరాబాద్ నుంచి సెలవుల నిమిత్తం మూడు రోజుల క్రితం ఆదిలాబాద్‌కు వచ్చాడు. సల్మాన్ తండ్రి షేక్‌సత్తర్ చిరువ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. ముగ్గురిలో సల్మాన్ పెద్ద కొడుకు కావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలని కష్టపడి హైదరాబాద్‌కు పంపించారు.
కొడుకు పైకొచ్చి తమను సుఖంగా చూసుకుంటారనుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఇక సయ్యద్ సల్మాన్‌ది మధ్యతరగతి కుటుంబం. తండ్రి సయ్యద్ సలీం వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో సల్మాన్ ఆటో నడుపుతూ ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. షేక్ సల్మాన్, సయ్యద్‌సల్మాన్‌లు వరుసకు బావమరుదులు. ఈ క్రమంలోనే సెలవులపై హైదరాబాద్ నుంచి వచ్చిన షేక్‌సల్మాన్‌తోపాటు మిగతా స్నేహితులు గుడ్డు, సమీర్‌అలీ, మంచీర్, రిజ్వాన్‌లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరిరువురు జలపాతంలో పడిమృతి చెందడంతో ఖానాపూర్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి.