విహార యాత్ర ముగించుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఈ సంఘటన జరిగింది.
బెంగళూరు, న్యూస్‌లైన్: విహార యాత్ర ముగించుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివార్లలోని తలఘట్టపుర పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఈ సంఘటన జరిగింది. మృతులు బెంగళూరుకు చెందిన వారుగా గుర్తించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు... శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇక్కడి సిటీ మార్కెట్ నుంచి బయలు దేరిన బీఎంటీసీ బస్సు కనకపుర రోడ్డులోని కెంపయ్యనపాళ్యకు బయలు దేరింది.
బెంగళూరు నగరంలోని నీలసంద్రకు చెందిన యువకులు కనకపుర సమీపంలోని మేకదాటికి విహార యాత్రకు వెళ్లి రెండు కార్లలో బెంగళూరు బయలుదేరారు. మార్గం మధ్యలో కనకపుర మెయిన్ రోడ్డులోని సోమనహళ్లి దగ్గర ఉన్న ఏపీఎస్ కాలేజ్ సమీపంలో సాయంత్రం 4.30 గంటలకు బీఎంటీసీ బస్సును మలుపు వద్ద షిఫ్ట్ డిజైర్ కారు (కేఏ 05- ఎంఎల్ 9825) ఢీకొంది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కనకపుర మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుక్ను హారోహళ్లి పోలీస్ స్టేషన్ సీఐ రామచంద్రప్ప, తలఘట్టపుర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
స్థానికుల సాయంతో 45 నిమిషాల పాటు శ్రమించి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు బెంగళూరులోని నీలసంద్రకు చెందిన యాసిర్ ఖాన్, అయూబ్, యారుబ్, జువైద్, మయూర్‌గా గుర్తించామని సీఐ రామచంద్రప్ప తెలిపారు. విహార యాత్రకు వెళ్లి వస్తుంటే ప్రమాదం జరిగిందని, అందరు విద్యార్థులేనని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ తలఘట్టపుర పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.