గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా...?
నాకిప్పుడు ఆరోనెల నడుస్తోంది. మావారితో కలిసి విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాను. గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా? నాకు కాస్త వివరంగా చెప్పండి.
- సుచిత్ర, హైదరాబాద్
ఇది చాలా మంది గర్భవతులకు చాలా సాధారణంగా వచ్చే సందేహమే. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని తరచూ డాక్టర్‌ను అడుగుతుంటారు. గర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గుర్తించాలి. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.
గర్భంతో ఉన్న వ్యవధిలో తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆర్నెల్ల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి ప్రసవం అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటారన్నది తెలిసిందే. ఏ ట్రైమిస్టర్‌లో అయినా ప్రయాణాలు చేయవచ్చు. కాకపోతే మొదటి, మూడో ట్రైమిస్టర్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మొదటి ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. అటువంటి సమయంలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే కొంతమందిలో కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు మొదటి ట్రైమిస్టర్‌లో ఉండవచ్చు. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యుల సలహా మేరకు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు.
ఇక రెండో ట్రైమిస్టర్‌లో తల్లి ఆరోగ్య పరిస్థితి, బిడ్డకు సంబంధించిన వివరాలు (స్కానింగ్ రిపోర్టులు) అన్నీ బాగా ఉంటే, అటువంటి వారు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిజానికి బిడ్డ పుట్టాక, చిన్నారి సపర్యలతో చాలాకాలం వరకు ఎటూ కదలడానికి, వెళ్లడానికి వీలుకాదు కాబట్టి ఒకవేళ విహార యాత్రలకు వెళ్లాలనుకుంటే రెండో ట్రైమిస్టర్ అన్నది చాలా సౌకర్యవంతమైన సమయం అనుకోవచ్చు. అయితే దూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి.
మూడో ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే. కాకపోతే తొమ్మిదోనెల దాటాక ప్రయాణాలు అంత మంచివి కాదు. ఇక 32-34 వారాల ప్రెగ్నెన్సీ సమయం నాటికి తాము ప్రసూతి ప్లాన్ చేసుకున్న చోటికి వచ్చి ఉండటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే తొమ్మిదో నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా మొదలవుతాయో తెలియదు. పైగా ఒక్కోసారి అకస్మాత్తుగా ఉమ్మనీరు బయటకు చిమ్మడం వంటివి కూడా కనిపించవచ్చు. అందుకే 34 వారాల తర్వాత ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోకుండా, తాము ప్రసూతి కావాలనుకున్న చోటే ఉండటం మంచిది.
ఇక ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఎలాంటి వాహనాలలో వెళ్లాలి, బస్‌లోనా, కారులోనా, రైల్లోనా, విమానప్రయాణాలు చేయవచ్చా...లాంటి సందేహాలను వెలిబుచ్చుతుంటారు. కుదుపులు లేకుండా ఉండే ఎలాంటి ప్రయాణమైనా చేయవచ్చు. ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని అడుగుతుంటారు. కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్‌లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా కార్ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటి వాటిని అవాయిడ్ చేయాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది. ఇక కార్ నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అయితే ఈ సీట్ బెల్ట్‌ను సౌకర్యంగా పొట్ట కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి.
ఇక విమాన ప్రయాణం చేసేవారు తాము ఏ కంపెనీకి చెందిన ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటున్నారో, వారిని సంప్రదించాలి. ఎందుకంటే కంపెనీని బట్టి వారు ప్రెగ్నెన్సీలో ఏ సమయం వరకు ప్రయాణాన్ని అనుమతిస్తారో, ఆ సమయం వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఒకవేళ విమాన ప్రయాణం అన్నది ఆరు గంటల కంటే ఎక్కువగా కొనసాగాల్సి వస్తే మాత్రం... ప్రతి రెండు గంటలకొకసారి ఫ్లైట్‌లోనే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిరగాలి. ఇక ఎనిమిది గంటలకు పైగా ప్రయాణం కొనసాగించాల్సి వస్తే మాత్రం విధిగా స్టాకింగ్స్ ధరించాలి. దీనివల్ల కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని నివారించవచ్చు.
ఒకవేళ 8 నుంచి 10 గంటలకు పైగా విదేశాలకు వెళ్లడం వంటి దూరప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే... ప్రయాణానికి ముందే తమ డాక్టర్‌ను విధిగా సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అవసరాన్ని బట్టి రక్తం గడ్డకట్టకుండా నివారించే ఇంజెక్షన్స్ (థ్రాంబోప్రొఫిలాక్టిక్ ఇంజెక్షన్స్) ఇచ్చి, ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఇక గర్భవతులు విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు విధిగా తమ డాక్టర్‌నుంచి ఫిజికల్ ఫిట్‌నెస్ / ట్రావెల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకుపోవడం మరచిపోవద్దు.
ఇక మీ విషయానికి వస్తే... మీ రిపోర్టులన్నీ బాగున్నాయి కాబట్టి... ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో కనీసం ఆరు నెలల పాటు ఎటూ వెళ్లడానికి వీలుండదు కాబట్టి ఈ సమయంలో మీరు నిరభ్యంతరంగా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
డాక్టర్ సుశీల వావిలాల
ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్