విషాదం నింపిన విహార యాత్ర
- ఏలూరు సమీపంలో లారీని ఢీకొట్టిన వ్యాన్
- హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది దంపతుల దుర్మరణం.. 15 మందికి గాయాలు
ఏలూరు అర్బన్: విహార యాత్ర విషాదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం దెందులూరు చెక్‌పోస్ట్ వద్ద శనివారం వేకువజామున చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లో స్థిరపడిన న్యాయవాది కందుకూరి హరిప్రసాద్ (49), ఆయన భార్య గీతాభవాని (42) అక్కడిక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డ వరంగల్ జిల్లా జనగాంకి చెందిన కందుకూరి హరిప్రసాద్ తల్లి సావిత్రమ్మ, భార్య గీతాభవాని, కుమారులు హరిదీప్, రాహుల్ కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరి జనగాంలో ఉంటున్న ఆయన తమ్ముడు నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు.
అక్కడి నుంచి నాగేశ్వరరావు, ఆయన భార్య విమల, వారి ముగ్గురు కుమార్తెలు కీర్తి, నిధి, సిరి, మేనమామ షణ్ముఖాచారి, కుమారుడు ఎం.శ్రీకాంత్, భార్య శ్రీలత, వారి పిల్లలు సూర్యతేజ, శివరామ్‌తేజ, వారి సమీప బంధువు అరుణతో కలిసి శుక్రవారం రాత్రి టాటా వింగర్ వ్యాన్‌లో అరకు లోయ బయలుదేరారు. శనివారం వేకువజామున ఏలూరులో దెందులూరులోని చెక్ పోస్ట్ ప్రాంతంలో ముందు వెళుతున్న లారీని వ్యాన్ డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వ్యాన్ అదుపుతప్పి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న హరిప్రసాద్, ఆయన భార్య గీతా భవాని అక్కడికక్కడే మృత్యువాతపడగా, డ్రైవర్ గుడ్లపల్లి నరేష్ సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది.