సాక్షి, ఆరిలోవ(విశాఖ): విశాఖనగరంలోని ఆరిలోవ ప్రాంతం దీన్‌దయాల్‌పురం వద్ద బీఆర్‌టీఎస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవ ఎస్‌ఐ గోపాలరావు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి దరి సుజాతనగర్ ప్రాంతం పాపయ్యరాజుపాలేనికి చెందిన సత్యవేణి(45) ఆమె చిన్న కుమార్తె మౌనిక(22)తో కలసి ద్విచక్రవాహనంపై నగరానికి వచ్చారు.
తిరిగి హనుమంతవాక, పెదగదిలి, సింహాచలం మీదుగా బీఆర్‌టీఎస్‌లో పెందుర్తి వెళ్లడానికి బయలుదేరారు. చినగదిలి దాటిన తర్వాత దీన్‌దయాల్‌పురం వద్ద హెల్త్‌సిటీలో క్యూ1 ఆస్పత్రి ఎదురుగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక వీఐపీలకు కేటాయించిన సెంటర్ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. అదే రోడ్డులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. కిందపడిన మౌనిక, ఆమె తల్లి సత్యవేణిలు తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు విడిచింది. సత్యవేణిని ఆరిలోవ పోలీసులు హెల్త్‌సిటీలో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోపాల్ తెలిపారు. సత్యవేణి పెద్ద కుమార్తె తేజస్విని, భర్త శ్రీరాములున్నారు. శ్రీరాములు హుకుంపేటలో ఉద్యోగం చేస్తున్నారు.
హెల్మెట్ ఉన్నా...
ద్విచక్రవాహనం నడుపుతున్న మౌనిక హెల్మెట్ ధరించింది. అయినా ప్రమాదం జరిగే సమయంలో ఆ హెల్మెట్ ప్రాణాలు కాపాడలేకపోయింది. తలకు ధరించిన హెల్మెట్ బలంగా రోడ్డును తాకడంతో ముక్కలైపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలపై సంఘటన స్థలంలోనే మౌనిక ప్రాణాలు కోల్పోయింది. వాహనానికి వెనుక కూర్చొన్న ఆమె తల్లి సత్యవేణి కొంత దూరం తుల్లిపోయి ప్రమాదానికి గురయ్యారు.
పాడేరులో విషాదఛాయలు
పాడేరు: గిరిజన ఉపాధ్యాయురాలు కంకిపాటి సత్యవేణి, ఆమె కుమార్తె మౌనికలు మృతి చెందడంతో పాడేరు, లగిశపల్లిల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీటెక్ చదివిన మౌనికకు ఇటీవల బెంగళూరులో ఉద్యోగం లభించింది. లగిశపల్లికి చెందిన సత్యవేణి జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
పాడేరు లోచలిపుట్టులోని ఐటీడీఏ రెంటల్ క్వార్టర్స్‌లో తన భర్త, కాఫీ సబ్ అసిస్టెంట్ కంకిపాటి శ్రీరాములుతో కలిసి నివసిస్తున్నారు. విశాఖపట్నం సుజాత నగర్‌లోని గతంలో కొనుగోలు చేసిన ఫ్లాట్‌కు శని,ఆదివారాలు, సెలవు దినాల్లో వెళుతుంటారు. అలా వెళ్లిన వారు మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం
సత్యవేణి, ఆమె కుమార్తె మౌనికలు మృతి చెందిన సంఘటనపై అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణలు వేర్వేరు ప్రకటనల్లో విచారం వ్యక్తం చేశారు.
జెడ్పీటీసీ సభ్యురాలు కిముడు గాయత్రిదేవి, పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం నేత కిముడు దేముళ్లునాయుడు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మతో పాటు ఉపాధ్యాయ, గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం తెలిపారు. పాడేరు, జి.మాడుగుల ఎంఈవోలు సీహెచ్ సరస్వతిదేవి, కురుసా నాగభూషణంలు సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment