వరద కాలువలో అవినీతి పరవళ్లు
సిమెంట్ లైనింగ్‌లో బయటపడిన నాణ్యత ప్రమాణాలు
అడుగడుగునా పగుళ్లు
రూ.175 కోట్లు నీటి పాలు
సోమశిల-కండలేరు కాలువ లైనింగ్ భవితవ్యం ప్రశ్నార్థకం
కలువాయి : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన సోమశిల-కండలేరు వరద కాలువ లైనింగ్ నిర్మాణంలో నాణ్యత కొట్టుకుపోయి అవినీతి పరవళ్లు తొక్కుతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన లైనింగ్ ఆరేళ్లకే కొట్టుకుపోతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యతకు నీళ్లొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.175 కోట్ల వ్యయంతో నిర్మితమైన సిమెంట్ లైనింగ్ క్రమక్రమంగా నీటి పాలవుతోంది. కాలువ దుస్థితి కళ్ల ముందే కనబడుతుంటే.. అదేమీ పట్టనట్లు రేపో.. మాపో పనులకు సంబంధించిన ఫైనల్ బిల్లులను కూడా కాంట్రాక్టర్‌కు అందజేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు ప్రజల దాహార్తి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రైతాంగానికి తాగు, సాగునీటిని అందించేందుకు సోమశిల-కండలేరు వరద కాలువను నిర్మించారు. కాలువ లీకేజీలను అరికట్టేందుకు, నీటి ప్రవాహాన్ని పెంచేందుకు కాలువకు ఇరువైపులా 44.450 కిలోమీటర్లు స్లోబ్‌లు, బెడ్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేసేందుకు జలయజ్ఞం పథకంలో ప్యాకేజీ నంబర్ 9 కింద రూ.175 కోట్లు మంజూరు చేశారు. పనులను సోమశిల జలాశయం సమీపంలోని కిలో మీటరు 2.35 వద్ద నుంచి కాలువకు ఇరువైపులా సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులను చేపట్టి 2008 నాటికి పూర్తి చేశారు. కుల్లూరు, కలువాయి, చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి సబ్ డివిజన్ల పరిధిలో ఈ పనులు చేపట్టారు. కాలువకు ఇరువైపులా మట్టిని చదును చేసి నీటితో క్యూరింగ్ చేసిన తర్వాత కాంక్రీట్ స్లోబ్‌లు వేయాల్సి ఉంది. కానీ పనుల్లో ఆ విధంగా జరిగిన దాఖలాలు లేవు. కాంక్రీట్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పనులు పూర్తయి 6 ఏళ్లు కూడా గడవకముందే. ఎక్కడికక్కడ లైనింగ్‌కు అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. కాంక్రీట్ చేసిన తర్వాత సిమెంట్ లైనింగ్‌కు నీటితో క్యూరింగ్ చేయకుండా కూలింగ్ పౌడర్‌ను చల్లి సరిపెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. కాలువ పూర్తి సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు. పనులు పూర్తయిన తర్వాత సోమశిల జలాశయం నుంచి కండలేరుకు కాలువ ద్వారా 5 విడతలుగా నీటిని విడుదల చేశారు. అయితే 9 నుంచి 10 వేల క్యూసెకుల వరకే నీటి కాలువకు విడుదల చేశారు.
ఈ నీటి ప్రవాహానికే సిమెంట్ లైనింగ్ ఎక్కడికక్కడ కొట్టుకుపోతూ వస్తోంది. కాలువలో కాంక్రీట్ లైనింగ్ చేసేటప్పుడు లీడ్ మిక్స్‌తో స్లోబ్‌లను లైవల్ చేసి ఆ తర్వాత కాంక్రీట్ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా లూజుమట్టితో చదును చేసి, కనీసం దిమ్మెసే కూడా చేయకుండా కాంక్రీట్ వేయడం వల్ల నీటి ప్రవాహానికి స్లోబులు లైనింగ్ కుంగి పగళ్లు ఏర్పడటంతో పాటు కొట్టుకుపోతోంది. కాంక్రీట్‌కు ఏర్పడిన పగుళ్లలోకి నీళ్లు వెళ్లి ప్రవాహానికి సిమెంట్ పెచ్చులు పెచ్చులుగా లేచిపోతున్నాయి. కాలువకు పూర్తిసామర్థ్యంలో నీటిని విడుదల చేస్తే లైనింగ్ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. సోమశిల-కండలేరు వరద కాలువ 2.35 కిలో మీటర్ నుంచి 15 వరకు కూల్లూరు, 15 నుంచి 33 వరకు కలువాయి, 33 నుంచి 44.450 వరకు ఆదూరుపల్లి సబ్‌డివిజన్ల పరిధిలోకి వస్తుంది. సిమెంట్ కాంక్రీట్ లైనిం గ్ దారుణంగా దెబ్బతింటున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. నాణ్యతా లోపంపై చర్యలు తీసుకోకుండా తుది బిల్లును కూడా మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు కాలువను పర్యక్షించి దెబ్బతిన్న కాంక్రీట్ పనులను తిరిగి చేయించాల్సిన అవసరం ఉంది
జారి పోయిన లైనింగ్‌లకు మరమ్మతులు చేయిస్తాం
కండలేరు వరద కాాలువలో జారిపోయిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌కు మరమ్మతులు చేయిస్తాం. కాలువకు నీటిని విడుదల చేసేలోపు పనులన్నీటిని పూర్తి చేయిస్తాం. కాంట్రాక్టర్ ద్వారానే ఈ పనులు చేయించి తుది బిల్లులు అందిస్తాం. అప్పటి వరకు బిల్లుల చెల్లింపులు నిలిపి వేస్తాం.
కేవీ రమణ, ఇన్‌చార్జి ఈఈ
తెలుగుగంగ ప్రాజెక్టు