Somasila - Kandaleru
-
సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
ఆహ్లాదకర తీరం..పాపికొండలను తలపించే విధంగా వాతవరణం..కనుచూపు మేర జలసోయగం..రెండుకొండల నడుమ ఒయ్యారాలు ఒలికించే పెన్నా నది.. నీటిలో ఎగిరే చేపలు.. దేశ విదేశాల నుంచి వచ్చే విహంగాలు అరుదైన పక్షిజాతుల ఇక్కడి సందడి చేస్తుంటాయి. అదే సోమిశిల వెనుకజలాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జంపేట : వైఎస్సార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ పెనుశిల అభయారణ్యం ఏర్పాటుచేయాలని పాతికేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1997 డిసెంబరు 15 జీవో నంబరు 106ను జారీ చేశారు. కడప డివిజన్ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం రేంజ్ పరిధిలో 43,491,608 హెక్టార్లు , నెల్లూరు జిల్లాలోని 40,443,265 హెక్టార్లను అభయారణ్యంలోకి చేర్చారు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, జలచరాలకు అవాసంగా మారింది. కోటపాడు నుంచి.. ఒంటిమిట్ట(రాజంపేటనియోజకవర్గం)మండలంలోని కోటపాడు శివారులో సోమశిల వెనుకజలాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 26న ఈ దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన, టీడీపీపాలనలో ఎకో టూరిజం పడకేసింది.ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎకోటూరిజంతో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని స్ధానిక శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి దృష్టి సారించారు. సోమశిల జలాశయం నిల్వసామర్ధ్యం 77.988 టీఎంసీలు. ప్రస్తుతం 52.3 టీఎంసీలు నిల్వ ఉంది. కోటపాడు, కుడమలూరు, బెస్తపల్లె, ఉప్పరపల్లె, మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కురుగుంటపల్లె, పొన్నాపల్లి, కొండమాచుపల్లె, మదిలేగడ్డ, గుండ్లమాడ, దొంగలసాని, నెమళ్లగొంది, నర్సనాయనిపేట, వాకమాడ, ఒగూరు, వట్రపురాయి, కొత్తూరు తదితర గ్రామాలు సోమశిల అంతర్భాగంలో ఉండిపోయాయి. బోటు షికారు ఎప్పుడో.. ఒంటిమిట్ట, నందలూరు, మండలాల్లోని బ్యాక్‌వాటర్‌లో బోటుషికారుకు అనుకూలంగా ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అటువంటప్పుడు సోమశిల బ్యాక్‌వాటర్‌లో షికారు చేయడానికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నిధులు కేటాయింపులిలా.. 2020 ఆగస్టు 30న వనవిహారి కోసం రూ.50లక్షలు అనుమతిచ్చారు. 2021 జూలైలో రూ.120 లక్షలతో చేపట్టాలని పరిపాలన ఆమోదం ఇచ్చారు. కోటపాడు శ్రీరామఎత్తిపోతల పంపుహౌస్ సమీపంలో అనువైన స్ధలాన్ని ఎంపిక చేశారు. తొలి విడతలో ఆరుపనులను అటవీశాఖ ఉన్నతాధికారులు రూ.42,84,795లతో చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. గిట్టుబాటుకాదని పనులు చేయడానికి ఎవరు ముందుకురాకపోవడం గమనార్హం. మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నాటుపడవలో ఎమ్మెల్యే పరిశీలన.. కొడమలూరులో జరిగిన జాతర సందర్భంగా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే సోమశిల వెనుకజాలలను పరిశీలించారు. అక్కడ ఆయనకు అందుబాటులో నాటుపడవ కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా బ్యాక్‌వాటర్‌లో పర్యటించారు. ఒంటిమిట్ట రేంజ్‌కి ఇచ్చిన బోటు పనిచేయక మూలనచేరింది. అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని సంగతి తెలిసిందే. ఎకో టూరిజం అభివృద్ధికి కృషి సోమశిల బ్యాక్‌వాటర్‌లో బోటుషికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో ఎకో టూరిజం ఏర్పాటుచేశారు.దీనిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట, నందలూరులో కూడా సోమశిల బ్యాక్‌వాటర్ ఉంది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
వరద కాలువలో అవినీతి పరవళ్లు
సిమెంట్ లైనింగ్లో బయటపడిన నాణ్యత ప్రమాణాలు అడుగడుగునా పగుళ్లు రూ.175 కోట్లు నీటి పాలు సోమశిల-కండలేరు కాలువ లైనింగ్ భవితవ్యం ప్రశ్నార్థకం కలువాయి : తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన సోమశిల-కండలేరు వరద కాలువ లైనింగ్ నిర్మాణంలో నాణ్యత కొట్టుకుపోయి అవినీతి పరవళ్లు తొక్కుతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన లైనింగ్ ఆరేళ్లకే కొట్టుకుపోతోంది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యతకు నీళ్లొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.175 కోట్ల వ్యయంతో నిర్మితమైన సిమెంట్ లైనింగ్ క్రమక్రమంగా నీటి పాలవుతోంది. కాలువ దుస్థితి కళ్ల ముందే కనబడుతుంటే.. అదేమీ పట్టనట్లు రేపో.. మాపో పనులకు సంబంధించిన ఫైనల్ బిల్లులను కూడా కాంట్రాక్టర్‌కు అందజేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రజల దాహార్తి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో రైతాంగానికి తాగు, సాగునీటిని అందించేందుకు సోమశిల-కండలేరు వరద కాలువను నిర్మించారు. కాలువ లీకేజీలను అరికట్టేందుకు, నీటి ప్రవాహాన్ని పెంచేందుకు కాలువకు ఇరువైపులా 44.450 కిలోమీటర్లు స్లోబ్లు, బెడ్ కాంక్రీట్ లైనింగ్ పనులు చేసేందుకు జలయజ్ఞం పథకంలో ప్యాకేజీ నంబర్ 9 కింద రూ.175 కోట్లు మంజూరు చేశారు. పనులను సోమశిల జలాశయం సమీపంలోని కిలో మీటరు 2.35 వద్ద నుంచి కాలువకు ఇరువైపులా సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ పనులను చేపట్టి 2008 నాటికి పూర్తి చేశారు. కుల్లూరు, కలువాయి, చేజర్ల మండలంలోని ఆదూరుపల్లి సబ్ డివిజన్ల పరిధిలో ఈ పనులు చేపట్టారు. కాలువకు ఇరువైపులా మట్టిని చదును చేసి నీటితో క్యూరింగ్ చేసిన తర్వాత కాంక్రీట్ స్లోబ్లు వేయాల్సి ఉంది. కానీ పనుల్లో ఆ విధంగా జరిగిన దాఖలాలు లేవు. కాంక్రీట్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పనులు పూర్తయి 6 ఏళ్లు కూడా గడవకముందే. ఎక్కడికక్కడ లైనింగ్‌కు అప్పుడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. కాంక్రీట్ చేసిన తర్వాత సిమెంట్ లైనింగ్‌కు నీటితో క్యూరింగ్ చేయకుండా కూలింగ్ పౌడర్‌ను చల్లి సరిపెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. కాలువ పూర్తి సామర్థ్యం 12 వేల క్యూసెక్కులు. పనులు పూర్తయిన తర్వాత సోమశిల జలాశయం నుంచి కండలేరుకు కాలువ ద్వారా 5 విడతలుగా నీటిని విడుదల చేశారు. అయితే 9 నుంచి 10 వేల క్యూసెకుల వరకే నీటి కాలువకు విడుదల చేశారు. ఈ నీటి ప్రవాహానికే సిమెంట్ లైనింగ్ ఎక్కడికక్కడ కొట్టుకుపోతూ వస్తోంది. కాలువలో కాంక్రీట్ లైనింగ్ చేసేటప్పుడు లీడ్ మిక్స్‌తో స్లోబ్లను లైవల్ చేసి ఆ తర్వాత కాంక్రీట్ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా లూజుమట్టితో చదును చేసి, కనీసం దిమ్మెసే కూడా చేయకుండా కాంక్రీట్ వేయడం వల్ల నీటి ప్రవాహానికి స్లోబులు లైనింగ్ కుంగి పగళ్లు ఏర్పడటంతో పాటు కొట్టుకుపోతోంది. కాంక్రీట్‌కు ఏర్పడిన పగుళ్లలోకి నీళ్లు వెళ్లి ప్రవాహానికి సిమెంట్ పెచ్చులు పెచ్చులుగా లేచిపోతున్నాయి. కాలువకు పూర్తిసామర్థ్యంలో నీటిని విడుదల చేస్తే లైనింగ్ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. సోమశిల-కండలేరు వరద కాలువ 2.35 కిలో మీటర్ నుంచి 15 వరకు కూల్లూరు, 15 నుంచి 33 వరకు కలువాయి, 33 నుంచి 44.450 వరకు ఆదూరుపల్లి సబ్డివిజన్ల పరిధిలోకి వస్తుంది. సిమెంట్ కాంక్రీట్ లైనిం గ్ దారుణంగా దెబ్బతింటున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. నాణ్యతా లోపంపై చర్యలు తీసుకోకుండా తుది బిల్లును కూడా మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు కాలువను పర్యక్షించి దెబ్బతిన్న కాంక్రీట్ పనులను తిరిగి చేయించాల్సిన అవసరం ఉంది జారి పోయిన లైనింగ్‌లకు మరమ్మతులు చేయిస్తాం కండలేరు వరద కాాలువలో జారిపోయిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్‌కు మరమ్మతులు చేయిస్తాం. కాలువకు నీటిని విడుదల చేసేలోపు పనులన్నీటిని పూర్తి చేయిస్తాం. కాంట్రాక్టర్ ద్వారానే ఈ పనులు చేయించి తుది బిల్లులు అందిస్తాం. అప్పటి వరకు బిల్లుల చెల్లింపులు నిలిపి వేస్తాం. కేవీ రమణ, ఇన్చార్జి ఈఈ తెలుగుగంగ ప్రాజెక్టు