సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు | Somasila, a fantastic nature beauty with great places | Sakshi
Sakshi News home page

సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు

Published Tue, Apr 25 2023 1:42 AM | Last Updated on Wed, Apr 26 2023 5:01 PM

- - Sakshi

ఆహ్లాదకర తీరం..పాపికొండలను తలపించే విధంగా వాతవరణం..కనుచూపు మేర జలసోయగం..రెండుకొండల నడుమ ఒయ్యారాలు ఒలికించే పెన్నా నది.. నీటిలో ఎగిరే చేపలు.. దేశ విదేశాల నుంచి వచ్చే విహంగాలు అరుదైన పక్షిజాతుల ఇక్కడి సందడి చేస్తుంటాయి. అదే సోమిశిల వెనుకజలాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

జంపేట : వైఎస్సార్‌, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ పెనుశిల అభయారణ్యం ఏర్పాటుచేయాలని పాతికేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1997 డిసెంబరు 15 జీవో నంబరు 106ను జారీ చేశారు.

కడప డివిజన్‌ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం రేంజ్‌ పరిధిలో 43,491,608 హెక్టార్లు , నెల్లూరు జిల్లాలోని 40,443,265 హెక్టార్లను అభయారణ్యంలోకి చేర్చారు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, జలచరాలకు అవాసంగా మారింది.

కోటపాడు నుంచి..

ఒంటిమిట్ట(రాజంపేటనియోజకవర్గం)మండలంలోని కోటపాడు శివారులో సోమశిల వెనుకజలాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 26న ఈ దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన, టీడీపీపాలనలో ఎకో టూరిజం పడకేసింది.ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎకోటూరిజంతో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని స్ధానిక శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి దృష్టి సారించారు.

సోమశిల జలాశయం నిల్వసామర్ధ్యం 77.988 టీఎంసీలు. ప్రస్తుతం 52.3 టీఎంసీలు నిల్వ ఉంది. కోటపాడు, కుడమలూరు, బెస్తపల్లె, ఉప్పరపల్లె, మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కురుగుంటపల్లె, పొన్నాపల్లి, కొండమాచుపల్లె, మదిలేగడ్డ, గుండ్లమాడ, దొంగలసాని, నెమళ్లగొంది, నర్సనాయనిపేట, వాకమాడ, ఒగూరు, వట్రపురాయి, కొత్తూరు తదితర గ్రామాలు సోమశిల అంతర్భాగంలో ఉండిపోయాయి.

బోటు షికారు ఎప్పుడో..

ఒంటిమిట్ట, నందలూరు, మండలాల్లోని బ్యాక్‌వాటర్‌లో బోటుషికారుకు అనుకూలంగా ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అటువంటప్పుడు సోమశిల బ్యాక్‌వాటర్‌లో షికారు చేయడానికి టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

నిధులు కేటాయింపులిలా..

2020 ఆగస్టు 30న వనవిహారి కోసం రూ.50లక్షలు అనుమతిచ్చారు. 2021 జూలైలో రూ.120 లక్షలతో చేపట్టాలని పరిపాలన ఆమోదం ఇచ్చారు. కోటపాడు శ్రీరామఎత్తిపోతల పంపుహౌస్‌ సమీపంలో అనువైన స్ధలాన్ని ఎంపిక చేశారు. తొలి విడతలో ఆరుపనులను అటవీశాఖ ఉన్నతాధికారులు రూ.42,84,795లతో చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ఆన్‌లైన్‌లో ఈ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. గిట్టుబాటుకాదని పనులు చేయడానికి ఎవరు ముందుకురాకపోవడం గమనార్హం. మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు.

నాటుపడవలో ఎమ్మెల్యే పరిశీలన..

కొడమలూరులో జరిగిన జాతర సందర్భంగా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే సోమశిల వెనుకజాలలను పరిశీలించారు. అక్కడ ఆయనకు అందుబాటులో నాటుపడవ కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా బ్యాక్‌వాటర్‌లో పర్యటించారు. ఒంటిమిట్ట రేంజ్‌కి ఇచ్చిన బోటు పనిచేయక మూలనచేరింది. అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని సంగతి తెలిసిందే.

ఎకో టూరిజం అభివృద్ధికి కృషి

సోమశిల బ్యాక్‌వాటర్‌లో బోటుషికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం సెంటర్‌ అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో ఎకో టూరిజం ఏర్పాటుచేశారు.దీనిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట, నందలూరులో కూడా సోమశిల బ్యాక్‌వాటర్‌ ఉంది. వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం

– మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement