tourism and forest department
-
సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
ఆహ్లాదకర తీరం..పాపికొండలను తలపించే విధంగా వాతవరణం..కనుచూపు మేర జలసోయగం..రెండుకొండల నడుమ ఒయ్యారాలు ఒలికించే పెన్నా నది.. నీటిలో ఎగిరే చేపలు.. దేశ విదేశాల నుంచి వచ్చే విహంగాలు అరుదైన పక్షిజాతుల ఇక్కడి సందడి చేస్తుంటాయి. అదే సోమిశిల వెనుకజలాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జంపేట : వైఎస్సార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ పెనుశిల అభయారణ్యం ఏర్పాటుచేయాలని పాతికేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1997 డిసెంబరు 15 జీవో నంబరు 106ను జారీ చేశారు. కడప డివిజన్ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం రేంజ్ పరిధిలో 43,491,608 హెక్టార్లు , నెల్లూరు జిల్లాలోని 40,443,265 హెక్టార్లను అభయారణ్యంలోకి చేర్చారు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, జలచరాలకు అవాసంగా మారింది. కోటపాడు నుంచి.. ఒంటిమిట్ట(రాజంపేటనియోజకవర్గం)మండలంలోని కోటపాడు శివారులో సోమశిల వెనుకజలాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 26న ఈ దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన, టీడీపీపాలనలో ఎకో టూరిజం పడకేసింది.ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎకోటూరిజంతో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని స్ధానిక శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి దృష్టి సారించారు. సోమశిల జలాశయం నిల్వసామర్ధ్యం 77.988 టీఎంసీలు. ప్రస్తుతం 52.3 టీఎంసీలు నిల్వ ఉంది. కోటపాడు, కుడమలూరు, బెస్తపల్లె, ఉప్పరపల్లె, మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కురుగుంటపల్లె, పొన్నాపల్లి, కొండమాచుపల్లె, మదిలేగడ్డ, గుండ్లమాడ, దొంగలసాని, నెమళ్లగొంది, నర్సనాయనిపేట, వాకమాడ, ఒగూరు, వట్రపురాయి, కొత్తూరు తదితర గ్రామాలు సోమశిల అంతర్భాగంలో ఉండిపోయాయి. బోటు షికారు ఎప్పుడో.. ఒంటిమిట్ట, నందలూరు, మండలాల్లోని బ్యాక్‌వాటర్‌లో బోటుషికారుకు అనుకూలంగా ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అటువంటప్పుడు సోమశిల బ్యాక్‌వాటర్‌లో షికారు చేయడానికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నిధులు కేటాయింపులిలా.. 2020 ఆగస్టు 30న వనవిహారి కోసం రూ.50లక్షలు అనుమతిచ్చారు. 2021 జూలైలో రూ.120 లక్షలతో చేపట్టాలని పరిపాలన ఆమోదం ఇచ్చారు. కోటపాడు శ్రీరామఎత్తిపోతల పంపుహౌస్ సమీపంలో అనువైన స్ధలాన్ని ఎంపిక చేశారు. తొలి విడతలో ఆరుపనులను అటవీశాఖ ఉన్నతాధికారులు రూ.42,84,795లతో చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. గిట్టుబాటుకాదని పనులు చేయడానికి ఎవరు ముందుకురాకపోవడం గమనార్హం. మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నాటుపడవలో ఎమ్మెల్యే పరిశీలన.. కొడమలూరులో జరిగిన జాతర సందర్భంగా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే సోమశిల వెనుకజాలలను పరిశీలించారు. అక్కడ ఆయనకు అందుబాటులో నాటుపడవ కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా బ్యాక్‌వాటర్‌లో పర్యటించారు. ఒంటిమిట్ట రేంజ్‌కి ఇచ్చిన బోటు పనిచేయక మూలనచేరింది. అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని సంగతి తెలిసిందే. ఎకో టూరిజం అభివృద్ధికి కృషి సోమశిల బ్యాక్‌వాటర్‌లో బోటుషికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో ఎకో టూరిజం ఏర్పాటుచేశారు.దీనిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట, నందలూరులో కూడా సోమశిల బ్యాక్‌వాటర్ ఉంది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
ఊరెళ్దాం.. పల్లెటూరెళ్దాం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఫ్లోరిడాకు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో అంతర్జాతీయ సెమినార్‌కు హాజరయ్యారు. వారి పదేళ్ల కూతురుని అక్కడి ఓ దృశ్యం విపరీతంగా ఆకర్షించింది. ఎంతగా అంటే, ఆ దృశ్యాన్ని మరోసారి చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చేంతగా.. ఇంతకూ ఆకట్టుకున్న ఆ దృశ్యమేంటో తెలుసా.. కుండల తయారీ. దీంతో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ పల్లెలను ముస్తాబు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విలేజ్ టూరిజం... కొత్త కాన్సెప్ట్ కానప్పటికీ, మనకున్న విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేవి అవే. రెండేళ్ల గణాంకాలను పరిశీలించిన ప్రభుత్వం దాన్ని ఖరారు చేసుకుని ఆ దిశగా అడుగులేస్తోంది. రెండేళ్లలో మన పల్లెలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్లో 21% పెరుగుదల నమోదైంది. దీంతో విదేశీ టూరిస్టుల సంఖ్యను ఏడాది కాలంలో 30 శాతానికి పెంచాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. 2014లో తెలంగాణను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 75 వేలు. అదే సమయంలో మన పొరుగున ఉన్న కర్ణాటకను సందర్శించినవారి సంఖ్య 6 లక్షలు. 2017లో తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 2.51 లక్షలు, 2018కి ఈ సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటికీ ఆ సంఖ్య దాదాపు 2 లక్షలుగా ఉంది. కేవలం ఏడాది కాలంలో పెరుగుదల రేటు 21 శాతంగా ఉండటం ప్రభుత్వంలో కొత్త ఆశలు చిగురించాయి. ఏమిటా కసరత్తు.. నగరాల్లో మగ్గే జనానికి పల్లె వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. అక్కడి గాలి, ఉదయం–సాయంత్రం వేళ కనిపించే ప్రకృతి రమణీయత, వ్యవసాయం, చేతివృత్తులు, జంతుజాలం.. ఒకటేమిటి, గ్రామీణ సౌందర్యం ఆహ్లాదపరుస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలను పర్యాటకంలో చేర్చటం ద్వారా వారిని ఆకట్టుకోవాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. - నగర శివారులోని శామీర్‌పేటలో పల్లె వాతావరణంతో కూడిన ఓ కృత్రిమ గ్రామాన్ని నిర్మించబోతున్నారు. తెలంగాణ వల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఉండటంతోపాటు కులవృత్తులను కళ్లముందుంచనున్నారు. తెలంగాణ రుచులను కూడా అందుబాటులో ఉంచుతారు. - దేశంలోనే కవ్వాల్ అభయారణ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదిలాబాద్ జిల్లాల్లో మహారాష్ట్రతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం పులులు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులు, పక్షులకు పెట్టింది పేరు. అభయారణ్యాన్ని ఆనుకుని పలు గ్రామాలున్నాయి. ఈ మొత్తాన్ని విదేశీయులకు చూపే విధంగా అటవీ శాఖతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకోబోతోంది. ట్రెక్కింగ్, బోటింగ్, బంగీ జంపింగ్‌లాంటి క్రీడలను, గ్రామీణ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది. - కవ్వాల్ అభయారణ్యం విస్తరించిన జన్నారం నుంచి కడెం రిజర్వాయర్ వరకు పర్యాటక ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. - శ్రీశైలం నల్లమల అడవుల్లోని మన్ననూరు, అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం ప్రాంతాల్లో కూడా విదేశీయు లను ఆకట్టుకునే ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. - గోదావరి తీరంలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, జంపన్నవాగు.. ఆ ప్రాంతంలోని ప్రపంచంలోనే ఎక్కువ పరిధిలో విస్తరించిన ఆదిమానవుల జాడలతో కూడిన ప్రాంతాన్ని చేర్చి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తోవలో ఉండే లక్నవరం, రామప్ప సరస్సుల వద్ద కూడా రూరల్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. - ఇప్పటివరకు తెలంగాణలో యునెస్కో గుర్తించిన ప్రాంతాలు లేవు. తాజాగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో పరిశీలిస్తోంది. ప్రపంచ పర్యాటక పటంలో దానికి చోటు దక్కితే అక్కడికి వచ్చే విదేశీయుల సంఖ్య వేలల్లో ఉండనుంది. ఆ మేరకు ఆ ప్రాంతాన్ని గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. హైదరాబాద్ టు అడవులు... టీహబ్ లాంటి చర్యలతో ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చే విదేశీయుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడి ఐటీ పరిశ్రమకు అనుబంధంగా నగరంలో రకరకాల ఇతివృత్తాలతో వందకుపైగా ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవారు వీలు చిక్కితే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. విదేశీయులను ఆకట్టుకునే ఏర్పాట్లు మన వద్ద అంతగా లేకపోవటం, తెలంగాణ పర్యాటకానికి ప్రపంచపటంలో పెద్దగా చోటు దక్కకపోవటంతో వాటిపై ముందస్తు ప్రణాళికలను వారు సిద్ధం చేసుకోవటం లేదు. ఇప్పుడు దీన్ని అధిగమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
అదో ఆవాస గ్రామం... అయితేనేం!
సాక్షి, విశాఖపట్నం : ఆ గ్రామం మండల కేంద్రం కాదు. కనీసం పంచాయతీ కూడా కాదు. ఓ మేజర్ పంచాయతీలోని ఆవాస గ్రామం. కానీ, నేడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రంగా గుర్తింపు పొందింది. అదే... అరకు. ప్రకృతి ప్రత్యేకతలతో రాష్ట్రంలో, దేశంలోనే పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లే అరకును విశాఖలో అడుగుపెట్టే దేశ, విదేశ పర్యాటకులు చూడకుండా వెళ్లరనే చెప్పాలి. చిత్రమేమంటే ఈ గ్రామానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయం, యంత్రాంగమూ లేదు. 2009కు ముందు అనంతగిరి, అరుకులోయ మండలాలు ఎస్.కోట (ఎస్టీ) నియోజకవర్గంలో ఉండేవి. ఎస్.కోట అసెంబ్లీ స్థానం విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అరకు లోయ కేంద్రంగానే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ పంచాయతీలే మండల, నియోజకవర్గ కేంద్రాలుగా ఉంటాయి. వాటిపేరిటే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇవేవీ లేకుండానే అరకు తన విశిష్టతను మరోసారి చాటుకోవడం గమనార్హం. -
ఖజానాకు నష్టం కలిగించారు
సాక్షి,హైదరాబాద్: పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జానకి ఆర్.కొండపి, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా ఉన్న సమయంలో కె.మధుకర్‌రాజ్ పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంతో ఖజానాకు భారీగా నష్టం కలిగించారని పేర్కొం టూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారిపై ఆరోపణలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ సమాచార హక్కు ఉద్యమకారులు సి.జె.కరీరా, జి.భార్గవి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా ఉన్న జానకి ఆర్.కొండపి, సమాచార కమిషనర్‌గా పనిచేస్తున్న మధుకర్రాజ్లపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ డెరైక్టర్ జనరల్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు జానకి ఆర్.కొండపి, మధుకర్రాజులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. కొత్తగూడ అటవీభూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, వారికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని పిటిషినర్లు ఆరోపించారు.