ఊరెళ్దాం.. పల్లెటూరెళ్దాం! | Focus On village tourism in Telangana | Sakshi
Sakshi News home page

ఊరెళ్దాం.. పల్లెటూరెళ్దాం!

Published Mon, May 27 2019 2:05 AM | Last Updated on Mon, May 27 2019 2:05 AM

Focus On village tourism in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ఫ్లోరిడాకు చెందిన దంపతులు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ సెమినార్‌కు హాజరయ్యారు. వారి పదేళ్ల కూతురుని అక్కడి ఓ దృశ్యం విపరీతంగా ఆకర్షించింది. ఎంతగా అంటే, ఆ దృశ్యాన్ని మరోసారి చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చేంతగా.. ఇంతకూ ఆకట్టుకున్న ఆ దృశ్యమేంటో తెలుసా.. కుండల తయారీ. దీంతో విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా తెలంగాణ పల్లెలను ముస్తాబు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విలేజ్‌ టూరిజం... కొత్త కాన్సెప్ట్‌ కానప్పటికీ, మనకున్న విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేవి అవే. రెండేళ్ల గణాంకాలను పరిశీలించిన ప్రభుత్వం దాన్ని ఖరారు చేసుకుని ఆ దిశగా అడుగులేస్తోంది. రెండేళ్లలో మన పల్లెలను చూసేందుకు వచ్చిన పర్యాటకుల్లో 21% పెరుగుదల నమోదైంది. దీంతో విదేశీ టూరిస్టుల సంఖ్యను ఏడాది కాలంలో 30 శాతానికి పెంచాలని పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. 2014లో తెలంగాణను సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య కేవలం 75 వేలు. అదే సమయంలో మన పొరుగున ఉన్న కర్ణాటకను సందర్శించినవారి సంఖ్య 6 లక్షలు. 2017లో తెలంగాణకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య 2.51 లక్షలు, 2018కి ఈ సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటికీ ఆ సంఖ్య దాదాపు 2 లక్షలుగా ఉంది. కేవలం ఏడాది కాలంలో పెరుగుదల రేటు 21 శాతంగా ఉండటం ప్రభుత్వంలో కొత్త ఆశలు చిగురించాయి.  
ఏమిటా కసరత్తు..
నగరాల్లో మగ్గే జనానికి పల్లె వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. అక్కడి గాలి, ఉదయం–సాయంత్రం వేళ కనిపించే ప్రకృతి రమణీయత, వ్యవసాయం, చేతివృత్తులు, జంతుజాలం.. ఒకటేమిటి, గ్రామీణ సౌందర్యం ఆహ్లాదపరుస్తుంది. అందుకే గ్రామీణ ప్రాంతాలను పర్యాటకంలో చేర్చటం ద్వారా వారిని ఆకట్టుకోవాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.  

- నగర శివారులోని శామీర్‌పేటలో పల్లె వాతావరణంతో కూడిన ఓ కృత్రిమ గ్రామాన్ని నిర్మించబోతున్నారు. తెలంగాణ వల్లె వాతావరణం ప్రతిబింబించేలా ఉండటంతోపాటు కులవృత్తులను కళ్లముందుంచనున్నారు. తెలంగాణ రుచులను కూడా అందుబాటులో ఉంచుతారు.  

- దేశంలోనే కవ్వాల్‌ అభయారణ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆదిలాబాద్‌ జిల్లాల్లో మహారాష్ట్రతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం పులులు, జింకలు, అడవి దున్నలు, ఇతర జంతువులు, పక్షులకు పెట్టింది పేరు. అభయారణ్యాన్ని ఆనుకుని పలు గ్రామాలున్నాయి. ఈ మొత్తాన్ని విదేశీయులకు చూపే విధంగా అటవీ శాఖతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకోబోతోంది. ట్రెక్కింగ్, బోటింగ్, బంగీ జంపింగ్‌లాంటి క్రీడలను, గ్రామీణ రెస్టారెంట్లను ఏర్పాటు చేయనుంది.  

- కవ్వాల్‌ అభయారణ్యం విస్తరించిన జన్నారం నుంచి కడెం రిజర్వాయర్‌ వరకు పర్యాటక ప్లాన్‌ను రూపొందిస్తున్నారు.  

- శ్రీశైలం నల్లమల అడవుల్లోని మన్ననూరు, అక్క మహాదేవి గుహలు, ఉమామహేశ్వరం, ఫరాబాద్, మల్లెల తీర్థం ప్రాంతాల్లో కూడా విదేశీయు లను ఆకట్టుకునే ఏర్పాటుకు ప్లాన్‌ చేస్తున్నారు.  

- గోదావరి తీరంలో ఉన్న ఏటూరునాగారం, తాడ్వాయి, జంపన్నవాగు.. ఆ ప్రాంతంలోని ప్రపంచంలోనే ఎక్కువ పరిధిలో విస్తరించిన ఆదిమానవుల జాడలతో కూడిన ప్రాంతాన్ని చేర్చి ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే తోవలో ఉండే లక్నవరం, రామప్ప సరస్సుల వద్ద కూడా రూరల్‌ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు.  

- ఇప్పటివరకు తెలంగాణలో యునెస్కో గుర్తించిన ప్రాంతాలు లేవు. తాజాగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో పరిశీలిస్తోంది. ప్రపంచ పర్యాటక పటంలో దానికి చోటు దక్కితే అక్కడికి వచ్చే విదేశీయుల సంఖ్య వేలల్లో ఉండనుంది. ఆ మేరకు ఆ ప్రాంతాన్ని గ్రామీణ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు.

హైదరాబాద్‌ టు అడవులు... 
టీహబ్‌ లాంటి చర్యలతో ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చే విదేశీయుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడి ఐటీ పరిశ్రమకు అనుబంధంగా నగరంలో రకరకాల ఇతివృత్తాలతో వందకుపైగా ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలకు హాజరయ్యేవారు వీలు చిక్కితే పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. విదేశీయులను ఆకట్టుకునే ఏర్పాట్లు మన వద్ద అంతగా లేకపోవటం, తెలంగాణ పర్యాటకానికి ప్రపంచపటంలో పెద్దగా చోటు దక్కకపోవటంతో వాటిపై ముందస్తు ప్రణాళికలను వారు సిద్ధం చేసుకోవటం లేదు. ఇప్పుడు దీన్ని అధిగమించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement