సాక్షి,హైదరాబాద్: పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో జానకి ఆర్.కొండపి, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా ఉన్న సమయంలో కె.మధుకర్‌రాజ్ పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంతో ఖజానాకు భారీగా నష్టం కలిగించారని పేర్కొం టూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారిపై ఆరోపణలను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నిర్ధారించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ సమాచార హక్కు ఉద్యమకారులు సి.జె.కరీరా, జి.భార్గవి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శిగా ఉన్న జానకి ఆర్.కొండపి, సమాచార కమిషనర్‌గా పనిచేస్తున్న మధుకర్‌రాజ్‌లపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ డెరైక్టర్ జనరల్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు జానకి ఆర్.కొండపి, మధుకర్‌రాజులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. కొత్తగూడ అటవీభూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, వారికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని పిటిషినర్లు ఆరోపించారు.