హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ గ్రామంలో కోట్ల రూపాయల విలువైన భూముల హక్కులు అన్యాక్రాంతం కాకుండా హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అప్పటి శేరిలింగంపల్లి తహసీల్దార్ టి.తిరుపతిరావుకు కోర్టు ధిక్కార కేసులో సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాలను కూడా రద్దు చేసింది. ప్రజాప్రయోజనాలకు భంగం కలిగే విధంగా వంద ఎకరాలకుపైగా ఉన్న భూములపై హక్కుల్ని కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం తీర్పు వెల్లడించింది.
వివరాల్లోకి వెళితే.. రాయదుర్గ్‌లోని 1 నుంచి 49వ సర్వే నంబర్ వరకూ ఉన్న భూములపై హక్కులు కల్పించాలని ఎం.లింగమయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2003 నాటి తీర్పునకు లోబడి రెవెన్యూ రికార్డుల్లో లింగమయ్య పేరు నమోదు చేయాలని, ప్రభావిత కుటుంబాల వాదనలు విన్న తర్వాతే మ్యుటేషన్ చేయాలని 2009 మార్చిలో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను జడ్జి ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో లింగమయ్య కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అప్పటి తహసీల్దార్ తిరుపతిరావు కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు రెండు మాసాల జైలు, రూ.1500 జరిమానా విధిస్తూ గత ఏడాది అక్టోబర్‌లో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాల్ చేస్తూ తిరుపతిరావు దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ధర్మాసనం అనుమతి ఇస్తూ సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది.
తహసీల్దార్ జైలు శిక్ష రద్దు
‘‘సీఎస్ 7/1958 నాటి దావాకు సంబంధించి లింగమయ్య పేరున 2002 నుంచి జారీ అయిన ఉత్తర్వులు మోసపూరితంగా ఉన్నాయి. ప్రజాప్రయోజనాలకు హాని కలిగించేలా వంద ఎకరాలకుపైగా ఉన్న భూముల హక్కుల్ని ప్రభుత్వం చేజారేలా ఆదేశాలు జారీ చేయలేం. 1959 ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా లింగమయ్య భూములపై హక్కులు కోరుతున్నారు. 7/1958 నాటి కేసు ప్రకారం షెడ్యూల్–ఎ లోని ఐటం 234లో ఆస్తుల వివరాలు మక్తా రాయదుర్గ్‌లో ఉన్నాయి. సదరు ఐటంకు చెందిన భూములు, సర్వే నంబర్లు, సరిహద్దుల వివరాలు పేర్కొనలేదు. అందుకే లింగమయ్య కోరినట్లుగా రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పునకు (మ్యుటేషన్) అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడం లేదు. థర్డ్‌పార్టీలకు భూములపై హక్కులు కల్పించాలని సింగిల్ జడ్జి ఆదేశాలను ఆమోదించలేం. తహసీల్దార్‌కు విధించిన జైలుశిక్ష, కోర్టు ధిక్కార తీర్పును రద్దు చేస్తున్నాం ’’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment