సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం లోని నాలుగు ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులపై అదనపు ఫీజుల భారం తప్పేలా లేదు. సీబీఐటీ, శ్రీనిధి, వాసవి, ఎంజీఐటీ కాలేజీల్లో చేరిన విద్యార్థులంతా అదనపు ఫీజుల నుంచి తప్పించుకునే పరిస్థితి కన్పించట్లేదు. శ్రీనిధి, వాసవి కాలేజీల్లో ఫీజులపై హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తాజా ఉత్తర్వులతో పెంచిన ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పెరిగిన ఫీజుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందా.. లేదా మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఓసారి సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగిలింది. ఒకవేళ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లకపోతే ఆయా కాలేజీల్లో చేరిన 12 వేల మందికి పైగా విద్యార్థులు ఏటా రూ.40 వేల నుంచి రూ.86,500 వరకు అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తుంది.
అసలేం జరిగింది..: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో వార్షిక ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) 2016లో ఖరారు చేసింది. అయితే అందులో సీబీఐటీ, ఎంజీఐటీ, శ్రీనిధి కాలేజీలకు తక్కువ పెంపును ప్రతిపాదించింది. వాసవి కాలేజీకి గతంలో ఉన్న ఫీజులో రూ.12 వేల కోత విధించి రూ.97 వేలకు పరిమితం చేసింది. దీంతో ఆయా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. తమ వాస్తవ ఆదాయ వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఏఎఫ్‌ఆర్‌సీ ఫీజులు ఖరారు చేసిందని పేర్కొంది. దీంతో వారి ఆదాయ వ్యయాలను పరిశీలించి హైకోర్టు గతేడాది ఆయా కాలేజీల ఫీజులు పెంచారు.
ఏఎఫ్‌ఆర్‌సీ ముందుగా సీబీఐటీకి రూ.1,13,500 ఫీజుగా నిర్ణయిస్తే హైకోర్టు దానికి అదనంగా రూ.86500 పెంపునకు ఓకే చెప్పి రూ.2 లక్షలకు పెంచింది. ఎంజీఐటీలో రూ.1 లక్ష ఉన్న ఫీజును రూ.1.6 లక్షలకు పెంచింది. వాసవిలో రూ.97 వేల నుంచి రూ.1.6 లక్షలకు పెంచింది. శ్రీనిధిలో రూ.91 వేల నుంచి రూ.46 వేలు పెంచి రూ.1.37 లక్షలు చేసింది. అయితే వాటిని ప్రభుత్వం అమలు చేయలేదు. దానిపై యాజమాన్యాలు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం హైకోర్టులో మళ్లీ అప్పీల్ దాఖలు చేసింది. అయితే అందులో శ్రీనిధి, వాసవి కాలేజీలకు సంబంధించి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాత ఫీజుల పెంపును అమలు చేయాలని చెప్పడంతో గందరగోళంలో పడింది.
విద్యార్థులపై ఒత్తిళ్లు
హైకోర్టు గతేడాది ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పెరిగిన ఫీజులను చెల్లించాల్సిందేనంటూ యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. అదనపు ఫీజు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు హాజరు కానివ్వకపోవడం వంటి చర్యలతో ఇబ్బందులకు గురిచేశాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనకు దిగాయి. అయినా యాజమాన్యాలు పెరిగిన ఫీజులను వసూలు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వం వాటి అమలుకు ఉత్తర్వులు జారీచేస్తే టాప్ పది వేల ర్యాంకులతో కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల ఫీజులను వంద శాతం ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
కారకులెవరు?
ఫీజల ఖరారు వ్యవహరంలో ఏఎఫ్‌ఆర్‌సీ నియమించిన కన్సల్టెంట్ వైఖరే ఈ వివాదానికి దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిటీ సభ్యుల ఆమోదం, సంతకం లేకుండానే ఆ కన్సల్టెంట్ కాలేజీల ఫీజుల ఖరారు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ మొత్తం చేతులు కూడా మారినట్లు ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. గతంలో రూ.77 వేలు దాటని కాలేజీల వార్షిక ఫీజును ఆ కన్సల్టెంట్ వ్యవహారం వల్ల రూ.లక్షకు పైగా పెంచినట్లు ఆరోపణలు వచ్చాయి. టాప్ కాలేజీల్లో ఒకటైన వాసవి కాలేజీలో వార్షిక ఫీజు కోత విధించడంపైనా విమర్శలొచ్చాయి. ఈ కాలేజీల ఫీజులను కమిటీ సభ్యుల ఆమోదం లేకుండానే జరిగిపోయినట్లు సమాచారం. ముడుపులు ఇచ్చిన వారికి పెంచి.. ఇవ్వని వారి కాలేజీల ఫీజులో కోత విధించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇదీ ఆ నాలుగు కాలేజీల్లో ఫీజుల పరిస్థితి..
విద్యా సంస్థ 2013–16ఫీజు 2016–19ఫీజు అదనపుపెంపు మొత్తంఫీజు
సీబీఐటీలో 1,13,300 1,13,500 86,500 2,00,000
వాసవి 1,09,300 97,000 63,000 1,60,000
శ్రీనిధి 79,900 91000 46,000 137000
ఎంజీఐటీ 82,400 1,00,000 60,000 1,60,000
Comments
Please login to add a commentAdd a comment