Backwater
-
కంటి తుడుపుగానే ముంపు నివారణ!
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ భూభాగం ముంపునకు గురికావడాన్ని నివారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. ముంపు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 1న సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్.. క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది. ఉమ్మడి సర్వే జరపడానికి ఏపీ, తెలంగాణలు సమ్మతించాయని, సర్వే ఫలితాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ)లు చర్యలు తీసుకుంటాయని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇవ్వడం కంటితుడుపు చర్యేనని ఆరోపించింది. ఇకనైనా పోలవరం వల్ల జరిగే ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ మంగళవారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌కు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు ఎన్నో లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో ఇంకా ఏముందంటే .. ఉమ్మడి సర్వేకు అంగీకరించినా.. పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్) 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన సర్వే రాళ్ల వద్ద నుంచి ఉమ్మడి సర్వేను ప్రారంభించాలని సీడబ్ల్యూసీ/పీపీఏ/ఏపీ ప్రభుత్వం అంగీకరించినా ఆ తర్వాత మిన్నకుండిపోయాయి. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురి అవుతున్నట్టు ఏపీ సమర్పించిన మ్యాపులే బయటపెట్టాయి. సీడబ్ల్యూసీ చైర్మన్ సూచన మేరకు పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలోని 7 వాగులు, భద్రాచలం, మణుగూరు భార జల ప్లాంట్ వద్ద ఉండనున్న ముంపు/నీటి స్థాయిలపై ఉమ్మడి సర్వే జరిపేందుకు ఏపీ, పీపీఏలు ముందుకు రావడం లేదు. నదిలో పూడికపై సర్వే జరపాలి భద్రాచలం వద్ద 8 ఔట్‌ఫాల్ స్లూయిస్ల వద్ద పూడిక పేరుకుపోవడంతో బ్యాక్‌వాటర్ ప్రభావం పెరిగి తెలంగాణలోని 37 వాగులు ముంపునకు గురి అవుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాల మేరకు కిన్నెరవాగు, ముర్రేడువాగులకు ఉన్న ముంపుపై ఇంకా ఉమ్మడి సర్వే జరపలేదు. నదిలో పూడికపై సీడబ్ల్యూసీ, లైడార్ సర్వేల నివేదికల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో మళ్లీ సర్వే జరపాలి. వరద లెక్కల్లో లోపాలు సవరించాలి ఇటీవల వచ్చిన భారీ వరదల సందర్భంగా నమోదు చేసిన వరద లెక్కల్లో తీవ్ర లోపాలున్నాయి. వీటిని సీడబ్ల్యూసీ పరిశీలించి సవరించాలి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత తెలంగాణ ముంపు ప్రభావం భారీగా పెరిగింది. దుమ్ముగూడెం అనకట్ట నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉమ్మడి సర్వే జరిపి ముఖ్య కట్టడాలు, ప్రాంతాలకు ఉండనున్న ముంపు ప్రభావంపై పరిశీలన జరపాలి. పోలవరం ముంపుపై తెలంగాణలో మళ్లీ బహిరంగ విచారణ జరపాలి. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురి అవుతున్న ప్రాంతాలకు రక్షణగా వరద గోడలను నిర్మించాలి. -
సోమశిల బ్యాక్ వాటర్‌లో ఎన్ని అందాలో.. డోంట్ మిస్.. ఎప్పటికీ గుర్తుంచుకుంటారు
ఆహ్లాదకర తీరం..పాపికొండలను తలపించే విధంగా వాతవరణం..కనుచూపు మేర జలసోయగం..రెండుకొండల నడుమ ఒయ్యారాలు ఒలికించే పెన్నా నది.. నీటిలో ఎగిరే చేపలు.. దేశ విదేశాల నుంచి వచ్చే విహంగాలు అరుదైన పక్షిజాతుల ఇక్కడి సందడి చేస్తుంటాయి. అదే సోమిశిల వెనుకజలాలు. ఈ ప్రాంతాన్ని పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. జంపేట : వైఎస్సార్, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ పెనుశిల అభయారణ్యం ఏర్పాటుచేయాలని పాతికేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 1997 డిసెంబరు 15 జీవో నంబరు 106ను జారీ చేశారు. కడప డివిజన్ పరిధిలోని ఒంటిమిట్ట, సిద్ధవటం రేంజ్ పరిధిలో 43,491,608 హెక్టార్లు , నెల్లూరు జిల్లాలోని 40,443,265 హెక్టార్లను అభయారణ్యంలోకి చేర్చారు. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. అరుదైన వన్యప్రాణులు, జలచరాలకు అవాసంగా మారింది. కోటపాడు నుంచి.. ఒంటిమిట్ట(రాజంపేటనియోజకవర్గం)మండలంలోని కోటపాడు శివారులో సోమశిల వెనుకజలాల్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని 2010లో నిర్ణయం తీసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 26న ఈ దిశగా అడుగులు పడ్డాయి. తర్వాత రాష్ట్ర విభజన, టీడీపీపాలనలో ఎకో టూరిజం పడకేసింది.ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎకోటూరిజంతో పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని స్ధానిక శాసనసభ్యులు మేడా మల్లికార్జునరెడ్డి దృష్టి సారించారు. సోమశిల జలాశయం నిల్వసామర్ధ్యం 77.988 టీఎంసీలు. ప్రస్తుతం 52.3 టీఎంసీలు నిల్వ ఉంది. కోటపాడు, కుడమలూరు, బెస్తపల్లె, ఉప్పరపల్లె, మాధవరం, బోయనపల్లె, చిన్నపురెడ్డిపల్లె, కురుగుంటపల్లె, పొన్నాపల్లి, కొండమాచుపల్లె, మదిలేగడ్డ, గుండ్లమాడ, దొంగలసాని, నెమళ్లగొంది, నర్సనాయనిపేట, వాకమాడ, ఒగూరు, వట్రపురాయి, కొత్తూరు తదితర గ్రామాలు సోమశిల అంతర్భాగంలో ఉండిపోయాయి. బోటు షికారు ఎప్పుడో.. ఒంటిమిట్ట, నందలూరు, మండలాల్లోని బ్యాక్‌వాటర్‌లో బోటుషికారుకు అనుకూలంగా ఉంటుందని పర్యాటకులు భావిస్తున్నారు. ఒంటిమిట్ట రామాలయం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు, యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. అటువంటప్పుడు సోమశిల బ్యాక్‌వాటర్‌లో షికారు చేయడానికి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. నిధులు కేటాయింపులిలా.. 2020 ఆగస్టు 30న వనవిహారి కోసం రూ.50లక్షలు అనుమతిచ్చారు. 2021 జూలైలో రూ.120 లక్షలతో చేపట్టాలని పరిపాలన ఆమోదం ఇచ్చారు. కోటపాడు శ్రీరామఎత్తిపోతల పంపుహౌస్ సమీపంలో అనువైన స్ధలాన్ని ఎంపిక చేశారు. తొలి విడతలో ఆరుపనులను అటవీశాఖ ఉన్నతాధికారులు రూ.42,84,795లతో చేపట్టాలని ఉత్తర్వులిచ్చారు. ఆన్లైన్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లను ఆహ్వానించారు. గిట్టుబాటుకాదని పనులు చేయడానికి ఎవరు ముందుకురాకపోవడం గమనార్హం. మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నాటుపడవలో ఎమ్మెల్యే పరిశీలన.. కొడమలూరులో జరిగిన జాతర సందర్భంగా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే సోమశిల వెనుకజాలలను పరిశీలించారు. అక్కడ ఆయనకు అందుబాటులో నాటుపడవ కనిపించింది. ప్రమాదకరమని తెలిసినా ధైర్యంగా బ్యాక్‌వాటర్‌లో పర్యటించారు. ఒంటిమిట్ట రేంజ్‌కి ఇచ్చిన బోటు పనిచేయక మూలనచేరింది. అయిదేళ్లుగా మరమ్మత్తులకు నోచుకోని సంగతి తెలిసిందే. ఎకో టూరిజం అభివృద్ధికి కృషి సోమశిల బ్యాక్‌వాటర్‌లో బోటుషికారు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టూరిజం సెంటర్ అభివృద్ధి చేసుకోవాలి. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలో ఎకో టూరిజం ఏర్పాటుచేశారు.దీనిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒంటిమిట్ట, నందలూరులో కూడా సోమశిల బ్యాక్‌వాటర్ ఉంది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం – మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
పోలవరం బ్యాక్‌వాటర్‌పై సమావేశం
సాక్షి, హైదరాబాద్: పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై బుధవారం కేంద్ర జలశక్తి శాఖ..ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై గతేడాది సెప్టెంబర్ 29న కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలపై ముంపు ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపుల కోసం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాయగా, సీడబ్ల్యూసీ నుంచి బదులు వచ్చింది. ఈ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 20లోగా పంపించాలని ఆయా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ కోరింది. ఫిబ్రవరి 15న పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు విచారణకు రానున్న నేపథ్యంలో 25న నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యత ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. పోలవరం ముంపు ప్రభావిత ప్రాంతాలకు రక్షణతో పాటు బాధిత రైతులకు పరిహారం, పునరావాసం కల్పించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. -
పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఇబ్బందేంలేదు.. తేల్చిచెప్పిన ఐఐటీ-రూర్కీ
రామగోపాలరెడ్డి ఆలమూరు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల ముంపు సమస్యే ఉత్పన్నం కాదని ఐఐటీ–రూర్కీ కూడా తెగేసిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు గోదావరికి గరిష్టంగా వరద వచ్చిన సమయంలో సీలేరు, శబరి నదుల్లో ఏ స్థాయిలో వరద మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతేస్థాయిలో ఉంటుందని తేల్చింది. రూర్కీ–ఐఐటీ అధ్యయన నివేదికను పరిశీలిస్తే.. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఆ నివేదికను చూపుతూ ఒడిశా సర్కార్ చేస్తున్న వాదనలో వీసమెత్తు నిజం కూడా లేదన్నది స్పష్టమవుతోంది. గోదావరిలో గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్–ప్రాబబుల్ మాగ్జిమమ్ ఫ్లడ్), పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ–ఐఐటీలోని హైడ్రాలజీ విభాగంతో ఒడిశా జలవనరుల శాఖ అధ్యయనం చేయించింది. ఆ రెండు అంశాలపై రెండేళ్లపాటు అధ్యయనం చేసిన రూర్కీ–ఐఐటీ 2019, ఫిబ్రవరిలో ఒడిశా సర్కార్‌కు వేర్వేరుగా నివేదికలిచ్చింది. అందులోని ప్రధానాంశాలివీ.. ఏకరీతిలో వర్షం కురిస్తే.. గోదావరి పరీవాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతంలో 1986, ఆగస్టు 12–14 మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావంవల్ల ఆగస్టు 15, 16న మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్ (ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా)ల లో వర్షం కురిసిందని రూర్కీ–ఐఐటీ పేర్కొంది. దీనివల్ల గోదావరి ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు గరిష్టంగా 94,900 క్యూసెక్కులు (35,06,338 క్యూసెక్కులు) వరద వచ్చిందని వెల్లడించింది. గోదావరి చరిత్రలో ఇదే గరిష్ట వరద ప్రవాహం మొత్తం గోదావరి బేసిన్లో మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్లు 70 శాతంలో విస్తరించి ఉన్నాయని.. 1986, ఆగస్టు 15, 16న కురిసిన వర్షపాతం మొత్తం గోదావరి బేసిన్లో ఒకేరోజు.. ఒకే సమయంలో కురిస్తే.. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 1,64,872 క్యూమెక్కులు (58,05,143 క్యూసెక్కులు) వరద వచ్చే అవకాశముందని వివరించింది. ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం సాధ్యమా? వాతావరణ మార్పుల ప్రభావంవల్ల ప్రస్తుతం ఒక చదరపు కిలోమీటర్ పరిధిలోనే ఏకరీతిలో వర్షం కురవడంలేదు. అలాంటిది ఆరు రాష్ట్రాల్లోని గోదావరి బేసిన్లో ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం కురవడం అసాధ్యమని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముంటుందని తేల్చిన ఐఐటీ–రూర్కీ అధ్యయనం శాస్త్రీయం కాదని స్పష్టంచేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు 1986, ఆగస్టు 16న వచ్చిన గరిష్ట వరద ప్రవాహం 35,06,338 క్యూసెక్కులను పరిగణలోకి తీసుకుంటే.. వెయ్యేళ్లకు ఓసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కులు, పదివేల ఏళ్లకు ఓసారి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరదవచ్చే అవకాశముందని ఐఐటీ–హైదరాబాద్ అధ్యయనంలో తేల్చడం గమనార్హం. ఇక గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కులకు మించి వరదవచ్చే అవకాశమేలేదని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. పోలవరం ప్రాజెక్టులోకి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించింది. ఆ మేరకే ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వేను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది. 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పులేదు ♦పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ– ఐఐటీ వెల్లడించిన అంశాలేమిటంటే.. ♦పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. కనిష్ట నీటిమట్టం 41.15 అడుగులు. గరిష్టస్థాయిలో నీటిని నిల్వచేస్తే.. 637 చదరపు కిలోమీటర్లు భూమి ముంపునకు గురవుతుంది. ఇందులో ఏపీలో 601, ఒడిశా లో 12, ఛత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. ఉంటుంది. ♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎగువ భాగంలో 145 కి.మీల దూరంలో దుమ్ముగూడెం ఉంటుంది. కూనవరం వద్ద శబరి నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఎగువన 72 కి.మీల పొడవున శబరి ప్రవహిస్తుంది. కొంటాకు 25 కిమీల ఎగువన శబరిలో సీలేరు నది కలుస్తుంది. ♦గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు కట్టకముందు సీలేరు నది 25 కిమీల వద్ద నీటిమట్టం 70.80 మీటర్లు ఉంటే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక నీటిమట్టం 70.81 మీటర్లు ఉంటుంది. అంటే.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల పెరిగే నీటి మట్టం ఒక సెంటీమీటరే. ♦అలాగే, ఇదే స్థాయిలో వరద వచ్చినప్పుడు.. పోలవరం కట్టకముందు శబరి నదిలో 40 కిమీల వద్ద నీటిమట్టం 105.4 మీటర్లు ఉంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అది 105.4 మీటర్లే ఉంటుంది. అంటే.. శబరిపైనా పోలవ రం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదన్న మాట. ♦ఇక రూర్కీ–ఐఐటీ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సంస్థ అంచనా వేసిన మేరకు గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదని స్పష్టమవుతోంది. -
పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం తెలంగాణపై ఉండదు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల తెలంగాణలో భూభాగం ఏమాత్రం ముంపునకు గురికాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం కిన్నెరసాని, ముర్రేడు ఉప నదులపై ఏమాత్రం పడుతుందనే అంశంపై తెలంగాణ జలవనరులశాఖ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించామని, ఇందుకు సంబంధించిన వివరాలను ఈనెల 12లోగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు పంపుతామని తెలిపింది. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ప్రకటన–2006 ప్రకారం.. నోటిఫికేషన్ జారీచేసిన 45 రోజుల్లోగా గ్రామసభలు నిర్వహించాలని, ఏళ్లు గడుస్తున్నా ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు గ్రామసభలు నిర్వహించలేదని ఎత్తిచూపింది. ఈఐఏ–2006 నిబంధనల మేరకు రెగ్యులేటరీ అథారిటీతో ఆ రాష్ట్రాల్లో గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్‌ప్రసాద్‌గుప్తాకు గతనెల 15న లేఖ రాసినట్లు తెలిపింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉత్తర్వులకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేస్తున్నామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ భూభాగం ముంపునకు గురవుతుందని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే క్రమంలో ఎన్జీటీ లేవనెత్తిన అంశాలపై గురువారం వర్చువల్ విధానంలో పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులు, సీడబ్ల్యూసీ, కేంద్ర అటవీ పర్యావరణశాఖ అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం సీఈ సి.లాల్, కేంద్ర అటవీ పర్యావరణశాఖ అధికారులు పాల్గొన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులు గైర్హాజరయ్యారు. తెలంగాణ భూభాగం ముంపునకు గురికాదు పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందనే అంచనాతో నిర్మిస్తున్నారని, దీనివల్ల తెలంగాణలో భూభాగం ముంపునకు గురవుతుందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశంలో ప్రస్తావించగా.. అది ఒట్టి అపోహే అంటూ ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కొట్టిపారేశారు. గోదావరి నది చరిత్రలో 1986 ఆగస్టు 16న గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు భద్రత కోసం 50 లక్షల క్యూసెక్కులు వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం వద్దకు 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో సీడబ్ల్యూసీ బ్యాక్‌వాటర్ సర్వే చేసిందని.. అందులో తెలంగాణలో ఒక్క ఎకరం కూడా ముంపునకు గురికాదని తేలిందని గుర్తుచేశారు. ముర్రేడు, కిన్నెరసాని ఉప నదులపై బ్యాక్‌వాటర్ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ అధికారులతో కలిసి సర్వే చేశామని, ఈ వివరాలను ఈనెల 12లోగా సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. పోలవరం బ్యాక్‌వాటర్ వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య ఉంటుందని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు చెబుతున్నాయని.. ఆ సమస్యను తప్పించడానికి రక్షణ గోడలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఏపీ అధికారులు రాసిన లేఖపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారులు తెలిపారు. 2022 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామని, ఆలోగా 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు -
కందకాలు తవ్వితే చెట్లు పచ్చబడ్డాయి
కోనేరు సురేశ్‌బాబు విజయనగరం జిల్లా ఆలూరు మండలం కందుల పదం గ్రామపరిధిలో 13 ఎకరాల్లో పామాయిల్ తోటను పదిహేనేళ్లుగా సాగు చేస్తున్నారు. పామాయిల్ చెట్టుకు రోజుకు 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. వెంగళ్రావు సాగర్ డ్యామ్ దగ్గర్లోనే సురేశ్‌బాబు వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. గుడ్డవాగు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్ అందుబాటులో ఉండటం వల్ల బోర్ పుష్కలంగా నీరు పోస్తూ ఉంటుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కరెంటు ఉన్న సమయంలో గతంలో డ్రిప్ ద్వారా అనుదినం నీరందించేవారు. అయితే, భూమి తేలిక నేల కాకపోయినప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల కొన్ని చోట్ల చెట్లకు సరిగ్గా నీరందక ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కందకాలు తీయిస్తే ఎక్కడి వర్షపు నీరు అక్కడే ఇంకి, వేసవిలోనూ చెట్లకు, దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న భావనతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించి గత మేలో కందకాలు తీయించారు. పామాయిల్ చెట్ల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది. చెట్లకు సమాన దూరంలో మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన తర్వాత డ్రిప్ వాడటం మానేశారు. కందకాల ద్వారానే బోరు నీటిని పారిస్తున్నారు. పామాయిల్ చెట్ల మట్టలను కందకాల్లో వేశారు. అవి క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతున్నాయి. నీటికి కొరత లేకపోయినా ముందు చూపుతో సురేశ్‌బాబు వాన నీటి సంరక్షణ కోసం కందకాలు తవ్వించడం విశేషం. కందకాలు తవ్విన తర్వాత చెట్లు మరింత పచ్చగా, కళగా ఉంటున్నాయని ఆయన గుర్తించారు. ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ మార్పును గుర్తించారని ఆయన తెలిపారు. భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఎండాకాలంలో నీరు వెనకా ముందు అయినాæచెట్లకు ఇబ్బందేమీ ఉండబోదని సురేశ్‌బాబు (97017 50189) ఆశాభావంతో ఉన్నారు. -
871.4 అడుగులుగా శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయ నీటిమట్టం గురువారం సాయంత్రం సమయానికి 871.4 అడుగులుగా నమోదైంది. జలాశయానికి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు 13,588 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. తెలంగాణా ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు 7,063 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనివాసుజల స్రవంతికి 2,025 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 4,500 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 147.6340 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. -
‘ఎల్లంపల్లి’లో కుక్కలగూడూర్
గ్రామాన్ని ముంచెత్తిన బ్యాక్‌వాటర్ మునిగిన రక్షిత మంచినీటి బావులు తాగునీటికి గ్రామస్తుల ఇబ్బంది బసంత్‌నగర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ రామగుండం మండలం కుక్కలగూడూర్‌ను ముంచేసింది. రెండు రోజుల క్రితం వరకు గ్రామ శివారులోని లోలెవల్ బ్రిడ్జి వద్ద రెండడుగులు మాత్రమే ఉన్న నీరు.. ప్రాజెక్టులో నిల్వ పెరుగుతున్నకొద్దీ బ్యాక్‌వాటర్ అదేస్థాయిలో గ్రామాన్ని చుట్టుముట్టింది. ప్రస్తుతం దాదాపు రెండుమీటర్ల ఎత్తుకు చేరింది. ఫలితంగా గ్రామంలోని రక్షిత మంచినీటి బావులు మునిగిపోయాయి. దీంతో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. సమీప గ్రామాలకు వెళ్దామన్నా.. నీటిచేరికతో రాకపోకలు స్తంభించాయి. ఎస్సీ కాలనీ నుంచి తాళ్ల బ్రిడ్జివద్దకు ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దారి లేని కూలీపనులకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. విద్యార్థులు చదువుకునేందుకు వెళ్లడంలేదు. గీతకార్మికులు చెట్లు ఎక్కడం లేదు. ముంపు గుర్తించని అధికారులు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సమయంలో కుక్కలగూడుర్ పాక్షికంగా ముంపునకు గురవుతుందని అధికారులు భావించారు. కానీ.. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బ్యాక్‌వాటర్ ఇళ్లలోకి ప్రవేశిస్తోంది. దీంతో బాధితులు రాత్రి సమయంలో కనీసం నిద్రకూడా పోవడం లేదు. వరదనీటి నుంచి పాములు, తేళ్లు, విషపుపరుగులు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తమను ఇళ్లలో ఎలా ఉండమంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గ్రామం మెుత్తం మునిగిపోతున్నా.. ఇప్పటివరకు అధికారులెవరూ ఆ గ్రామం వైపు కన్నెత్తిచూడడం లేదు. కనీసం ఎంత మునిగిపోతోంది..? బాధితులు ఎందరు ఉన్నారు..? అనికూడా తెలుసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్గటూర్, ధర్మారం మండలాల పరిధి ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు.. తమ గ్రామాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గ్రామ శివారులోని బండలవాగు ప్రాజెక్టు నిండితే గ్రామం చుట్టూ నీరు చేరి తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుందంటున్నారు. కలెక్టర్ స్పందించి తమ గ్రామాన్ని సందర్శించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తుల రాస్తారోకో గ్రామాన్ని పూర్తిస్థాయి ముంపు ప్రాంతంగా ప్రకటించి తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామ కూడలి వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. గ్రామంలో తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని yì మాండ్ చేశారు. ఆందోళనలో సర్పంచ్ బొంకూరి శంకర్, ఉప సర్పంచ్ కుదిరె సతీష్, నాయకులు బొడ్డు రాయమల్లు, మేడం మల్లయ్య, మానాల నగేష్, మల్లేశం, స్థానిక యువకులు, మహిళలు పాల్గొన్నారు. -
నీటమునగనున్న రాయపట్నం వంతెన
కొత్త వంతెనపై రాకపోకలు ప్రారంభం భారీ వాహనాలను అనుమతించని పోలీసులు ధర్మపురి : ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో రాయపట్నం లో లెవల్ వంతెన మునిగిపోనుంది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ రాయపట్నం వద్ద గోదావరినదిపై లో లెవల్ వంతెనను ఆరవై ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ వంతెన పలుమార్లు గోదావరినదికి వరదలు వచ్చినప్పుడు నీటమునుగుతోంది. దీంతో వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయడం వల్ల రెండు జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. అయితే ఈసారి ఎల్లంపల్లి ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యం మేరకు 20 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ధర్మపురి వరకు చేరుకుని వంతెన నీట మునుగుతుందని గుర్తించిన ప్రభుత్వం గోదావరినదిపై కొత్త హైలెవల్ వంతెన నిర్మాణాన్ని ప్రారంభించింది. కొత్త బ్రిడ్జి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. గత పదిహేను రోజులుగా గోదావరినదికి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ధర్మపురి వరకు చేరింది. దీంతో ఆదివారం సాయంత్రానికి పాత వంతెన స్లాబ్ వరకు నీటిమట్టం చేరింది. సోమవారం వరకు వంతెన స్లాబ్ నీటమునిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో గత పదిహేను రోజులుగా వంతెన పై నుంచి భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ద్విచక్ర వాహనాలను, కార్లను మాత్రమే అనుమతిస్తుండగా, ఆదివారం సాయంత్రం నుంచి వాటిని కూడా నిలిపివేశారు. పాతవంతెన మార్గాన్ని పూర్తిగా మూసివేసిన అధికారులు, కొత్త వంతెన మీదుగా వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నందున భారీ వాహనాలను నియంత్రించారు. -
ఏం చక్కటి వయ్యారం!
సైబీరియన్ పక్షులతో గోపవరం మండలం బేతాయపల్లి చెరువు కళకళలాడుతోంది. ఇక్కడికి సమీపంలోనే సోమశిల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండటంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో పక్షులు వచ్చాయి. చిన్న చిన్న కట్టె పల్లలను ఏరుకొచ్చి చెట్లపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. గుడ్లు పెట్టి.. పిల్లలను పొదిగి.. వాటికి రెక్కలొచ్చే వరకు ఈ పక్షులు ఇక్కడే ఉంటాయి. అనంతరం స్వస్థాలానికి పిల్లలతో కలిసి ఎగిరిపోతాయి. సైబీరియన్ పక్షుల సందడి పెద్ద ముక్కు... పొడవాటి కాళ్లు.. విశాలమైన రెక్కలు.. చూసేందుకు భలేగున్నాయి కదూ.. ఇవి సైబీరియన్ పక్షులు. మన జిల్లాకు అతిథులుగా వచ్చాయి. గోపవరం మండలం బేతాయిపల్లెలోని చెట్లపై గూళ్లు కట్టుకున్నాయి. జనవరి చివరిలో వచ్చిన ఈ విహంగాలు ఇక్కడే గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి అవి కాస్త ఎగిరే దశకు చేరాక తిరిగి తమ ప్రాంతానికి రివ్వున ఎగిరిపోతాయి. సోమశిల బ్యాక్‌వాటర్‌లో చేపలను ఆరగిస్తూ.. సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి. - ఫొటోలు: రమేష్ -
గోదారి ఏడారి
కంతనపల్లి బ్యాక్‌వాటర్ పేరిట ఇసుక దందా అందిన కాడికి దండుకున్న మైనింగ్ మాఫియూ పుష్కరాలకు కానరాని గోదావరి నీరు ధనార్జనే ధ్యేయంగా సాగిన దందా.. అశేష భక్తులకు అశనిపాతంలా మారింది. గోదావరిలో యథేచ్ఛగా కొనసాగిన ఇసుక తోడివేతతో నది ఎడారిని తలపిస్తోంది. పుష్కరాలు అత్యంత సమీపంలో ఉన్నా.. ఘాట్లకు నీరు సుదూరంలో ప్రవహిస్తోంది. పుణ్యస్నానాలు ఆచరించేదెలా అని భక్తులు కలవరపడుతున్నారు. ఏటూరునాగారం: ఏటూరునాగారం ఏజెన్సీలో కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం బ్యాక్ వాటర్‌లో కలిసిపోయే లక్షా 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని మైనింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సాకుతో అందినకాడికల్లా మైనింగ్ అధికారులు ఇసుకను తరలించారు. మైనింగ్, మినరల్స్ నిబంధనల ప్రకారం గోదావరి మధ్యలో ఇసుకను కేవలం మీటరు లోతు, మీటరు వెడల్పు మాత్రమే తీయాల్సి ఉంది. కానీ ఇసుక కాంట్రాక్టర్లు, అధికారులు సుమారు మూడు మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు జరిపారు. ఇసుకను భారీ లోతుల్లో తోడేశారు. ఎండ వేడికి ఇసుకలో ఉన్న తేమ పూర్తిగా కోల్పోరుుంది. ఇలా కంతనపల్లి దిగువ భాగంలోని తుపాకులగూడెం, ఏటూరు 1, ఏటూరు 2 వద్ద క్వారీలను ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించారు. ఇంకిపోతున్న వరదనీరు గోదావరిలో ఇసుక లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు వచ్చినా నీరు నిలవడం లేదు. గుంతల్లో ఇంకిపోరుుంది. వేసవిలో గోదావరి 60 శాతం ప్రవహించాల్సి ఉంది. కానీ కేవలం 45 శాతమే ప్రవహించడం ఇసుకాసురుల పాప ఫలితమే. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురిసినా గోదావరి తీరం వెంట నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ ఏడాది ఇసుక తవ్వకాలతో ఆ పరిస్థితి తారుమారైంది. గోదావరి పుష్కరాలకు నీటి గండం ఏర్పడడానికి ప్రధాన కారణం ఇసుక క్వారీలు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వ క్వారీలు కావడంతో అధికారులు నోరుమెదపడం లేదు. ఈ పరిస్థితి ప్రజలకు తెలిస్తే ఎక్కడ వ్యతిరేకత వస్తోందనని ఆ ఊసే ఎత్తడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఘాట్లకు నీటి గండం ఏర్పడడం స్వయంకృతమేననే విమర్శ విన్పిస్తోంది. ఇసుక తవ్వకాలతో ఇలా.. గోదావరిలో యంత్రాలతో ఇసుకను తవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చేతి పంపులు, బోరు బావుల నీళ్లు కూడా రావట్లేదు. పొలాల్లో మోటార్లు నోర్లు తెరుస్తున్నాయి. ఆదాయం ప్రభుత్వానికి.. కరువు కష్టాలు మాకు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. - తాడూరి రఘు, ఏటూరునాగారం భద్రాచలం వెళ్లాలనుకుంటున్నాం.. ఇక్కడి పుష్కరఘాట్ల వద్ద నీళ్లు రాకుంటే భద్రాచలం వెళ్దామని అనుకుంటున్నాం. కానీ, ఇక్కడికి నీరు రావాలని కోరుకుంటున్నాం. నీటి ఎద్దడి ఈ ఏడాది బాగా తగ్గిపోరుుంది. వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేదు. - బలభద్ర స్వరూప, ఏటూరునాగారం వర్షాలు కురిస్తేనే.. గతేడాది ఇదే సమయంలో వర్షాలు జోరుగా ఉండేవి. ఇటీవల ముంచెత్తిన వానలు అకస్మాత్తుగా ముఖం చాటేశారుు. వర్షాలు కురిస్తేనే పుష్కర స్నానాలకు వీలుపడుతుంది. దయ్యాలవాగులోనూ ఇసుక తవ్వకాలతో చేతి పంపుల్లోకి కూడా నీరు రావడం లేదు. - కోట రాజు, ఏటూరునాగారం