సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ భూభాగం ముంపునకు గురికావడాన్ని నివారించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. ముంపు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఈ నెల 1న సుప్రీంకోర్టులో కేంద్రం సమర్పించిన అఫిడవిట్.. క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉందని ఆక్షేపించింది.
ఉమ్మడి సర్వే జరపడానికి ఏపీ, తెలంగాణలు సమ్మతించాయని, సర్వే ఫలితాల ఆధారంగా ఏపీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ)లు చర్యలు తీసుకుంటాయని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇవ్వడం కంటితుడుపు చర్యేనని ఆరోపించింది. ఇకనైనా పోలవరం వల్ల జరిగే ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ మంగళవారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌కు లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖకు ఎన్నో లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లేఖలో ఇంకా ఏముందంటే ..
ఉమ్మడి సర్వేకు అంగీకరించినా..
పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేసినప్పుడు ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన సర్వే రాళ్ల వద్ద నుంచి ఉమ్మడి సర్వేను ప్రారంభించాలని సీడబ్ల్యూసీ/పీపీఏ/ఏపీ ప్రభుత్వం అంగీకరించినా ఆ తర్వాత మిన్నకుండిపోయాయి. తెలంగాణలో 954 ఎకరాలు ముంపునకు గురి అవుతున్నట్టు ఏపీ సమర్పించిన మ్యాపులే బయటపెట్టాయి. సీడబ్ల్యూసీ చైర్మన్ సూచన మేరకు పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలోని 7 వాగులు, భద్రాచలం, మణుగూరు భార జల ప్లాంట్ వద్ద ఉండనున్న ముంపు/నీటి స్థాయిలపై ఉమ్మడి సర్వే జరిపేందుకు ఏపీ, పీపీఏలు ముందుకు రావడం లేదు.
నదిలో పూడికపై సర్వే జరపాలి
భద్రాచలం వద్ద 8 ఔట్‌ఫాల్ స్లూయిస్‌ల వద్ద పూడిక పేరుకుపోవడంతో బ్యాక్‌వాటర్ ప్రభావం పెరిగి తెలంగాణలోని 37 వాగులు ముంపునకు గురి అవుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాల మేరకు కిన్నెరవాగు, ముర్రేడువాగులకు ఉన్న ముంపుపై ఇంకా ఉమ్మడి సర్వే జరపలేదు. నదిలో పూడికపై సీడబ్ల్యూసీ, లైడార్ సర్వేల నివేదికల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో మళ్లీ సర్వే జరపాలి.
వరద లెక్కల్లో లోపాలు సవరించాలి
ఇటీవల వచ్చిన భారీ వరదల సందర్భంగా నమోదు చేసిన వరద లెక్కల్లో తీవ్ర లోపాలున్నాయి. వీటిని సీడబ్ల్యూసీ పరిశీలించి సవరించాలి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, కాఫర్ డ్యామ్ నిర్మించిన తర్వాత తెలంగాణ ముంపు ప్రభావం భారీగా పెరిగింది. దుమ్ముగూడెం అనకట్ట నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉమ్మడి సర్వే జరిపి ముఖ్య కట్టడాలు, ప్రాంతాలకు ఉండనున్న ముంపు ప్రభావంపై పరిశీలన జరపాలి. పోలవరం ముంపుపై తెలంగాణలో మళ్లీ బహిరంగ విచారణ జరపాలి. పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపునకు గురి అవుతున్న ప్రాంతాలకు రక్షణగా వరద గోడలను నిర్మించాలి.
Comments
Please login to add a commentAdd a comment