రామగోపాలరెడ్డి ఆలమూరు సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల ముంపు సమస్యే ఉత్పన్నం కాదని ఐఐటీ–రూర్కీ కూడా తెగేసిచెప్పింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు గోదావరికి గరిష్టంగా వరద వచ్చిన సమయంలో సీలేరు, శబరి నదుల్లో ఏ స్థాయిలో వరద మట్టం ఉంటుందో.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతేస్థాయిలో ఉంటుందని తేల్చింది.
రూర్కీ–ఐఐటీ అధ్యయన నివేదికను పరిశీలిస్తే.. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల తమ భూభాగం ముంపునకు గురవుతుందని ఆ నివేదికను చూపుతూ ఒడిశా సర్కార్ చేస్తున్న వాదనలో వీసమెత్తు నిజం కూడా లేదన్నది స్పష్టమవుతోంది. గోదావరిలో గరిష్ట వరద ప్రవాహం (పీఎంఎఫ్–ప్రాబబుల్ మాగ్జిమమ్ ఫ్లడ్), పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ–ఐఐటీలోని హైడ్రాలజీ విభాగంతో ఒడిశా జలవనరుల శాఖ అధ్యయనం చేయించింది. ఆ రెండు అంశాలపై రెండేళ్లపాటు అధ్యయనం చేసిన రూర్కీ–ఐఐటీ 2019, ఫిబ్రవరిలో ఒడిశా సర్కార్‌కు వేర్వేరుగా నివేదికలిచ్చింది. అందులోని ప్రధానాంశాలివీ..
ఏకరీతిలో వర్షం కురిస్తే..
గోదావరి పరీవాహక ప్రాంతం (బేసిన్) మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో 3,12,812 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతంలో 1986, ఆగస్టు 12–14 మధ్య ఏర్పడిన అల్పపీడన ప్రభావంవల్ల ఆగస్టు 15, 16న మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్ (ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా)ల లో వర్షం కురిసిందని రూర్కీ–ఐఐటీ పేర్కొంది. దీనివల్ల గోదావరి ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు గరిష్టంగా 94,900 క్యూసెక్కులు (35,06,338 క్యూసెక్కులు) వరద వచ్చిందని వెల్లడించింది. గోదావరి చరిత్రలో ఇదే గరిష్ట వరద ప్రవాహం
మొత్తం గోదావరి బేసిన్‌లో మిడిల్ గోదావరి, లోయర్ గోదావరి సబ్ బేసిన్‌లు 70 శాతంలో విస్తరించి ఉన్నాయని.. 1986, ఆగస్టు 15, 16న కురిసిన వర్షపాతం మొత్తం గోదావరి బేసిన్‌లో ఒకేరోజు.. ఒకే సమయంలో కురిస్తే.. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 1,64,872 క్యూమెక్కులు (58,05,143 క్యూసెక్కులు) వరద వచ్చే అవకాశముందని వివరించింది.
ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం సాధ్యమా?
వాతావరణ మార్పుల ప్రభావంవల్ల ప్రస్తుతం ఒక చదరపు కిలోమీటర్ పరిధిలోనే ఏకరీతిలో వర్షం కురవడంలేదు. అలాంటిది ఆరు రాష్ట్రాల్లోని గోదావరి బేసిన్‌లో ఒకే రోజు ఒకే సమయంలో ఒకే రీతిలో వర్షం కురవడం అసాధ్యమని వాతావరణ శాస్త్రవేత్తలు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముంటుందని తేల్చిన ఐఐటీ–రూర్కీ అధ్యయనం శాస్త్రీయం కాదని స్పష్టంచేస్తున్నారు.
మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు 1986, ఆగస్టు 16న వచ్చిన గరిష్ట వరద ప్రవాహం 35,06,338 క్యూసెక్కులను పరిగణలోకి తీసుకుంటే.. వెయ్యేళ్లకు ఓసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కులు, పదివేల ఏళ్లకు ఓసారి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరదవచ్చే అవకాశముందని ఐఐటీ–హైదరాబాద్ అధ్యయనంలో తేల్చడం గమనార్హం.
ఇక గోదావరికి గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కులకు మించి వరదవచ్చే అవకాశమేలేదని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. పోలవరం ప్రాజెక్టులోకి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వేను నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించింది. ఆ మేరకే ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వేను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోంది.
58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పులేదు
♦పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై రూర్కీ– ఐఐటీ వెల్లడించిన అంశాలేమిటంటే..
♦పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. కనిష్ట నీటిమట్టం 41.15 అడుగులు. గరిష్టస్థాయిలో నీటిని నిల్వచేస్తే.. 637 చదరపు కిలోమీటర్లు భూమి ముంపునకు గురవుతుంది. ఇందులో ఏపీలో 601, ఒడిశా లో 12, ఛత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. ఉంటుంది.
♦పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి ఎగువ భాగంలో 145 కి.మీల దూరంలో దుమ్ముగూడెం ఉంటుంది. కూనవరం వద్ద శబరి నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి ఎగువన 72 కి.మీల పొడవున శబరి ప్రవహిస్తుంది. కొంటాకు 25 కిమీల ఎగువన శబరిలో సీలేరు నది కలుస్తుంది.
♦గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు కట్టకముందు సీలేరు నది 25 కిమీల వద్ద నీటిమట్టం 70.80 మీటర్లు ఉంటే.. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక నీటిమట్టం 70.81 మీటర్లు ఉంటుంది. అంటే.. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంవల్ల పెరిగే నీటి మట్టం ఒక సెంటీమీటరే.
♦అలాగే, ఇదే స్థాయిలో వరద వచ్చినప్పుడు.. పోలవరం కట్టకముందు శబరి నదిలో 40 కిమీల వద్ద నీటిమట్టం 105.4 మీటర్లు ఉంటే.. ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అది 105.4 మీటర్లే ఉంటుంది. అంటే.. శబరిపైనా పోలవ రం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదన్న మాట.
♦ఇక రూర్కీ–ఐఐటీ అధ్యయనాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సంస్థ అంచనా వేసిన మేరకు గోదావరికి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావం ఉండదని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment