చదువుల తల్లులు | Annually increasing enrollment of girls in higher education | Sakshi
Sakshi News home page

చదువుల తల్లులు

Published Thu, Mar 9 2023 4:54 AM | Last Updated on Thu, Mar 9 2023 10:14 AM

Annually increasing enrollment of girls in higher education - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో ఉన్నత చదువుల్లో మహిళల చేరికలు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. పదేళ్ల క్రితం అంతంతమాత్రంగా ఉన్న చేరికలు ప్రస్తుతం భారీగా వృద్ధి చెందాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం వంటి కోర్సులకే పరిమితమైన అమ్మాయిలు ఇప్పుడు స్టెమ్‌ (సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌) కోర్సులకు పెద్దపీట వేస్తున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో 2016లో 8 శాతంగా ఉన్న మహిళల చేరికలు 2021లో 20 శాతానికి పెరగడం విశేషం.

అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో కూడా వీరి చేరికలు 23 శాతంగా ఉండడం గమనార్హం. ఐఐటీలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో మహిళల చేరికలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా సూపర్‌ న్యూమరరీ సీట్లు కేటాయించడం ఇందుకు దోహదపడింది. 2017లో ఐఐటీల్లో చేరిన మహిళలు 995 మంది ఉండగా 2021 నాటికి ఈ సంఖ్య 3 వేలకు చేరుకుంది.

ఐఐటీ, ఎన్‌ఐటీల్లోనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ స్టెమ్‌ కోర్సులకే అమ్మాయిలు ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ ఉన్నత విద్యా సర్వే నివేదిక ప్రకారం.. 2016–17లో స్టెమ్‌ కోర్సుల్లో చేరిన మహిళలు 41 లక్షలుగా ఉండగా 2020–21లో అది 44 లక్షలకు చేరింది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో కన్నా మనదేశంలో స్టెమ్‌ కోర్సులు అభ్యసిస్తున్న మహిళలు ఎక్కువ కావడం విశేషం. మనదేశంలో స్టెమ్‌ కోర్సులు చేస్తున్న మహిళలు 43 శాతం కాగా అమెరికాలో 34 శాతం, బ్రిటన్‌లో 38 శాతం, కెనడాలో 31 శాతం మాత్రమే. 

2 కోట్లకు పైగా ఉన్నత విద్యార్థినులు
కాగా కొద్దికాలం క్రితం విడుదలైన ఆలిండియా సర్వే ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఐష్‌) నివేదిక ప్రకారం.. 2020–21లో ఉన్నత విద్యలో పురుషులు, మహిళల మొత్తం చేరికలు 4.14 కోట్లుగా ఉన్నాయి. 2019–20లో ఈ మొత్తం చేరికలు 3.85 కోట్లు కాగా ఏడాదిలో 30 లక్షల మంది అదనంగా చేరారు. వీరిలో 2019–20లో ఉన్నత విద్యలో చేరిన మహిళలు 1.88 కోట్లు ఉన్నారు. 2020–21లో ఈ సంఖ్య 2.01 కోట్లకు పెరిగింది.

2014–15 నాటి మహిళల చేరికల సంఖ్యతో పోలిస్తే దాదాపు 44 లక్షల మంది అదనంగా చేరారని ఐష్‌ నివేదిక పేర్కొంది. 2014లో పురుషులు, మహిళల మొత్తం చేరికల సంఖ్యలో మహిళలు 45 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు మొత్తం చేరికల్లో మహిళలు 49 శాతంగా ఉండడం విశేషం. 

పాఠశాల విద్యలోనూ బాలికల సంఖ్య జంప్‌..
పాఠశాల విద్యలోనూ బాలికల చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2021–22 యూనిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ (యూడైస్‌) గణాంకాల ప్రకారం.. దేశంలో పాఠశాల విద్యలో (ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు) బాలికలు 12,73,35,252 మంది ఉన్నారు.కరోనా సమయంలో మొత్తం చేరికలు తగ్గిన నేపథ్యంలో బాలికల సంఖ్య కూడా కొంత తగ్గింది. ఆ తర్వాత మళ్లీ వారి చేరికలు పెరుగుతూ వస్తున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement