Polavaram Backwater Will Not Have An Impact On Telangana - Sakshi
Sakshi News home page

పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావం తెలంగాణపై ఉండదు

Published Fri, May 7 2021 11:06 AM | Last Updated on Fri, May 7 2021 11:24 AM

Polavaram Backwater Will Not Have An Impact On Telangana - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రభావం వల్ల తెలంగాణలో భూభాగం ఏమాత్రం ముంపునకు గురికాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రభావం కిన్నెరసాని, ముర్రేడు ఉప నదులపై ఏమాత్రం పడుతుందనే అంశంపై తెలంగాణ జలవనరులశాఖ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించామని, ఇందుకు సంబంధించిన వివరాలను ఈనెల 12లోగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు పంపుతామని తెలిపింది. పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) ప్రకటన–2006 ప్రకారం.. నోటిఫికేషన్‌ జారీచేసిన 45 రోజుల్లోగా గ్రామసభలు నిర్వహించాలని, ఏళ్లు గడుస్తున్నా ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు గ్రామసభలు నిర్వహించలేదని ఎత్తిచూపింది.

ఈఐఏ–2006 నిబంధనల మేరకు రెగ్యులేటరీ అథారిటీతో ఆ రాష్ట్రాల్లో గ్రామసభలు నిర్వహించాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్‌ప్రసాద్‌గుప్తాకు గతనెల 15న లేఖ రాసినట్లు తెలిపింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఉత్తర్వులకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేస్తున్నామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ భూభాగం ముంపునకు గురవుతుందని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే క్రమంలో ఎన్జీటీ లేవనెత్తిన అంశాలపై గురువారం వర్చువల్‌ విధానంలో పీపీఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల జలవనరులశాఖ అధికారులు, సీడబ్ల్యూసీ, కేంద్ర అటవీ పర్యావరణశాఖ అధికారులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం సీఈ సి.లాల్, కేంద్ర అటవీ పర్యావరణశాఖ అధికారులు పాల్గొన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అధికారులు గైర్హాజరయ్యారు. 

తెలంగాణ భూభాగం ముంపునకు గురికాదు
పోలవరం ప్రాజెక్టును 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందనే అంచనాతో నిర్మిస్తున్నారని, దీనివల్ల తెలంగాణలో భూభాగం ముంపునకు గురవుతుందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ సమావేశంలో ప్రస్తావించగా.. అది ఒట్టి అపోహే అంటూ ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కొట్టిపారేశారు. గోదావరి నది చరిత్రలో 1986 ఆగస్టు 16న గరిష్ఠంగా 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ప్రాజెక్టు భద్రత కోసం 50 లక్షల క్యూసెక్కులు వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేందుకు వీలుగా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం వద్దకు 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో సీడబ్ల్యూసీ బ్యాక్‌వాటర్‌ సర్వే చేసిందని.. అందులో తెలంగాణలో ఒక్క ఎకరం కూడా ముంపునకు గురికాదని తేలిందని గుర్తుచేశారు.

ముర్రేడు, కిన్నెరసాని ఉప నదులపై బ్యాక్‌వాటర్‌ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై తెలంగాణ అధికారులతో కలిసి సర్వే చేశామని, ఈ వివరాలను ఈనెల 12లోగా సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య ఉంటుందని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు చెబుతున్నాయని.. ఆ సమస్యను తప్పించడానికి రక్షణ గోడలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు చెప్పారు. ముంపు ప్రభావం ఉండే ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించాలని ఏపీ అధికారులు రాసిన లేఖపై తగిన నిర్ణయం తీసుకుంటామని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారులు తెలిపారు. 2022 ఏప్రిల్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామని, ఆలోగా 45.72 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని పీపీఏ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ సూచించారు.

చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు 
ఏపీకి 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement