2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులివ్వాలి | Andhra Pradesh government made it clear to PPA for Funds | Sakshi
Sakshi News home page

2017–18 ధరల ప్రకారమే పోలవరానికి నిధులివ్వాలి

Published Thu, Nov 11 2021 3:16 AM | Last Updated on Thu, Nov 11 2021 3:16 AM

Andhra Pradesh government made it clear to PPA for Funds - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లు కేంద్రం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌’ ఇవ్వాలని కోరుతూ కేంద్ర జల్‌శక్తి శాఖకు ప్రతిపాదన పంపాలని మరోసారి కోరింది. గతేడాది జరిగిన సమావేశంలోనే ఈమేరకు కేంద్రానికి ప్రతిపాదన పంపడానికి పీపీఏ అంగీకరించిన విషయాన్ని గుర్తు చేసింది. తక్షణమే ఆ ప్రతిపాదన పంపి.. నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

ఈ మేరకు నిధులిస్తేనే ప్రాజెక్టు పూర్తిచేయడం సాధ్యమవుతుందనే అంశాన్ని కేంద్రానికి గట్టిగా చెప్పాలని విజ్ఞప్తి చేసింది. ఇతర జాతీయ ప్రాజెక్టుల తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకూ నీటిపారుదల, సరఫరా వ్యయాలను ఒకటిగానే పరిగణించి, నిధులివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన పంపాలని కోరింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇదే అంశంపై కేంద్రానికి ఇప్పటికే నివేదికలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.2,100 కోట్లను తక్షణమే రీయింబర్స్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడం ద్వారా ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనలకు పీపీఏ సీఈవో జె.చంద్రశేఖర్‌ అయ్యర్‌ సానుకూలంగా స్పందించారు.

గడువులోగా పూర్తికి ప్రణాళిక
పీపీఏ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. పీపీఏ సీఈవోతో పాటు సభ్య కార్యదర్శి ఎస్కే శ్రీనివాస్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వివరించారు. ప్రణాళిక మేరకు పనులు జరుగుతుండటంపై పీపీఏ సంతృప్తి వ్యక్తం చేసింది. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని తోడివేసి, డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు డయాఫ్రమ్‌ వాల్‌ను మరింత పటిష్టం చేస్తామని, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పనులు 2022లోగా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.

గడువులోగా పనులు పూర్తి చేయడానికి రోజుకు, నెలకు ఎంత పరిమాణంలో పనులు చేయాలన్నది తేల్చేందుకు ప్రత్యేక కమిటీ వేస్తామని, ఆ కమిటీ నివేదిక మేరకు పనులు చేపట్టాలని చంద్రశేఖర్‌ అయ్యర్‌ సూచించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. నిర్వాసితుల పునరావాసం, భూసేకరణకే రూ.30 వేల కోట్లు అవసరమని, ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని అధికారులు తేల్చిచెప్పారు. దీనిపై తాము వెలిబుచ్చిన సందేహాలను నెలాఖరులోగా నివృత్తి చేస్తే ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామన్న పీపీఏ సీఈవో సూచనకు రాష్ట్ర అధికారులు అంగీకరించారు.

పీపీఏ సీఈవో పదవీకాలం పొడిగింపు 
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(సీఈవో)గా అదనపు బాధ్యత నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్‌ అయ్యర్‌ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనను కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చంద్రశేఖర్‌ అయ్యర్‌ ప్రస్తుత పదవీ కాలపరిమితి ఈ నెల 27తో ముగియనుంది.     

నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే..
ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సీఈవో ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూటరీల పనులకు ఇప్పటికే సర్వే పూర్తి చేశామని, టెండర్లు పిలిచి పనులు చేపడతామని అధికారులు వివరించారు. నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తే గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.  పీపీఏ ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే రాజమహేంద్రవరానికి తరలించాలని, ఇక్కడ ఉంటే ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించవచ్చని, ఇది గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి దోహదం చేస్తుందని అధికారులు చెప్పారు. ఈ సూచనకు పీపీఏ సానుకూలంగా స్పందించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement