గోదారి ఏడారి
కంతనపల్లి బ్యాక్‌వాటర్ పేరిట ఇసుక దందా
అందిన కాడికి దండుకున్న మైనింగ్ మాఫియూ
పుష్కరాలకు కానరాని గోదావరి నీరు
ధనార్జనే ధ్యేయంగా సాగిన దందా.. అశేష భక్తులకు అశనిపాతంలా మారింది. గోదావరిలో యథేచ్ఛగా కొనసాగిన ఇసుక తోడివేతతో నది ఎడారిని తలపిస్తోంది. పుష్కరాలు అత్యంత సమీపంలో ఉన్నా.. ఘాట్లకు నీరు సుదూరంలో ప్రవహిస్తోంది. పుణ్యస్నానాలు ఆచరించేదెలా అని భక్తులు కలవరపడుతున్నారు.
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఏజెన్సీలో కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం బ్యాక్ వాటర్‌లో కలిసిపోయే లక్షా 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని మైనింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సాకుతో అందినకాడికల్లా మైనింగ్ అధికారులు ఇసుకను తరలించారు. మైనింగ్, మినరల్స్ నిబంధనల ప్రకారం గోదావరి మధ్యలో ఇసుకను కేవలం మీటరు లోతు, మీటరు వెడల్పు మాత్రమే తీయాల్సి ఉంది. కానీ ఇసుక కాంట్రాక్టర్లు, అధికారులు సుమారు మూడు మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు జరిపారు. ఇసుకను భారీ లోతుల్లో తోడేశారు. ఎండ వేడికి ఇసుకలో ఉన్న తేమ పూర్తిగా కోల్పోరుుంది. ఇలా కంతనపల్లి దిగువ భాగంలోని తుపాకులగూడెం, ఏటూరు 1, ఏటూరు 2 వద్ద క్వారీలను ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించారు.
ఇంకిపోతున్న వరదనీరు
గోదావరిలో ఇసుక లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు వచ్చినా నీరు నిలవడం లేదు. గుంతల్లో ఇంకిపోరుుంది. వేసవిలో గోదావరి 60 శాతం ప్రవహించాల్సి ఉంది. కానీ కేవలం 45 శాతమే ప్రవహించడం ఇసుకాసురుల పాప ఫలితమే. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురిసినా గోదావరి తీరం వెంట నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ ఏడాది ఇసుక తవ్వకాలతో ఆ పరిస్థితి తారుమారైంది. గోదావరి పుష్కరాలకు నీటి గండం ఏర్పడడానికి ప్రధాన కారణం ఇసుక క్వారీలు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వ క్వారీలు కావడంతో అధికారులు నోరుమెదపడం లేదు. ఈ పరిస్థితి ప్రజలకు తెలిస్తే ఎక్కడ వ్యతిరేకత వస్తోందనని ఆ ఊసే ఎత్తడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఘాట్లకు నీటి గండం ఏర్పడడం స్వయంకృతమేననే విమర్శ విన్పిస్తోంది.
ఇసుక తవ్వకాలతో ఇలా..
గోదావరిలో యంత్రాలతో ఇసుకను తవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చేతి పంపులు, బోరు బావుల నీళ్లు కూడా రావట్లేదు. పొలాల్లో మోటార్లు నోర్లు తెరుస్తున్నాయి. ఆదాయం ప్రభుత్వానికి.. కరువు కష్టాలు మాకు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి.
- తాడూరి రఘు, ఏటూరునాగారం
భద్రాచలం వెళ్లాలనుకుంటున్నాం..
ఇక్కడి పుష్కరఘాట్ల వద్ద నీళ్లు రాకుంటే భద్రాచలం వెళ్దామని అనుకుంటున్నాం. కానీ, ఇక్కడికి నీరు రావాలని కోరుకుంటున్నాం. నీటి ఎద్దడి ఈ ఏడాది బాగా తగ్గిపోరుుంది. వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేదు.
- బలభద్ర స్వరూప, ఏటూరునాగారం
వర్షాలు కురిస్తేనే..
గతేడాది ఇదే సమయంలో వర్షాలు జోరుగా ఉండేవి. ఇటీవల ముంచెత్తిన వానలు అకస్మాత్తుగా ముఖం చాటేశారుు. వర్షాలు కురిస్తేనే పుష్కర స్నానాలకు వీలుపడుతుంది. దయ్యాలవాగులోనూ ఇసుక తవ్వకాలతో చేతి పంపుల్లోకి కూడా నీరు రావడం లేదు. - కోట రాజు, ఏటూరునాగారం