Godavari ample
-
రూ.వందల కోట్లు కృష్ణార్పణం
-
రూ.వందల కోట్లు కృష్ణార్పణం
సర్కారు అవినీతిలో కొట్టుకుపోయిన పుష్కర ఘాట్లు.. రోడ్లు! వేసిన రోడ్లు గుంతలమయం.. కొన్ని చోట్ల రోడ్లే మాయం.. ఇంకొన్నిచోట్ల సొంత రియల్ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు ప్రభుత్వ అండతో అధిక అంచనాలతో పనులు మంజూరు ప్రతి పనిలోనూ స్థానిక పచ్చ నేతలకు కమీషన్లు పుష్కరాలు జరిగింది 135 గ్రామాలు, ఒక నగర ప్రాంతంలోనే లోటు బడ్జెట్లోనూ రూ.1472.39 కోట్లు ఖర్చు.. సరాసరి ఊరికి రూ.11 కోట్లు సాక్షి, అమరావతి: ఒక్కొక్క ఊరికి రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ ఊరి రూపురేఖలే మారిపోవాలి. కానీ పుష్కరాల సందర్భంగా రూ.1472 కోట్లు ఖర్చుపెట్టినా కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లో ఆ మేరకు పనుల ఆనవాళ్లు కనిపించడంలేదు. నామినేషన్లపై పనులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు అరకొర పనులతో కనికట్టు చేసేశారు. కొన్ని చోట్ల ఉన్న రోడ్లపైనే కంకరపోసి బిల్లులు చేయించుకున్నారు. మరికొన్నిచోట్ల రోడ్లు వేయకుండానే వేసినట్లు చూపించేశారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసేశారు. ఘాట్ల నిర్మాణంలో ఎలాంటి నిబంధనలూ పాటించకుండా కంకరపోసి టైల్స్ అతికించేశారు. పుష్కరాలు ముగిసి నెలరోజులైనా మరికొన్ని చోట్ల ఘాట్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల మంది ప్రజల భక్తి విశ్వాసాలే పెట్టుబడిగా వందల కోట్ల ప్రజాధనాన్ని పుష్కరాల పనుల పేరుతో తెలుగు తమ్ముళ్లు దోచేసుకున్నారు. పుష్కరాల పనులు జరిగిన ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయం సచిత్రంగా స్పష్టమైంది. రూ.1472 కోట్ల పనుల ఆనవాళ్లేవీ? రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కృష్ణా పుష్కరాల పనులకోసం రూ.1349.37 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీనికి తోడు రాష్ట్రంలోని వివిధ ఆలయాల ఆస్తులకు సంబంధించిన కామన్ గుడ్ ఫండ్ నుంచి మరో రూ.123.02 కోట్లు దేవాదాయ శాఖ ఖర్చు చేసింది. మొత్తంగా పుష్కరాలకోసం రూ.1472.39 కోట్లు ఖర్చు చేయగా... అందులో రూ.1186.83 కోట్లతో రోడ్లు వంటి వివిధ నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల మాదిరి ఇతర అభివృద్ధి పథకాల్లో భాగంగా అక్కడ మరికొన్ని నిధులతో అదే సమయంలో జరిగిన అభివృద్ధి పనులు వీటికి అదనం. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని 135 గ్రామాల(శివారు గ్రామాలతో కలిపి)తో పాటు విజయవాడ నగరంలోనే రూ.1472.39 కోట్ల వ్యయంతో పుష్కర పనులను చేపట్టారు. అంటే ఒక్కొక్క ఊరికి సరాసరి రూ.11 కోట్లు వ్యయం. కానీ కృష్ణా తీరం వెంట ఉన్న ఆ గ్రామాల్లో రెండు మూడు నెలల కిందట ఉన్న సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీలున్న చోటల్లా టీడీపీ నేతలే నామినేషన్ ద్వారా పనులను దక్కించుకొని తూతూ మంత్రంగా పూర్తిచేయడంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధీ కనిపించడంలేదు. మిగిలిన చోట్ల పనులకు వాస్తవాని కన్నా అధికం మొత్తం అంచనాలతో మంజూరు చేశామంటూ టెండరు ద్వారా పనులు పొందిన వారి నుంచి స్థానిక అధికార పార్టీ నేతలు కమీషన్లు కొట్టేశారు. నెలకే గుంతలు... లేదంటే పగుళ్లు పుష్కరాలకు జలవనరుల శాఖ గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మొత్తం రూ. 334 కోట్ల ఖర్చుతో 188 ఘాట్లు, ఘాట్ల వద్ద ఫ్లాట్ ఫారం పనులను చేపట్టారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా కలెక్టర్లు డిసెంబరు, జనవరి నెలలలోనే ఘాట్ల నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో గానీ వాటికి అనుమతులు మంజూరు చేయలేదు. టెండర్లు ప్రక్రియ మిగిలింది కేవలం రెండు నెలల సమయమే. ప్రభుత్వమే పనులు మంజూరు చేసిందే ఆలస్యం చేయడంతో కాంట్రాక్టర్లు కూడా తాము చేసే పనుల్లో నాణ్యత పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఆఖరిరోజు వరకు పనులు చేస్తూ వచ్చారు. సిమెంట్ పని అంటే కనీసం వారం రోజుల పాటు నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ... పుష్కరాల ముందు రోజు కూడా చాలా ఘాట్లలో పనులు చేపట్టారు. దీంతో ఆ ఘాట్ల పుష్కరాలు జరుగుతున్న రోజుల్లోనే పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల ఘాట్ల వద్ద సిమెంట్ ప్లాట్‌ఫారాలు కుంగిపోయాయి. ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా పుష్కరాల కోసం వేసిన రోడ్లన్నీ నెల రోజులకే గుంతలమయం అయ్యాయి. -
మెట్లను గమనించకే తొక్కిసలాట
- కమిషన్ ముందు పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది - గోదావరి పుష్కర తొక్కిసలాటపై విచారణ 27కి వాయిదా రాజమహేంద్రవరం క్రైం: ‘పుష్కర ఘాట్ గేటు నంబర్-1 వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ గోదావరి రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలనుంచి అధికంగా భక్తులు ఘాట్‌కు చేరుకోవడంతో వాటిని పీకివేశారు. దీంతో గేటు నంబర్-1ను తెరిచిన వెంటనే ముందున్న ఏడు మెట్లను గమనించని భక్తులు ఒకరిపై మరొకరు పడి తొక్కిసలాట జరిగింది’... ఇదీ గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ వద్ద 29 మంది మృతికి కారణమైన తొక్కిసలాటపై ప్రభుత్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు ఇచ్చిన వివరణ. తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో విచారణ నిర్వహించింది. దీనికి హాజరైన ప్రభుత్వ న్యాయవాది చింతపెంట.. పుష్కరాలప్పుడు ప్రభుత్వశాఖలు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, తొక్కిసలాట తర్వాత గాయపడిన వారికందించిన వైద్యసేవల్ని తెలియజేస్తూ తొక్కిసలాట జరగడానికి మెట్లను భక్తులు గమనించకపోవడమే కారణమన్నట్టు చెప్పుకొచ్చారు. అనంతరం విచారణను జస్టిస్ సోమయాజులు ఈ నెల 27కి వాయిదా వేశారు. కాగా, ప్రభుత్వ శాఖలు పూర్తి ఆధారాలు సమర్పించకుండా కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయని మానవ హక్కుల నేత ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు. -
ఉత్కళ ‘పుష్కరం’
గోదావరి పుష్కరాల నేపథ్యంలో 12 రోజులపాటు భక్తజనంతో వెల్లువెత్తిన రాజమండ్రి పుష్కరఘాట్.. సోమవారం మళ్లీ ఆ రోజులను తలపించింది. ఒడిశా నుంచి 50 బస్సుల్లో తరలివచ్చిన వేలాదిమంది భక్తులతో ఘాట్‌కు తిరిగి ‘పుష్కర కళ’ వచ్చింది. ఒడిశాలోని బరంపురం, బాలేశ్వరం, జయపూర్, నవరంగ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భాష, ప్రాంతం వేరయినా అంతరంగాలు, ఆచారాల్లో తేడా లేదని చాటుతూ పుష్కరస్నానాలు, పిండప్రదానాలు చేశారు. ఇతర తీర్థవిధులను నిర్వహించారు. ఒడిశా నుంచి వచ్చిన పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ ఏడాదంతా పుష్కరాలేనని, సోమవారం తమ ఆచారాల ప్రకారం ‘యోగదినం’ కావడంతో గోదావరికి తరలి వచ్చామని పురోహితుడు విజయచంద్రదాస్ తెలిపారు. కాగా ఒడిశా భక్తులు వేలాదిగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్నీ దర్శించి, పిండప్రదానాది విధులు నిర్వర్తించారు. - రాజమండ్రి కల్చరల్ -
తొక్కిసలాటను మర్చిపోయారా?
పుష్కరాలు పూర్తయినా విచారణ ఊసే లేదు ఆధారాల మాయంపై అనుమానాలు ‘సిట్’పై ఉన్న శ్రద్ధ ఇప్పుడు లేకపోవడంపై విమర్శలు హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో తొలి రోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 27 మంది ప్రాణాలను బలిగొన్న ఈ దుర్ఘటనపై ఇంకా విచారణ ప్రారంభించడం లేదు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటులో చూపిన శ్రద్ధ ఇప్పుడెందుకు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుపై ఆరోపణలు వస్తే వేగంగా స్పందించిన ప్రభుత్వం పుష్కరాల్లో తొక్కిసలాట అంశాన్ని ఎందుకు విస్మరిస్తోందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పుష్కరాల తొలిరోజైన జూలై 14న తొక్కిసలాట చోటు చేసుకుంది. పుష్కరాలపై డాక్యుమెంటరీ చిత్రీకరణ, సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానం ఆచరించడం, భక్తులను రెండున్నర గంటల పాటు ఆపేయడం... ఇవన్నీ తొక్కిసలాటకు కారణమనే విమర్శలు వచ్చాయి. దీనిపై పుష్కరాలు ముగిశాక ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తామని జూలై 15న ప్రభుత్వం ప్రకటించింది. జూలై 25తో పుష్కరాల ఘట్టం ముగిసినా విచారణ అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ.. పుష్కరాల నిర్వహణ అద్భుతమని కీర్తించుకోవడం మినహా తొక్కిసలాటపై నిర్ణయం తీసుకోలేదు. విచారణ జరిగితే సీఎంకు ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి. పుష్కర ఘాట్‌లోని సీసీ కెమెరా ఫుటేజ్‌లు సహా తొక్కిసలాటకు సంబంధించిన కీలక ఆధారాలు మాయమవుతున్నాయనే వాదనలున్నాయి. ఆధారాలు, రికార్డుల్లో ఎన్ని ‘మార్పులు చేర్పులు’ జరుగుతాయో? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పుష్కరాలు విజయవంతం
జిల్లాకు రెండో స్థానం, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ క్రైం : అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు విజయవంతమయ్యూయని ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన జిల్లాల్లో కరీంనగర్‌కు మొదటి స్థానం, నిజామాబాద్‌కు రెండో స్థానం దక్కడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని 11 ప్రాంతాల్లో 18 ఘాట్ల వద్ద జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఒక కోటి లక్ష మంది పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. జాతీయ రహదారి పక్కనే పోచంపాడ్ ఉండడంతో ైెహ దరాబాద్ నుంచి ఎక్కువ మంది పోచంపాడ్‌కు వచ్చారని, దీంతో అందరూ పోచంపాడ్‌కు వెళ్లకుండా.. సావెల్, దోంచందా, గుమ్మిర్యాల్, తడ్పాకకు భక్తులను తరలించి ట్రాఫిక్ రద్దీని నివారించామని వెల్లడించారు. ఇందల్వాయి టోల్గేట్ నుంచి పుష్కరాలకు వెళ్లే మార్గంలో ఘాట్ల వివరాలు తెలిపే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. 300 మంది ఎస్పీఓలు.. 300 మంది గ్రామీణ యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీఓ)గా రూట్ బందోబస్తుకు నియమించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వీరికి నిత్యం ఒక్కొక్కరికి రూ. 150 చెల్లించామని చెప్పారు. బాసరకు వెళ్లే మార్గంలో జిల్లా సరిహద్దు యంచ, కందకుర్తి, పోచంపాడ్ వద్ద 50 ఎకరాలకు స్థలాలను గుర్తించి పార్కింగ్ కోసం ఉపయోగించామని వెల్లడించారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల పోలీసు లు కూడా పుష్కరాల్లో విధులు నిర్వర్తిం చారని గుర్తుచేశారు. ఆరుగురు మృతి.. పుష్కర సమయంలో ముగ్గురు రోడ్డు ప్రమాదాలు, మరో ముగ్గురు గోదావరి నదిలో పడి చనిపోయినట్లు ఎస్పీ చెప్పా రు. తప్పిపోరుున 297 మందిని పోలీస్ కంట్రోల్ రూంకు తరలించి మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసి వారి వారి కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. 15 మంది బ్యా గ్లు పోగొట్టుకోగా.. 13 మందికి బ్యాగ్‌లు అప్పగించామని, 10 మంది సెల్ఫోన్లు పోగొట్టుకోగా 9 మందికి ఇప్పించామని ఎస్పీ గుర్తుచేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
పుష్కరం... లాభాలు పుష్కలం
గ్రేటర్ ఆర్టీసీకి రూ.15 కోట్లకు పైగా... ద.మ.రైల్వేకు రూ.46.5 కోట్ల ఆదాయం సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వేలకు గోదావరి పుష్కరాలు కాసుల వర్షం కురిపించాయి. గోదావరి పుష్కరాలకు నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వెళ్లారు. ఆర్టీసీ 19 వేల ట్రిప్పులు నడిపినట్లు అంచనా. సుమారు 8 లక్షల మందికి పైగా భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం,పోచంపాడు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లారు. పుష్కర ఘాట్లకు తరలించడమే కాకుండా తిరిగి నగరానికి చేరవే సేందుకు అత్యధిక ట్రిప్పులు నడిపినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. ఆర్టీసీ అంచనాల మేరకు సుమారు రూ.15 కోట్ల ఆదాయం లభించింది. పుష్కరాల సందర్భంగా రాజమండ్రితో పాటు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 823 ప్రత్యేక రైళ్లను నడిపింది. వీటిలో సుమారు 150 ప్యాసింజర్ రైళ్లు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడల నుంచి భద్రాచలం, బాసర, రాజమండ్రి, తదితర పుణ్య క్షేత్రాలకు నడిచాయి. దక్షిణ మధ్య రైల్వేకు సుమారు రూ.46.5 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో హైదరాబాద్ నుంచి రూ.18 కోట్ల వరకు ఉండవచ్చునని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. -
లెక్క తేలుస్తున్నారు
పుష్కర మృతులు 22 మంది క్షతగాత్రులు ముగ్గురు శ్రీకాకుళం సిటీ : రాజమండ్రిలో గోదావరి పుష్కరాల ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆర్భాటంగా నిర్వహించిన పుష్కర యాత్ర ఎంతోమంది ప్రాణాలను బలిగొంది. ఈ వివరాల నమోదుపై ఇప్పుడు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పుష్కరాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. పదిలక్షలు వంతున అందించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ. రెండులక్షల వంతున అందిస్తామని ప్రకటించింది. పుష్కరఘటనలో తొలిరోజు మృతి చెందిన 27 మంది పూర్తి సమాచారాన్ని అందించాలని కేంద్రం ఆదేశంతో అక్కడి యంత్రాంగం కూడా ఇప్పటికే జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి జాబితాను పంపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో జిల్లా వాసులు తొమ్మిది మంది వరకు మృతి చెందారు. అనంతరం పుష్కరాలకు వె ళ్తూ వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ. మూడు లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబందించిన ఉత్తర్వులు జిల్లాకు రావల్సి ఉన్నాయని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. పుష్కరాల మృతులు 22 మంది గోదావరి పుష్కరాల్లో తొలిరోజున మృతిచెందిన వారు తొమ్మిది మంది కాగా, పుష్కరాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు 13 మంది వరకు ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు మృతి చెందిన వారిలో రేగిడి ఆమదాలవలసకు చెందిన పైల పెంటన్నాయుడు, జడ్డు అప్పలనర్శమ్మ, పొట్నూరు అమరావతి (ఆమదాలవలస), కొత్తకోట కళావతి (సంతకవిటి), పొట్నూరు లక్ష్మి, బరాటం ప్రశాంత్ కుమార్ (శ్రీకాకుళం), లమ్మత తిరుపతమ్మ(సంతబొమ్మాళి), సాసుపల్లి ఆమ్మాయమ్య(భామిని), లచ్చుభుక్త పారమ్మ(వంగర) ఉన్నారు. వీరి కుటుంబీకులకు కేంద్రం నుంచి పరిహారం అందాల్సి ఉంది. ఇక పుష్కరాలకు వెళ్లే ప్రయత్నంలో, అక్కడి నుంచి తిరిగి వచ్చేటపుడు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో జిల్లాకు చెందిన 13 మంది మృత్యువాత పడ్డారు. కర్రి సుభద్రమ్మ(గార), బోర ఎర్రప్పడు, బోర సరస్వతి(పోలాకి), పిట్టా అప్పలరాజు(జలుమూరు), పడాల ప్రసాదరావు, పడాల యశ్వంత్, పడాల షణ్ముఖం(పాలకొండ), కర్ర చంద్రరావు(రాజాం), పెంట శివకుమార్(పలాసా), పిన్నింటి సత్యనారాయణ( నందిగాం), కెల్లవలస రాజారావు(సారవకోట), మెండ అప్పన్న(వంగర), కూన అప్పలరాజు(సరుబుజ్జలి) ఉన్నారు. వీరికి రాష్ట్ర ్రపభుత్వం నుంచి పరిహారం అందాల్సి ఉంది. క్షతగాత్రులు పుష్కరాల రాకపోకల్లో జిల్లా వాసులు సుమారు 37 మంది వరకు గాయపడిన ట్లు తగిన సమాచారం అదికారుల వద్ద ఉండగా వారిలో అధికారికంగా ముగ్గురిని మాత్రమే ఈ జాబితాలో ఎంపిక చేశారు. అధికారులు ఎంపిక చేసిన వారిలో పాలకొండ కు చెందిన మొదల రమణమ్మ, లావేటి తవిటమ్మ, లావేటి యాసినిలు ఉన్నారు. -
డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్న అధికారి?
ఒక్కోపురోహితుడి నుంచి రూ.500 వసూలు ములుగు: గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న పురోహితుల నుంచి ధర్మాన్ని కాపాడే ఓశాఖ అధికారి కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. మంగపేట గోదావరి పుష్కర ఘాట్ వ ద్ద అధికారింగా 30 మంది అర్చకులను నియమించారు. మంగపేట గోదావరి పుష్కరాలకు భక్తుల రద్దీ పెరగడంతోపాటు పిండ ప్రదానాలు చేయడానికి పురోహితులకు డిమాండ్ పెరిగింది. గమనించిన ఓ అధికారి వారి ఆదాయం నుంచి వాటా అడుగుతున్నట్లు సమాచారం. తాను నియమించిన పురోహితుల నుంచి రోజువారీగా ఒక్కొకరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేగాకుండా పురోహితుల పేరుతో సదరు అధికారి అర్హతలేని అర్చకులను నియమించారని ఆరోపణలొస్తున్నారుు. పుష్కరాలకు ముందే తనకు తెలిసిన పురోహితులను సంప్రదించి పుష్కర డ్యూటీలు పడేలాచేశాడని తెలిసింది. అంతేగాకుండా తనకు తెలిసిన ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన పురోహితులను రప్పించారని సమాచారం. -
భక్తజన తీర్థం
పుష్కరాలకు పోటెత్తుతున్న భక్తులు పదో రోజు 3 లక్షల మంది రాక పుణ్యస్నానాలతో మంగపేట, రామన్నగూడెం కళకళ తప్పని బురద, నడక కష్టాలు హన్మకొండ: గోదావరి పుష్కరాలు రేపే ముగుస్తుండడంతో గోదావరి తీరానికి భక్త జనం పోటెత్తుతోంది. సాధారణ రోజులు, సెలవుదినాలు అని తేడా లేకుండా పల్లెలు, పట్నాల నుంచి ప్రజలు తండోపతండా లుగా తరలివస్తున్నారు. దీంతో మంగపేట, రామన్నగూడెం పుష్కరఘాట్లు తీర్థాన్ని తలపిస్తున్నారుు. పుష్కరాల పదోరోజు గురువారం రామన్నగూడెం, మంగపేట, పుష్కర ఘాట్ల వద్ద మూడు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటివరకు 20 లక్షల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొలంగట్లలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు బురదమయమయం కావడంతో వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు కమలాపురం జిల్లా పరిషత్ హై స్కూల్, బిల్ట్ కర్మాగారంలో అప్పటికప్పుడు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ స్థలాల నుంచి భక్తులను పుష్కరఘాట్లకు తరలించే ఉచిత ఆర్టీసీ బస్సులు సకాలంలో రాకపోవడంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. చివరకు ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగపేట వద్ద ట్రాఫిక్‌లో ఇరుక్కున్న బస్సులను బయటకు రప్పించి కమలాపురం పంపారు. మరోవైపు జామాయిల్ తోటల్లో పార్క్ చేసిన పలు వాహనాలు బురదలో ఇరుక్కున్నాయి. పెరిగిన నీటి ప్రవహాం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద నీరు చేరుతోంది. దీంతో క్రమక్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. మంగపేట ఘాట్ వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరిగి ఘాట్వైపుకు పది అడుగుల మేర ముందుకు వచ్చింది. రామన్నగూడెంలో నీటి ప్రవాహం పెరగడంతో ఇన్ని రోజులుగా నదిలో కుడివైపున ఉన్న పాయలో స్నానాన్ని అధికారులు నిషేధించారు. కేవలం ఘాట్‌కు ఎదురుగా ఉన్న పాయలోనే స్నానానికి అనుమతించారు. ఖమ్మం జిల్లాలో పుష్కరఘాట్ల వద్ద రద్ధీ ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మంగపేటకు చేరుకున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో కొంత మంది భక్తులు చుంచుపల్లి, అకినేపల్లి, కమలాపురం ఇన్‌టేక్ వెల్ వద్ద స్నానాలు చేశారు. శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మంగపేట పుష్కరఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. ఉప్పొంగుతున్న గోదావరి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరడంతో గోదావరి ఉప్పొంగుతోంది. బుధవారం 2.40 మీటర్ల నీటి మట్టం ఉండగా గురువారం 2. 65 మీటర్లకు చేరింది. నీటి ఉధృతి గంటగంటకూ పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలవనరులశాఖ రామన్నగూడెం ఘాట్ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
దుర్గమ్మ దర్శనానికి పుష్కర భక్తజనం
విజయవాడ : గోదావరి పుష్కరాలకు రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయప్రాంగణం కిటకిటలాడుతోంది. నాలుగు రోజుల కంటే గురువారం రద్దీ కాస్త తగ్గుముఖం పట్టడంతో భక్తులను అంతరాలయ దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే భోజనాలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సులు, మినీ వ్యానుల్లో వస్తున్న భక్తులు తమ వాహనాలను కనకదుర్గనగర్, భవానీపురం టీటీడీ స్థలంలో నిలుపుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో దుర్గాఘాట్‌కు చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి చేరుతున్నారు. రద్దీకి తగినట్టుగా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు మైక్ ద్వారా పలు సూచనలు, సలహాలను ఇస్తున్నారు. ఈవో నర్సింగరావు గురువారం స్వయంగా మైక్ ప్రచార కేంద్రానికి చేరుకుని భక్తులకు సూచనలు చేశారు. 10వ రోజు ఆదాయం రూ.18.23 లక్షలు పుష్కరాలను పురస్కరించుకుని 10వ రోజు దుర్గమ్మ దేవస్థానానికి రూ.18,23,501 ఆదాయం సమకూరింది. రూ.100, రూ.20 టికెట్ విక్రయాల ద్వారా రూ.7.53 లక్షల ఆదాయం వచ్చింది. 10వ రోజు 71 వేల లడ్డూలను విక్రయించారు. వివిధ సేవలు, కాటేజీల అద్దెల రూపంలో ఈ ఆదాయం సమకూరింది. -
పుష్కరాలకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
గంటలో చేరుతామనగా ప్రమాదం యలమంచిలి వద్ద కారు బోల్తా ఒకరు మృతి.. నలుగురికి గాయాలు యలమంచిలి : గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి గాజువాక వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. యలమంచిలి సమీపంలో పెదపల్లి హైవే జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలిలా ఉన్నాయి...నిద్రమత్తులో డ్రైవర్ కళ్లుమూతపడటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్న లోయలోకి దూసుకుపోయి చెట్టును ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతో ముందు సీటులో కూర్చున్న గాజువాక పంతులుగారి ప్రాంతానికి చెందిన లేళ్ల నర్సింగరావు (55) అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. కారు నడుపుతున్న నర్సింగరావు కొడుకు కుమార్ లేళ్ల శ్రీధర్ రెండుకాళ్లు విరిగిపోయాయి. ఇదే కారులో ప్రయాణిస్తున్న దంపతులు కామశాని రత్నాకరరావు, కామశాని దేవిమణి, గాజువాక సరిగమవైన్స్ యజమాని గూడెల జయరామ్ తీవ్రగాయాలపాలయ్యారు. దేవిమణి తలకు, ఇతర శరీరభాగాలకు బలమైన గాయాలు తగిలాయి. జయరామ్ రెండుకాళ్లు, చేయి వేరిగిపోయాయి. రత్నాకరరావుకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం మేరకు యలమంచిలి సీఐ కె.వెంకట్రావు, పట్టణ ఎస్ఐ జి.బాలకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని గాజువాక సుప్రజా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో దేవిమణి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేర్ ఆస్పత్రికి తరలించినట్టు పట్టణ ఎస్ఐ బాలకృష్ణ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం నర్సింగరావు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బాలకృష్ణ చెప్పారు. -
తిరుమల భక్తులకు పుష్కర కష్టాలు
తిరుచానూరు :శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి రైలులో తిరుపతి వచ్చే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంలో పుష్కర కష్టాలు ఎదురవుతున్నాయి. రాజమండ్రిలో జరుగుతున్న గోదావరి పుష్కరాలకు అటు వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. దీంతో నెలల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. బుధవారం రాత్రి తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఫుట్‌బోర్డుపై ప్రమాదకర రీతిలో ప్రయాణించాల్సి వచ్చింది. కనీసం నిలబడి ప్రయాణించేందుకు సైతం రైలులో స్థలం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో శ్రీకాకుళంకు చెందిన ఓ కుటుంబం రెండు నెలల క్రితమే రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ రైలులో ప్రయాణించలేకపోయారు. రైల్వే పోలీసులు, రైల్వే అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పైగా తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. అలాగే పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు టికెట్లు ఇవ్వకపోవడంతో రైల్వే స్టేషన్లోనే గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. తాము ఎలా గమ్యస్థానాలకు చేరుకోవాలంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేక రైళ్లు నడిపి తమను గమ్యస్థానాలకు చేర్చాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. -
గోదారి ప్రమాదం
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు దుర్మరణం మృతుల్లో ఇద్దరు మహిళలు,ఒక ఆర్టీసీ డ్రైవర్ పలువురికి గాయాలు సోమల : గోదావరి పుష్కరాలకు వెళ్లిన జిల్లావాసులు ముగ్గురు వేర్వేరు ప్రమాదాల్లో మృత్యువాతపడ్డారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. మృతుల్లో సోమలకు చెందిన ఇద్దరు మహిళలతోపాటు మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఉన్నారు. వివరాల్లోకెళితే.. సోమలకు చెందిన శివరాం, ఆయన భార్య వడ్డిపల్లి కుమారి(44), గంగయ్య, ఆయన భార్య వెంకటలక్ష్మమ్మ(50), ఆర్మీ ఉద్యోగి సుబ్రమణ్యంతోపాటు వెంకటమ్మ, శాంతమ్మ, సోమల ఎంపీటీసీ సభ్యురాలు వసంతమ్మ, ఆమె భర్త రమణలు సోమవారం గోదావరి పుష్కరాలకు టవేరా కారులో బయలుదేరి వెళ్లారు. మంగళవారం వారు రాజమండ్రిలోని కోటిలింగాల పుష్కర ఘాట్‌లో స్నానాలు చేసిన అనంతరం అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు బయలుదేరారు. మార్గ మధ్యంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి వద్ద టీ తాగేందుకు ఆగారు. కుమారి, వెంకటలక్ష్మమ్మ, గంగయ్యలు టీ తాగుతుండగా మిగిలిన వారు కారులోనే ఉన్నారు. ఇంతలో అనంతపురం జిల్లాయాడికి గ్రామానికి చెందిన పుష్కర భక్తులు తూఫాన్ వాహనంలో వచ్చి టవేరా వెనుక నిలిపి టీ తాగేందుకు వెళ్లారు. ఇంతలో గూడ్స్‌వ్యాన్ దూసుకొచ్చి ఆగి ఉన్న తూఫాన్ కారును ఢీకొట్టింది. ఆ వాహనం వెళ్లి ముందున్న టవేరా కారును బలంగా తాకింది. దీంతో వడ్డిపల్లి వెంకటలక్ష్మి(60), వడ్డిపల్లి కుమారి(45) అక్కడికక్కడే మృతిచెందగా గంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. టవేరా కారులో కూర్చున్న ఆరుగురు, తూఫాన్ వాహనంలో ఉన్న రంగస్వామి, భాగ్యలక్ష్మిలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు పత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు కుమారి భర్త శివరాం టీచర్ కాగా వీరికి కుమార్తె స్వాతి (24), కుమారుడు తేజ(11) ఉన్నారు. అలాగే వెంకటలక్ష్మమ్మ భర్త గంగయ్య విశ్రాంత ఉద్యోగి, వీరికి ఇద్దరు కుమారులు ఆనంద్(25), నాగరాజు(20) ఉన్నారు. ఎంతో భకిృ్తతో పుష్కరాలకు వెళ్లిన తమకు భగవంతుడు ఇలా ద్రోహం చేశాడంటూ బంధువులు విలపిస్తున్నారు. మృతదేహాలను బుధవారం రాత్రి సోమలకు తీసుకురానున్నారు. మృతదేహాలను సోమలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఈ ఘటనతో సోమలలో విషాదచాయలు అలుముకున్నాయి. -
పుష్కరాల్లో ఇదేమి వీఐపీ సంస్కృతి
కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపాటు విశాఖపట్నం: గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ మండిపడ్డారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల తతంగంపై తాను ఎంతో ఆవేదన చెందుతున్నానన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. పుష్కర భక్తుల కష్టాలపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాస్తయినా శ్రద్ధ చూపి ఉంటే 29 మంది ప్రాణాలు పోయేవి కావన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా తమ కుటుంబ సభ్యులు, వందిమాగదులతో వీఐపీలు రాజమండ్రికి వస్తూనే ఉన్నారని విమర్శించారు. వారి వల్ల భక్తులకు ఇబ్బందితో పాటు ప్రభుత్వ ఖజానాపై కూడా పెనుభారం పడుతుందని వివరించారు. -
ఎనిమిదో రోజు 30 లక్షలు
గత నాలుగు రోజులతో పోలిస్తే తెలంగాణలో తగ్గిన రద్దీ ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు నెట్వర్క్: గోదావరి పుష్కరాలకు ఎనిమిదో రోజూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చారు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ప్రధాన పుణ్య క్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం, బాసర, భద్రాచలానికి భక్తుల తాకిడి తగ్గింది. సాధారణ భక్తులు గంటలోపే ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామిని సందర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి 4 గంటలు, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనానికి 3 గంటలు, బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కరీంనగర్లో అత్యధికంగా 11.32 లక్షల మంది పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుష్కర స్నానం చేశారు. కోటిలింగాల పుష్కర ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యువజన అధ్యక్షుడు వేణుమాధవరావు పుష్కర స్నానమాచరించి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. సుందిల్ల ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పుష్కర స్నానం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోన్ పుష్కర ఘాట్‌లో 1.4 లక్షల మంది స్నానాలు ఆచరించారు. నిజామాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న ఓ ఆటో బాసరా గోదారి వంతెన సమీపంలో అగ్ని ప్రమాదానికి గురవడంతో భక్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. గోదావరిఖనిలో పుష్కర స్నానానికి వెళ్లి సుంకె ప్రసాద్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. గోదావరి ఎగువ ప్రాంతం, ఏటూరు నాగారం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో వరంగల్‌లోని ఘాట్ల వద్ద నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టె ఘాట్ల వద్ద ఇప్పటివరకు 13 లక్షల మంది స్నానాలు ఆచరించారు. మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి దంపతులు మంగపేటలో పుష్కరస్నానం ఆచరించారు. -
ప్రజల దృష్టి మరల్చడానికే!
రాజమండ్రిలో ఏపీ ‘రాజధాని’ ఆవిష్కరణ ముందుగా నిర్ణయించిన ప్రకారం జరగాల్సింది హైదరాబాద్‌లో.. వరుస ఘటనలతో మసకబారిన ఏపీ ప్రభుత్వ పనితీరు హైదరాబాద్: గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున పుష్కరఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతికి దారితీసిన సంఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఏపీ సీఎం చంద్రబాబు.. రాజధాని కథను రాజమండ్రి కేంద్రంగా నడిపించా రా? అంటే అందరినోటా అవుననే వినిపిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన సీడ్ కేపిటల్ ప్రణాళిక విడుదల కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయించడంలోని ఆంతర్యమిదేనని అంటున్నారు. మే 25న మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం అందించింది. కచ్చితంగా జూలై 15 నాటికి సీడ్ కేపిటల్ ప్లాన్ అందిస్తామని అప్పట్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మీడియా ఎదుట ప్రకటించారు. దీని ప్రకారం ఈ నెల 14న రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పుష్కరాలు ప్రారంభించి 15వ తేదీకి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చేతుల మీదుగా సీడ్ కేపిటల్ ప్లాన్ అందుకుని ఆ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహిం చాల్సి ఉంది. అయితే 14న పుష్కరాల ప్రారంభం రోజున చంద్రబాబు ప్రచార యావకు 29 మంది బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జాతీయ, అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది. తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. జాతీయ మీడియా సైతం బాబు తీరును తప్పుపట్టింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టులో పౌరహక్కు ల సంఘాలు వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో మొత్తం వ్యూహాన్ని మార్చారు. ఆ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు పుష్కరాలు పూర్తయ్యే వరకు రాజమండ్రిలోనే ఉంటానని వ్యూహాత్మకంగా ప్రకటించారు. కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిపై భౌతిక దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం, మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మె, పుష్కరఘాట్‌లో తొక్కిసలాట వంటి ఘటనలతో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు పూర్తిగా మసకబారింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో.. సిం గపూర్ సంస్థలు తుది ప్రణాళికను సమర్పించకముం దే రాజధాని ఇలా ఉండబోతోందంటూ నాలుగు ఊహా చిత్రాలను విడుదల చేసి ప్రజల దృష్టిని మళ్లించే యత్నం చేశారు. తాజాగా సోమవారం సింగపూర్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందాన్ని నేరుగా రాజమండ్రి రప్పించి అక్కడే సీడ్ కేపిటల్ ప్లాన్ అందజేసే ఏర్పాట్లు చేశారని విమర్శలొస్తున్నాయి. -
ఇది నిబంధనల నిమజ్జనం
రెండోమాట స్నానం చేయడానికి చాలినంత నీరు లేని రాష్ట్రంలో ఏర్పాట్ల కోసం రూ. 600 కోట్లు ఖర్చు చేశా డట ఒక రాష్ట్ర పాలకుడు. ఇంకో రాష్ట్ర పాలకుడు అవే ఏర్పాట్ల ఖర్చును రూ. 1,600 కోట్లుగా చూపుతున్నాడు. నీళ్ల వ్యాపారులు ‘శుద్ధి’ చేసిన జలాలను సీసాలలో పట్టి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే ఒక అధికారి, ‘పుష్కరాలను ఘనంగా జరిపించామన్న బిరుదులు, కితాబులతో తమ కీర్తిని పెంచుకుందామని ప్రభుత్వం తలచిందే గానీ, ప్రజలకు కల్పిం చవలసిన కనీస సదుపాయాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది’ అని వ్యాఖ్యానించారు. ‘నాకింత శక్తినివ్వవయ్యా అని కోరితే- నాకాయన కష్టాలు ప్రసాదించాడు! నాకింత బుర్ర, బుద్ధీ ప్రసాదించమంటే- దుష్కరమైన సమస్యలను ముఖాన కొట్టి పరిష్కరించుకోమన్నాడు. నాకింత సుఖాన్ని ప్రసాదించమని అర్థిస్తే-కొందరు అసంతృప్త జీవు లను చూపాడు. నాకింత శాంతిని ప్రసాదించమని ప్రార్థిస్తే-కష్టించి పనిచేసుకోమని అవకాశం కల్పించాడు. అయ్యా, నాకింత ప్రశాంతిని దానం చేయమంటే - ఇతరులకు ఎలా సాయపడాలో చూపాడు! కానీ-ఇంతకూ నేను కోరినవేవీ అతనివ్వలేదు. అయినా నాకు కావలసి నవన్నీ ఇచ్చాడు గదా!’ (మనిషి తన భవిష్యత్తుకు తానే సృష్టికర్త-మ్యాన్ ఈజ్ ది క్రియేటర్ ఆఫ్ హిజ్ ఓన్ డెస్టినీ- అని పదే పదే గుర్తు చేసిన వివేకానందుడు తాను ఏం కావాలని కోరుకున్నాడో, ‘దేవుడు’ ఏం ప్రసాదించాడో ఒక సందర్భంలో చెప్పిన మాటలు) బతికుండగా మంచినీళ్లకు కూడా కటకటలాడించి వల్లకాట్లో మాత్రం పాడియావులను దానం చేసే సంస్కృతికి అలవాటు పడిన పరాన్నభుక్కులకు పాలకుల ఆశీర్వాదాలు ఉన్నంతకాలం ఈ దేశంలో మత ప్రసక్తి లేని, మూఢ విశ్వాసాల జాడలేని సెక్యులర్ వ్యవస్థను నిర్మించుకోవడం సాధ్యంకాదు. ప్రచార ఆర్భాటంతో, స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు సాగించే కార్య క్రమాలు ప్రజల నిజమైన సంక్షేమానికి ఉపకరించవు. ప్రజల ఆకాంక్షలకే కాదు, వారి ప్రాణాలకు రక్షణ కూడా కల్పించలేవు. ఇందుకు రెండు తాజా నిదర్శనాలు- గోదావరి మహా పుష్కరాలలోనూ, పూరీ జగన్నాథ రథోత్స వంలోనూ జరిగిన తొక్కిసలాటలే. 2003 పుష్కరాలకు 3.5 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి ఆ సంఖ్య ఐదు కోట్లకు (ఇప్పటికి) పెరగడం ఏ పరిణా మానికి నిదర్శనం? ప్రజలలో ఆత్మ విశ్వాసం ఉదయించడానికి దోహదపడే రాజ్యాంగ విధులనూ, బాధ్యతలనూ గడచిన 65 ఏళ్ల స్వాతంత్య్ర జీవనంలో పాలకులూ, నాయకులూ విస్మరించడమే ఆ పరిణామానికి కారణం. ఆర్థిక వ్యవస్థను ప్రజాబాహుళ్యానికి ప్రయోజనకరంగా మలచడంలోనూ, సాంఘిక సంస్కరణల ద్వారా అసమానతలను రూపుమాపడంలోనూ, భారతీయ తాత్విక సంప్రదాయంలోని హేతువాద సంపదను సద్వినియోగం చేసుకుని ప్రజలను చైతన్యవంతులను చేయడంలోను పాలకులు ఘోరంగా విఫలమ య్యారు. అంతేకాదు, పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన ‘ప్రాథమిక బాధ్యతల’ నుంచి (51 ఏ అధికరణ, ఎఫ్/ హెచ్ నిబంధనలు) దూరంగా జరిగారు. ఏదీ ఆ నిబంధనల అమలు? బహుళ జాతులతో, సంస్కృతులతో దీపిస్తున్న భారతీయ ఉమ్మడి సంపన్న వారసత్వ విలువలను కాపాడుకోవాలని ‘ఎఫ్’ నిబంధన శాసిస్తుండగా, పౌరులలో శాస్త్రీయ దృక్పథాన్నీ, మానవతావాదాన్నీ, జిజ్ఞాసాపూర్వక పరిశీ లనాశక్తినీ, సంస్కరణా ధోరణులనూ పెంపొందించాలని ‘హెచ్’ నిబంధన ఆదేశిస్తున్నది. కాబట్టి పాలకులు వేసుకోవలసిన ప్రశ్న- ప్రజానీకంలో భక్తి రసం తెప్పలుగా పారుతోందా, లేదా? అన్నది కాదు, ఢిల్లీ నుంచి కింది వరకు ‘ప్రాథమిక బాధ్యత’ను తాము సక్రమంగా నిర్వర్తిస్తున్నామా, లేదా? అనే. కుల, మత, వర్గ వివక్ష లేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా పౌరులందరికీ సమానావకాశాలు, ఉపాధి కల్పన ద్వారా శాంతి సౌమనస్యాలను కల్గించడం పాలకుల విధి అని ‘ప్రియాంబుల్’ శాసిస్తున్నది. దానిని ఎందుకు పాలకులు పాటించడం లేదు? దోపిడీ పద్ధతులనూ, అలాంటి వ్యవస్థనూ నిషేధిస్తున్న రాజ్యాంగ నిబంధనలను వారు ఎందుకు కాలరాస్తున్నట్టు? సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో 38/39 అధికరణల మేరకు దేశ సంపద, సహజ వనరులు ప్రజలందరి సొత్తు, కొలదిమంది వ్యక్తులది కాదు అని పదేపదే గుర్తు చేయవలసి రావడం ఎందుకు? పాలనా వ్యవస్థా, పాలకులూ పూర్తిగా గాడి తప్పాయని అత్యున్నత న్యాయస్థానం పలుసార్లు హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు? ఇదంతా ఏ పరిణామానికి నిదర్శనమో పాలకులు చెప్ప గలరా? రాజ్యాంగం అప్పగించిన ఈ కనీస బాధ్యతను గురించి గుర్తు చేసే సాహసం చేసిన న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను అదుపు చేయడానికి ఇటీవల ముమ్మర యత్నం జరుగుతున్న మాట నిజమా, కాదా? న్యాయ వ్యవస్థ వెలు వరించే కొన్ని తీర్పులు అసమంజసంగా కొందరికి కనబడుతున్నప్పటికీ ఆ వ్యవస్థ స్వేచ్ఛను అపహరించే ప్రయత్నం చేయడం కన్నా, దానిని సంస్క రించడానికి ప్రయత్నించాలి. ప్రజా బాహుళ్యం, దేశ ప్రయోజనాలకు ఇది అవసరం. లుప్తమవుతున్న హేతువాద దృక్పథం ప్రాథమిక బాధ్యతలలో భాగంగా రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని అలవరు చుకోవాలని కూడా నిర్దేశిస్తున్నది. కాబట్టి మూఢ విశ్వాసాల బారిన పడిన వారిని చైతన్యవంతులను చేసే కృషి జరగాలి. ఈ కృషిలో పాలకులు భార తీయ తాత్విక దృక్పథానికి చెందిన షడ్దర్శనాలలో హేతువాదాన్ని ఆశ్రయిం చిన తొల్లింటి జైన, బౌద్ధ, చార్వాక, లోకాయత, సాంఖ్య, న్యాయ, వైశేషిక, పూర్వ మీమాంస సిద్ధాంతకర్తలను భారతీయ సంస్కృతికి అసలైన ప్రతినిధు లుగా మరొక్కసారి గుర్తించి ప్రకటించాలి. కపిలుడు, కణాదుడు ఈ సంస్కృ తిలో ఎదిగివచ్చిన ప్రతిభామూర్తులన్న సంగతి విస్మరించరాదు. నేటి రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా ఉన్న పూర్ణకుంభానికి రూపకర్త ఇప్పుడు షెడ్యూల్డ్ కులంగా పేర్కొంటున్న ‘మాల’ వర్గానికి చెందిన విధికుడు. నాగో పాధ్యాయ అనే ఉపాధ్యాయుడి కుమారుడు. దైవం శక్తిని నిర్గుణ, నిరాకా రమని ప్రకటించుకున్న తరువాత ఆకారం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? అని గౌడపాదుడు ప్రశ్నించాడు. కపిలుడి సాంఖ్యసూత్రాలు, కణా దుడి ‘అణు’సిద్ధాంతం హేతువాదానికి ప్రతీకలుగా పేర్గాంచాయి. తొల్లింటి భారతీయుల తాత్వికత ‘మూర్త’ (విగ్రహ) సంప్రదాయం కాదు, ‘అమూర్త’ (విగ్రహ రహిత) సంప్రదాయమేనని తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రచు రించిన ‘ఆర్ష విజ్ఞాన సర్వస్వం’ పేర్కొంటున్నది. శ్వేతకేతుకూ, అతడి తండ్రి ఉద్దాలకునికీ మధ్య జరిగిన ప్రశ్నజవాబులు హేతువాదాన్ని బలపరిచేవే. గ్రీకుల డెమోక్రిటిస్, తొల్లింటి మన గణితశాస్త్రవేత్తలు ఆర్యభట్టు, భాస్కర ఒక కోవకు చెందిన భౌతికవాదులే. అందుకే వివేకానందుడు, ‘మనవాళ్లు విలు వైన గణితశాస్త్రాన్ని గ్రీకులకు అప్పగించి, జ్యోతిష్యాన్ని గ్రీకుల నుంచి ఎరువు తెచ్చుకున్నారు’ అంటాడు. ప్రపంచం నిరంతరంగా పరిణామం చెందుతు న్నదని ఆది బౌద్ధులు, హిరాక్లిటస్ నిరూపించారు. భావస్వేచ్ఛను అనుభవి స్తున్న ‘ఇంద్ర’ హేతువాది అయినందునే ‘వేద నిందితుడు’ అని ప్రకటించి, కాశ్యప ముని గుంటనక్కగా బతకమని శపించినట్టు మహాభారతం చెబు తోంది. తార్కిక దృష్టి కలిగిన భరతుడిని ‘లోకాయత’ మానవతావాదం ప్రభావానికి లోనుకావద్దని రాముడు సలహా ఇవ్వడాన్ని భావస్వేచ్ఛను అణగ దొక్కే ప్రయత్నంగా గమనిస్తాం. యాగాలను నిరసించినందునే వాటిపై బతికే ఒక వర్గం బౌద్ధ వినాశనానికి పునాదులు వేసింది. అందుకే గురజాడ వారు, ‘‘బౌద్ధ ధర్మాన్ని దేశ సరిహద్దులు దాటించి భారతదేశం ఆత్మహత్య చేసుకుంది’ అని శాశ్వత సత్యం చెప్పారు. ‘శుద్ధ’జలంతో వ్యాపారం పవిత్రంగా భావించే గోదావరి మీద పుష్కరాల పేరుతో ఎంత వ్యాపారం జరి గిందో నిర్వాహకులు విస్మరించినట్టుంది. స్నానం చేయడానికి చాలినంత నీరు లేని రాష్ట్రంలో ఏర్పాట్ల కోసం రూ. 600 కోట్లు ఖర్చు చేశాడట ఒక రాష్ట్ర పాలకుడు. ఇంకో రాష్ట్ర పాలకుడు అవే ఏర్పాట్ల ఖర్చును రూ. 1,600 కోట్లుగా చూపుతున్నాడు. నీళ్ల వ్యాపారులు ‘శుద్ధి’చేసిన జలాలను సీసాలలో పట్టి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అందుకే బాధ్యత కల ఒక అధికారి, ‘పుష్కరాలను ఘనంగా జరిపించామన్న బిరుదు లు, కితాబులతో తమ కీర్తిని పెంచుకుందామని ప్రభుత్వం తలచిందేగానీ, ప్రజలకు కల్పించవలసిన కనీస సదుపాయాలను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది’ అని వ్యాఖ్యానించారు. నదులను కాపాడుకోవలసిన అవసరం గురించీ, ఇదేదో మహోత్సవం అని కాకుండా పుష్కరం అంటే మనలను పెంచి పోషించే జలమేనన్న కోణం నుంచి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ‘పోషయతీతి పుష్కరం’ అన్నారు. స్నానం ఎక్కడైనా చేయవచ్చు- నీళ్లంటూ ఉంటే. మన మురికిని నదికి అంటించడానికి వేరే చోటికి పనిగట్టుకు వెళ్లనక్కరలేదు. నదీస్నానం అసలు ఉద్దేశం- శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తి కావాలన్న తపన. కానీ నదిని అంతా కలుషితం చేయడం వల్ల ఈ-కోలీ అనే బ్యాక్టీరియా చుట్టబెట్టిందన్న మాట వాస్తవం. విశ్వనాథ వారు అన్నట్టు గోదావరి జలాలను పుక్కిట పట్టడానికి అఖిల భారతం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఖ్యాతిని దక్కించుకోవాలంటే, గోదావరి జలాలను ఆక్రమించిన బ్యాక్టీరియా నుంచి ఆ నదిని ముందు విముక్తం చేయాలి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
బాబే బాధ్యుడు!
చంద్రబాబు ప్రచారార్భాటమే 29 మంది ప్రాణాలు తీసిందని దుమ్మెత్తిపోసిన జాతీయ మీడియా గోదావరి పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం పాలవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిదే బాధ్యత... డాక్యుమెంటరీ షూటింగ్కోసం లక్షలాదిమంది భక్తులను 2.30 గంటలపాటు పుష్కరఘాట్‌లోకి అనుమతించకపోవడంవల్లే తొక్కిసలాట జరిగింది. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబుదే... అధికారులు, భక్తులే బాధ్యులనడం సిగ్గుచేటు... జరిగిన దుర్ఘటనకు సిగ్గుపడకుండా టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారు... ఇలాంటి సిగ్గులేని నాయకులున్నందుకు మనం సిగ్గుపడాలంటూ జాతీయ మీడియా విరుచుకుపడింది. గోదావరి పుష్కర దుర్ఘటనపై ప్రముఖ జాతీయ చానల్ ‘టైమ్స్ నౌ’లో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి రెండు రోజులు ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో మాజీ కేబినెట్ సెక్రటరీ టీఆర్ఎస్ సుబ్రమణ్యం, మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ భాటియా, సామాజిక ఉద్యమకారులు కంచె ఐలయ్య, రావుల ఈశ్వర్, వినియోగదారుల హక్కుల నిపుణులు బెజోన్ మిశ్రా ఏపీ మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పి నారాయణ, కాంగ్రెస్ నేతలు బ్రజేశ్ కలప్ప, మధుయాష్కీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రచార యావను ‘టైమ్స్ నౌ’ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామితోసహా ప్రముఖులంతా తీవ్రంగా ఎండగట్టారు. సామాజిక, రాజకీయ, పాలనారంగ నిపుణులను చర్చలో భాగస్వాములను చేసి నిర్వహించిన ఈ డిబేట్ చంద్రబాబు చేసిన తప్పును ప్రపంచానికి చాటిచెప్పింది. అర్ణబ్ గోస్వామి ప్రశ్నలు సంధించిన తీరు, టీడీపీ నేతలు తమ తప్పులను సమర్థించుకున్న తీరు ఎలా సాగిందో ఓసారి మీరే చదవండి.. ‘‘ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలకోసం పుష్కరఘాట్‌ను బ్లాక్‌చేసి, అందులోకి భక్తులు ప్రవేశించకుండా రెండు గంటలపాటు నిలిపివేయడం, లక్షలాది మంది భక్తులను పోలీసులు నియంత్రించలేకపోవడమే తొక్కిసలాట జరగడానికి కారణమని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలోని అంశాలు స్పష్టంచేస్తున్నాయి. అసలు వీఐపీలకోసం ప్రత్యేక ఘాట్లు ఎందుకు? దాన్ని వదిలి ముఖ్యమంత్రి ప్రజలకోసం కేటాయించిన ఘాట్‌కు వెళ్లడం ఎందుకు? ఉదయం 6.26 గంటలకు పుష్కర తొలిస్నానం చేయడానికి ముఖ్యమంత్రికేమైనా ప్రత్యేక హక్కులున్నాయా? ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారంకోసం తీసే డాక్యుమెంటరీ షూటింగ్కోసం గంటల తరబడి ప్రజలను బయటనే నిలపడం ఎందుకు? దీనివల్ల జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణాలకు మీ ముఖ్యమంత్రి, మీ పార్టీ బాధ్యత తీసుకుంటారా?’’ అని అర్ణబ్ నిలదీశారు. పుష్కరాలు ప్రారంభించడం ముఖ్యమంత్రి హక్కు. ఆయన అక్కడ కేవలం పది నిమిషాలు మాత్రమే ఉన్నారు. అక్కడ ఎలాంటి ఫిలిం షూటింగ్ లేదు’’ అని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇచ్చిన సమాధానంతో అర్ణాబ్ నిర్ఘాంతపోయారు. ‘‘సరే కాస్సేపు మీరే కరెక్ట్ అనుకుందాం. సీఎం ఉదయం 6.26 గంటలకు తొలి పుష్కరస్నానం చేయడం నిజంకాదా? ముఖ్యమంత్రి కంటే ముందు ఎంతమంది భక్తులు స్నానం చేశారో చెప్పండి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఏ అధికారంతో అక్కడున్నారు? వారేమైనా పబ్లిక్ సర్వెంట్సా?’’ అని ప్రశ్నించారు. ‘‘పుష్కరాలకోసం 40 వేలమంది పోలీసులను మోహరించాం. ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులెవ్వరూ విమర్శించడంలేదు’’ అంటూ సీఎం రమేశ్ పొంతనలేని సమాధానం చెప్పారు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిస్తూ.. ‘‘రాజమండ్రిలో జరిగిన ప్రమాదానికి అధికారులదే బాధ్యత. ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యతను వారు మరచిపోవడంవల్లనే ఈ దుర్ఘటన జరిగింద’ంటూ తప్పును అధికారులపైకి నెట్టివేశారు. ‘‘ముఖ్యమంత్రి తన మందీమార్బలంతో ఘాట్‌లో రెండు గంటలపాటు ఉంటే అధికారులేం చేస్తారు? పబ్లిసిటీ గిమ్మిక్ కోసం సీఎంను అక్కడకు ఎవరు వెళ్లమన్నారు?’’ అని సూటిగా అడిగారు. ‘‘చంద్రబాబు రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు. ఆయనకు ప్రచారం అవసరంలేదు. పుష్కరాల్లో పాల్గొనేలా మోటివేట్ చేసేందుకే ఆయన తొలిస్నానం చేశారు’’ అని పల్లె సమర్థించుకోచూశారు. ‘‘అవునా.. అయితే ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, రావెల కిషోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, సీఎం కుమారుడు లోకేశ్‌బాబు సీఎంతో పాటు పుష్కరస్నానం చేయలేదా? వారికోసం ఆ ఘాట్‌ను బ్లాక్చేయలేదా? భద్రతా బలగాలు మొత్తం వీవీఐపీల చుట్టూ ఉండటంవల్లనే లక్షలాదిమంది భక్తులను నియంత్రించేందుకు ఎవరూ లేకపోవడం నిజంకాదా?’’ అని నిలదీశారు. ‘‘ఉదయం 6.26 గంటలకు పుష్కరస్నానం చేస్తే మంచిదన్న ప్రచారంవల్లనే ప్రజలు ఎక్కువగా వచ్చారు. అందుకే ఈ దుర్ఘటన జరిగింది. అయినా మా ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంవల్ల భక్తులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు’’ అని నారాయణ సమర్థించుకోచూశారు. దీంతో చర్చలో పాల్గొన్న ప్రముఖులందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అలా మాట్లాడటానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను ప్రచారం కోసం వాడుకోవాలని చూసి 27 మంది మరణానికి కారణమైన ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణపై అందరూ ప్రశ్నలు సంధించడాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తప్పుపట్టారు. ‘‘రాష్ట్ర సీఎం పుష్కరాల్లో తొలిస్నానం చేస్తే తప్పేమిటి? అలా చేయకూడదని రూలేమైనా ఉందా?’’ అని ఎదురుదాడికి దిగారు. ‘‘ఓకే.. మరి సీఎం కొడుక్కి ఏం హక్కుంది’’అని అర్ణబ్ నిలదీశారు. ‘‘వారంతా సీఎం కుటుంబసభ్యులు. వారికా హక్కుంది’’ అని వర్ల సమర్థించుకున్నారు. ‘‘మిస్టర్ రామయ్యా.. మీ మాటల్లో, గొంతులో వీవీఐపీని అన్న అహంకారం కనిపిస్తోంది. జరిగిన దానికి బాధ్యత తీసుకోకుండా, సిగ్గుపడకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. మీకు, మీ ముఖ్యమంత్రికి అహంకారం తగ్గే రోజు వస్తుంది. ఏదో ఒకరోజు మీరు అధికారం కోల్పోతారు. అప్పుడు మరో వీవీఐపీ మిమ్మల్నిలా గేటు బయటే ఆపినప్పుడు మీకు సామాన్యుడి బాధలేమిటో అర్థమవుతాయి’’ అంటూ అర్ణబ్ చర్చను ముగించారు. లక్షలాదిమంది హాజరయ్యే మతపరమైన ప్రాంతాలకు ప్రత్యేక సెక్యూరిటీ కావాల్సిన వీఐపీలు దూరంగా ఉండటం మంచిది. వారికోసం సామాన్య ప్రజలను బలిచేయకూడదు. ప్రజలు ఎక్కువగా వచ్చే సమయాల్లో వీవీఐపీలు రాకుండా ఉంటే మంచిది. దేవుడి దగ్గర అందరూ సమానమేనని గుర్తించండి. అందుకే అక్కడైనా అందరినీ సమానంగా చూడాలి. - రావుల ఈశ్వర్, సామాజిక ఉద్యమకారుడు గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలంటే రాజమండ్రిలోనే అన్నట్లుగా ప్రచారం చేసింది. ఉదయం 6.26 గంటలకు ముహుర్తం నిర్ణయించారు. ఆ సమయంలో పుష్కరస్నానంచేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందన్న నమ్మకంతో లక్షలాదిమంది తరలివచ్చారు. అసలు లౌకిక దేశంలో మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రచారం చేయడమేమిటి? -ప్రొఫెసర్ కంచె ఐలయ్య, సామాజిక ఉద్యమకారుడు ‘‘పుష్కరాల ప్రారంభం రోజున ఉదయం ఆరు గంటలకే అమ్మ ఘాట్ వద్దకు చేరుకుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర స్నానం కోసం సుమారు రెండున్నర గంటలపాటు గేట్లు మూసివేయడంతో రద్దీ విపరీతంగా పెరిగి తొక్కిసలాట జరిగింది. పుణ్యానికని వెళితే తిరిగిరాని లోకాలకు పంపారు. చంద్రబాబు కారణంగా ఇప్పుడు అమ్మే లేకుండాపోయింది. ’’ - బుద్దరాజు లక్ష్మి కుమారుడు సతీష్ ‘మా అమ్మ దొడ్డి కన్నయ్యమ్మ పుష్కరాల్లో సేవలందించేందుకు మా గ్రామానికి చెందిన 23 మందితో కలిసి వచ్చారు. అయితే జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో పుష్కరస్నానంకోసం ఘాట్‌కు చేరుకున్నారు. దాహంతో ఘాట్‌లోని శివాలయం వద్ద కూర్చున్నారు. ఇంతలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో అక్కడికక్కడే మృతి చెందారు.’’ - రామజోగినాయుడు, టెక్కలి ‘‘పుష్కరస్నానం కోసం ఉదయాన్నే ఘాట్‌కు చేరుకున్నాం. లోపల సీఎం ఉండటంతో గేట్లు మూసేశారు. సీఎం వెళ్లి పోయిన తర్వాత గేటు తెరువగా వెనుకనున్న వారు కెరటంలా వ చ్చి పడ్డారు. తేరుకునేలోపే నా భార్య, కుమార్తె విగతజీవులై కనిపించారు. కింద పడిపోయిన వారిని లేపే వారున్నా ఎంతోమంది బతికి బైటపడేవారు.’’ - కృష్ణ, మారికవలస, విశాఖపట్నం ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ జరిపితే న్యాయం జరగదు. కేంద్రం జోక్యం చేసుకుని విచారణ జరిపించాలి. మతపరమైన ప్రాంతాల్లో వీఐపీ సంస్కృతిని నిషేధిస్తూ చట్టం తీసుకురావాలి. -టీఆర్ఎస్ సుబ్రమణ్యం, మాజీ కేబినెట్ సెక్రటరీ లక్షలాదిమంది వచ్చే ప్రాంతాల్లో క్యూ నిలిచిపోకూడదు. రాజమండ్రిలో చంద్రబాబు కోసం ప్రజలను ఆపడంవల్లే ప్రమాదం జరిగింది. క్యూ పక్కన పెట్టి సీఎం వెళ్లవచ్చని రూల్ ఎక్కడుంది? ఇది సిగ్గుచేటు. - అరుణ్ భాటియా, మాజీ ఐఏఎస్ అధికారి పుష్కరాల్లో ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. అది మరచి వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటు. మతపరమైన ప్రాంతాల్లో వివక్ష తగదు. పబ్లిక్ ప్లేస్‌లోకి నేతలు వెళ్లకుండా చట్టం తీసుకురావాలి. ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకాలి. -బెజోన్ మిశ్రా, వినియోగదారుల హక్కుల నిపుణుడు పుష్కరాల్లో తొలిరోజున తొలిస్నానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారేమో. ఇంతమంది మరణానికి కారణమైన ఆయనకు పుణ్యం రాదు. అన్ని రకాల పాపాలూ ఆయనను వెన్నాడతాయి. -శైలేశ్ గాంధీ, సమాచార హక్కు ఉద్యమకారుడు -
1,00,000
నాలుగో రోజు పుష్కరాలకు పోటెత్తిన భక్తులు భక్తజనంతో కిక్కిరిసిన పుష్కరఘాట్లు మంగపేటలో పుష్కరస్నానం ఆచరించిన మంత్రి ఇంద్రకరణ్ దంపతులు గోదావరి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం పుష్కర ఘాట్లలో నాలుగో రోజు శుక్రవారం లక్ష మందికి పైగా భక్తులు పుష్కరస్నానం చేశారు. వరుసగా రెండురోజులపాటు సెలవులు ఉండడంతో ప్రజలు గోదారి బాట పట్టారు. దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు మంగపేట పుష్కరఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శని, ఆదివారాల్లో పుష్కరఘాట్ల వద్ద పర్యటించనున్నారు. - మంగపేట మంగపేట : మండల కేం ద్రంతోపాటు గోదావరి పు ష్కరఘాట్ నాలుగోరోజు శుక్రవారం భక్తజనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారని అ ధికారులు అంచనా వేశా రు. అధికారులు ఊహించ ని విధంగా భక్తులు తరలిరావడం, నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో గోదారమ్మ పులకించింది. ఎండను సైతం లెక్కచేయకుండా రెండున్నర కిలోమీటర్ల దూరం నడిచి గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అనంతరం ఉమాచంద్రశేఖరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాగా, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
పుష్కరాలకు మరిన్ని స్పెషల్ రైళ్లు
విశాఖపట్నం సిటీ : గోదావరి పుష్కరాల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లను వాల్తేరు రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఈనెల 18, 19, 20, 24 తేదీల్లో నడుస్తాయని స్పష్టం చేసింది. విశాఖపట్నం-నిడదవోలు మధ్య ఈ రైళ్లు పరుగెడతాయని వెల్లడించింది. విశాఖపట్నం-నిడదవోలు ప్రత్యేక రైలు(01839) ఈనెల 18, 19 తే దీల్లో ఉదయం 9.45 గంటలకు బయల్దేరి రాజమండ్రికి మధ్యాహ్నం 2.47 గంటలకు, నిడదవోలుకు సాయంత్రం 3.25 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.30 గంటలకు నిడద వోలులో బయల్దేరి రాజమండ్రికి సాయంత్రం 5.30 గంటలకు, రాత్రి 10.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, నర్సింగపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అనపర్తి, ద్వారపూడి, కడియం, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 12 జనరల్ బోగీలుంటాయి. విశాఖపట్నం-నిడదవోలు ప్రత్యేక రైలు(01835) ఈనెల 20, 24 తేదీల్లో ఉదయం 5.30 గంటలకు విశాఖలో బయల్దేరి రాజమండ్రికి ఉదయం 9.30 గంటలకు, నిడదవోలుకు 10.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10.45 గంటలకు బయల్దేరి రాజమండ్రికి ఉదయం 11.55 గంటలకు, విశాఖకు సాయంత్రం 4.30 గంటలకు చేరుతుంది. ఈ రైలు తొమ్మిది జనరల్ బోగీలు, 10 జనరల్ ఛైర్‌కార్ బోగీలుంటాయి. పైన తెలిపిన అన్ని స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని వాల్తేరు రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ తెలిపారు. -
పుష్కరాల బాట
నేటి నుంచి వరుస సెలవులు రాజమండ్రి ప్రయాణాల జోరు పోటెత్తుతున్న రైల్వే స్టేషన్ కిటకిటలాడుతున్న రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న వైనం విశాఖపట్నం సిటీః రైళ్లన్నీ కిటకిట లాడుతున్నాయి. ఏ రైలూ కాస్త ఖాళీగా కనిపించడం లేదు. ఇటు గోదావరి పుష్కరాలు..అటు పూరీ జగన్నాథ రధయాత్ర కు వెళ్లేవారితో విశాఖ రైల్వేస్టేషన్ మునుపెన్నడూ లేనంత రద్దీగా కనిపిస్తోంది. నాలుగయిదు రోజులుగా ఇదే పరిస్థితి.దీనికితోడు శని, ఆదివారాలు సెలవులు కావడంతో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. విద్యాలయాలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించడంతో అంతా ప్రయాణాల బాట పట్టారు. శుక్రవారం రైల్వే స్టేషన్ ఒక్క సారిగా కిటకిటలాడింది. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వేల మంది మాత్రమే రోజుకు జనరల్ ప్రయాణికులు టికె ట్లు తీసుకుంటారు. రిజర్వేషన్, ఇతర స్టేషన్లలో తీసుకున్న టికెట్లతో లెక్కిస్తే రోజుకు లక్ష మందికి పైగా విశాఖ నుంచి బయల్దేరిన ట్టు అంచనా వేస్తున్నారు. పుష్కరాలు ముగిసే కొద్దీ మరింత రద్దీ పెరిగేలా ఉందని రైల్వే వర్గాలంటున్నాయి. గత సోమవారం నుంచి శుక్రవారం వరకూ విశాఖ నుంచి రాజమండ్రికి బయల్దేరిన వారు 5 లక్షల మందికిపైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పుష్కరాల సందర్భంగా వాల్తేరు రైల్వే ప్రవేశపెట్టిన 12 రైళ్లతో పాటు 40కు పైగా రెగ్యులర్ రైళ్లు రాజమండ్రికి నిత్యం వెళుతుండడంతో ప్రయాణికులంతా ఈ రైళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. అన్ని రైళ్లకూ 100 నుంచి వెయ్యి మంది చొప్పున బయల్దేరుతున్నారని రైల్వే వర్గాలు అంటున్నాయి. రైళ్లన్నీ 3 నుంచి 5 గంటలు ఆలస్యంః -పుష్కర రద్దీ కారణంగా రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు దూర ప్రాంతాల నుంచి ఎక్కువ రైళ్లు నడుపుతుండడంతో ట్రాక్ ఖాళీ లేక ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ రైలు రాజమండ్రిలో చోటు కోసం నిరీక్షించడంతో ఈ సమస్య తలెత్తినట్టు రైల్వే అధికారిక వర్గాలు అంటున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచీ రైళ్ల ఆలస్యం కొనసాగుతోంది. ఎప్పుడూ 12 గంటలకు విశాఖ స్టేషన్‌కు వచ్చి 12.30 గంటలకు బయల్దేరే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వచ్చి తిరిగి 5 గంటలకు బయల్దేరి వెళ్లింది. ఠంచనుగా తెల్లవారి 6 గంటలకు విశాఖకు చేరుకునే గోదావరి ఎక్స్‌ప్రెస్ ఉదయం 8 గంటలకు, 7 గంటలకు చేరుకునే విశాఖ ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలకు విశాఖకు చేరుకున్నాయి. విశాఖ నుంచి బయల్దేరాల్సిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్ భారీ ఆలస్యంతో నడుస్తుంది. ఈ రైలు విశాఖకు చేరుకునేందుకు ఆలస్యం కావడంతో ప్రత్యేక రైళ్లు కూడా ఎప్పుడు బయల్దేరతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ైరె ళ్లన్నీ ఆలస్యంగా చేరుకోవడం, బయల్దేరడం జరుగుతోంది. ప్రతీ రైలు కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 5 గంటల వరకూ ఆలస్యంగా ఉన్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. పెరిగిన ప్రయాణికులు ఇలా..! 12-7-2015 26,000 13-7-2015 52,000 14-7-2015 46,000 15-7-2015 49,000 16-7-2015 52,000 17-7-2015 60,000 -
పుష్కర ప్రణామం
అమావాస్యతో పోటెత్తిన భక్తులు గోదావరిలో పెద్దలకు పిండప్రదానం మూడో రోజు 45 వేల మంది భక్తుల రాక ఎండలతో ఇబ్బంది పడుతున్న భక్తులు మంచినీరు, నీడ కోసం తండ్లాట హన్మకొండ : అమావాస్య నేపథ్యంలో గోదావరి పుష్కరాలకు గురువారం భక్తులు పోటెత్తారు. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం పుష్కరఘాట్లలో పెద్దలకు సంప్రదాయబద్ధంగా పిండప్రదానం చేశారు. అయితే మండుతున్న ఎండలతో భక్తులు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. మంచినీరు, నీడ కోసం తండ్లాడారు. పుష్కరాల మూడో రోజున జిల్లాలో 45,000 మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. మొదటిరోజు 15,000 మంది భక్తులు రాగా... రెండో రోజు ఈ సంఖ్య 30,000కు చేరుకుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పుష్కరఘాట్లతో పోల్చితే జిల్లాలోని పుష్కరఘాట్లలో రద్దీ తక్కువగా ఉండడంతో భక్తులు ఇటువైపునకు మక్కువ చూపుతున్నారు. గురువారంమంగపేట పుష్కరఘాట్‌లో 35,000, రామన్నగూడెంలో 10,000 మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ రెండు ఘాట్లలో కలిపి దాదాపు ఆరువేలకు పైగా పిండప్రదానాలు జరిగినట్లు అధికారుల అంచనా. అయితే రామన్నగూడెం పుష్కరఘాట్‌కు బస్సులు రద్దు చేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముల్లకట్ట పుష్కరఘాట్ వద్దకు గోదావరిలో నీటిని మళ్లించాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు ముల్లకట్ట పుష్కరఘాట్‌కు కేటాయించిన పురోహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ముల్లకట్టకు భక్తులు రాకపోవడంతో తమకు ఇక్కడ ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఇతర ఘాట్లకు కేటాయించాల్సిందిగా అధికారులను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు. జేసీ పర్యవేక్షణ పెరుగుతున్న భక్తుల సంఖ్యకనుగుణంగా సౌకర్యాలు, సహాయకార్యక్రమాలు కల్పించడంలో జిల్లా అధికారులు తలామునకలయ్యూరు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం రెండు ఘాట్లను పరిశీలించారు. రామన్నగూడెంలో కిలోమీటరున్నర దూరంలో ఉన్న గోదారి నీటిపాయ వద్దకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భక్తులు స్నానాలు ఆచరించే స్థలాల్లో మంచినీటి సౌకర్యం, షామియానాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రక్షిత మంచినీరు అందించేందుకు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని సూచించారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ రెండుఘాట్ల వద్దకు వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఘాట్ల వద్ద ఇబ్బంది కలగకుండా మైకుల ద్వారా తగు సూచనలు చేయాలంటూ ఆదేశించారు. నది లోపల లోతైన ప్రాంతాలకు భక్తులు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు పడవల్లో తిరుగుతూ గస్తీ కాశారు. ములుగు డీఎస్పీ రాజామహేంద్రనాయక్ స్వయంగా పడవలో తిరిగి పరిశీలించారు. మంగపేట బస్‌స్టేషన్ నుంచి పుష్కరఘాట్ వరకు భక్తులను మినీబస్సులు, మ్యాజిక్‌ల ద్వారా తరలించారు. మంగపేటలో చలువ పందిళ్లు పుష్కరఘాట్‌లో స్నానాలు చేసే స్థలం వద్ద నీడను ఇచ్చే ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం ఉదయం మంగపేట పుష్కరఘాట్‌లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అంతకు ముందు రోజు కేవలం మూడు షామియానాలు ఏర్పాటు చేసినా.. అవి భక్తుల అవసరాలను తీర్చలేకపోయాయి. మరో తొమ్మిది రోజులు పుష్కరాలు కొనసాగాల్సి ఉన్నందున మరిన్ని చలువ పందిళ్లను నిర్మించాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. పుష్కరఘాట్లు, నదీలో పరిసరాలు శుభ్రంగా ఉంచేలా పారిశుద్ధ్య కార్మికులు పనులు చేస్తున్నారు. రామన్నగూడెంలో పుష్కరఘాట్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో భక్తులు స్నానాలు చేసే చోట ఏర్పాటు చేసిన షామియానాలు పడిపోయాయి. రామన్నగూడెంలో సైతం చలువ పందిళ్లు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఎండవేడితో విలవిల పుష్కరఘాట్లకు వచ్చే భక్తులు ఎండవేడి మికి విలవిలలాడుతున్నారు. నదీతీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సౌకర్యాలు సరిపోవడం లేదు. రామన్నగూడెంలో భక్తులను తరలించేందుకు ఏర్పాటు చేసిన ట్రాక్టరు సేవలు రెండో రోజుకే అర్ధంతరంగా ఆగిపోయాయి. మండే ఎండల్లో రానుపోనూ మూడుకిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. దీంతో భక్తులకు పుష్కరస్నానం భారంగా మారుతోంది. నదిలో భక్తులు నడిచివెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఇసుక బస్తాల మార్గం వెంట నీడ ఇచ్చేందుకు చలువ పందిళ్లు, డ్రమ్ముల ద్వారా తాగునీటి సౌకర్యం ఏర్పాటు లేకపోవడంతో భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రత మరింత పెరిగితే భక్తులు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు సమస్య తీవ్రతను గుర్తించి నీడ, నీరు సౌకర్యం కల్పించాల్సి ఉంది. -
దీవించమ్మా..
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్న భక్తులు నీటి ప్రవాహం వెంట ఏర్పాట్లకు సిద్ధమైన యంత్రాంగం పగటి వేళ 35 సెల్సియస్ డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు గోదావరి పుష్కరాల రెండో రోజు బుధవారం భక్తుల తాకిడి పెరిగింది. మంగపేట పుష్కరఘాట్ భక్త జనంతో కిటకిటలాడింది. రామన్నగూడేనికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముల్లకట్టవద్ద గోదావరి ప్రవాహం లేకపోవడంతోపాటు పోలీసులు రాకపోకలు నిషేధించడంతో పుష్కరఘాట్ వెలవెలబోయింది. బుధవారం సుమారు 26 వేల మంది భక్తులు గంగమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదారమ్మ .. దీవించమ్మా.. అని వేడుకున్నారు. - సాక్షి, హన్మకొండ మంగపేట : పుష్కరఘాట్ వద్ద కల్పించిన సౌకర్యాలను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం పరిశీ లించారు. ఈసందర్భంగా కస్తూరీబా మహిళా మం డలి అధ్యక్షురాలు కొమరగిరి సామ్రాజ్యం, కమలాపురం కోలాట భజన మండలి సభ్యులు మంగళహా రతితో కలెక్టర్‌కు ఆహ్వానం పలికారు. గోదారమ్మకు పూజలు నిర్వహించి కలెక్టర్.. దీపాలు వెలిగించి నది వదిలారు. కాగా, ఆరూరి రమేశ్ తన కుటుంబ సభ్యులతో కలిపి పుష్కర స్నానం ఆచరించారు. ‘పుష్కర బుక్లెట్’ ఆవిష్కరణ ములుగు : గోదావరి పుష్కరాలు-2015 వరంగల్ జిల్లా సమాచార బుక్‌లెట్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఇక్కడ ఆవిష్కరించారు. వరంగల్ : పుష్కరాల సందర్భంగా అధికారులు తీసుకుంటున్న ‘అతి’జాగ్రత్తలు భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉన్నతాధికారుల నిర్ణయాలతో పోలీ సులు తమ శైలిలో వ్యవహరించడం ఇందుకు కారణమవుతోంది. మంగపేట సమీప పుష్కరఘాట్‌కు వెళ్లాలంటే భక్తులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారిని గంపోని గూడెం పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి మినీ బస్సు ద్వారా పుష్కరఘాట్‌కు వెళ్లాలి. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారు మంగపేట బస్టాండ్‌లో దిగి ఉమాచంద్రశేఖర స్వామి అలయం వరకు నడిచివెళ్లి మినీ బస్సులో పుష్కరఘాట్‌కు చేరుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. గంపోనిగూడేం వద్ద నుంచి పుస్కరఘాట్ వరకు సుమారు 2.50కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పోలీసులు తీసుకుంటున్న అతి..జాగ్రత్త వల్ల గంటకు పైగా సమయం పడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వారి కష్టాలు చెప్పకుండా ఉన్నాయి. -
పుష్కరాలను కేసీఆర్ అపవిత్రం చేశారు
2019 ఎన్నికల్లో నా నాయకత్వంలోనే టీడీపీ పోటీ: రేవంత్‌రెడ్డి మద్దూరు: గోదావరి పుష్కరాలను సీఎం కేసీఆర్ అపవిత్రం చేశారని టీటీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరులో మంగళ వారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ వదిన మూడు రోజుల క్రితం మరణించిం దని, ఇంట్లో ఎవరైనా మరణిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం 12 రోజులపాటు శుభకార్యాలకు దూరంగా ఉండాలన్నారు. కానీ, కేసీఆర్ ఇవేమీ పట్టించుకోకుండా పుష్కరాలను ప్రారంభించడం రాష్ట్రానికే అరిష్టమని, దీనిపై రాష్ట్రంలోని పండితులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల పనులు చివరిదశలో ఉన్నాయని.. రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తే, ఆ పనులు పూర్తయి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. అయితే, గత ప్రభుత్వాలు చేపట్టిన ఈ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తే కమీషన్లు రావని కేసీఆర్ వీటి జోలికెళ్లడంలేదని రేవంత్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.35 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందో తెలపాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టకపోతే భారీస్థాయిలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తన నాయకత్వంలోనే పోటీ చేస్తుందని, ఘన విజయం కూడా సాధిస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
నేనొస్తే ఇబ్బందనే రావట్లేదు
హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న దుర్ఘటనపై సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘అక్కడికి వచ్చి వారిని ప్రత్యక్షంగా పరామర్శించి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నా.. దాని వల్ల మళ్లీ తొక్కిసలాట జరిగి ప్రజలకు, ప్రభుత్వ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని భావించి రావడం విరమించుకున్నాను’ అని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
సోకులకే ప్రాధాన్యం
పుష్కర ఏర్పాట్లలో అంతా తానే అయిన వైనం సేఫ్టీ కన్నా సోకులకే ప్రాధాన్యతనిచ్చిన సీఎం సమీక్షల మీద సమీక్షల నిర్వహణ అంతిమంగా దారుణ వైఫల్యం హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లను అన్నీ తానై పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరిగిన దుర్ఘటనకు ఎవరినీ బాధ్యులుగా చేయలేని స్థితిలో ఉన్నారని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల్లో ఏ ఒక్క అధికారికి కూడా పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ అధికారాలను అప్పగించలేదు. మంత్రులతో పాటు అధికారులతో కమిటీల మీద కమిటీలను ఏర్పాటు చేశారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రే దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం పొందాలనే యావతో గోదావరి పుష్కరాల హైపును స్వయంగా చంద్రబాబు నాయుడే పెంచారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతీ రెండు రోజులకూ రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సమీక్షలను నిర్వహించారని, పుష్కర ఏర్పాట్లలో ఉండాల్సిన అధికార యంత్రాంగం ఆ సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని, స్వయంగా ఏర్పాట్లపై ఆలోచించి అమలు చేసే తీరికే తమకు లేకుండా చేశారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పుష్కర ఏర్పాట్లలో ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పారిశుద్ధ్యం, సెక్యురిటీ, సేఫ్టీ అంశాలను విస్మరించారని, ఎంత సేపు లేజర్ షోలు, వెలుగుల డెకరేషన్ల ఏర్పాటుకే సీఎం ప్రాధాన్యాత ఇచ్చారని అదికార యంత్రాంగం పేర్కొంటోంది. సమన్వయం, ప్రణాళిక లేమి... తొలుత సాంస్కృతిక కమిటీ అంటూ పరకాల ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆ తరువాత పరకాలను కాదంటూ మురళీ మోహన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా పలు కమిటీలను ఏర్పాటు చేయడం ఆ తరువాత మార్పులు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసిన వాటిల్లో ఒక కమిటీకి మరో కమిటీకి మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షించే అధికారం సీఎం పేషీలో ఎవరికీ ఇవ్వకపోవడం జరిగాయి. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన నిత్య హారతికి జనం రాకపోవడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరా మంగళవారం తెల్లవారుజామునే పుష్కర ఘాట్‌కు లక్షల సంఖ్యలో జనం చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోక సీఎం పుష్కరఘాట్‌లోనే ఐదుగంటల సేపు గడపడం, సీఎం పూజలు పూర్తికాగానే జనాలను ఒక్కసారిగా వదలడంతో దారుణం జరిగిపోయింది. బాబు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పుష్కర ఏర్పాట్లో ఉన్న అధికారులు కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే సీఎం ఏమంటారోననే భయంతో ఏ అధికారీ జవాబుదారీగా పనిచేయలేదని, సీఎం తీరే ఈ సంఘటనకు కారణమని వారు పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు. -
బాబే బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి
సూర్యాపేట: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంతో తొలిరోజునే రాజమండ్రి ఘటన జరిగిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు ఎన్నడూలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం చేశారేకానీ ఏర్పాట్లు మాత్రం చేయలేదన్నారు. ఉత్సవాల ప్రారంభం రోజునే పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడం అక్కడ ఏర్పాట్ల వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. -
పుష్కర ‘పాపం’ ప్రభుత్వానిదే
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పెందుర్తి: గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో పెద్ద ఎత్తున భక్తులు మృతిచెందడం తీరని విషాదమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ విచారం వ్యక్తం చేశారు. ఈ పాపం ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పుష్కరాల్లో ప్రచారంకోసం పాకులాడిన ప్రభుత్వం భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని తప్పుపట్టారు. తొలిరోజు లక్షలాది మంది వస్తారని ముందే తెలిసిన ప్రభుత్వం, అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వహించారన్నారు. కుంభమేళాను తలపిస్తామని ప్రచారం చేసినవారు తగిన ఏర్పాట్లు చేయాలి కదా అని ప్రశ్నించారు. -
బాబు వైఫల్యమే: బొత్స
పుష్కర మరణాలకు ఆయనే బాధ్యత వహించాలి ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యం ఏర్పాట్లకు ఇవ్వలేదు హైదరాబాద్: గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో భక్తుల మరణాలకు సీఎం చంద్రబాబునాయుడే పూర్తిగా బాధ్యత వహించాలని, ఆయన ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఘోరం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన వ్యక్తిగత ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని పుష్కరాల ఏర్పాట్లకు ఇవ్వనేలేదని మండిపడ్డారు. తన బొమ్మలు పెట్టుకోవడానికి చంద్రబాబు చూపిన ఆర్భాటం బారికేడ్ల నిర్మాణంపై చూపిఉంటే ఈ దారుణం జరిగేదే కాదన్నారు. ఘాట్లవద్ద ఎంతమంది భక్తుల రాకపోకలుంటాయో ప్రభుత్వం సరైన అంచనాలు వేయలేకపోయిందన్నారు. తానొక్కడినే పుష్కరాలు విజయవంతంగా నిర్వహించాననే కీర్తి కండూతికోసం చంద్రబాబు తాపత్రయ పడినందువల్లనే ఈ దారుణం జరిగిందన్నారు. చంద్రబాబు తన పుష్కరస్నానంకోసం ఘాట్‌లో దిగి మూడు గంటలసేపు భక్తులను నిలబెట్టారని, దీంతో ఆయన వెళ్లిపోయాక ఒక్కసారిగా అందరూ తోసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించాయన్నారు. ఘాట్ల వద్ద ఎక్కడా ఒక్క అంబులెన్స్గానీ, వైద్యుడు, నర్సుగానీ కనిపించలేదన్నారు. ఇదిలా ఉండగా బొత్స మంగళవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. పుష్కరాల ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలి: అంబటి పవిత్ర పుష్కరాల్లో మరణాలు చోటు చేసుకున్నందుకు బాధ్యుడైన చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కరాలకు రూ.1,650 కోట్ల భారీ నిధులు కేటాయించినా ఏర్పాట్లలో అడుగడుగునా చంద్రబాబు అలసత్వం, అసమర్థత కనిపిస్తోందన్నారు. ఇవి చంద్రబాబు హత్యలే.. గోదావరి పుష్కరాల్లో సంభవించిన మరణాలు చంద్రబాబు చేసిన హత్యలేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ దుయ్యబట్టారు. గతంలో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కాకముందే ఐదుగురు మృతిచెందితే ఆనాటి వైఎస్ ప్రభుత్వాన్ని గద్దెదిగాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఈ మర ణాలపై ఏమంటారని వారు ప్రశ్నించారు. -
పుష్కర బస్‌చార్జీలను తగ్గించాలని ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు వెళ్లే బస్సుల చార్జీలను తగ్గించాలని బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌భవన్ ముందు సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా నిధులు విడుదల చేసిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాసే కాంట్రాక్టర్లు పనులు దక్కించుకొని ఆ నిధులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప ఇంతవరకు పనులను పూర్తి చేయలేదని విమర్శించారు. భక్తులకు అరకొర సౌకర్యాలు కల్పించారన్నారు. సీఎం కేసీఆర్ ఒక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిపై హిందూ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. పక్క రాష్ట్రాలు బస్సు చార్జీలు తగ్గిస్తుంటే ఇక్కడి సీఎం మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నాగూరావునామాజీ, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
గోదావరి.. తెలుగువారి జీవనాడి
పుష్కరాలను తెలుగువారు పండుగలా జరుపుకోవాలి భక్తులపై ఆర్టీసీ బస్సుల్లో సర్‌ఛార్జి ఉండదు రైల్వే వ్యవస్థనూ తగ్గించాలని కోరుతున్నాం అన్ని మతాల అనుసంధానానికే పుష్కర శోభాయాత్ర మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి: గోదావరి నదికి తెలుగు ప్రజలతో అవినాభావ సంబంధం ఉందని, ఇది తెలుగువారి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలను మంగళవారం ఉదయం 6.26 గంటలకు ప్రారంభిస్తామని, తాను కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరిస్తానని చెప్పారు. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలను తెలుగువారు ప్రతి ఒక్కరూ దీనిని పవిత్రమైన పర్వంలా నిర్వహించుకోవాలని కోరారు. గోదావరి నీటిని రాష్ట్రమంతటా అందించగలిగితే సంపద సృష్టించవచ్చన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక సమస్యలు వచ్చినా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే నిధులు ఎక్కువగా కేటాయించినట్లు చెప్పారు. గడువు సమీపించడంతో చాలా అభివృద్ధి పనులు కొలిక్కి రాలేదని, వాయిదా పడిన పనులన్నీ పుష్కరాల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పుష్కరస్నానం ఆచరించడానికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఆర్టీసీ బస్సుల్లో సర్‌చార్జి వేయబోమని స్పష్టం చేశారు. అలాగే సర్‌చార్జి వేయవద్దని రైల్వే శాఖను కూడా కోరుతున్నట్లు తెలిపారు. భక్తుల మన్ననలు పొందేలా సేవలందించిన వారికి పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ నెల 26న అభినందన సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి నదితో అన్ని మతాలవారినీ అనుసంధానం చేసేందుకే పుష్కర శోభాయాత్ర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ఈ నెల 16న రాజమండ్రి చేరుతుందని సీఎం చెప్పారు. ప్రాధాన్య అంశాలపై చర్చావేదికలు రాష్ట్రానికి సంబంధించి ఐటీ, జలవనరులు, సాంకేతిక విద్య తదితర ముఖ్య విషయాలపై రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో చర్చా వేదికలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపా రు. ఈ నెల 15 నుంచి 25 వరకూ ప్రతి రోజూ ఒక్కో అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో నిర్వహించే ఈ చర్చాగోష్టులకు ఒక్కో మంత్రి చొప్పున ఆధ్వర్యం వహిస్తారని చెప్పారు. ప్రఖ్యాత ఇంజనీరు కేఎల్ రావు జయంతి సందర్భంగా ఈ నెల 16న జలవనరులపై నిర్వహించే చర్చావేదికలో తనతోపాటు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ నెల 20న మౌలిక వసతులపై జరిగే చర్చాగోష్టిలో సింగపూర్ బృందం కూడా పాల్గొంటుందని వెల్లడించారు. కుటుంబ సమేతంగా.. సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి వరకూ విస్తరించిన నాలుగు లేన్ల రహదారిని ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పుష్కర భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్తూ మార్గమధ్యంలో కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఆగి, రాష్ట్రంలోని 12 ప్రముఖ ఆలయాల నమూనాలను ఆవిష్కరించారు. -
గోదావరి మమకారం
కంద-బచ్చలి... పనస-ఆవ... అరటి దూట-పెసర... అరటి పవ్వు-కొబ్బరి... తాటిపండు-బెల్లం... రేర్ కాంబినేషన్లు! వేరెక్కడా దొరకని గోదావరి రుచులు. పుష్కరస్నానంతో శరీరం ప్రక్షాళన అయినట్లే... పుష్కరప్రాంత రుచులతో మనసు పులకరిస్తుంది. మరో పుష్కరం వరకు ఈ మధురానుభూతులు గుర్తుండిపోతాయి. మీరు గోదావరి వారైతే ఈ వంటలతో ఆతిథ్యం ఇవ్వండి. మీరు గోదావరికి వచ్చిన వారైతే... వీటిల్లో ఏ ఒక్క వంటకాన్నీ మిస్ కాకండి. పనస పొట్టు ఆవపెట్టిన కూర కావలసినవి: పనస పొట్టు - 2 కప్పులు; అల్లం తురుము - టీ స్పూను; కరివేపాకు - 3 రెమ్మలు; పచ్చి మిర్చి - 8; చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు (కొద్దిగా చింతపండును బాగా నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి కొద్దిగా వేడి చేసి పక్కనుంచాలి)ఆవ కోసం... ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 2 (తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా నూరితే ఆవ సిద్ధమవుతుంది) పోపు కోసం... సెనగ పప్పు - అర టీ స్పూను; మినప్పప్పు - అర టీ స్పూను; ఆవాలు - పావు టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; ఉప్పు - తగినంత; కారం - అర టీ స్పూను; పసుపు - కొద్దిగా; నూనె - 4 టీ స్పూన్లు; ఇంగువ - రెండు చిటికెలు తయారీ: ముందుగా బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కొద్దిగా వేయించిన తర్వాత సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, కరివేపాకు, పచి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బాగా వేయించాలి పనసపొట్టు, పసుపు వేసి బాగా కలిపి పావు కప్పు నీళ్లు పోసి మూత ఉంచాలి కొద్దిగా ఉడికిన తరవాత మూత తీసేసి ఉడకనివ్వాలి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి ఉప్పు వేసి కలపాలి చింతపండు గుజ్జు, ఆవ వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. కంద బచ్చలి తీపి కూర కావలసినవి: కంద - 200గ్రా.; బచ్చలి కూర - 1 కట్ట; చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి - 3; బెల్లం తురుము - టీ స్పూను; బియ్యప్పిండి - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - తగినంత పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; సెనగపప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; ఎండు మిర్చి - 4; కొత్తిమీర - కొద్దిగా; కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: ముందుగా కందను శుభ్రంగా కడిగి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి బచ్చలికూరను శుభ్రం చేసి సన్నగా తరిగి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి మరోమారు వేయించాలి పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి మరోమారు వేయించాలి కంద ముక్కలు, బచ్చలి తరుగు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి మూత పెట్టాలి బాగా ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం తురుము, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి. అరటిదూట పెసరపప్పు చలవ కూర కావలసినవి: అరటిదూట - ఒక ముక్క (మార్కెట్లో ముక్కలు అమ్ముతారు); పెసర పప్పు - పావు కప్పు; పచ్చి మిర్చి - 6; కరివేపాకు - 2 రెమ్మలు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; నూనె - టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; పసుపు - తగినంత తయారీ: ముందుగా అరటిదూటను శుభ్రం చేయాలి ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి, అరటి దూటను సన్నగా తరగి ముక్కలను ఉప్పు నీళ్లలో వేయాలి. (లేదంటే నల్లబడిపోతాయి) పెసరపప్పును సుమారు అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి మరోమారు వేయించి ముందుగా అరటి దూట ముక్కలు వేసి బాగా కలపాలి పెసరపప్పు కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత ఉంచాలి. కొద్దిగా ఉడుకు పట్టాక ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మరికాసేపు ఉంచి మెత్తగా ఉడికిన తర్వాత దించేయాలి (ఇది ఒంటికి చలవ చేయడమే కాకుండా, మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఔషధంగా పనిచేస్తుంది). అరటిపువ్వు కొబ్బరి కమ్మటి పచ్చడి కావలసినవి: అరటిపువ్వు - చిన్నది (1); కొబ్బరి ముక్కలు - కప్పు; సెనగ పప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 10; చింతపండు - కొద్దిగా; ఉప్పు - తగినంత; నూనె - 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; ఇంగువ - రెండు చిటికెలు తయారీ: ముందుగా అరటిపువ్వును శుభ్రం చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టి తీసి, నీళ్లలో బాగా కడిగి గట్టిగా పిండేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేగాక, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించి తీసేయాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న అరటిపువ్వు మిశ్రమం వేసి బాగా వేయించి తీసేయాలి మిక్సీలో ముందుగా పోపు సామాను వేసి మెత్తగా పట్టాక, కొబ్బరి ముక్కలు వేసి బాగా తిప్పాలి వేయించి ఉంచుకున్న అరటిపువ్వు వేసి మరోమారు మెత్తగా తిప్పాలి ఉప్పు, పసుపు, చింతపండు వేసి మరోమారు మెత్తగా తిప్పాలి వేడి వేడి అన్నంలో కమ్మటి నెయ్యితో ఈ పచ్చడి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. -
గోదావరి వేడుకలకు నేడు శ్రీకారం
రాజమండ్రిలో ప్రారంభం ఉత్సవాల ప్రారంభ సూచికగా సాయంత్రం అఖండ పుష్కర జ్యోతి ప్రజ్వలన మంగళవారం ఉదయం పీఠాధిపతుల స్నానాలతో పుష్కరాలు ఆరంభం హైదరాబాద్, రాజమండ్రి: గోదావరి పుష్కరాలు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభం అవుతున్నప్పటికీ ఆరంభ వేడుకలు సోమవారం సాయంత్రం నుంచే ఊపందుకోనున్నాయి. రాజమండ్రి నగరంలో సాయంత్రం నాలుగు గంటలకు వెయ్యి మంది కళాకారులతో హారతి ఊరేగింపు అనంతరం ‘పుష్కరఘాట్’లో అఖండజ్యోతి ప్రజ్వలనతో పుష్కర వేడుకలు మొదలవుతాయి. అనంతరం గోదావరి అఖండహారతి, ఆకాశ దీపాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వెయ్యి మంది కూచిపూడి కళాకారులతో అర్ధరాత్రి వరకు సాంసృ్కతిక కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమాల్లో సినీ సంగీతదర్శకుడు థమన్, కూచిపూడి కళాకారిణి అంబిక తదితరులు పాల్గొంటారు. కంచి పీఠాధిపతులు మంగళవారం తెల్లవారుజామున 6.26 గంటలకు గోదావరిలో తొలిస్నానాలను చేసి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్‌లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో విజయేంద్ర సరస్వతి స్నానమాచరించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ప్రారంభ ముహూర్తానికే కుటుంబ సమేతంగా గోదావరి పుష్కర ఘాట్‌లో స్నానం చేస్తారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ఆదివారం రాజమండ్రిలో మీడియాకు వెల్లడించారు. పుష్కర పూజలకు ప్రభుత్వ ధరలు గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్ద ప్రధానంగా నిర్వహించే పూజలకు దేవాదాయశాఖ ధరలను ఖరారు చేసింది. పిండప్రదానం పూజ ధర రూ. 300గానూ, గోదావరి పూజ, ఇతర సంకల్పాలకు రూ. 150, ముసివాయనం పూజకు రూ. 200, స్వయంపాకం పొట్లాలు ఒక్కొక్కటికి రూ. 200లుగా ధరలను ఖరారు చేశారు. భక్తులు నేరుగా పూజారులకే ప్రభుత్వ నిర్ణయించిన ధరలు చెల్లించి పూజలు చేయించుకోవాలి. నిర్ణీత ధరలకు పూజలు నిర్వహించేలా 4,295 మంది పూజార్లకు ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. వీరు షిప్టుల వారీగా ఉంటారు. కోలాహలంగా పుష్కర స్వాగత యాత్ర కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో రెండు రోజుల ముందే పుష్కర సందడి మొదలైంది. ఆదివారం సాయంత్రం నిర్వహించిన పుష్కర స్వాగత యాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక బృందాల నృత్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాటాలతో స్వాగత యాత్ర వైభవంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ యాత్రలో పాల్గొన్నారు. గోదావరికి మహానీరాజనం పుష్కర స్వాగత యాత్ర అనంతరం గోష్పాదక్షేత్రంలో నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై గోదావరికి నీరాజనం సమర్పించారు. పండితులు దోర్భల ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గోదావరికి మహానీరాజనం సమర్పించారు. గోష్పాద క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పుష్కరాలకు రండి.. హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను గోదావరి పుష్కరాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జపాన్ పర్యటన వివరాలను గవర్నర్‌కు వివరించారు. జపాన్ పర్యటన అనంతరం న్యూఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ అయిన అంశాలు కూడా వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు గవర్నర్‌పై తన కేబినెట్లోని మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు చంద్రబాబు వివరణ ఇచ్చినట్లు సమాచారం. వివాదం సద్దుమణిగేందుకు తీసుకోవాల్సిన చర్యలు కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. పుష్కర ఏర్పాట్లు గురించి గవర్నర్ అడగ్గా.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఇంకా ఏర్పాట్లలో లోపాలే... పుష్కరాలకు వచ్చే భక్తులకు మరుగుదొడ్డి సమస్య పెద్ద ఇబ్బందిగా మారబోతుంది. ప్రతిరోజూ దాదాపు 25 లక్షల మంది భక్తులు పుష్కరాలకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా, రాజమండ్రి, కొవ్వూరు, నరసాపురం పట్టణాల్లో ఈ అంశం తీవ్ర సమస్యగా మారుతుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన దాదాపు 1,400 రెడీమేడ్ మరుగుదొడ్లను ప్రధాన ఘాట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఈ రెడీమేడ్ మరుగుదొడ్ల నిర్వహణసరిగా కనిపించడం లేదు. మురుగునీటి మళ్లింపు చర్యలు సరిగా లేవు. ఫలితంగా రెడీమేడ్ మూత్రవిసర్జన శాలలు, మరుగుదొడ్లు భక్తులకు సరిగా ఉపయోగపడే అవకాశాలు ఉండవని రాజమండ్రి నుంచి పలువురు సాక్షి ప్రధాన కార్యాలయానికి ఫోను ద్వారా ఫిర్యాదు చేశారు. -
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి
6 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా మంత్రులు అల్లోల, ఈటల, జోగు రామన్న గోదావరిఖని/ధర్మపురి: గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, జోగు రామన్నలు అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా గోదావరిఖని, ధర్మపురి వద్ద చేపడుతున్న పుష్కర ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2003లో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో 27 ఘాట్ల వద్ద పుష్కరాలు నిర్వహించగా... తెలంగాణ రాష్ట్రంలో రూ.600 కోట్ల ఖర్చు చేసి 106 చోట్ల పుష్కరఘాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు అన్ని చోట్ల పుష్కర పనులు తుదిదశకు చేరుకున్నాయని, ఎక్కడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత పుష్కరాల సమయంలో మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తే... ఈసారి 6-8 కోట్ల మంది హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
పుష్కర బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్
ఎంజీబీఎస్, జేబీఎస్‌లలో అదనపు కేంద్రాలు హైదరాబాద్: ఈ నెల 14 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ మరిన్ని విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 450 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కూడా కల్పించింది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, బాసర పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లు తీసుకొనేందుకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ తెలిపారు. -
పుష్కరాలకు సర్వం సిద్ధం
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు - 108 రోజుల పాటు వెలిగే మహాకాయ దీపం తయారు - గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం - 14న దీపం వెలిగించి పుష్కరాలు ప్రారంభించనున్న సీఎం ఫడ్నవీస్ - 12 ప్రత్యేక రైళ్లు నడ పనున్న సెంట్రల్ రైల్వే సాక్షి, ముంబై: గోదావరి పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యాయి. నాసిక్, త్రయంబకేశ్వర్లలో గత కొన్ని రోజులుగా పుష్కర పనుల్లో నిమగ్నమైన అధికారులు, అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. లక్షలాది మంది భక్తులు, సాధువులు వస్తున్న నేపథ్యంలో గంగాఘాట్ వద్ద ఉన్న మార్కెట్‌ను తాత్కాలికంగా తొలగించి సమీపంలోని మరో ప్రాంతానికి మార్చారు. నాసిక్‌లో మహాకాయ దీపాన్ని వెలిగించేందుకు రికార్డు స్థాయిలో సేకరించిన పత్తితో భారీ వత్తి తయారు చేశారు. కొల్హాపూర్ జిల్లా శిరోల్ తాలూకా తామదలగే గ్రామంలో ‘దేశభక్తుడు రంతప్పణ్నా కుంబార్ శిరోల్ బ్యాక్వర్డ్ క్లాస్ కో ఆపరేటీవ్ కాటన్ మిల్లు’లో ఈ దీపపు వత్తిని తయారు చేశారు. 108 రోజులపాటు వెలిగే దీపం కోసం 750 అడుగుల పొడవైన వత్తిని తయారుచేశారు. గిన్నిస్ బుక్‌లో మహాదీపానికి చోటు సంపాదించడం కోసమే ఇలా చేస్తున్నట్లు కాటన్ మిల్లు అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌రావ్ మానే తెలిపారు. వత్తి తయారు చేసేందుకు రెండు నెలలు పట్టిందని, ఈ నెల 14న నాసిక్‌లో పుష్కర ప్రారంభోత్సవం సందర్భంగా దీపాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా వెలిగించనున్నారని చెప్పారు. కాలుష్య రహిత పుష్కరాలు పుష్కరాలు కాలుష్క రహితంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే సుమారు 63 ప్రాంతాల్లో సుమారు పలు సంస్థలకు చెందిన 40 వేలమంది స్వచ్చత అభియాన్ నిర్వహించారు. గతంలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నదీ స్వచ్చత అభియాన్‌లో కూడా సుమారు 20 వేల మంది పాలుపంచుకున్నారు. అది విజయవంతం అవడంతో పుష్కరాలను కాలుష్య రహితంగా చేసేందుకు మరోసారి స్వచ్చత అభియాన్ నిర్వహించారు. భారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జీ గిరీశ్ మహాజన్ సమక్షంలో దాదాపు 8.50 లక్షల మొక్కలను జిల్లావ్యాప్తంగా నాటించారు. ఆఖాడాల కీలకపాత్ర పుష్కరాల్లో సాధువుల ఆఖాడా(సమూహం)లు కీలక పాత్ర వహిస్తాయి. పుష్కరాల సందర్భంగా జరిగే ప్రధాన కార్యక్రమాలన్నీ వారే నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి శైవ , వైష్ణవ ఆఖాడాల్లోని సాధువులు వస్తారు. శ్రీ శంభు పంచ్ దశనామ్ జునా ఆఖాడా, శ్రీ శంభు పంచ్ దశనామ్ ఆవ్హాన్ ఆఖాడా, శ్రీ పంచాగ్నీ ఆఖాడా, శ్రీ తపోనిధి నిరంజనీ ఆఖాడా, శ్రీ తపోనిధి ఆనంద్ ఆఖాడా, శ్రీ పంచాయతీ ఆఖాడా మహానిర్వాణీ, శ్రీ పంచాయతీ అఠల్ ఆఖాడా, శ్రీ బడా ఉదాసిన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ నయా ఉదాసీన్ ఆఖాడా నిర్వాణ్, శ్రీ పంచాయతీ నిర్మల్ ఆఖాడా అనే పది శైవుల ఆఖాడాలు త్రయంబకేశ్వర్‌కి వచ్చాయి. శ్రీ నిర్మోహి అనీ ఆఖాడా, శ్రీ నిర్వాణీ అనీ ఆఖాడా, శ్రీ దిగంబర్ అనీ ఆఖాడా అనే మూడు ైవె ష్ణవుల ఆఖాడాలు నాసిక్‌లో పుష్కర ఘట్టాలు నిర్వహించనున్నాయి. తొలిరోజు ధ్వజారోహణ, ఊరేగింపు, షాహి స్నానాల ప్రారంభం తదితర ప్రత్యేక ఘట్టాలన్ని ఆఖాడాలు ప్రారంభించనున్నారు. వీరి రాకతో నాసిక్, త్రయంబకేశ్వర్ పరిసరాల్లో ఒకరకమైన ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంటుంది. కుంభమేళా అంటేనే సాధువుల పండుగ అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక సారి వ్యాఖ్యానించారు. ‘ఇది సాధువుల కుంభమేళా. కుంభమేళాకు వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయడమే మా బాధ్యత’ అని అన్నారు. మహిళా భద్రత కట్టుదిట్టం పుష్కరాల్లో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భారీ సంఖ్యలో మహిళా పోలీసులను మోహరిస్తామని, 24 గంటలూ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ‘మహిళల రక్షణ మా ప్రధాన బాధ్యత. మొత్తం 15 వేల మంది పోలీసులతో పాటు మహిళా పోలీసులను కూడా మోహరిస్తాం. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో అదనంగా ఐదుగురు మహిళలను ఏర్పాటు చేస్తాం. నిర్భయ మొబైల్ వ్యాన్‌ను నడుపుతున్నాం. ఏదైనా సమస్య ఎదురైతే కంట్రోల్ రూం నంబర్ 100 లేదా 97622 00200 లేదా 97621 00100కు సంప్రదించవచ్చు’ అని నాసిక్ కమిషనర్ ఎస్ జగన్నాథన్ తెలిపారు. పుష్కరాలకు 12 సూపర్ ఫాస్ట్ రైళ్లు గోదావరి పుష్కరాల సందర్భంగా నాసిక్- హౌరా మధ్య 12 సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 02859 నం సూపర్ ఫాస్ట్ స్పెషల్ రైలు నాసిక్ నుంచి జూలై 14, ఆగస్టు 19, 29, సెప్టెంబర్ 13, 18, 25 తేదీల్లో సాయంత్రం 4.30కు నడపన్నుట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. 02860 నం రైలు హౌరా నుంచి జూలై 12న, ఆగస్టు 17, 27, సెప్టెంబర్11, 16,23 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరనున్నట్లు తెలిపింది. భుసావల్, నాగ్‌పూర్, రాయ్‌పూర్, బిలాస్పూర్, రౌర్కేలా, టాటానగర్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఉన్నట్లు వివరించింది. -
గోదారి ఏడారి
కంతనపల్లి బ్యాక్‌వాటర్ పేరిట ఇసుక దందా అందిన కాడికి దండుకున్న మైనింగ్ మాఫియూ పుష్కరాలకు కానరాని గోదావరి నీరు ధనార్జనే ధ్యేయంగా సాగిన దందా.. అశేష భక్తులకు అశనిపాతంలా మారింది. గోదావరిలో యథేచ్ఛగా కొనసాగిన ఇసుక తోడివేతతో నది ఎడారిని తలపిస్తోంది. పుష్కరాలు అత్యంత సమీపంలో ఉన్నా.. ఘాట్లకు నీరు సుదూరంలో ప్రవహిస్తోంది. పుణ్యస్నానాలు ఆచరించేదెలా అని భక్తులు కలవరపడుతున్నారు. ఏటూరునాగారం: ఏటూరునాగారం ఏజెన్సీలో కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం బ్యాక్ వాటర్‌లో కలిసిపోయే లక్షా 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని మైనింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సాకుతో అందినకాడికల్లా మైనింగ్ అధికారులు ఇసుకను తరలించారు. మైనింగ్, మినరల్స్ నిబంధనల ప్రకారం గోదావరి మధ్యలో ఇసుకను కేవలం మీటరు లోతు, మీటరు వెడల్పు మాత్రమే తీయాల్సి ఉంది. కానీ ఇసుక కాంట్రాక్టర్లు, అధికారులు సుమారు మూడు మీటర్ల లోతులో ఇసుక తవ్వకాలు జరిపారు. ఇసుకను భారీ లోతుల్లో తోడేశారు. ఎండ వేడికి ఇసుకలో ఉన్న తేమ పూర్తిగా కోల్పోరుుంది. ఇలా కంతనపల్లి దిగువ భాగంలోని తుపాకులగూడెం, ఏటూరు 1, ఏటూరు 2 వద్ద క్వారీలను ఏర్పాటు చేసి సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించారు. ఇంకిపోతున్న వరదనీరు గోదావరిలో ఇసుక లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు వచ్చినా నీరు నిలవడం లేదు. గుంతల్లో ఇంకిపోరుుంది. వేసవిలో గోదావరి 60 శాతం ప్రవహించాల్సి ఉంది. కానీ కేవలం 45 శాతమే ప్రవహించడం ఇసుకాసురుల పాప ఫలితమే. గతేడాది వర్షాలు ఆలస్యంగా కురిసినా గోదావరి తీరం వెంట నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ ఏడాది ఇసుక తవ్వకాలతో ఆ పరిస్థితి తారుమారైంది. గోదావరి పుష్కరాలకు నీటి గండం ఏర్పడడానికి ప్రధాన కారణం ఇసుక క్వారీలు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వ క్వారీలు కావడంతో అధికారులు నోరుమెదపడం లేదు. ఈ పరిస్థితి ప్రజలకు తెలిస్తే ఎక్కడ వ్యతిరేకత వస్తోందనని ఆ ఊసే ఎత్తడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఘాట్లకు నీటి గండం ఏర్పడడం స్వయంకృతమేననే విమర్శ విన్పిస్తోంది. ఇసుక తవ్వకాలతో ఇలా.. గోదావరిలో యంత్రాలతో ఇసుకను తవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. చేతి పంపులు, బోరు బావుల నీళ్లు కూడా రావట్లేదు. పొలాల్లో మోటార్లు నోర్లు తెరుస్తున్నాయి. ఆదాయం ప్రభుత్వానికి.. కరువు కష్టాలు మాకు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. - తాడూరి రఘు, ఏటూరునాగారం భద్రాచలం వెళ్లాలనుకుంటున్నాం.. ఇక్కడి పుష్కరఘాట్ల వద్ద నీళ్లు రాకుంటే భద్రాచలం వెళ్దామని అనుకుంటున్నాం. కానీ, ఇక్కడికి నీరు రావాలని కోరుకుంటున్నాం. నీటి ఎద్దడి ఈ ఏడాది బాగా తగ్గిపోరుుంది. వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేదు. - బలభద్ర స్వరూప, ఏటూరునాగారం వర్షాలు కురిస్తేనే.. గతేడాది ఇదే సమయంలో వర్షాలు జోరుగా ఉండేవి. ఇటీవల ముంచెత్తిన వానలు అకస్మాత్తుగా ముఖం చాటేశారుు. వర్షాలు కురిస్తేనే పుష్కర స్నానాలకు వీలుపడుతుంది. దయ్యాలవాగులోనూ ఇసుక తవ్వకాలతో చేతి పంపుల్లోకి కూడా నీరు రావడం లేదు. - కోట రాజు, ఏటూరునాగారం -
గోదావరిలో ‘కౌట‘ వద్ద అడ్డుకట్ట
బాసర, కందకుర్తిల వద్ద గోదావరి నీటి మట్టం పెంచే ప్రయత్నం సర్వే చేసిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పుష్కరాలకు ఆరు రోజులే గడువు {పత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి ఆదిలాబాద్: గోదావరి పుష్కరాలకు కేవలం ఆరు రోజులే గడువుంది. కానీ, వరుణుడి జాడ లేకపోవడం.. మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం కౌట గ్రామం వద్ద గోదావరి నదిలో రాళ్లు, మట్టితో కలిపి అడ్డుకట్ట కట్టాలని యోచిస్తున్నారు. అడ్డుకట్ట నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మంగళవారం నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్ నేతృత్వంలో అధికారుల బృందం ముథోల్ మండల పరిధిలోని గోదావరి నదిని పరిశీలించింది. కౌట గ్రామం వద్ద గోదావరిలో ఎత్తుగడ్డ వద్ద అడ్డుకట్ట కట్టేందుకు వీలవుతుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రాళ్లు, మట్టితో కూడిన మూడు మీటర్ల ఎత్తులో అడ్డుకట్ట కట్టడం ద్వారా బాసరతో పాటు, ఎగువన ఉన్న కొన్ని పుష్కర ఘాట్ల వద్ద నీటి మట్టాన్ని కొంతమేరకు పెంచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం బాసర వద్ద మోకాళ్ల మట్టుకు నీళ్లున్నాయి. కొన్ని రోజులుగా ఎండల తీవ్రత ముదురుతుండటంతో పుష్కరాల సమయానికి నీటిమట్టం మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఈక్రమంలో అడ్డుకట్ట వేయాలనే యోచనలో ఉన్నారు. అడ్డుకట్ట వేసేందుకు సర్వే చేపట్టామని నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ భగవంత్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ కట్ట నిర్మాణంతో బాసరతో పాటు, నిజామాబాద్ జిల్లా కందకుర్తి (త్రివేణి సంగమం) వంటి పుష్కర ఘాట్ల వద్ద నీటిమట్టం కొంత పెరిగే అవకాశాలున్నాయని అన్నారు. అయితే, గడువు తక్కువగా ఉండడంతో పుష్కరాల లోపు పనులు పూర్తిచేయగలమా.. లేదా అన్నదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. షవర్ల కోసం ఏర్పాట్లు.. నదిలో నీళ్లు లేకపోవడంతో షవర్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. బాసరలోని అన్ని ఘాట్ల వద్ద కలిపి 150 షవర్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ పనులను వేగవంతం చేయాలని భావిస్తున్నారు. అయితే, బాసరలోని ఒక్క వీఐపీ ఘాట్ వద్ద మాత్రమే పైపుల బిగింపు జరిగింది. ఇంకా నల్లాల ఫిట్టింగ్ కాలేదు. మిగిలిన ఘాట్ల వద్ద ఈ మేరకు కూడా పనులు జరగలేదు. ఈనెల 10వ తేదీ వరకు ఈ షవర్ల పనులు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి పేర్కొన్నారు. -
పుష్కరాలకు ప్రత్యేక నిఘా
150 పోలీసులతో జీఆర్పీ సిద్ధం ఆర్పీఎఫ్తో నిరంతర గస్తీ పాత నేరగాళ్లపైనా దృష్టి విశాఖపట్నం సిటీ : గోదావరి పుష్కరాలకు రైల్వే పోలీసు శాఖ కొత్త ప్రణాళికలను అమలు చేయనుంది. భక్తుల భద్రతకు పెద్ద పీట వేయనుంది. రైల్వే స్టేషన్లోనే ముమ్మర తనిఖీలతో పాటు ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించనుంది. విశాఖ రైల్వే స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఎస్ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. పుష్కరాల కోసం మరో 150 మంది అదనపు సిబ్బంది కావాలని రైల్వే పోలీసు శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మాత్రం రైళ్లలోని ప్రయాణికుల భద్రత తాము చూసుకుంటామని రైల్వే స్టేషన్లో మాత్రమే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో జీఆర్పీ పోలీసులు పూర్తిగా స్టేషన్‌పైనే నిఘా పెట్టనున్నారు. అందుకనుగుణమైన ఏర్పాట్లు చేయడంలో జీఆర్పీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్)తో కలిసి జీఆర్పీ ప్రణాళిక రూపొందించింది. పలాస నుంచి విశాఖ వరకూ ఉన్న జీఆర్పీల నుంచి పోలీసులను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పుష్కరాల్లో రోజూ 2.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారన్న అంచనాతో జీఆర్పీ, ఆర్పీఎఫ్లు సంయుక్తగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అంతకన్నా ఎక్కువ మంది రైల్వే స్టేషన్‌కు వచ్చినా చేయి దాటకుండా కసరత్తు చేస్తున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నిఘా ! ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఒకే సారి ఎక్కువ మంది రాకపోకలు సాగించడం వల్ల కూడా బ్రిడ్జి పడిపోయే ప్రమాదం ఉంటుందని గ్రహించి ఆ మేరకు ప్రయాణికుల రద్దీకి ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. స్టేషన్ మధ్యలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జిపై రాకపోకలు గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు. రైల్వే ప్రవేశ ద్వారాల వద్ద, బయటకు వెళ్లే మార్గాల వద్ద కూడా నిఘా వ్యవస్థను వినియోగించుకోనున్నారు. ప్లాట్‌ఫారాలపై పూర్తిగా జీఆర్పీ ఫోర్స్, ఆర్పీఎఫ్ ఫోర్సులుంటాయి. అనుమానితులపై ప్రత్యేక నిఘా ! రైల్వే స్టేషన్లో అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఇప్పటికే పలు నేరాల్లో అరెస్టయి మళ్లీ ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా ఈ నెల 14వ తేదీ నుంచి నెలాఖరు వరకూ పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మొహరింపజేయనున్నారు. -
మధుర గోదావరి
పన్నెండేళ్లకోసారి గోదావరి మాత పరవశిస్తుంది... తన చెంతకు వచ్చేవారిని ఉత్తచేతులతో ఎందుకు పంపుతుంది ఆ తల్లి... తనలో స్నానం చేసి పునీతులవుతున్న వారందరికీ నోరు తీపి చేస్తుంది... మళ్లీ మళ్లీ తలచుకునేలా ఆదరిస్తుంది... పుష్కర నదీ తీరంలోని వారికి ఇదొక పండుగ... ఎక్కడెక్కడి వారూ పుట్టింటికి వస్తుంటారు... వచ్చినవారిని తియ్యగా పలకరించండి... పుష్కరాల సందర్భంగా గోదావరి తీరాన దొరికే మధుర రుచులు వారి నోటికి అందించండి... పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన వంటలు ఈ వారం అందరి కోసం... తాపేశ్వరం మడత కాజా కావలసినవి: మైదాపిండి - 2 కప్పులు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు; పంచదార - 2 కప్పులు; నూనె - వేయించడానికి తగినంత; ఉప్పు - కొద్దిగా; ఏలకుల పొడి - టీ స్పూను; వంటసోడా - చిటికెడు తయారీ: ఒక పాత్రలో కొద్దిగా నూనె, మైదా పిండి , ఉప్పు వేసి కలపాలి వంటసోడా జత చే సి మరోమారు కలపాలి తగినన్ని నీళ్లు పోసి పిండి మెత్తగా కలిపి, సుమారు గంటసేపు నాననివ్వాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి తీగపాకం వచ్చే వరకు ఉంచాలి ఏలకుల పొడి జతచేయాలి బాగా నానిన మైదా పిండికి పొడిగా ఉన్న బియ్యప్పిండి కొద్దిగా జత చేసి బాగా మర్దనా చేయాలి చిన్న ఉండ తీసుకుని చపాతీ మాదిరిగా పల్చగా ఒత్తాలి ఒత్తిన చపాతీ మీద నూనె పూసి, ఆ పైన పొడి బియ్యప్పిండి చల్లాలి ఆ పైన మరో చపాతీ ఉంచాలి. దాని మీద కూడా నూనె రాసి బియ్యప్పిండి వేయాలి ఈ విధంగా మొత్తం మూడు చపాతీలు ఒకదాని మీద ఒకటి వేయాలి చివరి దాని మీద నూనె, పిండి వేశాక నెమ్మదిగా రోల్ చేయాలి అంచుల్లో విడిపోకుండా కొద్దిగా నూనె పూయాలి చాకు సహాయంతో చిన్న చిన్న కాజాలు కట్ చేయాలి వాటి మధ్యభాగంలో అప్పడాలకర్రతో నెమ్మదిగా ఒత్తాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో కాజాను వేసి మీడియం మంట మీద కాజాలు బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి వాటిని వేడి వేడి పాకంలో వేసి సుమారు 20 నిమిషాలు నానిన తర్వాత తీసేయాలి కొద్దిగా వేడి తగ్గాక వడ్డించాలి. పెద్దాపురం వారి బెల్లం పాలకోవా కావలసినవి: పాలు - లీటరు; బెల్లం తురుము - పావు కేజీ; నెయ్యి - కొద్దిగా తయారీ: పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో పోసి స్టౌ మీద చిన్న మంట మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి ఎప్పటికప్పుడు అంచుల దగ్గర కలుపుతుండాలి నెమ్మదిగా పాలు చిక్కబడటం మొదలయ్యాక మరింత వేగంగా పాలు కలుపుతుండాలి బాగా చిక్కబడగానే బెల్లం తురుము వేసి ఆపకుండా కలపాలి మిశ్రమం బాగా దగ్గర పడ్డ తర్వాత నెయ్యి వేసి కలిపి వెంటనే దించేసి వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటూ పాలకోవా మాదిరిగా తయారుచేసి పళ్లెంలో ఉంచి ఆరనివ్వాలి గట్టి పడ్డాక వాటిని గాలిచొరని డబ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి.. ఆత్రేయపురం పూతరేకులు కావలసినవి: బియ్యం - పావు కేజీ; పంచదార - పావు కేజీ; ఏలకుల పొడి - టీ స్పూను; నెయ్యి - పావు కేజీ; నూనె - కొద్దిగా తయారీ: బియ్యాన్ని ముందురోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా పల్చగా చేసి ఒక వెడల్పాటి పళ్లెంలో పోయాలి పూతరేకు కుండను కట్టెల పొయ్యి మీద బోర్లించి, కుండంతా పట్టేలా నూనె రాసి, పళ్లెంలో పల్చటి వస్త్రాన్ని ముంచి, దానిని కుండ మీద వెనుక నుంచి ముందుకు వేగంగా లాగాలి రెండు నిమిషాలు కాలగానే జాగ్రత్తగా చేతితో కాని, అట్లకాడతో కాని పూతరేకును తీసి పక్కన ఉంచాలి ఈ విధంగా అన్ని రేకులూ తయారుచేసుకుని పక్కన ఉంచాలి నీరు బాగా పిండేసిన ఒక పొడి వస్త్రం మీద పూతరేకులను ఉంచి వెంటనే తీసేయాలి ఒక రేకు మీద ముందుగా నెయ్యి వేసి, ఆ పైన పంచదార పొడి వేయాలి పైన మరో పూతరేకు ఉంచి నెయ్యి, పంచదార పొడి వేసి పైన మరో పూతరేకు ఉంచాలి ముందుగా రెండుపక్కలా మడతలు వేసి వాటిని వరసగా మడవాలి అప్పటికప్పుడు తయారుచేసి తింటే రుచిగా ఉంటాయి. ధవళేశ్వరం జనార్దనస్వామి జీళ్లు కావలసినవి: బెల్లం తురుము - కేజీ (బూరుగపూడి బెల్లం శ్రేష్ఠం); నెయ్యి - 100 గ్రా; ఏలకుల పొడి - 3 టీ స్పూన్లు; బాగా మందంగా ఉన్న మేకు - 1 (గోడకు గాని, తలుపుకు కాని బిగించాలి) తయారీ: ఒక మందపాటి పాత్రలో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఆపకుండా కలుపుతుండాలి బెల్లం కరిగి ఉండ పాకం వచ్చాక మరి కాసేపు ఉంచి దించేయాలి గరిటెతో బాగా కలపాలి ఒకమాదిరి గట్టిగా అయిన తర్వాత ఆ మిశ్రమం పొడవాటి పలుచటి కడ్డీ మాదిరిగా తయారవుతుంది అప్పుడు ఆ మిశ్రమాన్ని మేకుకి వేసి పొడవుగా లాగుతుండాలి సుమారు పావు గంట సేపు లాగిన తర్వాత బెల్లం గట్టి పడుతుంది అప్పుడు వెడల్పాటి బల్ల మీద ఉంచి గుండ్రంగా రోల్ చేసి బియ్యప్పిండి, నువ్వుపప్పు అద్దుతూ రోల్ చేయాలి మనకు కావలసిన పరిమాణంలోకి వచ్చేవరకు రోల్ చేసి చాకు సహాయంతో చిన్న సైజులోకి జీళ్లను కట్ చేయాలి బాగా ఆరిన తర్వాత గాలి చొరని డబ్బాలోకి తీసి నిల్వ చేసుకోవాలి. కాకినాడ కోటయ్య కాజా కావలసినవి: మైదా - మూడు కప్పు; సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ సోడా - చిటికెడు. తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి బేకింగ్ సోడా జత చేసి మరో మారు కలపాలి తగినన్ని నీళ్లు జత చేసి బాగా మెత్తగా వచ్చేలా కలపాలి (గట్టిగా ఉండకూడదు) కలిపిన తర్వాత పిండి చేతికి అంటుతుంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని సుమారు పావుగంట సేపు బాగా మర్దనా చేయాలి. (ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయి కాజాలు) పిండి బాగా సాగుతుండాలి పైన తడి వస్త్రం వేసి సుమారు మూడు గంటలసేపు నాననివ్వాలి వేరొక పాత్రలో కేజీ పంచదారకు తగినన్నీ నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి బాగా చిక్కటి పాకం వచ్చేవరకు కలపాలి ఏలకుల పొడి జత చేసి మరో మారు కలపాలి మైదా మిశ్రమాన్ని తీసుకుని మరోమారు బాగా మర్దనా చేయాలి పళ్లెం మీద కొద్దిగా పొడి పిండి వేసి మైదాపిండి మిశ్రమాన్ని దాని మీద దొల్లించి సన్నగా, పొడవుగా గొట్టం ఆకారంలో చేతితో ఒత్తాలి చాకుతో చిన్న చిన్న కాజాల మాదిరిగా కట్ చేయాలి వాటికి మళ్లీ రెండువైపులా బియ్యప్పిండి అద్ది పక్కన ఉంచాలి బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి, నూనె కాగిన తర్వాత ఒక్కో గొట్టం కాజాను వేసి వేయించాలి (మీడియం మంట మీద తయారుచేయాలి) ఒక్కో కాజా బాగా పొంగుతాయి కాజాలు బంగారు వర్ణంలోకి మారాక తీసేసి పంచదార పాకంలో వేయాలి సుమారు 30 సెకండ్ల పాటు పాకంలో మునిగేలా చూడాలి. (లేదంటే అవి పాకం పీల్చుకోవు) ప్లేట్లోకి తీసుకుని వెంటనే వాటి మీద కొద్దిగా నెయ్యి వే సి చేత్తో కిందకు పైకి బాగా కలపాలి. (వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేయడం వల్ల అవి కాజాలకు అంటి మంచి రుచి వస్తాయి). -
ప్రత్యేక ఆకర్షణ..కోటిలింగాల ఘాట్
1.20 కిలోమీటర్ల నిడివితో రూ.14 కోట్లతో నిర్మాణం గంటకు 70 వేల మంది పుష్కర స్నానం చేయొచ్చంటున్న అధికారులు రాజమండ్రి: గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్ రికార్డుల మోత మోగించనుంది. విస్తీర్ణం, నిర్మాణ వ్యయంలోనే కాదు.. పుష్కర స్నానాలు చేస్తే భక్తుల సంఖ్యలో కూడా ఈ ఘాట్ అగ్రస్థానంలో నిలవనుంది. దేశంలో అతి పెద్ద ఘాట్‌గా చెబుతున్న దీని పొడవు 1.20 కిలోమీటర్లు కాగా, నిర్మాణానికి వెచ్చించిన వ్యయం రూ.14 కోట్లు. దాదాపు పూర్తి కావస్తున్న ఈ ఘాట్‌ను రాజమండ్రి సందర్శనకు వస్తున్న వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గోదావరి ఎడమ తీరంలో 3వ రైలు వంతెన, కొత్తగా నిర్మిస్తున్న 4 లేన్ల వంతెనల మధ్య నిర్మిస్తున్న ఈ ఘాట్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్లు, గోదావరి గట్టు రోడ్ల నిర్మాణం జరుగుతోంది. కోటిలింగాల ఘాట్‌ను గంటకు 70 వేల మంది స్నానం చేసే విధంగా విస్తరించామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ఇక్కడ కోటి మంది వరకు స్నానాలు చేయనున్నారు. ఇందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 18 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని ఘాట్ మధ్యభాగంలో 10 అడుగుల ఎత్తున నిర్మించే ప్లాట్‌ఫామ్‌పై భక్తులకు కనిపించేలా ఉంచనున్నారు. ఇది ఘాట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. -
పుష్కరాలా.. అంటే ఏమిటి?
ఏళ్లకేళ్లుగా కొండలు, గుట్టలే వారి ఆవాసాలు. సంప్రదాయాలు.. కట్టుబాట్లే వారి ఆస్తిపాస్తులు. గోదావరి పరివాహకమే వారి జీవనాధారం. కానీ, ప్రస్తుత గోదావరి పుష్కరాల సందడి వారి గూడేల్లో కన్పించడం లేదు. అసలామాటకొస్తే తమకు పుష్కరాలంటేనే తెలియదంటున్నారు గొత్తికోయలు. ఏటూరునాగారం: ఏటూరునాగారం అభయారణ్యంలో సుమారు 3వేల మంది గొత్తికోయలు జీవిస్తున్నారు. వీరు ఏడాదిలో రెండు సార్లు(పుష్యమాసం, వైశాఖ మాసం) తమ దేవతామూర్తులను గోదావరి నీటితో శుద్ధి చేస్తారు. అసలు తమకు పుష్కరాలు అంటే ఏమిటోతెలియదంటున్నారు . నాయకపోడ్లు తమ ఆడబిడ్డ అయిన లక్ష్మీదేవరను గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి ఉత్సవా లు జరుపుకుంటారు. మడుగులోని నీటిని కూడా ఆదివాసీ గిరిజనులు పవిత్ర జలాలుగా భావిస్తారు. ఎన్నో తెగలు.. భిన్న సంస్కృతులు ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నో తెగలు, భిన్న సంస్కృతులతో జీవనం సాగిస్తున్నారుు. గోండ్, అంబుజ్ మేరి యా, బిస్నోమ్ మెరియ, మురియా, హల్పా, బట్రా, పజ్రా, గొత్తికోయ, కోయలు, మాంజీ, బంజారాలంబాడీ, నాయకపోడ్ తెగలు ఏజెన్సీలో జీవిస్తున్నాయి. ఒకప్పుడు వేట.. ప్రస్తుతం పోడు వ్యవసాయం వీరి కడుపు నింపుతోంది. వెదురుతో సృజానాత్మక వస్తువులు తయారు చేస్తారు.నాసిక్‌లో నివసించే వర్లితెగ గిరిజనులు రూపొందించే వర్లి చిత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పటి వరకు ఎప్పుడు చేయలె పుష్కరాలకు స్నానాలు అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఎప్పు డూ చేయలె. ఇక్కడికి వచ్చినకాడి నుంచి వాగులు, కుంటల్లోనే స్నానాలు చేస్తాం. సంక్రాంతి ముందు వడ్లు కోసేటప్పుడు పండుగ చేసుకొని గొర్రెలు, మేకలను బలిస్తాం. పొలిమేరల చుట్టూ నల్లటి ముగ్గు పోసి ఎవరు రాకుండా చూస్తాం. - మాడవి జోగయ్య, చింతలపాడు -
ఎక్సప్రెస్ స్పీడ్ లో పుష్కర ఏర్పాట్లు పూర్తి
{పయాణికులకు తూర్పుకోస్తా రైల్వే {పత్యేక సదుపాయాలు గోదావరి పుష్కరాల కోసం తూర్పు కోస్తా రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో వారం రోజుల్లో ఊపందుకోనున్న పుష్కరాలకోసం రైల్వే సర్వసన్నద్ధమైంది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో విశాఖపట్నం, సింహాచలం, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లు వివరాలు వాల్తేరు రైల్వే గురువారం రాత్రి ప్రకటించింది. - విశాఖపట్నం సిటీ స్పెషల్ కౌంటర్లు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 8 జనరల్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి. వాటితో బాటు ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై మరో నాలుగు, జ్ఞానాపురం వైపు రెండు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో ప్రత్యేకంగా రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్లకు మాత్రమే టికెట్లు జారీ చేస్తారు. మరో మూడు ఎనీ టైం వెండింగ్ మెషీన్లతో టికెట్లు జారీ చేయనున్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఒకే కౌంటర్ పని చేస్తోంది. ప్రతీ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ, 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఏటీవీఎం మెషీన్ మాత్రం రౌండ్ ది క్లాక్ అందుబాటులో ఉంటుంది.విజయనగరంలో ప్రస్తుతం రెండు కౌంటర్లున్నాయి. అదనంగా ఒక కౌంటర్‌ను ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ, తిరిగి రాత్రి 6 నుం చి 7 గంటల మధ్య అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరో రెండు ఏటీవీఎంలు పని చేస్తాయి. హెల్ప్ డెస్క్‌లు పుష్కరాల సందర్భంగా నిరంతరం పని చేసేలా విచారణ, హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. విశాఖ స్టేషన్లో మూడు, సింహాచలం, దువ్వాడలలో చెరో ఒకటి వుంటాయి. రైల్వేస్టేషన్లో చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ను ఈ ఏర్పాట్లకు ఇన్ఛార్జిగా నియమించారు. జ్ఞానాపురం, విశాఖ ప్రధాన ద్వారాల వద్ద 30 మంది ఉండేందుకు అనుకూలమైన షెడ్డులను నిర్మిస్తారు. జ్ఞానాపురం, మెయిన్ స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద సంచార టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. వైద్య సదుపాయాలను అన్ని ప్లాట్‌ఫారాలపై ఏర్పాటు చేశారు. స్పెషల్ రైళ్లు... హైదరాబాద్-విశాఖపట్నం(07706) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 12, 16, 20, 24, తేదీల్లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి, ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖపట్నం-హైదరాబాద్(0775) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13, 17, 21, 25 తేదీల్లో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి, ఆ మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డొర్నకల్, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. హైదరాబాద్-శ్రీకాకుళం(07708) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14, 18, 22, 26, తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి, ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 7.20 గంటలకు బయల్దేరి 10.15 గంటలకు శ్రీకాకుళం చేరుతుంది. శ్రీకాకుళం-హైదరాబాద్(07707) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15, 19, 23, 27, తేదీల్లో మధ్యాహ్నం 1:15 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి విశాఖకు సాయంత్రం 3.45 గంటలకు చేరుకుని తిరిగి 4.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు విజయనగరం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, మధిర, ఖమ్మం, డొర్నకల్, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. తిరుపతి-పార్వతీపురం(07709) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13, 17, 21, 25 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖకు చేరుకుని తిరిగి 2.05 గంటలకు బయల్దేరి సాయంత్రం 6 గంటలకు పార్వతీపురం చేరుతుంది.పార్వతీపురం-ధర్మవరం(07710) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 14, 18, 22, 26 తేదీల్లో రాత్రి 6.45 గంటలకు బయల్దేరి విశాఖకు రాత్రి 10.35 గంటలకు చేరుకుని, తిరిగి 10.55 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4.25 గంటలకు ధర్మవరం చేరుతుంది. అనంతపూర్, గూటీ, ధొనే, నంద్యాల్, గిద్దలూర్, కుంభం, మార్కాపురం, దొనకొండ, వినుకొండ, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం , బొబ్బిలి, ధర్మవరం-పార్వతీపురం స్టేషన్లలో ఆగుతుంది. ధర్మవరం-విశాఖపట్నం (07712) ఎక్స్‌ప్రెస్ ఈనెల 15,19,23,27 తేదీల్లో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అనంతపూర్, గూటీ, ధొనే, నంద్యాల్, గిద్దలూర్, కుంభం, మార్కాపురం, దొనకొండ, వినుకొండ, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం. ఈ రైల్లో 8 స్లీపర్ క్లాస్, 10 జనరల్ బోగీలు, 2 ఏసీ బోగీలు ఉంటాయి. విశాఖపట్నం- తిరుపతి (07711) ఎక్స్‌ప్రెస్ ఈనెల 16, 20,24,28 తేదీల్లో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు తిరుపతి చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూటూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ-విశాఖపట్నం (07714) ఎక్స్‌ప్రెస్ ఈనెల 16,17,18,19, 23,24,25,26 తేదీల్లో రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈరైల్లో 9 జనరల్ బోగీలు, 10 స్లీపర్‌క్లాస్ బోగీలు, 2 ఏసీ బోగీలుంటాయి. విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్‌యాదవ్ తెలిపారు. -
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న గోదావరి పుష్కరాలలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పుష్కరాల్లో నిర్వహించాల్సిన సాంస్కృతిక కార్యక్రమాలపై గురువారం రవీంద్రభారతి ప్రాంగణంలోని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, రామన్నగూడెం, భద్రాచలం, కందకుర్తి తదితర కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో పుష్కరోత్సవాన్ని పూర్తిగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడానికి సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ప్రచారానికి సంబంధించి సీడీల తయారీ, మీడియాలో ప్రచారాలపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సమాచార, పౌరసంబంధాల శాఖ సంచాలకులు సుభాష్, దూరదర్శన్, ఆకాశవాణి ప్రతినిధులు, భద్రాచలం, ధర్మపురి ఈవోలు, సాంస్కృతిక సారథి ప్రతినిధులు, జిల్లాల డీపీఆర్వోలు, ఆలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పుష్కర పనులు వేగిరం చేయాలి
గోదావరి పుష్కర పనులను వేగవంతం చేయూలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద, మంగపేట గోదావరి పెర్రీపాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. - రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఏటూరునాగారం : జూలై 14 నుంచి ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలకు సంబంధించి నిర్మాణ పనులను వేగవంతం చేయూలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ముల్లకట్ట వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా రూ.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పస్రా నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా సైడ్ బర్మ్స్ పోసి పుష్కరాల వరకు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎన్‌హెచ్ ఎస్ఈ వసంతను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎస్ఈ మదనయ్య మంత్రికి వివరించారు. పప్కాపురంలోని 900 మీటర్ల సీసీ రోడ్డుకు క్లియరెన్స్ కోసం అటవీశాఖ అనుమతి కోరుతూ లేఖ ఎందుకు రాయలేదని కలెక్టర్ ఎస్ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాసి పనులు వేగవంతం చేయిస్తామన్నారు. జిల్లా నుంచి అన్ని ప్రాంతాలకు 375 బస్సులు కేటాయించామని ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ భవాని ప్రసాద్ మంత్రికి వివరించారు. నిరంతరం విద్యుత్ కోసం 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 6 ఏర్పాటు చేసి సుమారు 150 లైట్ల చొప్పున ఒక్కో ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ మోహన్‌రావు వెల్లడించారు. లక్నవరం, రామప్ప, గుడెప్పాడ్, మేడారం, గట్టమ్మ, ములుగు రోడ్డు, ఏటూరునాగారం క్రాస్ వద్ద 8 ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. 3 వేల సిబ్బందితో బందోబస్తు పుష్కరాలకు వచ్చే భక్తులకు భద్రత ఇవ్వడానికి 3 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పా టు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ తెలిపారు. మత్స్యశాఖ ద్వారా 98 మంది గజఈతగాల్లను నియమించామని, తెప్పలు, మరబోట్లు, సేఫ్ జాక్సిట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా అసిస్టెంట్ డెరైక్టర్ శంకర్రావు తెలిపారు. తాగునీటి కోసం రామన్నగూడెం, ముల్లకట్ట, మంగపేట ఘాట్ ల వద్ద 18 మినీ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి నీరు సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాం చందర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ మహేందర్‌జీ, డీఎస్పీ రాజమహేంద్రనాయక్ పాల్గొన్నారు. గోదావరి ఫెర్రీ పారుంట్ వద్ద పనుల పరిశీలన మంగపేట : మంగపేట గోదావరి ఫెర్రీపాయింట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ నిర్మాణ పనులను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంంగా పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయని మైనర్ ఇరిగేషన్ ఈఈ చిట్టిబాబును అడిగి తెలుసుకున్నారు. జూన్ ఒకటి నుంచే రుతుపవనాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని వర్షాలు పడితే పనులకు అంతరాయం కలుగుతుందని వర్షాలు పడకముందే జూన్ 15లోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
పుష్కరాలకు 106 స్నానఘట్టాలు
- పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శి జవహర్‌రెడ్డి ఏలూరు : జిల్లాలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 106 స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. స్నానఘట్టాల వద్దే దుస్తులు మార్చుకునే గదులను కూడా ఏర్పాటు చేయూలని అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో పుష్కరాల సందర్భంగా ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా వస్తారన్నారు. వారి రాకను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో స్నానఘట్టాల ఆధునికీకరణతో పాటు ఆధునిక పరిజ్ఞానంతో భక్తుల కోసం వికలాంగులు, వృద్ధాప్యంలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా షవర్ బాత్ ఏర్పాట్లు కూడా చేయాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా ఎప్పటికప్పుడే చెత్తను తొలగించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల న్నారు. జిల్లాలో మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని నియమించాలన్నారు. ఇందుకు ఎన్ని నిధులు అవసరమవుతాయో ఉభయగోదావరి జిల్లాల అధికారులు ఒక ప్రణాళికను సమర్పించాలని డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డిని ఆదేశించారు. డైనమిక్ కలెక్టర్ భాస్కర్ కలెక్టరు కాటంనేని భాస్కర్ ఎంతో డైనమిక్‌గా పనిచేస్తున్నారని, సమర్థవంతమైన కలెక్టర్ సమక్షంలో గోదావరి పుష్కరాలకు పటిష్టమైన ఏర్పాట్లు జరగడం ప్రజల అదృష్టమని జవహ ర్‌రెడ్డి అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా నిరంతరం అవసరమైన ప్రతి పాదనలను సమర్పిస్తూ జిల్లాలో భక్తుల కోసం పటిష్టమైన చర్యలు చేపట్టడంలో భాస్కర్ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 2వేల మంది పారిశుధ్య కార్మికులను నియమించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండూ చూసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందుకు రూ.8 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. భక్తులకు అవసరమైన తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం రూ. 2.59 కోట్లు నిధులు మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పుష్కరాల పనులు ఏ మేరకు జరుగుతున్నాయో ఆన్లైన్లో తెలుసుకునే విధంగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. సమావేంలో జెడ్పీ సీఈవో కె.సత్యనారాయణ, డీపీవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావు పాల్గొన్నారు. -
కాగితాలపై కోట్లు.. కార్యాచరణకు తూట్లు
- టెండర్ దశలోనే 248 పనులు - ప్రారంభమైన వాటి విలువ రూ.20 కోట్లే - పంచాయతీరాజ్ శాఖ నిర్లిప్తత ఏలూరు (టూటౌన్) :జిల్లాలో మరో 90 రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. కుంభమేళ తరహాలో పుష్కరాలు నిర్వహిస్తామని ఒక పక్క ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేశారు. మరోపక్క ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గోదావరి పుష్కరాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తామని ప్రకటించినా వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనులు నత్తనడక సాగుతున్నాయి. 278 పనులకు ప్రభుత్వం రెండు విడతలుగా అనుమతులు మంజూరు చేసినా ప్రస్తుతం 28 పనులు ప్రారంభమయ్యాయి. మరో 248 పనులు టెండర్ దశలోనే ఉన్నాయి. టెండర్లు ఖరారై, ఒప్పందాలు పూర్తయి పనులు ప్రారంభించడానికి కనీసం మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. పుష్కరాల నాటికి పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఏలూరు పంచాయితీరాజ్ ఎస్ఈ కార్యాలయం నుంచి మొదటి విడతగా రూ.20 కోట్ల విలువైన సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవగా, వాటికి టెండర్లు వేసి అగ్రిమెంట్ కూడా పూర్తయింది. కానీ 28 పనులను మాత్రమే కాంట్రాక్టర్లు ప్రారంభించారు. మరో రెండింటిని ప్రారంభించాల్సి ఉంది. రెండో విడతలో 248 పనులకు రూ.36 కోట్లు నిధులు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆలస్యంగా అనుమతులు ఇవ్వడంతో ఇంకా టెండర్ల ప్రక్రియ దశలోనే ఈ పనులున్నాయి. అధికారులు 248 పనులకు టెండర్లు వేయగా రోజుకు 10 పనులు చొప్పున టెండర్లను తెరుస్తున్నారు. టెండర్లను తెరిచే ప్రక్రియ ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతుందని, ఆ తరువాత రాబోయే 10 రోజుల్లో ఒప్పందాలు పూర్తి చేస్తామని చెబుతున్నా మొత్తం పనులకు కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదని సమాచారం. వీటికి అధికారులు మరోసారి టెండర్లు పిలవాల్సి ఉంది. ఒక పక్క పుష్కరాల గడువు దగ్గర పడుతున్నా అధికారుల్లో వేగం కనిపించడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖద్వారా పుష్కరాలు జరిగే అన్ని ఘాట్లకు సంబంధించిన కొన్ని గ్రామాల్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా వీటిని ప్రారంభించడం ఆలస్యమైంది. పుష్కరాలకల్లా పూర్తవకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులు త్వరితగతిన స్పందించి పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు. పనుల పూర్తికి సత్వర చర్యలు పుష్కరాల నాటికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. రెండో విడత పనులకు అనుమతులు రావడం ఆలస్యం కావడంతో టెండర్లు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ మరో మూడు నెలల సమయం ఉంది కాబట్టి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తవగానే అగ్రిమెంట్ పూర్తి చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం. - సి.వేణుగోపాల్, ఎస్ఈ, పంచాయతీరాజ్ శాఖ -
ఆపసోపాలు
పుష్కర పనులకు అరకొర నిధులు హడావుడిగా షార్ట్ టెండర్లు యాత్రికులకు సౌకర్యాల కల్పన సాధ్యమేనా? ఏలూరు : గోదావరి పుష్కరాలకు మూడు నెలలే గడువు ఉంది. దేశం నలుమూలల నుంచి భారీఎత్తున తరలివచ్చే యాత్రికులను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం ముందునుంచీ ప్రతిపాదనలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు విడుదలకాకపోవడం.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవడంతో ఏర్పాట్ల విషయంలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కొద్దోగొప్పో నిధులు విడుదల అవుతుండగా, సకాలంలో పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. ఈ నెల రోజులు టెండర్లు పిలవడం, వాటిని ఖరారు చేయడానికే సరిపోతుంది. ఆ తరువాత రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేయాల్సి ఉండటంతో అధికారులు.. ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్నానఘట్టాలు, యాత్రికుల విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పుష్కరాలకు వివిధ పనుల నిమిత్తం జిల్లాకు రూ.923 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.657 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు మాత్రమే గ్రీన్‌సిగ్నల్ లభిం చింది. ఇందులో 90 శాతం పనులకు టెండర్లు పిలవలేదు. దీంతో ఇప్పటివరకూ 10 శాతం పనులు మాత్రమే ప్రా రంభమయ్యాయి. ప్రధానంగా నిధుల లేమి అధికారులకు సంకటంగా మారిం ది. నిధులొచ్చాక రోజువారీ సమీక్షలు, నివేదికల ఇచ్చేందుకే కాలం సరిపోతుందని యంత్రాంగం ఆందోళన చెం దుతోంది. ప్రభుత్వం నిధుల విడుదలకు భరోసా ఇచ్చి, సమీక్షలను తగ్గిస్తే పుష్కర పనులు వేగం పుంజుకుంటాయనేది అధికారులు అభిప్రాయం. అరకొరగా నిధులను విడుదల చేస్తూ ఇటీవల జీవోలు జారీ కావడంతో పనులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన షార్ట్ టెండర్లు పిలుస్తున్నారు. ఆర్ అండ్ బీకి రూ.296 కోట్లు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే సాధారణ పనులకు విడుదల చేయాల్సిన నిధులను పుష్కర పనులకు సర్కారు దారి మళ్లించింది. 83 పనులకు రూ. 296 కోట్లను విడుదల చేసింది. దీంతో అధికారులు ఆగమేఘాలపై పనులకు సంబంధించిన అంచనాలను రూపొం దించి ఎక్కడిక్కడ షార్ట్టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 13 ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు ఏలూరు నగరపాలక సంస్థ, ఏడు పురపాలక సంఘాలు, ఓ నగర పంచాయతీకి కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి రెండు వారాలైంది. ఆ నిధులను మునిసిపాలిటీలకు ఇవ్వకుండా పుష్కర పనులకు మళ్లించడం విమర్శలకు తావిస్తోంది. కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు మునిసిపాలిటీలకు రూ.92 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో 355 పనులను ప్రజారోగ్య శాఖ ద్వారా చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ శాఖ పరంగా రూ.18.34 కోట్ల విలువైన పనులు నేటికీ ప్రారంభం కాలేదు. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఇంకా నిధులు విడుదల కాలేదు. కేంద్రం ఇస్తానన్న స్వచ్ఛభారత్ నిధుల ప్రస్తావనే లేదు. మత్య్సశాఖ పరంగా బోట్లు, ఈతగాళ్ల నియామకం, వారికి శిక్షణ కోసం రూ.2 కోట్లు ఇటీవలే విడుదల అయ్యాయి. -
దేవుడి సొమ్ముకు శఠగోపం
గుళ్లను బాగు చేయమంటే... దేవుడి నిధికే ఎసరు పెట్టారు పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లలో ప్రభుత్వ వింత వైఖరి ‘పేద ఆలయాల’కు ఉపయోగపడాల్సిన సీజీఎఫ్ నిధులు మళ్లింపు ఉత్సవాల పనులకు ఖజానా నుంచి కేటాయించొద్దని నిర్ణయం తాజా నిర్ణయంతో ధూపదీప నైవేద్యాలకూ కటకట సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధించిన తర్వాత తొలి గోదావరి పుష్కరాలు... కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో నదీ తీరంలోని దేవాలయాలకు కొత్త శోభ వస్తుందని భక్తులు ఆశించారు. ఇందుకు వీలుగా దేవాదాయ శాఖకు భారీగా నిధులు వస్తాయని భావించారు. కానీ నిధులు ఇవ్వటం దేవుడెరుగు.. శిథిలావస్థలోని ఆలయాల జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలకు వాడాల్సిన దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధికే ప్రభుత్వం ఎసరు పెట్టింది. పుష్కరాల పేర నయాపైసా ఇవ్వకుండా ఉన్న నిధులనే ఊడ్చేసింది. అసలే నిధులు సరిపోక దేవాలయాలు కొడిగట్టే దీపంలాగా ఉన్న తరుణంలో... ఉన్న కొద్దిపాటి నిధులనూ మళ్లించి దేవుడి ధూపదీపాలకు ఎసరు పెట్టింది. ఇదీ కథ... వచ్చే జూలైలో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పుష్కరాలు కావడంతో వాటిని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రూ.900 కోట్లు వెచ్చించాలని లెక్కలేసింది. ఈ సంఖ్య వినడానికి బాగానే ఉన్నా... అందులో రూ.700 కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రావాల్సినవే. ఆ మేరకు ఢిల్లీకి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే అవి కచ్చితంగా వస్తాయన్న నమ్మకం ఇప్పటివరకు లేదు. ఇందులో 25 శాతం రాష్ట్రప్రభుత్వం భరించాలి. ముందైతే దేవాలయాల అభివృద్ధి, సుందరీకరణకు రూ.100 కోట్లు ఇవ్వనున్నట్టు తొలుత పేర్కొంది. దీంతో ఆయా దేవాలయాల అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కానీ నాలుగు రోజుల క్రితం ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేవలం రూ.12 కోట్లనే ప్రకటించారు. పోనీ ఆ రూ.12 కోట్లనైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. దేవాదాయ శాఖలోని సర్వశ్రేయోనిధి (కామన్‌గుడ్‌ఫండ్) నుంచి వాటిని ఇవ్వాలని తాజాగా నిర్ణయించారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అట్టహాసంగా ప్రకటించిన ప్రభుత్వం... ‘పేద గుడుల’కు పెద్ద దిక్కుగా ఉన్న సర్వశ్రేయోనిధికి ఎసరు పెట్టడంతో దేవాదాయ శాఖలో గందరగోళం నెలకొంది. ఇదీ సమస్య... తెలంగాణలో శిథిలావస్థకు చేరుకున్న పలు దేవాలయాల జీర్ణోద్ధరణతోపాటు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికిప్పుడు రూ.60 కోట్లు కావాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ పనులన్నీ అధికారికంగా మంజూరైనవే. ఇక ధూపదీప నైవేద్యాల కోసం రూ.6 కోట్లు అవసరం. ఈ పథకం కింద నెలకు రూ.2,500 చొప్పున ఇస్తున్న మొత్తాన్ని రూ.6 వేలకు పెంచుతున్నట్టు ఇటీవల ప్రభుత్వం పేర్కొంది. దీని ప్రకారం మరో రూ.12 కోట్లు అవసరం. ఇక దళిత వాడల్లో ఆలయాల నిర్మాణానికీ ఈ నిధి నుంచే నిధులు కేటాయించాలి. ఇన్ని అవసరాలుండగా ప్రస్తుతం కామన్గుడ్ఫండ్లో ఉన్న నిధులు కేవలం రూ.24 కోట్లే. ఆ నిధులు అసలు అవసరాలకు ఏ మూలకూ చాలనందున ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతున్న తరుణంలో... అందులోంచి రూ.12 కోట్లను పుష్కరాలకు మళ్లించడం గమనార్హం. సర్వశ్రేయోనిధిని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించవచ్చనే వెసులుబాటు ఉండటంతో... పుష్కరాలు కూడా ధార్మిక కార్యక్రమాలే అని పేర్కొంటూ వాటిని మళ్లిస్తోంది. బడ్జెట్లో రూ.300 కోట్లు పెడతాం.. దీనిపై దేవాదాయ శాఖ అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఆ శాఖ మంత్రి కొత్త హామీతో వారిని తృప్తి పరిచే ప్రయత్నం చేశారు. వచ్చే బడ్జెట్లో దేవాదాయ శాఖకు రూ.300 కోట్లు ప్రకటించనున్నట్టు తెలిపారు. -
పుష్కరాలతో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు రూ.వెయ్యి కోట్లను కేటాయించామని, రహదారులు, పారిశుద్ధ్యం, ఘాట్ల నిర్మాణం, దేవాలయాల జీర్ణోద్ధరణ, భక్తుల వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు వీటిని ఖర్చు చేయాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. -
గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి మంత్రిగా బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం అధికారికంగా మంత్రిత్వ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని డీ-బ్లాకులో తనకు కేటాయించిన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాల మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్ర తొలి క్యాబినెట్లో స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమర్ధ పనితీరు ద్వారా సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీఐడీ విచారణ నివేదిక అందిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. న్యాయశాఖ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాల తరహాలోనే బాసర సరస్వతికీ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని అమలు చేస్తామని తెలిపారు. కాగా, సహచర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కోసం పనిచేస్తానని అదే జిల్లాకు చెందిన మరో మంత్రి జోగు రామన్న చెప్పారు. శుక్రవారం ఇంద్రకరణ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా రామన్న ఆయన చాంబర్‌కు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. -
గోదావరి పుష్కరాలకు 67 ఘాట్లు
పుష్కర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలకు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 67 పుష్కరఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో ప్రస్తుతం 28 పుష్కర ఘాట్లు ఉండగా, మరో 39 ఘాట్లను నిర్మించాలని రెవెన్యూశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై పలు విభాగాల అధికారులతో బుధవారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. పుష్కరఘాట్ల ఏర్పాటు నిమిత్తం ఐదు జిల్లాల్లో 43 ప్రాంతాలను ఎంపిక చేశారు. నిజామాబాద్ జిల్లాలో కండకుర్తి, తాడ్బి లోలి, పో చంపాడు, సావెల్, తడపాకల, గుమ్మిర్యాల్, దోమ్చంద్, ఉమ్మెడ, తునిగి ని, కోసిలి, బినోలా, ఆదిలాబాద్ జిల్లాలో బాసర, సోన్, ఖానాపూర్, గూడెం, లక్సెట్టిపేట, మంచిర్యాల, వెలాల, చెన్నూరు, కరీంనగర్ జిల్లాలో.. ఎర్దండి, వల్గొండ, వేంపల్లి వెంకట్రావుపేట, ధర్మపురి, రాయంపట్నం, కోటిలింగాల, తిమ్మాపూర్, మంథని, కాళేశ్వరం, వరంగల్ జిల్లాలో ముళ్లకట్ట, రామన్నగూడెం, మల్లూరు, మంగపేట, ఖమ్మం జిల్లాలో వజీద్, పర్ణశాల, దుమ్ముగూడెం, భద్రాచలం, రామచంద్రాపురం, లిం గాల, చింతిర్యాల , చిన్నతల బయ్యారం, గొమ్మూరు, రామానుజవరం, మల్లేపల్లి ఉన్నాయి. -
మహాజాతరలా పుష్కరాలు
రూ.13.56 కోట్లతో {పతిపాదనలు ఘాట్ల ఎంపిక పూర్తి చేసిన అధికారులు 410 మీటర్ల స్నానఘట్టాల నిర్మాణం 5 ఇన్‌ఫిల్టరేషన్ బావులు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటుకు సన్నాహాలు మేడారం తరహాలో భారీ ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు మేడారం మహాజాతర తరహాలో సకల ఏర్పాట్లు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చేయూల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కిషన్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇన్‌చార్జ్‌లుగా అధికారులను నియమిం చారు. ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ, స్పెషల్ ఎంఐ ఈఈలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించే నాలుగు చోట్ల స్నానఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదించారు. పుష్కర స్నానాలకు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాలుగు ప్రాంతాల్లో 410 మీటర్ల పొడవునా స్నానఘట్టాల నిర్మాణంతోటు ఇతర సదుపాయూలకు నీటి పారుదల శాఖ అధికారు లు రూ.13.56 కోట్లతో అంచనాలు రూపొం దించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నారుు. 2003లో 10 లక్షల మంది భక్తులు... 12 ఏళ్ల క్రితం (2003)లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. 12 రోజుల పాటు జరిగిన ఈ పుష్కరాల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. పుష్కరాల సందర్భంగా నీటి పారుదల శాఖ రామన్నగూడెం లాంచీల రేవు వద్ద తాత్కాలిక షెడ్లను మాత్రమే నిర్మించింది. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం వాహనాలు రెట్టింపు సంఖ్యల్లో పెరిగిపోవడంతో స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు. దీనికి తోడుగా వచ్చే మార్చి నాటికి గోదావరిపై నిర్మిస్తున్న ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు జరిగే అవకాశాలున్నాయి. మన జిల్లా మీదుగా ఖమ్మం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు వెళ్లే వారు ఈ రహదారిపై ప్రయాణిస్తారు. గత పుష్కరాల సమయంలోనే వరంగల్-ఏటూరునాగారం ప్రధాన రహదారిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారుల అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత అనుభవాల దృష్ట్యా పుష్కరాలకు తరలివచ్చే అశేషజనవాహినికి ఇబ్బందులు తలెత్తకుండా స్నానఘట్టాలు నిర్మించేందుకు అధికారులు ముందస్తుగా అంచనాలు సిద్ధం చేశారు. జూలైలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసమయంలో గోదావరి వరద ఉదృతంగా ఉంటే పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తుల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మిస్తున్నారు. మేడారం తరహాలో బ్యాటర్ ఆఫ్ ట్యాప్స్‌కు నిరంతరం నీటి సరఫరా చేసేందుకు స్నాన ఘట్టాల ప్రాంతాల్లో ఐదు ఇన్ ఫిల్టరేషన్ బావులు నిర్మించాలని అధికారుల ప్రతిపాదనల్లో ఉంది. స్నానఘట్టాలు ఇలా... రామన్నగూడెం : ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద లాంచీల రేవు ఉంది. ఇక్కడి నుంచి గోదావరి అవతలి ఒడ్డుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు లాంచీలు నడిచేవి. 2003 పుష్కరాలు రావడంతో తొలిసారి ఈరేవులో సిమెంట్ మెట్లు నిర్మించారు. ఈమెట్లకు పైభాగంలో స్నానాలు చేసేందుకు మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నల్లాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్లకు అదనంగా మరో 10మీటర్లు స్నానఘట్టాలు నిర్మించేందు కు నీటి పారుదల శాఖ ప్రాతిపాదించింది. అప్పటి పుష్కరాల్లో స్నానఘట్టాలు, నల్లాల ఏర్పాటు కోసం రూ.12లక్షలు వ్యయం చేశారు. ప్రస్తుతం రూ.22.53లక్షలు కేటాయించారు. ముల్లకట్ట : ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామ సమీపంలో 163 జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా గోదావరి నదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతోంది. పుష్కర సమయానికి రహదారిపై రాకపోకలు ప్రారంభమవుతాయని భావిస్తున్న అధికారులు... ఈ బ్రిడ్జికి రెండు వైపులా 100 మీటర్ల చొప్పున స్నానఘట్టాల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్తోపాటు గోదావరిలో రెండు ఇన్‌ఫిల్టరేషన్ బావులను నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.6.84 కోట్లతో అంచనాలు రూపొందించారు. మంగపేట : మంగపేట మండల కేంద్రానికి అనుకుని ఉన్న గోదావరి నది ఒడ్డున నూతనంగా 100 మీటర్ల స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుస్తులు మార్చుకునేందుకు కంపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక ఇన్‌ఫిల్టరేషన్ వెల్‌ను నిర్మిస్తున్నారు. వరంగల్ నుంచి భద్రాచలానికి పోయే ప్రధాన రహదారి మధ్యలో మంగపేట ఉండడం వల్ల ఇక్కడకు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. గత పుష్కరాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలే దు. ప్రస్తుతం ఇక్కడ స్నానఘట్టాలు నిర్మించేందుకు రూ.22.52 లక్షలు కేటాయించారు. మల్లూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీహేమచల నర్సింహస్వామి దేవాలయం మంగపేట మండలంలోని మల్లూరులో ఉంది. గోదావరి పుష్కరాల సందర్భంగాపుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ఈక్షేత్రాన్ని దర్శించే అవకాశాలున్నాయి. దీంతో ఈగ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున సుమారు 100మీటర్ల స్నానఘట్టాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. మల్లూరుకు వెళ్లే భక్తులు ఏటూరునాగారం వెళ్లకుండా గోదావరిలో స్నానాలు చేయడంతోపాటు దర్శనాలు చేసుకునే వీలుకలుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనుంది. ఇక్కడ నిర్మాణాల కోసం రూ.22.52లక్షలు కేటాయించారు. ముల్లకట్ట వద్ద రెండు, రామన్నగూడెం, మంగపేట, మల్లూరు స్నానఘట్టాల సమీపంలోని గోదావరి నదిలో మూడు ఇన్ఫిల్లరేషన్ వెల్స్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.20.58 లక్షలు ప్రతిపాదించారు. అందులో స్నానఘట్టాల నిర్మాణానికి రూ. 11.34 కోట్లు, క్లోరినేషన్‌కు రూ. 23.17లక్షలు, మహిళల దుస్తులు మార్చుకునేందుకు రూ.24లక్షలతో డ్రస్సింగ్ రూములు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.75లక్షలు, ఇతరత్ర ఏర్పాట్ల కోసం రూ.79.25లక్షలు కేటాయించారు. సౌకర్యాల కల్పనకు రూ.13.56కోట్లు గోదావరి పుష్కరాల సందర్భంగా నాలుగు ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మాణంతోపాటు సదుపాయాల కోసం రూ.13.56కోట్లతో ప్రాథమికంగా అంచనాలు రూపొందించాం. అందులో స్నానఘట్టాల నిర్మాణానికి రూ. 11.34కోట్లు, 5 ఇన్‌ఫిల్టరేషన్ బావుల కోసం రూ.20.58లక్షలు, క్లోరినేషన్‌కు రూ. 23.17లక్షలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు రూ.24లక్షలతో డ్రెస్సింగ్ రూములు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.75లక్షలు, ఇతరత్రా ఏర్పాట్లకు రూ.79.25 లక్షలు కేటాయించాం. ఈమేరకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. బడ్జెట్లో పుష్కరాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే పనులు ప్రారంభిస్తాం. - పద్మారావు, ఎస్ఈ, నీటిపారుదల శాఖ -
పుష్కరాలకు టోకెన్ గ్రాంట్ 100 కోట్లు: యనమల
రాజమండ్రి: వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాలకు టోకెన్ గ్రాంట్(ప్రాథమిక కేటాయింపు)గా రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ శుక్రవారం రాజ మండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులతో సమావేశమైంది. ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. యనమల మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు ఎంత ఖర్చయినా భరిస్తామని, అందుకు ఆకాశమే హద్దని అంటూనే విడుదల చేసే నిధులకు మాత్రం పరిమితి విధించారు. పుష్కరాలను అవకాశంగా తీసుకుని అన్ని అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తే వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. -
ప్రతిపాదనలు గోదారంత.. కేటాయింపులు కాలువంత...
ఆదిలోనే నీళ్లు వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు.. ఉభయగోదావరి జిల్లాలకు మహాసంరంభమేనన్న అంచనా ‘నీటిబుడగే’ అనిపిస్తోంది. రానున్నది మహా పుష్కరమనీ, కుంభమేళాగా నిర్వహిస్తామని ఇటీవలే గొప్పగా చెప్పారు ప్రజాప్రతినిధులు. ఈ నేపథ్యంలో వచ్చే ఏటి పుష్కరాలకు గత పుష్కరాల కన్నా రెట్టింపు మంది సందర్శకులు వస్తారని భారీ అంచనాలు సిద్ధం చేశారు అధికారులు. అయితే వాటిపై ఆదిలోనే ప్రభుత్వం నీళ్లు జల్లింది. సాక్షి, రాజమండ్రి : పుష్కరాలకు టోకెన్ గ్రాంటుగా రూ.100 కోట్లు మాత్రమే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం సదుపాయాలకు మాత్రమే చేసే ఖర్చులకు అదనంగా మరో రూ.వంద కోట్లయినా ఇస్తాము తప్ప ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పైసా ఇచ్చేది లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం రాజమండ్రిలో చెప్పారు. దీంతో అవాక్కవడం - అధికారుల వంతైంది. ‘12 ఏళ్ల క్రితమే రూ.వంద కోట్లు వెచ్చించారు. ఈ వ్యవధిలో అన్నింటి ధరలూ పదిరెట్లు పెరిగాయి. ఈ పుష్కరాలకు రెట్టింపు యాత్రికులు వస్తారంటున్నదీ ప్రభుత్వమే. అలాంటప్పుడు ఆ వంద కోట్లు ఎలా సరిపోతాయి?’ అని గుంజాటన పడడమే వారి వంతైంది. పుష్కరాలకు కనీసం రూ.500 కోట్లయినా అవసరమని ఈ నెల 3న జరిగిన అధికారుల సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తామంటూనే నిధులను పరిమితం చేస్తోంది. ఆర్థిక మంత్రి యనమల అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ శుక్రవారం రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. పుష్కర నిధులకు ఆకాశమే హద్దన్న నోటితోనే యనమల వెంటనే పుష్కరాలకు టోకెన్ గ్రాంటుగా వంద కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం అందరినీ విస్మయపరిచింది. రెండు జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులు.. పుష్కరాలతో గోదావరి తీర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలన్న భావనతో రూ.1100 కోట్ల మేర ప్రతిపాదనలను రూపొందించి మంత్రుల కమిటీకి అందించారు. అయితే ‘నిధులు ఎంతైనా ఇస్తాం, పనులు పుష్కర యాత్రికులకు సదుపాయాలు కల్పించేవి మాత్రమే అయి ఉండాలి’ అంటూ ఆర్థిక మంత్రి నిబంధన పెట్టారు. కేంద్రం ఇస్తే మరింత ఖర్చు చేయగలం.. ‘గత పుష్కరాలకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.100 కోట్లు వెచ్చించాం. రూ.50 కోట్లు కేవలం రాజమండ్రిలోనే ఖర్చు చేశాం. ఈసారి నిధుల కొరత ఉంది. అయినా ఖర్చుకు వెనుకాడం. కేంద్రం నుంచి అదనపు నిధులు వస్తే మరింత ఎక్కువ ఖర్చు చేయగలం. గతంలో కేంద్రం పెద్దగా సహకారం అందించలేదు. ప్రముఖ దేవాలయాల ఆదాయం పుష్కరాల్లో భారీగా పెరుగుతుంది. అందువల్ల ఆలయాల అభివృద్ధికి వారి నిధులనే వెచ్చించాలి. పరిసరాల్లోని చిన్న ఆలయాల అభివృద్ధి వ్యయం కూడా అవే భరించాలి. ఇరిగేషన్ అధికారులు ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే డిమాండ్ల ఆధారంగా కాక అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఘాట్ల నిర్మాణం, పునర్నిర్మాణం చేయాలి. ప్రతిపాదనలు పుష్కరాలకు వర్తించేవా, కాదా అని కలెక్టర్లు పరిశీలించాకే నిధులు వస్తాయి’.. ఆర్థిక మంత్రి యనమల అధికారులకు చేసిన కర్తవ్యబోధ ఇది. కాగా ఇరిగేషన్, ఆర్అండ్బీ, దేవాదాయ తదితర శాఖల నుంచి, రాజమండ్రి నగరపాలక సంస్థ నుంచి ప్రతిపాదనలను కమిటీ స్వీకరించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సూచనలు తెలుసుకుంది. పుష్కరాలు శుభంగా జరగాలన్న సంకల్పంతో.. వేద పండితుల మంత్రపఠనంతో సమావేశం ప్రారంభించారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్లు నామన రాంబాబు, ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్ వర్మ, బలసాలి ఇందిర, లక్ష్మీ శివకుమారి, తూర్పుగోదావరి ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, చిర్ల జగ్గిరెడ్డి, వనమాడి వెంకటేశ్వర రావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ, పి.నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు, పశ్చిమగోదావరి ఎమ్మెల్యేలు కె.ఎస్.జవహర్, బూరుగుపల్లి శేషారావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, బండారు మాధవరాయుడు, ముప్పిడి వెంకటేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల్లో యాత్రికుల సౌకర్యం కోసం ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఎమ్మెల్సీ చైతన్యరాజు ఉచిత భోజనసదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. యాత్రికులకు అన్నదానం చేసే వారి వివరాలు, చేసే స్థలాలు ముందుగానే రిజిస్టరు చేసుకోవాలి. - నిమ్మకాయల చినరాజప్ప, ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అన్ని శాఖల అధికారులకు ఎవరు ఏం చేయాలో నిర్దేశించాం. గతం కంటే ఘనంగా పుష్కరాలు ఉంటాయి. అధికారుల ప్రతిపాదనలు తుది రూపు దాల్చి, కమిటీ ముందుకు వచ్చాక తుది కార్యాచరణ ఉంటుంది. - పి.నారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రాజమండ్రిలోరూ.4 కోట్లతో పర్యాటక శాఖ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తుంది. అది ఈసారి పుష్కరాలకు గుర్తుగా ఉండిపోతుంది. వీఐపీ, వీవీఐపీ భక్తుల కోసం కొవ్వూరు, రాజమండ్రిల్లో కొత్త ఘాట్లు నిర్మిస్తాం. - పైడికొండల మాణిక్యాలరావు, దేవాదాయ శాఖ మంత్రి మహిళా యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేయాలి. వారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. - పీతల సుజాత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పుష్కరాలకు ప్రధానవేదికైన రాజమండ్రిలో వద్ద గోదావరి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి. భక్తులకు సదుపాయాల కోసం నగరపాలక సంస్థ అంచనా వేసిన రూ.270 కోట్లు మంజూరు చేయాలి. - పంతం రజనీ శేషసాయి, మేయర్, రాజమండ్రి భక్తులు ఇబ్బంది లేకుండా నదీస్నానాలు చేసి, ఆలయ దర్శనం చేయగలిగితే పుష్కరాలు విజయవంతం అయినట్టే. మహిళలకు స్నాన ఘట్టాల దుస్తుల వూర్పిడికి వసతులు మెరుగు పరచాలి. రాజమండ్రిలో కోటిలింగాల రేవు నుంచి గోదావరి రోడ్డుతో పాటు నగరంలోని అన్న ఇరుకు రోడ్లలో ఆక్రమణలు తొలగించి వెడల్పు చేయాలి. ఖాళీ స్థలాల్లో భారీ టెంట్లు వేసి ప్రయాణికులకు విశ్రాంతి సదుపాయం కలగచేయాలి. - ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ, రాజమండ్రి జిల్లాలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు చాలా ఉన్నాయి. పుష్కరాల సందర్భంగా వాటిని తీర్చిదిద్దాలి. అందుకు సరిపడా నిధులు కేటాయించాలి. - జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట ఎమ్మెల్యే పుష్కరాల్లో పితృదేవతలకు పిండప్రదాన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకోసం వచ్చే భక్తులకు రవాణా, వసతి, భోజన సదుపాయాలు కల్పించేందుకు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ కార్యక్రమాలకు సామగ్రి కూడా ప్రభుత్వమే అందించాలి. - ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్యే, రాజమండ్రి సిటీ అధికారులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పనుల ప్రణాళికలు రూపొందించుకోవాలి. వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. - నీతూ కుమారి ప్రసాద్, కలెక్టర్, తూర్పుగోదావరి అన్ని శాఖల అధికారులతో సవిరంగా చర్చిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు రూపొందిస్తాం. - కాటమనేని భాస్కర్, కలెక్టర్, పశ్చిమగోదావరి -
వైభవంగా గోదావరి పుష్కరాలు
ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్: గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చేఏడాది జూలై 14 నుంచి ప్రారంభమయ్యే తొలి పుష్కరాలకు ముఖ్యఅతిథిగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ఇతర రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను అతిథులుగా ఆహ్వానించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పుష్కరాల వేళ అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకునేందుకు శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్యుల వద్దకు ప్రభుత్వ సలహా దారు కె.వి. రమణాచారి నేతృత్వంలో ఒక బృందాన్ని పంప నున్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, దేవాదాయశాఖ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు, టీఆర్ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు హాజరయ్యారు. శృంగేరీ, కంచి, ఇతర పీఠాధిపతులు, చినజీయర్‌స్వామి వంటి ఆధ్యాత్మిక గురువులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. 2 కోట్లకు పైగా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల తో ప్రవచనాలు ఇప్పించాలని, ధార్మిక, ఆధ్యాత్మిక, సాం స్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. గోదావరితీరంలోని ఆలయాలకు మరమ్మతులు చేపట్టాలన్నారు.