మెట్లను గమనించకే తొక్కిసలాట
- కమిషన్ ముందు పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది
- గోదావరి పుష్కర తొక్కిసలాటపై విచారణ 27కి వాయిదా
రాజమహేంద్రవరం క్రైం: ‘పుష్కర ఘాట్ గేటు నంబర్-1 వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ గోదావరి రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలనుంచి అధికంగా భక్తులు ఘాట్‌కు చేరుకోవడంతో వాటిని పీకివేశారు. దీంతో గేటు నంబర్-1ను తెరిచిన వెంటనే ముందున్న ఏడు మెట్లను గమనించని భక్తులు ఒకరిపై మరొకరు పడి తొక్కిసలాట జరిగింది’... ఇదీ గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ వద్ద 29 మంది మృతికి కారణమైన తొక్కిసలాటపై ప్రభుత్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు ఇచ్చిన వివరణ.
తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో విచారణ నిర్వహించింది. దీనికి హాజరైన ప్రభుత్వ న్యాయవాది చింతపెంట.. పుష్కరాలప్పుడు ప్రభుత్వశాఖలు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, తొక్కిసలాట తర్వాత గాయపడిన వారికందించిన వైద్యసేవల్ని తెలియజేస్తూ తొక్కిసలాట జరగడానికి మెట్లను భక్తులు గమనించకపోవడమే కారణమన్నట్టు చెప్పుకొచ్చారు. అనంతరం విచారణను జస్టిస్ సోమయాజులు ఈ నెల 27కి వాయిదా వేశారు. కాగా, ప్రభుత్వ శాఖలు పూర్తి ఆధారాలు సమర్పించకుండా కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయని మానవ హక్కుల నేత ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు.