State Department
-
హజ్ యాత్ర మృతుల్లో... 98 మంది భారతీయులు
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ యాత్రకు వెళ్లిన భారతీయుల్లో 98 మంది చనిపోయినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. గత ఏడాది హజ్ యాత్ర సమయంలో మొత్తం 187 మంది భారతీయులు చనిపోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్«దీర్ జైశ్వాల్ వివరించారు. ‘ఈ ఏడాది మే 9 నుంచి జూలై 22వ తేదీ వరకు జరగాల్సిన హజ్ యాత్రలో 1.75 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 98 మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలన్నీ దీర్ఘకాలిక అనారోగ్యం, వృద్ధాప్యం వంటి సహజ కారణాలతో సంభవించినవే. అరాఫత్ రోజున ఆరుగురు మరణించారు. ప్రమాదాల్లో మరో నలుగురు చనిపోయారు’’ అని జైస్వాల్ మీడియాకు వివరించారు. -
వీసా దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, తాత్కాలిక వృత్తిదారులు(టెంపరరీ వర్కర్స్)కిచ్చే కొన్ని రకాల నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తినిపుణు(స్పెషలిజం ఆక్యుపేషన్)లకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. -
అమెరికా వీసా కావాలంటే 1000 రోజులు
న్యూఢిల్లీ: రోజురోజుకీ అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. అమెరికా బిజినెస్ (బీ–1), టూరిస్ట్ (బీ–2) వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయంతొలిసారిగా వేయి రోజులకు చేరింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది. ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్‌వాసులు 994 రోజులు, ఢిల్లీ 961 రోజులు, చెన్నై 948 రోజులు, కోల్‌కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి చెప్పారు. అత్యవసరంగా ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే అపాయింట్మెంట్ వెంటనే ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో అడ్మిషన్లు ఉండటంతో విద్యార్థి వీసాలు మంజూరుకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర వీసాల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది. -
హెచ్1బీ పరిమితి : అలాంటిదేమీ లేదు
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాలపై పరిమితులు విధించేందుకు అమెరికా ప్రభుత్వం యోచిస్తోందన్న అంచనాలపై ట్రంప్ సర్కార్ స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి పరిమితులు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. డేటా స్థానికీకరణ అడిగే దేశాలపై హెచ్ 1 బీ వీసాలపై పరిమితులు విధించాలనే ప్రణాళికలేవీ లేవని ప్రకటించింది. హెచ్ -1 బి వీసీ ప్రోగ్రామ్‌తో, వర్క్ వీసా జారీ ప్రక్రియను విస్తృతంగా సమీక్షించాలని యోచిస్తున్నప్పటికీ ఇది ఒక నిర్దిష్ట దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని విదేశాంగ ప్రతినిధి తెలిపారు. నిక్షిప్తమైన డేటాకు సంబంధించి ఇండియాతో చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి...కానీ అది వీసాలపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆమె వెల్లడించారు. దేశంలోని చెల్లింపుల కంపెనీలన్నీ ఇక్కడే తమ వినియోగదార్ల సమాచారాన్ని నిల్వ చేయడాన్ని గతేడాది భారత్ తప్పనిసరి చేసింది. అయితే అందుకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని కొన్ని అమెరికా కంపెనీలు ఆ నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో అమెరికా మన భారతీయ ఐటీ నిపుణులు ఆ దేశంలో పనిచేయడానికి వీలు కల్పించే హెచ్1-బీ వీసాలపై పరిమితులు విధించాలని భావించినట్లు బుధవారం మీడియా నివేదికలు ఆందోళనలు రేపాయి. దీనిపై గురువారం ట్రంప్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. -
'పాస్ పోర్ట్' ఫోటోకు కొత్త నిబంధనలు..
అమెరికాః పాస్ పోర్ట్ కోసం ఫోటో తీసుకోవడం అంటేనే ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందే ఉన్న నియమ నిబంధనలకు తోడు కొత్తగా పాస్ పోర్టుకోసం ధరఖాస్తు చేసేవారికి అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ మరిన్ని నిబంధనలను అమల్లోకి తెస్తోంది. పాస్ పోర్ట్ కోసం అప్లై చేసేముందు.. దానికి జత పరిచే ఫోటోలు కళ్ళజోడు లేకుండా తీయించుకోవాలన్న కొత్త ఆంక్షను పెట్టింది. పాస్ పోర్టు జారీలో అనవసరమైన ఆలస్యాన్ని నిరోధించేందుకు ఈ నిబంధనను అమల్లోకి తెస్తోంది. పోటో అనగానే చిరునవ్వులు చిందించడం, రకరకాల భంగిమలను ప్రదర్శించడం చేస్తారు. అయితే పాస్ పోర్ట్ ధరఖాస్తుకు జతపరిచే ఫోటోల్లో కెమెరా ముందు ఎటువంటి విపరీత హావభావాలు ప్రదర్శించకూడదు. అలాగే ఫోటో సైజు విషయంలోనూ ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాత నిబంధనలకు తోడు తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కళ్ళజోడు పెట్టుకొని ఫోటో తీయించుకోకూడదన్న నిబంధనను జోడించింది. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. గతేడాది ఏజెన్సీకి సుమారు 2,00,000 మంది వినియోగదారులు సమర్పించిన ఫోటోల్లో ఎన్నో నాణ్యతా లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా వాటిలో కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల నీడలు, గీతలు వంటి సమస్యలు వస్తున్నాయని, దాంతో అటు ఏజెన్సీకి, ఇటు జెట్ సెట్టర్స్ ప్రాసెసింగ్ కు తీవ్రంగా ఆలస్యం అవుతున్నట్లు తెలిపింది. ఈయేడు స్టేట్ డిపార్ట్ మెంట్ నుంచి సుమారు 20 మిలియన్ల వరకూ పాస్ పోర్టులు జారీ చేయాల్సి రావచ్చని, దీంతో అనవసరమైన ఆలస్యాన్ని తప్పించుకునేందుకు ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. పాస్ పోర్ట్ ఫోటోలో మార్పులకోసం తెచ్చిన కొత్త నిబంధనల్లో అత్యవసర పరిస్థితులకు స్టేట్ డిపార్ట్ మెంట్ కొంత సడలింపు ఇచ్చింది. అత్యవసర ప్రయాణాలు, వైద్య పరమైన సమస్యల వంటి అరుదైన పరిస్థితుల్లో మాత్రం పాస్ పోర్ట్ ఫోటోకు కళ్ళద్దాలను అనుమతిస్తామని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. అయితే అలాంటి సందర్భాల్లో పాస్ పోర్ట్ అప్లికేషన్ కు తప్పనిసరిగా వైద్య నిపుణులు అందించిన మెడికల్ సర్టిఫికెట్ కూడా జత చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఇప్పటికే ఉన్న పాస్ట్ పోర్లుల విషయంలో కళ్ళజోడు ప్రశ్న లేదని, ఇకపై కొత్తగా ధరఖాస్తు చేసుకునేవారు మాత్రం ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్ మెంట్ సూచించింది. -
మెట్లను గమనించకే తొక్కిసలాట
- కమిషన్ ముందు పేర్కొన్న ప్రభుత్వ న్యాయవాది - గోదావరి పుష్కర తొక్కిసలాటపై విచారణ 27కి వాయిదా రాజమహేంద్రవరం క్రైం: ‘పుష్కర ఘాట్ గేటు నంబర్-1 వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ గోదావరి రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాలనుంచి అధికంగా భక్తులు ఘాట్‌కు చేరుకోవడంతో వాటిని పీకివేశారు. దీంతో గేటు నంబర్-1ను తెరిచిన వెంటనే ముందున్న ఏడు మెట్లను గమనించని భక్తులు ఒకరిపై మరొకరు పడి తొక్కిసలాట జరిగింది’... ఇదీ గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ వద్ద 29 మంది మృతికి కారణమైన తొక్కిసలాటపై ప్రభుత్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు ఇచ్చిన వివరణ. తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథిగృహంలో విచారణ నిర్వహించింది. దీనికి హాజరైన ప్రభుత్వ న్యాయవాది చింతపెంట.. పుష్కరాలప్పుడు ప్రభుత్వశాఖలు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, తొక్కిసలాట తర్వాత గాయపడిన వారికందించిన వైద్యసేవల్ని తెలియజేస్తూ తొక్కిసలాట జరగడానికి మెట్లను భక్తులు గమనించకపోవడమే కారణమన్నట్టు చెప్పుకొచ్చారు. అనంతరం విచారణను జస్టిస్ సోమయాజులు ఈ నెల 27కి వాయిదా వేశారు. కాగా, ప్రభుత్వ శాఖలు పూర్తి ఆధారాలు సమర్పించకుండా కమిషన్‌ను తప్పుదోవ పట్టిస్తున్నాయని మానవ హక్కుల నేత ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు. -
అర కోటి దాటిన బీజేపీ సభ్యత్వాలు
ట్వీట్ చేసిన అమిత్ షా... రాష్ట్ర శాఖకు అభినందనలు ముంబై: రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా బీజేపీ సభ్యత్వం ఇచ్చినట్లు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ శాఖను అభినందిస్తూ ట్వీట్ చేశారు. గత నవంబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ మొదటి సభ్యత్వం తీసుకుని... సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్చి 31 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించిన 10 కోట్ల బీజేపీ సభ్యత్వాల్లో ఇప్పటికే 5 కోట్లు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీగా ఆవిర్భవించాలనే లక్ష్యంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సభ్యత్వ నమోదు గురించి ప్రచారం చేస్తూ బీజేపీ చీఫ్, ఇతర నేతలు దేశమంతా తిరుగుతున్నారు. ఇది మార్చి 31 వరకు కొనసాగుతుంది.