గోదావరి.. తెలుగువారి జీవనాడి
పుష్కరాలను తెలుగువారు పండుగలా జరుపుకోవాలి
భక్తులపై ఆర్టీసీ బస్సుల్లో సర్‌ఛార్జి ఉండదు
రైల్వే వ్యవస్థనూ తగ్గించాలని కోరుతున్నాం
అన్ని మతాల అనుసంధానానికే పుష్కర శోభాయాత్ర
మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
రాజమండ్రి: గోదావరి నదికి తెలుగు ప్రజలతో అవినాభావ సంబంధం ఉందని, ఇది తెలుగువారి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలను మంగళవారం ఉదయం 6.26 గంటలకు ప్రారంభిస్తామని, తాను కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరిస్తానని చెప్పారు. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలను తెలుగువారు ప్రతి ఒక్కరూ దీనిని పవిత్రమైన పర్వంలా నిర్వహించుకోవాలని కోరారు. గోదావరి నీటిని రాష్ట్రమంతటా అందించగలిగితే సంపద సృష్టించవచ్చన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక సమస్యలు వచ్చినా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే నిధులు ఎక్కువగా కేటాయించినట్లు చెప్పారు. గడువు సమీపించడంతో చాలా అభివృద్ధి పనులు కొలిక్కి రాలేదని, వాయిదా పడిన పనులన్నీ పుష్కరాల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పుష్కరస్నానం ఆచరించడానికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఆర్టీసీ బస్సుల్లో సర్‌చార్జి వేయబోమని స్పష్టం చేశారు. అలాగే సర్‌చార్జి వేయవద్దని రైల్వే శాఖను కూడా కోరుతున్నట్లు తెలిపారు. భక్తుల మన్ననలు పొందేలా సేవలందించిన వారికి పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ నెల 26న అభినందన సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి నదితో అన్ని మతాలవారినీ అనుసంధానం చేసేందుకే పుష్కర శోభాయాత్ర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ఈ నెల 16న రాజమండ్రి చేరుతుందని సీఎం చెప్పారు.
ప్రాధాన్య అంశాలపై చర్చావేదికలు
రాష్ట్రానికి సంబంధించి ఐటీ, జలవనరులు, సాంకేతిక విద్య తదితర ముఖ్య విషయాలపై రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో చర్చా వేదికలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపా రు. ఈ నెల 15 నుంచి 25 వరకూ ప్రతి రోజూ ఒక్కో అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో నిర్వహించే ఈ చర్చాగోష్టులకు ఒక్కో మంత్రి చొప్పున ఆధ్వర్యం వహిస్తారని చెప్పారు. ప్రఖ్యాత ఇంజనీరు కేఎల్ రావు జయంతి సందర్భంగా ఈ నెల 16న జలవనరులపై నిర్వహించే చర్చావేదికలో తనతోపాటు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ నెల 20న మౌలిక వసతులపై జరిగే చర్చాగోష్టిలో సింగపూర్ బృందం కూడా పాల్గొంటుందని వెల్లడించారు.
కుటుంబ సమేతంగా..
సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి వరకూ విస్తరించిన నాలుగు లేన్ల రహదారిని ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పుష్కర భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్తూ మార్గమధ్యంలో కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఆగి, రాష్ట్రంలోని 12 ప్రముఖ ఆలయాల నమూనాలను ఆవిష్కరించారు.