The railway system
-
ప్రాజెక్టులు సరే..పైసలేవి ప్రభు!
►మౌలిక వసతులతోపాటు రైళ్ల వేగం రెట్టింపు చేస్తామన్న మంత్రి ►ఉద్యోగుల జీతాలు పెంచితే రైల్వేపై రూ.30 వేల కోట్ల భారం ►ప్రయాణ, సరుకు రవాణా చార్జీలు యథాతథం ►మరి నిధులు ఎక్కడ్నుంచి తెస్తారంటున్న నిపుణులు ►కష్టకాలం అంటూనే.. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రకటన న్యూఢిల్లీ ‘‘భారత రైల్వే వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ప్రస్తుతం అత్యంత కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది..’’ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించిన నిష్టుర సత్యమిది! మరి బడ్జెట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించిందా? మంత్రి ప్రతిపాదనలు రైల్వేను పట్టాలెక్కించే విధంగానే ఉన్నాయా? కొందరు నిపుణులు మాత్రం బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొంటున్నారు. ఓవైపు డబ్బులు లేవంటూనే.. మరోవైపు కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించడాన్ని చూస్తుంటే మంత్రి నేల విడిచి సాము చేసినట్టుగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు కొత్త ఊపిరులూదుతామని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్న మంత్రి.. బడ్జెట్లో అందుకు కావాల్సిన ఆదాయ మార్గాలను స్పష్టంగా చూపలేదు. భారత రైల్వేల ద్వారా ఏటా 700 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. 100 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తోంది. వీటిద్వారా గణనీయమైన ఆదాయం సాధిస్తామని కిందటేడాది బడ్జెట్లో ప్రకటించారు. కానీ ఆ మేరకు ఆదాయం ఆర్జించలేదు. ఈసారి బడ్జెట్లో ప్రయాణికుల చార్జీల ద్వారా అదనంగా 12.4 శాతం ఆదాయాన్ని పొందుతామని, కిందటేడాది కన్నా అదనంగా మరో 5 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తామని మంత్రి చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ పరిమిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ రద్దీ మార్గాల్లో సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త రైళ్లను ప్రకటించడంలో సంయమనం పాటించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీన్ దయాల్ కోచ్‌లు, ఉదయ్ పేరుతో డబుల్ డెక్కర్ సర్వీసులను ప్రకటించడం కేవలం ప్రయాణికులను సంతృప్తిపరిచేందుకే అని అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుతం గంటకు 30 కి.మీ. ఉన్న రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేస్తామని, అందుకు 2,800 కి.మీ. మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు. వీటితోపాటు రైళ్లు, రైల్వే స్టేషన్లలో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వీటన్నింటికీ భారీగా నిధులు కావాలి. అదీగాకుండా ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం 13 లక్షల రైల్వే ఉద్యోగులకు జీతాలు పెంచితే రూ.30 వేల కోట్ల భారం పడుతుంది. రైల్వే వ్యవస్థ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన మంత్రి.. వీటన్నింటికీ ఎక్కడ్నుంచి నిధులు తెస్తారన్న అంశాన్ని మంత్రి స్పష్టంగా చెప్పలేదు. అటు ప్రయాణికుల చార్జీలు, సరు రవాణా చార్జీలను ఏమాత్రం ముట్టుకోకుండా ఇంత పెద్దఎత్తున నిధులు ఎక్కడ్నుంచి తెస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
గోదావరి.. తెలుగువారి జీవనాడి
పుష్కరాలను తెలుగువారు పండుగలా జరుపుకోవాలి భక్తులపై ఆర్టీసీ బస్సుల్లో సర్‌ఛార్జి ఉండదు రైల్వే వ్యవస్థనూ తగ్గించాలని కోరుతున్నాం అన్ని మతాల అనుసంధానానికే పుష్కర శోభాయాత్ర మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి: గోదావరి నదికి తెలుగు ప్రజలతో అవినాభావ సంబంధం ఉందని, ఇది తెలుగువారి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభివర్ణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలను మంగళవారం ఉదయం 6.26 గంటలకు ప్రారంభిస్తామని, తాను కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరిస్తానని చెప్పారు. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలను తెలుగువారు ప్రతి ఒక్కరూ దీనిని పవిత్రమైన పర్వంలా నిర్వహించుకోవాలని కోరారు. గోదావరి నీటిని రాష్ట్రమంతటా అందించగలిగితే సంపద సృష్టించవచ్చన్నారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక సమస్యలు వచ్చినా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే నిధులు ఎక్కువగా కేటాయించినట్లు చెప్పారు. గడువు సమీపించడంతో చాలా అభివృద్ధి పనులు కొలిక్కి రాలేదని, వాయిదా పడిన పనులన్నీ పుష్కరాల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పుష్కరస్నానం ఆచరించడానికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఆర్టీసీ బస్సుల్లో సర్‌చార్జి వేయబోమని స్పష్టం చేశారు. అలాగే సర్‌చార్జి వేయవద్దని రైల్వే శాఖను కూడా కోరుతున్నట్లు తెలిపారు. భక్తుల మన్ననలు పొందేలా సేవలందించిన వారికి పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ నెల 26న అభినందన సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. గోదావరి నదితో అన్ని మతాలవారినీ అనుసంధానం చేసేందుకే పుష్కర శోభాయాత్ర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ఈ నెల 16న రాజమండ్రి చేరుతుందని సీఎం చెప్పారు. ప్రాధాన్య అంశాలపై చర్చావేదికలు రాష్ట్రానికి సంబంధించి ఐటీ, జలవనరులు, సాంకేతిక విద్య తదితర ముఖ్య విషయాలపై రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో చర్చా వేదికలు నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపా రు. ఈ నెల 15 నుంచి 25 వరకూ ప్రతి రోజూ ఒక్కో అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో నిర్వహించే ఈ చర్చాగోష్టులకు ఒక్కో మంత్రి చొప్పున ఆధ్వర్యం వహిస్తారని చెప్పారు. ప్రఖ్యాత ఇంజనీరు కేఎల్ రావు జయంతి సందర్భంగా ఈ నెల 16న జలవనరులపై నిర్వహించే చర్చావేదికలో తనతోపాటు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అలాగే ఈ నెల 20న మౌలిక వసతులపై జరిగే చర్చాగోష్టిలో సింగపూర్ బృందం కూడా పాల్గొంటుందని వెల్లడించారు. కుటుంబ సమేతంగా.. సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రాజమండ్రి వరకూ విస్తరించిన నాలుగు లేన్ల రహదారిని ప్రారంభించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పుష్కర భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి పుష్కర ఘాట్‌కు వెళ్తూ మార్గమధ్యంలో కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద ఆగి, రాష్ట్రంలోని 12 ప్రముఖ ఆలయాల నమూనాలను ఆవిష్కరించారు. -
రాష్ట్రంలో ‘రైల్వే’ అభివృద్ధి కోసం వినతి
మార్కాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని గుంటూరు డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత, మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఆదివారం బెంగళూరులో రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. గుంటూరు-గుంతకల్ మధ్య డబుల్ లైన్ పనులు వేగవంతం చేయాలని, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. కర్నూలు-విజయవాడ వయా మార్కాపురం మీదుగా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలని, గుంటూరు-హైదరాబాద్ మధ్య ఫాస్ట్ పాసింజర్ రైలు తేవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విజయవాడ-ముంబయి వయా నంద్యాల మీదుగా సూపర్‌ఫాస్ట్ రైలు నడపాలని, మార్కాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని మంత్రికి విన్నవించినట్లు వివరించారు. మార్కాపురం-గుంతకల్ మధ్య విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. మార్కాపురం రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకారం అందిస్తానని సదానందగౌడ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మార్కాపురం-శ్రీశైలం మధ్య రైల్వేలైన్ ఏర్పాటు విషయాన్ని కూడా తాము మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నీటి సంఘం అధ్యక్షులు గుంటక వెలుగొండారెడ్డి, మొగుళ్లూరి మల్లికార్జునరావు, కొప్పరపు శ్రీనివాసరావు, గొట్టం నాగార్జునరెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు.