మార్కాపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని గుంటూరు డివిజన్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నేత, మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఆదివారం బెంగళూరులో రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడారు.
గుంటూరు-గుంతకల్ మధ్య డబుల్ లైన్ పనులు వేగవంతం చేయాలని, మచిలీపట్నం-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను రోజూ నడపాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. కర్నూలు-విజయవాడ వయా మార్కాపురం మీదుగా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ నడపాలని, గుంటూరు-హైదరాబాద్ మధ్య ఫాస్ట్ పాసింజర్ రైలు తేవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. విజయవాడ-ముంబయి వయా నంద్యాల మీదుగా సూపర్‌ఫాస్ట్ రైలు నడపాలని, మార్కాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని మంత్రికి విన్నవించినట్లు వివరించారు.
మార్కాపురం-గుంతకల్ మధ్య విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయని మంత్రి తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. మార్కాపురం రైల్వేస్టేషన్ అభివృద్ధికి సహకారం అందిస్తానని సదానందగౌడ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. మార్కాపురం-శ్రీశైలం మధ్య రైల్వేలైన్ ఏర్పాటు విషయాన్ని కూడా తాము మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నీటి సంఘం అధ్యక్షులు గుంటక వెలుగొండారెడ్డి, మొగుళ్లూరి మల్లికార్జునరావు, కొప్పరపు శ్రీనివాసరావు, గొట్టం నాగార్జునరెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు.
రాష్ట్రంలో ‘రైల్వే’ అభివృద్ధి కోసం వినతి
Published Mon, Jun 9 2014 1:41 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement