ప్రాజెక్టులు సరే..పైసలేవి ప్రభు!
►మౌలిక వసతులతోపాటు రైళ్ల వేగం రెట్టింపు చేస్తామన్న మంత్రి
►ఉద్యోగుల జీతాలు పెంచితే రైల్వేపై రూ.30 వేల కోట్ల భారం
►ప్రయాణ, సరుకు రవాణా చార్జీలు యథాతథం
►మరి నిధులు ఎక్కడ్నుంచి తెస్తారంటున్న నిపుణులు
►కష్టకాలం అంటూనే.. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ప్రకటన
న్యూఢిల్లీ ‘‘భారత రైల్వే వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. ప్రస్తుతం అత్యంత కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది..’’ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించిన నిష్టుర సత్యమిది! మరి బడ్జెట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించిందా? మంత్రి ప్రతిపాదనలు రైల్వేను పట్టాలెక్కించే విధంగానే ఉన్నాయా? కొందరు నిపుణులు మాత్రం బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొంటున్నారు. ఓవైపు డబ్బులు లేవంటూనే.. మరోవైపు కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించడాన్ని చూస్తుంటే మంత్రి నేల విడిచి సాము చేసినట్టుగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. రైల్వేకు కొత్త ఊపిరులూదుతామని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామన్న మంత్రి.. బడ్జెట్‌లో అందుకు కావాల్సిన ఆదాయ మార్గాలను స్పష్టంగా చూపలేదు. భారత రైల్వేల ద్వారా ఏటా 700 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. 100 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తోంది. వీటిద్వారా గణనీయమైన ఆదాయం సాధిస్తామని కిందటేడాది బడ్జెట్‌లో ప్రకటించారు. కానీ ఆ మేరకు ఆదాయం ఆర్జించలేదు. ఈసారి బడ్జెట్‌లో ప్రయాణికుల చార్జీల ద్వారా అదనంగా 12.4 శాతం ఆదాయాన్ని పొందుతామని, కిందటేడాది కన్నా అదనంగా మరో 5 కోట్ల టన్నుల సరుకును రవాణా చేస్తామని మంత్రి చెప్పారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి ఈ పరిమిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కానీ రద్దీ మార్గాల్లో సాధారణ ప్రయాణికుల కోసం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ వంటి కొత్త రైళ్లను ప్రకటించడంలో సంయమనం పాటించలేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీన్ దయాల్ కోచ్‌లు, ఉదయ్ పేరుతో డబుల్ డెక్కర్ సర్వీసులను ప్రకటించడం కేవలం ప్రయాణికులను సంతృప్తిపరిచేందుకే అని అభిప్రాయపడుతున్నారు.
అలాగే ప్రస్తుతం గంటకు 30 కి.మీ. ఉన్న రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేస్తామని, అందుకు 2,800 కి.మీ. మార్గాన్ని నిర్మిస్తామని చెప్పారు. వీటితోపాటు రైళ్లు, రైల్వే స్టేషన్లలో పెద్దఎత్తున మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వీటన్నింటికీ భారీగా నిధులు కావాలి. అదీగాకుండా ఏడో వేతన సవరణ కమిషన్ సిఫారసుల ప్రకారం 13 లక్షల రైల్వే ఉద్యోగులకు జీతాలు పెంచితే రూ.30 వేల కోట్ల భారం పడుతుంది. రైల్వే వ్యవస్థ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పిన మంత్రి.. వీటన్నింటికీ ఎక్కడ్నుంచి నిధులు తెస్తారన్న అంశాన్ని మంత్రి స్పష్టంగా చెప్పలేదు. అటు ప్రయాణికుల చార్జీలు, సరు రవాణా చార్జీలను ఏమాత్రం ముట్టుకోకుండా ఇంత పెద్దఎత్తున నిధులు ఎక్కడ్నుంచి తెస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.