
పుష్కర బస్‌చార్జీలను తగ్గించాలని ఆందోళన
హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాలకు వెళ్లే బస్సుల చార్జీలను తగ్గించాలని బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్‌భవన్ ముందు సోమవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా నిధులు విడుదల చేసిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి కొమ్ముకాసే కాంట్రాక్టర్లు పనులు దక్కించుకొని ఆ నిధులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప ఇంతవరకు పనులను పూర్తి చేయలేదని విమర్శించారు.
భక్తులకు అరకొర సౌకర్యాలు కల్పించారన్నారు. సీఎం కేసీఆర్ ఒక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనిపై హిందూ సమాజానికి సమాధానం చెప్పాలన్నారు. పక్క రాష్ట్రాలు బస్సు చార్జీలు తగ్గిస్తుంటే ఇక్కడి సీఎం మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, నాగూరావునామాజీ, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.