ఎనిమిదో రోజు 30 లక్షలు
గత నాలుగు రోజులతో పోలిస్తే తెలంగాణలో తగ్గిన రద్దీ
ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు
నెట్‌వర్క్: గోదావరి పుష్కరాలకు ఎనిమిదో రోజూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చారు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ప్రధాన పుణ్య క్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం, బాసర, భద్రాచలానికి భక్తుల తాకిడి తగ్గింది. సాధారణ భక్తులు గంటలోపే ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామిని సందర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి 4 గంటలు, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనానికి 3 గంటలు, బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కరీంనగర్‌లో అత్యధికంగా 11.32 లక్షల మంది పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుష్కర స్నానం చేశారు.
కోటిలింగాల పుష్కర ఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యువజన అధ్యక్షుడు వేణుమాధవరావు పుష్కర స్నానమాచరించి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. సుందిల్ల ఘాట్ వద్ద వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పుష్కర స్నానం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోన్ పుష్కర ఘాట్‌లో 1.4 లక్షల మంది స్నానాలు ఆచరించారు. నిజామాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న ఓ ఆటో బాసరా గోదారి వంతెన సమీపంలో అగ్ని ప్రమాదానికి గురవడంతో భక్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. గోదావరిఖనిలో పుష్కర స్నానానికి వెళ్లి సుంకె ప్రసాద్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. గోదావరి ఎగువ ప్రాంతం, ఏటూరు నాగారం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో వరంగల్‌లోని ఘాట్ల వద్ద నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టె ఘాట్ల వద్ద ఇప్పటివరకు 13 లక్షల మంది స్నానాలు ఆచరించారు. మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి దంపతులు మంగపేటలో పుష్కరస్నానం ఆచరించారు.