ముక్కోటి దాటింది..
ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు
ప్రధాన క్షేత్రాల్లోనూ తొందరగానే దర్శనం
ఏపీలో మంగళవారం తగ్గిన పుష్కర భక్తులు
రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర గోదావరిలో ముక్కోటి మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. భక్తజనం ఎక్కువవుతుండటంతో పుష్కరాలకు మరో 4 రోజు లుండగానే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మంగళవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. కోటి లింగాల రేవు, పుష్కర ఘాట్‌లు మినహా మిగిలిన ఘాట్లలో తెల్లవారుజాము నుంచే పెద్దగా ర ద్దీ కనిపించలేదు. అలాగే సరస్వతీ (వీఐపీ) ఘాట్‌కు వచ్చే వీఐపీల తాకిడి కూడా తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 47 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 34,03,457 మంది భక్తులు మాత్రమే పుణ్య స్నానాలను ఆచరించారు.
తూర్పున 24,06,858 మంది, పశ్చిమలో 10,86,201 మంది పుష్కర స్నానమాచరించారు. తూర్పులో లక్ష మంది, పశ్చిమలో 70 వేలమంది వరకు భక్తులు పుష్కరస్నానాల కోసం ఇంకా వేచి ఉన్నారు. దీంతో ఇప్పటివరకు ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 3,09,42, 618కు చేరింది. రాజమండ్రి అర్బన్ పరిధిలోని ఘాట్‌లలో 1,17,62,323 మంది పుష్కర స్నానం చేయగా, తూర్పుగోదావరిలోని గ్రామీణ ఘాట్‌లలో 93,78,081 మంది, పశ్చిమలో మరో 98,02,214 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.