అక్షరాలా అరకోటి!
పదో రోజు పుష్కరాలకు పోటెత్తిన జనం
- మహబూబ్‌నగర్‌లో 37 లక్షలు, నల్లగొండలో 13 లక్షల మంది స్నానాలు
సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా తీరం జనసంద్రమైంది. ఆది వారం సెలవు రోజు కావడం, మరో రెండ్రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో జనం పోటెత్తారు. వరుసగా 10వ రోజు భక్తులతో ఘాట్లు కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో 50 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 37 లక్షలకుపైగా స్నానాలు చేశారు. నల్లగొండ జిల్లాలో 13 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారి పుష్కర యాత్రికుల వాహనాలతో కిక్కిరిసిపోయింది.
పాలమూరు జిల్లాలో రంగాపూర్‌లో 9.5 లక్షలు, నది అగ్రహారంలో 8.57 లక్షలు, బీచుపల్లిలో 6.5 లక్షలు, సోమశిలలో 5.91 లక్షలు, గొందిమళ్లలో 3.15 లక్షలు, పాతాళగంగలో 1.55 లక్షలు, పస్పులలో 1.5 లక్షలు, కృష్ణ ఘాట్‌లో 1.52 లక్షల మంది స్నానాలు ఆచరించారు. అయితే నీటిమట్టం తగ్గడం వల్ల పలుచోట్ల స్నానాలకు అవకాశం లేకపోవడంతో అధికారులు భక్తులను మునగాన్‌దిన్నె, బూడిదపాడు, పంచదేవ్‌పహాడ్, గుమ్మడం, జటప్రోలు, క్యాతూర్, పాతాళగంగ ఘాట్లకు తరలించారు. నీటిమట్టం తగ్గడంతో ఆదివారం జూరాల పుష్కరఘాట్‌ను మూసివేశారు. మరోవైపు జనం తండోపతండాలుగా కదలడంతో షాబాద్ నుంచి అలంపూర్ వరకు వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. సోమశిల, కొల్లాపూర్ ప్రధాన రహదారి జనసంద్రంగా మారడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా వాహనాలను క్రమబద్ధీకరించారు. బీచుపల్లిలో సినీనటుడు సునీల్ పుష్కర స్నానం చేశారు.
నల్లగొండలో జనమే జనం..
నల్లగొండ జిల్లాలోని 28 ఘాట్లలో 13 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. వాడపల్లిలో తెలంగాణ అమరవీరులకు పిండ ప్రదానం చేశారు.
నదిలో పడి బాలుడి మృతి..
నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిన్నమునిగల్‌లో విషాద కర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముత్తినేని లక్ష్మణ్, సుధారాణి దంపతులు పుష్కర స్నానం ఆచరించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరి పెద్దకుమారుడు హార్థిక్ (12) ప్రమాదవశాత్తు నదిలోని ఓ గుంతలో పడిపోయాడు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మరోవైపు పెదవూరం మండలం సంగారం స్టేజీ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, మినీ బస్సు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో బెలూన్లు తెరచుకోవడంతో డ్రైవర్‌కు స్వల్పగాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదు.
బలవంతంగా టోల్ వసూలు
షాద్‌నగర్/అడ్డాకుల: పుష్కరాలకు వెళ్లే జనంతో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా, అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరుసార్లు రాయికల్ టోల్‌గేట్లను ఎత్తివేశారు. కానీ శాఖాపూర్ వద్ద బలవంతంగా టోల్ వసూలు చేశారు.