ఉత్కళ ‘పుష్కరం’
గోదావరి పుష్కరాల నేపథ్యంలో 12 రోజులపాటు భక్తజనంతో వెల్లువెత్తిన రాజమండ్రి పుష్కరఘాట్.. సోమవారం మళ్లీ ఆ రోజులను తలపించింది. ఒడిశా నుంచి 50 బస్సుల్లో తరలివచ్చిన వేలాదిమంది భక్తులతో ఘాట్‌కు తిరిగి ‘పుష్కర కళ’ వచ్చింది. ఒడిశాలోని బరంపురం, బాలేశ్వరం, జయపూర్, నవరంగ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భాష, ప్రాంతం వేరయినా అంతరంగాలు, ఆచారాల్లో తేడా లేదని చాటుతూ పుష్కరస్నానాలు, పిండప్రదానాలు చేశారు.
ఇతర తీర్థవిధులను నిర్వహించారు. ఒడిశా నుంచి వచ్చిన పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ ఏడాదంతా పుష్కరాలేనని, సోమవారం తమ ఆచారాల ప్రకారం ‘యోగదినం’ కావడంతో గోదావరికి తరలి వచ్చామని పురోహితుడు విజయచంద్రదాస్ తెలిపారు. కాగా ఒడిశా భక్తులు వేలాదిగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్నీ దర్శించి, పిండప్రదానాది విధులు నిర్వర్తించారు. - రాజమండ్రి కల్చరల్