నేడే ఆఖరు
చివరి రోజు భక్తజనం భారీగా తరలివచ్చే అవకాశం
హాజరుకానున్న డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎంపీ కవిత
11వ రోజు 2 లక్షల మంది పుష్కర స్నానాలు
జల, జన కళతో మురిసిన గోదావరి
ములుగు : పుష్కర స్నానానికి పోటెత్తిన భక్తులను చూసి గోదావరి పులకించింది. అంచనాలకు మించి వచ్చిన జనం కోసం స్వయంగా ఒక్క అడుగుముందుకేసిందా అన్నట్లు శుక్రవారం నీటిమట్టం పెరిగింది. ఈ మేరకు నదిలో ఇదివరకు ఏర్పాటు చేసిన హెచ్చరిక కంచెలను శుక్రవారం అధికారులు మరింత ముందుకు తీసుకొచ్చారు. పది రోజుల వరకు నదీతీరాల వరకు వెళ్లిన భక్తులు శుక్రవారం ఘాట్‌లకు సమీపంలోనే పుష్కర స్నానాలు ఆచరించారు. నది నీళ్లు మురికిగా ఉండడంతో పుణ్యస్నానాల అనంతరం భక్తులు షవర్ల కిందికి చేరుకుని మళ్లీ స్నానాలు చేశారు. పిండప్రదానాలకు సరైన స్థలం లేక భృక్తులు ఇబ్బందులు పడ్డారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఘాట్‌లలో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. మంగపేట ఘాట్ చుట్టూ ఖాళీ గుంతల్లో భారీగా నీళ్లు చేరాయి. ఫైర్, పంచాయతీరాజ్ అధికారులు ఇంజన్ల ద్వారా గోదావరిలోకి మళ్లించారు. మంగపేట ఘాట్‌కు వెళ్లే ప్రైవేట్ వాహనాలను అధికారులు మంగపేట సమీపంలో జామాయిల్‌తోటలో నిలిి వేశారు. ఐటీడీఏ పీఓ అమేయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, ములుగు డీఎస్పీ బానోతు రాజహమేంద్రనాయక్ ఏర్పాట్లను సమీక్షించారు.
2 లక్షల మంది భక్తులు....
రామన్నగూడెం, మంగపేట ఘాట్లలో 11వ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మంగపేట ఘాట్‌కు లక్ష 70వేల మంది, రామన్నగూడెం ఘాట్‌కు 30వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఫుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 22లక్షలకు చేరింది.
జాడలేని ఉచిత బస్సులు...
షటిల్ సర్వీసుల ద్వారా భక్తులను ఘాట్‌ల వరకు ఉచితంగా చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు శుక్రవారం మంగపేటలో కనిపించలేదు. 20, 30నిమిషాలకు ఒక్కటి చొప్పున మాత్రమే నడిపించారు. దీంతో భక్తులు కాలినడకన ఘాట్‌కు చేరుకున్నారు. రామన్న గూడెంలో ఇదే పరిస్థితి ఉండడంతో భక్తులు ఆటోలను ఆశ్రయించారు. కాగా, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఐటీడీ ఏ పీఓ అమేయ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ డిప్యూటీ కార్యదర్శి భారతి శుక్రవారం కుటుంబ సమేతంగా మంగపేట ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు.
నేడు ముగింపు
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర పండుగకు శనివారం ఆఖరు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్య లో హాజరయ్యే అవకాశముందని జిల్లా యంత్రాగం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యూరు.
హాజరుకానున్న డిప్యూటీలు, కవిత
పుష్కరాల ముగింపు రోజు శనివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నారు. కవిత, పద్మాదేవేందర్‌రెడ్డి ఉదయం 9 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరుతారు. 12గంటలకు మంగపేట ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 2 గంటల వరకు కమలాపురం గెస్ట్ హౌస్‌లో గడిపి కాళేశ్వరం బయలుదేరుతారు. కడియం ఉదయం 7.30 గంటలకు రామన్నగూడెం రానున్నారు.