Pushkarni baths
-
వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
‘దిడుగు’ మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందజేత చందర్లపాడు: పుష్కర స్నానాలకెళ్లి మృతిచెందిన ఐదుగురు విద్యార్థుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయాన్ని నేతలు బుధవారం అందజేశారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీశ్, నందిగామ మండలం చెరువుకొమ్ముపాలెంకు చెందిన పాశం గోపిరెడ్డి, నందిగామకు చెందిన కమ్మవరపు హరిగోపి, కూచి లోకేశ్, వీరులపాడు మండలం జయంతి గ్రామవాసి నందిగామ నగేష్‌లు ఇటీవల గుంటూరు జిల్లాలోని దిడుగు గ్రామం వద్ద పుష్కరస్నానాలకు వెళ్లి మృత్యువాత పడడం తెలిసిందే. కాగా పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌లు బుధవారం మృతుల కుటుంబాలను కలసి వైఎస్సార్సీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం ఈ ఆర్థికసాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. -
ఇసుక మాఫియా చంపేసింది
• ఐదు నిండు జీవితాలను మింగిన ఇసుక గుంతలు • పుష్కర స్నానానికి వచ్చి విద్యార్థుల మృత్యువాత • ‘కృష్ణా’లో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి జలసమాధి సాక్షి, అమరావతి/చందర్లపాడు : సర్కారు నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల ధనదాహం.. ఐదు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి విగతజీవులయ్యారు. నదిలో నీరు లేనప్పుడు ఇసుక అక్రమ తవ్వకాల కోసం తీసిన భారీ గుంతలో పడి మరణించారు. పుణ్య స్నానాలు ఆచరిద్దామని వెళ్లిన ఐదుగురు స్నేహితులు నీట మునిగి ఒకేసారి మృత్యువాత పడడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇసుక నుంచి తైలం పిండుకోవడంలో ఆరితేరిన అధికార పార్టీ నాయకులే తమ బిడ్డలను పొట్టనపెట్టుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీష్ (19), నందిగామ మండల పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డి (19), నందిగామ పట్టణానికి చెందిన కమ్మవరపు హరిగోపి (20), కూచి లోకేష్ (20), వీరులపాడు మండల పరిధిలోని జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ (20) నందిగామలోని చైతన్య కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం కళాశాలకు వెళ్లారు. అయితే, యూనిఫాం వేసుకొని రాలేదంటూ యాజమాన్యం వారిని బయటకు పంపింది. దీంతో పుష్కర స్నానం చేద్దామన్న ఆలోచనతో ద్విచక్ర వాహనాలపై మొత్తం 11 మంది చందర్లపాడు మండలంలోని ఏటూరుకు చేరుకున్నారు. లంక గుండా గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని దిడుగు ప్రాంతానికి వచ్చారు. కృష్ణా నది పాయలో పుష్కర స్నానం చేయాలన్న ఉద్దేశంతో ఉదయం 11 గంటలకు పడవ రేవుకు సమీపంలో నదిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. లోతు తక్కువగానే ఉంటుందని భావించిన కూచి లోకేశ్ అందరికంటే ముందు నదిలోకి దిగాడు. తర్వాత హరీష్, గోపిరెడ్డి, హరిగోపి, నగేష్ లోపలికి వెళ్లారు. అయితే, నదిలో నీరు లేని సమయంలో ఇసుక కోసం విచ్చలవిడిగా సాగించిన తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముందుగా దిగిన లోకేశ్ గుంతలోకి జారిపోవడంతో మిగిలిన నలుగురు అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు. గుంత లోతు 30 అడుగులకు పైగానే ఉండడంతో ఐదుగురు ఒకేసారి మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న వారి మిత్రులు కూచి గోపీ, గద్దె వంశీ, బోడేపూడి వంశీ, గువ్వల కార్తీక్, దేవి వరప్రసాద్, ఎం.మనోజ్‌లు సమీపంలోనే ఘాట్ వద్ద అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్న కూచి లోకేష్ తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఈలోగా విషయం తెలుసుకున్న చందర్లపాడు ఎస్ఐ కె.దుర్గాప్రసాద్, ఎంపీడీఓ నాగార్జున శ్రీనివాస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు గంట సేపటి తరువాత మృతదేహాలు లభ్యమయ్యాయి. తప్పుదారి పట్టించే యత్నం ఐదుగురు విద్యార్థులు పుష్కర స్నానాలకు వెళ్లి నదిలో పడి మృతి చెందడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. నిజానికి ఏటూరు వద్ద అధికారికంగా పుష్కర ఘాట్ లేదు. పుష్కరాల ప్రారంభం నుంచే ఇక్కడ అనధికారికంగా స్నానాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నేత లు, కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భక్తులకు నది వద్ద అన్న ప్రసాదం, పులిహోర పొట్లాలు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పుష్కర స్నానాల కోసం ఏటూరు ఘాట్‌కు వెళ్లారు. అయితే, ఐదుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికార పార్టీ నేతలు హడావుడిగా ఫ్లెక్సీలను తొలగించారు. జరిగిన ఘటనను విద్యార్థుల స్వయంకృతాపరాధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యుల ఆందోళన తమ బిడ్డలు మృత్యువాత పడ్డారని తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంది గామకు తరలించేందుకు సిద్ధమయ్యారు. గూడ్స్ ఆటోలోకి ఐదుగురి మృతదేహాలను చేర్చారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. ఒకేసారి ఐదుగురు మృత్యువాత పడినా, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం చేయాలని చూడటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పారు. దీంతో సబ్ కలెక్టర్ సృజన జోక్యం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా కృషి చేస్తానని సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాలను నందిగామ మార్చురీకి తరలించారు. చంద్రబాబు ఈతకు వెళ్లమన్నాడా? ‘‘పిల్లలందరూ నందిగామలో మా ఇంటి దగ్గర నుంచే పుష్కర స్నానాలకు వచ్చారు. నదిలో మునిగిన పిల్లలను కాపాడలేని పోలీసులు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? పుష్కరాలకు ప్రచారం ఎందుకు? ప్రాణాలు తీయడానికా! మాకు ఒక్కడే కొడుకు. ఇక మేము ఎవరి కోసం బతకాలి? వాడు లేని జీవితం మాకెందుకు. మమ్మల్ని తీసుకొనిపోతే బాగుండేది’’ అంటూ హరిగోపి తల్లి వాణి బోరున విలపిచింది. కుమారుడు మరణించాడన్న బాధతో ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్న ఆమెను పక్కనే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మీ పిల్లలను సీఎం చంద్రబాబు ఏమన్నా ఈతకు వెళ్లమన్నాడా? అని దబాయించారు. దీంతో మమ్మల్ని కూడా చంపడయ్యా అంటూ వాణి విలపించింది. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ ‘కృష్ణా’లో భారీ గోతులు ఉన్నాయని తెలిపినా పట్టించుకోని అధికారులు పెదకూరపాడు: కృష్ణా నదిలో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, పుష్కరాలకు నీరు విడుదల చేయడంతో ఈ గుంతల్లోకి నీరు చేరిందని ‘సాక్షి’ ముందే ెహ చ్చరించింది. గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని దిడుగు, మల్లాది, మునగోడు గ్రామాల్లో కృష్ణానదిలో ఇసుక రిచ్‌ల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారని తెలియజేసింది. సోమవారం గుంటూరు జిల్లా ఎడిషన్ ఐదో పేజీలో దీనిపై సమగ్ర కథనాన్ని ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. భక్తులు స్నానాలు చేసే ప్రదేశాల్లో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్ద గుంత ఉండటం వల్లే.. ‘‘ఐదుగురు నదిలోకి వెళ్తుంటే ఆపుదామని చూశాం. ఆలోగానే లోపలికి వెళ్లారు. ఒకరు కింద పడగానే మిగిలిన నలుగురు అతడి చేతులు పట్టుకొని లాగేందుకు యత్నించారు. పెద్ద గుంత ఉండడంతో నీట మునిగిపోయారు’’ - విజయకుమార్, తోటి విద్యార్థి రక్షించేందుకు ప్రయత్నించా.. ‘‘మేమంతా మంచి స్నేహితులం. పుష్కర స్నానం చేద్దామని వచ్చాం. మునిగిపోతున్న స్నేహితులను రక్షించేం దుకు ప్రయత్నించాను. ఇద్దరు నా కాళ్లు గట్టిగా పట్టుకోవటంతో మునిగిపోతాననే భయంతో ఎలాగోలా బయటపడ్డా. వారిని రక్షించలేకపోయా.’’ - వంశీ, విద్యార్థి పడమర వైపు వెళ్లొద్దన్నాం ‘‘11 మంది ఇక్కడికి వచ్చారు. పడమర వైపు వెళ్లొద్దని వారికి చెప్పాం. అటూ ఇటూ ఆడుకుంటూ పడమర వైపునకు వెళ్లారు. వారు మునిగిపోతూ వేసిన కేకలు వినిపించాయి. పడవ వేసుకుని 15 మంది గజ ఈతగాళ్లం వెళ్లాం. అప్పటికే ఐదుగురూ నీట మునిగిపోయారు’’ - ఎస్.సత్యనారాయణ, ప్రత్యక్ష సాక్షి -
ఉత్కళ ‘పుష్కరం’
గోదావరి పుష్కరాల నేపథ్యంలో 12 రోజులపాటు భక్తజనంతో వెల్లువెత్తిన రాజమండ్రి పుష్కరఘాట్.. సోమవారం మళ్లీ ఆ రోజులను తలపించింది. ఒడిశా నుంచి 50 బస్సుల్లో తరలివచ్చిన వేలాదిమంది భక్తులతో ఘాట్‌కు తిరిగి ‘పుష్కర కళ’ వచ్చింది. ఒడిశాలోని బరంపురం, బాలేశ్వరం, జయపూర్, నవరంగ్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భాష, ప్రాంతం వేరయినా అంతరంగాలు, ఆచారాల్లో తేడా లేదని చాటుతూ పుష్కరస్నానాలు, పిండప్రదానాలు చేశారు. ఇతర తీర్థవిధులను నిర్వహించారు. ఒడిశా నుంచి వచ్చిన పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ ఏడాదంతా పుష్కరాలేనని, సోమవారం తమ ఆచారాల ప్రకారం ‘యోగదినం’ కావడంతో గోదావరికి తరలి వచ్చామని పురోహితుడు విజయచంద్రదాస్ తెలిపారు. కాగా ఒడిశా భక్తులు వేలాదిగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్నీ దర్శించి, పిండప్రదానాది విధులు నిర్వర్తించారు. - రాజమండ్రి కల్చరల్ -
ఆఖరి రోజూ అదే రద్దీ
- బోగీ పట్టాలు తప్పడంతో రైళ్లు ఆలస్యం - కిటకిటలాడిన రైల్వేస్టేషన్ - 100 ప్రత్యేక బస్సుల ఏర్పాటు సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కరాల ఆఖరిరోజు శనివారం కూడా నగరం నుంచి వేలాది మంది పుష్కర స్నానాలకు వెళ్లారు. అయితే, గత శని, ఆదివారాలతో పోలిస్తే ఆఖరి రోజు పుష్కరాలకు వెళ్లిన వారి సంఖ్య తక్కువగానే ఉందని రైల్వే, ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకే పుష్కరాలు ముగుస్తాయని ప్రకటించడంతో ఉదయం పూటే ఎక్కువ మంది స్నానాలకు తరలివెళ్లారని అధికారులు తెలిపారు. ఆలస్యంగా నడిచిన రైళ్లు చేబ్రోలు- బాదంపూడి మధ్య రాయగడ పాసింజర్‌లోని ఒక బోగీ కొద్దిగా పట్టాలు తప్పింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమై దాన్ని సరిచేయించి పంపారు. ఒకవైపు పుష్కరాల రద్దీ, మరోవైపు బోగీ పట్టాలు తప్పడంతో రాజమండ్రి వైపు నుంచి వచ్చే రైళ్లు రెండు, మూడు గంటలు ఆలస్యంగా వచ్చాయి. శనివారం ఉదయం 8 ప్రత్యేక రైళ్లు యధావిధిగా నడిచాయి. మూడేసి గంటలు ఆలస్యంగా వెళ్లాయి. పుష్కర స్నానానికి వెళ్లేవారు, యాత్రను ముగించి వచ్చేవారితో ఉదయం స్టేషన్ కిటకిటలాడినా.. మధ్యాహ్నం తరువాత కొంత ఖాళీగా కనిపించింది. 100 ప్రత్యేక బస్సులు శుక్రవారం రాత్రి పుష్కరాల కోసం 150 బస్సులు ఏర్పాటుచేసిన ఆర్టీసీ శనివారం మరో వంద నడిపింది. ఉదయం బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో కేశినేని భవన్ నుంచి 50 బస్సులు నడిపారు. -
నేడే ఆఖరు
చివరి రోజు భక్తజనం భారీగా తరలివచ్చే అవకాశం హాజరుకానున్న డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, ఎంపీ కవిత 11వ రోజు 2 లక్షల మంది పుష్కర స్నానాలు జల, జన కళతో మురిసిన గోదావరి ములుగు : పుష్కర స్నానానికి పోటెత్తిన భక్తులను చూసి గోదావరి పులకించింది. అంచనాలకు మించి వచ్చిన జనం కోసం స్వయంగా ఒక్క అడుగుముందుకేసిందా అన్నట్లు శుక్రవారం నీటిమట్టం పెరిగింది. ఈ మేరకు నదిలో ఇదివరకు ఏర్పాటు చేసిన హెచ్చరిక కంచెలను శుక్రవారం అధికారులు మరింత ముందుకు తీసుకొచ్చారు. పది రోజుల వరకు నదీతీరాల వరకు వెళ్లిన భక్తులు శుక్రవారం ఘాట్లకు సమీపంలోనే పుష్కర స్నానాలు ఆచరించారు. నది నీళ్లు మురికిగా ఉండడంతో పుణ్యస్నానాల అనంతరం భక్తులు షవర్ల కిందికి చేరుకుని మళ్లీ స్నానాలు చేశారు. పిండప్రదానాలకు సరైన స్థలం లేక భృక్తులు ఇబ్బందులు పడ్డారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఘాట్లలో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. మంగపేట ఘాట్ చుట్టూ ఖాళీ గుంతల్లో భారీగా నీళ్లు చేరాయి. ఫైర్, పంచాయతీరాజ్ అధికారులు ఇంజన్ల ద్వారా గోదావరిలోకి మళ్లించారు. మంగపేట ఘాట్‌కు వెళ్లే ప్రైవేట్ వాహనాలను అధికారులు మంగపేట సమీపంలో జామాయిల్‌తోటలో నిలిి వేశారు. ఐటీడీఏ పీఓ అమేయ్‌కుమార్, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, ములుగు డీఎస్పీ బానోతు రాజహమేంద్రనాయక్ ఏర్పాట్లను సమీక్షించారు. 2 లక్షల మంది భక్తులు.... రామన్నగూడెం, మంగపేట ఘాట్లలో 11వ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మంగపేట ఘాట్‌కు లక్ష 70వేల మంది, రామన్నగూడెం ఘాట్‌కు 30వేల మంది భక్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఫుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 22లక్షలకు చేరింది. జాడలేని ఉచిత బస్సులు... షటిల్ సర్వీసుల ద్వారా భక్తులను ఘాట్ల వరకు ఉచితంగా చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు శుక్రవారం మంగపేటలో కనిపించలేదు. 20, 30నిమిషాలకు ఒక్కటి చొప్పున మాత్రమే నడిపించారు. దీంతో భక్తులు కాలినడకన ఘాట్‌కు చేరుకున్నారు. రామన్న గూడెంలో ఇదే పరిస్థితి ఉండడంతో భక్తులు ఆటోలను ఆశ్రయించారు. కాగా, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఐటీడీ ఏ పీఓ అమేయ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ డిప్యూటీ కార్యదర్శి భారతి శుక్రవారం కుటుంబ సమేతంగా మంగపేట ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. నేడు ముగింపు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర పండుగకు శనివారం ఆఖరు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్య లో హాజరయ్యే అవకాశముందని జిల్లా యంత్రాగం భావిస్తోంది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యూరు. హాజరుకానున్న డిప్యూటీలు, కవిత పుష్కరాల ముగింపు రోజు శనివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రానున్నారు. కవిత, పద్మాదేవేందర్‌రెడ్డి ఉదయం 9 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరుతారు. 12గంటలకు మంగపేట ఘాట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 2 గంటల వరకు కమలాపురం గెస్ట్ హౌస్‌లో గడిపి కాళేశ్వరం బయలుదేరుతారు. కడియం ఉదయం 7.30 గంటలకు రామన్నగూడెం రానున్నారు. -
రోడ్ టై..
తెల్లారితే చాలు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం..ఈ వారం రోజుల్లో ఇవి మరీ ఎక్కువైపోయాయి. ఏం వినాల్సి వస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవల్సి వస్తోంది. పుష్కరాలు ప్రారంభమై 8రోజులైంది. ఈ ఎనిమిది రోజులూ వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోనో..లేదా పొరుగు జిల్లాలోనూ జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలామంది క్షతగాత్రులయ్యారు. రోడ్లమీద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడ్డం..తొందరగా గమ్యం చేరాలని వాహనచోదకుల మితిమీరిన వేగం..కొత్త మార్గాల మీద అవగాహన లేకపోవడం..కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కించడం..వాహనాలను పరిమితికి మించి జనంతో నింపేయడం లాంటి కారణాలు ఈ వరుస ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో సుమారు 22 మంది చనిపోగా 118 మంది గాయపడ్డారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కేకోటపాడు మండలంలో వంతెన పైనుంచి వ్యాను కింద పడి నలుగురు మృత్యువాత పడ్డారు. - వంతెన పైనుంచి టాటాఏస్ బోల్తా - నలుగురు దుర్మరణం - 28 మందికి గాయాలు - పుష్కరాల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం - రెడ్డివానిపాలెంలో విషాదం కె.కోటపాడు : పుష్కర స్నానాలు ముగించుకొని కొద్ది సేపట్లో గ్రామానికి చేరుకుంటారనగా అంతులేని విషాదం చోటుచేసుకుంది. రక్షణ గోడలేని వంతెనపై నుంచి టాటాఏస్ బోల్తాపడింది. కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం కూడలి వద్ద మంగళవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 28 మంది గాయాల పాలయ్యా రు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రెడ్డివానిపాలెం వాసులు. బాధితులు, బంధువుల రోదనలతో కె.కోటపాడు ఆస్పత్రి మార్మోగిపోయింది. ఆదివారం రాత్రి టాటాఏస్ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది రాజమండ్రి వెళ్లారు. తిరిగి వస్తుండగా స్వగ్రామానికి పది కిలోమీటర్ల దూరంలోని వారాడ సంతపాలెం కూడలివద్ద వంతెన పైనుంచి టాటా ఏస్ బోల్తాపడింది. ప్రమాదంలో రెడ్డివానిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ(62), వేపాడ మండలం సింగరాయి గ్రామానికి చెందిన కొల్లి సన్యాసమ్మ(58)లు సంఘటన స్థలంలోనే మృతిచెం దారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రెడ్డి సన్యాసమ్మ(60), రెడ్డి అచ్చియ్యమ్మ(63)లు చనిపోయారు. ఈ ప్రమాదంలో కాళ్లు,చేతులు విరిగిపోయిన ఆర్.ఈశ్వరమ్మ, ఎ.రాముడమ్మ, ఆర్.గణేష్, ఆర్.శ్రీలక్ష్మి, ఆర్.రాజేశ్వరి, ఆర్.లక్ష్మణరావు, ఆర్.సింహాచలం, రెడ్డి సింహాచలంనాయుడు, ఆర్. వేములమ్మ, ఆర్. లక్ష్మి, ఆర్.ఈశ్వరరావులకు కె.కోటపాడు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఆర్.భవాని, రెడ్డి సన్యాసమ్మ , ఆర్.చినదేముడు , ఆర్.సన్యాసమ్మ , అనపర్తి కీర్తన, అనపర్తి భరత్ , రెడ్డి కోటి , కొప్పు ముత్యాలరావు, అనపర్తి లక్ష్మి , ఆర్. ఈశ్వరమ్మ , ఆర్.సన్యాసమ్మ , ఎ.లక్ష్మి , ఆర్.అక్కమ్మ , కె.బుచ్చమ్మ , వి.కన్నమ్మ , ఎ.రాముడమ్మ , ఆర్.కోమలి (2)లు కె.కోటపాడులో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సంఘటన స్థలానికి ఉదయం ఐదున్నర గంటలకే చేరుకున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 11 మందిని విశాఖపట్నం తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేశారు.మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాలని వైద్యులను ఆదేశించారు. మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నక్కెళ్ల నాయుడుబాబులు పరామర్శించారు. మృతులకు, బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. కె.కోటపాడు తహశీల్దార్ కె.సత్యారావు చనిపోయిన రెడ్డి సన్యాసమ్మ, రెడ్డి దేముడమ్మ, కొల్లి సన్యాసమ్మ, రెడ్డి అచ్చియ్యమ్మల దహన సంస్కారాలకు ఒక్కొక్కరికి రూ.8వేలు చొప్పున ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబాలను స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రెడ్డి జగన్మోహన్, శ్రీకాంత్ శ్రీనులు పరామర్శించారు. చోడవరం సీఐ కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. వంతెనకు రక్షణ గోడ లేక.. వారాడ సంతపాలెం గ్రామ కూడలిలోని వంతెనకు పూర్తి స్థాయిలో రక్షణ గోడలు నిర్మించలేదు. ఇటీవల ఈ రోడ్డును విస్తరించారు. గతంలో కల్వర్టు అంచులకు సమానంగా తారురోడ్డు ఉండేది. రోడ్డు మార్జిన్‌ను వాహనదారులు గుర్తించేవారు. వేకువజామున పుష్కరయాత్రికులతో వెళుతున్న టాటాఏస్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో వాహనాన్ని అదుపుచేయలేకపోయారు. అది వంతెన పైనుంచి బోల్తాపడింది. వంతెన రక్షణ గోడలు ఎత్తుగా ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదన వ్యక్తమవుతోంది. విషాద ప్రయాణాలు - 15న ఎస్.రాయవరం ప్రాంతం కోనవానిపాలెం వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ వ్యాన్ ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. - 18న ప్రత్తిపాడు టోల్ గేట్ వద్ద జీపును ఆర్టీసీ బస్సు ఢీకొట్టంది. ఎం.వరలక్ష్మి మృతి చెందింది. నలుగురు గాయపడ్డారు. - అదే రోజు కత్తిపూడి వద్ద కల్లుపాకల ప్రాంత వాసి సంపంగి శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు. - వడ్డాది మార్గంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. - 19న రాజమండ్రి నుంచి గాజువాక వస్తున్న కారు నక్కపల్లి దరి వేంపాడు వద్ద ఆటోను ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. - అదే రోజు సామర్లకోట వద్ద లారీ, ఆటో ప్రమాదంలో కొత్తకోట ప్రాంత వాసి సన్యాసిరావు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. - యలమంచిలి హైవేలో ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. - ఈ నెల 20న మారికవలస జంక్షన్ వద్ద ఆటోను ఆర్టీసీ పుష్కర స్పెషల్ బస్ ఢీకొనడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. ఆరుగురికి గాయాలయ్యాయి. - అదే రోజు కశింకోట వద్ద రెండు బస్సులు ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. మరో ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. - చోడవరం మండలం తామర చెరువు వీధికి చెందిన వెంకటేశ్వర్లు రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. - 21న వారాడ సంతపాలెం వద్ద వంతెనపై టాటా ఏస్ అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు. - నక్కపల్లి ఏరియా ఆస్పత్రి సమీపంలో ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. -
జనతరంగం
చినుకులన్నీ వాగులై.. ఏరులై.. నదులై.. సాగరాన్ని చేరినట్టు.. అన్నిమార్గాల నుంచి గోదావరి తీరానికి భక్తులు పోటెత్తారు. జనతరంగమై పుష్కర ఘాట్లను ముంచెత్తారు. వాతావరణం గంటకో రకంగా మారుతూ హోరు గాలి.. జోరు వాన.. మండే ఎండగా దోబూచులాడినా లెక్కచేయకుండా పుష్కర గోదారి చెంతకు ఉరకలెత్తారు. పశ్చిమాన పవిత్ర నదీ తీరం పుష్కరోత్సవ శోభతో వెలిగిపోయింది. - అదే జోరు.. భక్త జన హోరు - పురోహితులు చాలక పిండ ప్రదానాల కోసం అవస్థలు - ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో ఘాట్ల సమీపానికి వస్తున్న వాహనాలు - కొవ్వూరులో గాలివాన.. భక్తుల ఇక్కట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : రోజులు గడుస్తున్నా పుష్కర భక్తులు, యాత్రికుల జోరు మాత్రం తగ్గడం లేదు. పుబ్బ నక్షత్రం.. సోమవారం కావడంతో రికార్డు సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మహాశివునికి ఇష్టమైన సోమవారం రోజున పిండ ప్రదానాల సంఖ్య రెట్టింపైంది. తగినంతమంది పురోహితులు లేక జిల్లాలోని చాలా ఘాట్లలో క్రతువుల నిర్వహణకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. శనివారం నాటి రద్దీ ఆదివారం ఒకింత తగ్గినా సోమవారం మాత్రం జనం పోటెత్తారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగడం.. ఎక్కడికక్కడ భారీ వాహనాలను మళ్లించడంతో పుష్కర భక్తులు వాహనాల్లో సాఫీగానే ఘాట్ల సమీపానికి చేరుకుంటున్నారు. కొవ్వూరులో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన గాలులు, వర్షం యాత్రికులను అవస్థలకు గురి చేశాయి. అన్ని ఘాట్లలోని మెట్లు తడవడం, రోడ్లన్నీ బురదమయంగా మారడంతో స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పుష్కర స్నానం ఆచరించిన మంత్రి మాణిక్యాలరావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తమ కుటుంబ సభ్యులతో కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించారు. పిండప్రదానాలు చేశారు. అనంతరం గోశాలలో గో పూజలు నిర్వహించారు. అనధికార ఘాట్ల మూసివేత ఓ యువకుడి మృతితో అధికారులు కళ్లు తెరిచారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం, చుట్టుప్రక్కల ప్రాంతాల్లోని అనధికార ఘాట్లను మూసివేశారు. సిద్ధాంతంలోని కేదారిఘాట్తో పాటు మండలంలో ఉన్న ఇతర ఘాట్లలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. ఉదయం పూట వర్షం కారణంగా భక్తులకు కాస్త అసౌకర్యం కలిగింది. కొనసాగుతున్న లాంచీ ఇబ్బందులు పోలవరంలో భక్తుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. పుణ్యస్నానాలు చేసిన భక్తులు పట్టిసీమ క్షేత్రాన్ని వేలసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో లాం చీలు సమయానికి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. లాంచీల సంఖ్య పెంచాలని పుష్కరాల ప్రారంభం నుంచి భక్తులు డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పెరవలి మండలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముక్కామల బ్రహ్మగుండ క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. తీపర్రు ఘాట్‌లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పడంతో దుర్గంధం వస్తోందని భక్తులు వాపోయారు. బురదలోనే నడక యలమంచిలి మండలం చించినాడ, లక్ష్మీపాలెం ఘాట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేశారు. చించినాడలో ఘాట్‌కు వెళ్లే రహదారి వర్షం కారణంగా బురదమయంగా మారింది. భక్తులు బురదలోనే నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఘాట్ల వద్ద పురోహితుల సంఖ్య తక్కువగా ఉండటంతో పిండ ప్రదానాల కోసం భక్తులు ఎక్కువ సమయం వేచివుండాల్సి వచ్చింది. శని, ఆదివారాల కంటే భక్తుల రద్దీ తగ్గడంతో ఆచంట, నిడదవోలు మండలాల్లోని ఘాట్లలో స్నానాలు సాఫీగా సాగాయి. -
కన్నీటి గోదారి
పుణ్యస్నానానికని వెళితే పుణ్యలోకాలు ప్రాప్తించాయి. గోదావరి పుష్కర మహోత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లిన జిల్లా వాసులకు అనుకోని విషాదం ఎదురైంది. పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో ఐదుగురు జిల్లావాసులు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగాయి. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి.. - భోరుమన్న మహాలక్ష్మి కుటుంబీకులు - విషాదంలో కేఆర్ఎం కాలనీ మద్దిలపాలెం : రాజమండ్రి గోదావరిలో పుష్కర స్నానాలకని వెళ్లిన తల్లి విగతజీవిగా మారిందన్న వార్త ఆ కుటుంబ సభ్యులను దుఃఖసాగరంలో ముంచింది. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయి ఆ కుటుంబ సభ్యులు భోరున రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రిలేరు, ఇప్పుడు తల్లి కూడా దూరమైపోయిందన్న వేదనలో ఉన్న పిల్లలను ఓదార్చడానికి కూడా ఎవరూ సాహసించలేకపోయారు. పుణ్యస్నానానికి వెళ్లి వస్తానని చెప్పిన తన తల్లి విగతజీవిగా వస్తుందన్న వార్తను కుటుంభ సభ్యులు,గ్రామస్తులను దుఃఖసాగరంలో ముంచెత్తింది. జీవీఎంసీ 10వ వార్డు పరిధి కె.ఆర్.ఎమ్.కాలనీకి చెందిన కోటిన మహాలక్ష్మి(68) సీతమ్మధార నాలుగో పట్ణణ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న తన అక్క కుటుంబంతో కలసి సోమవారం రాత్రి రాజమండ్రి వెళ్లింది. మంగళవారం ఉదయం పుష్కరస్నానం కోసం వెళ్లడానికి ప్రయత్నించిన క్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృత్యువాత పడింది. మహాలక్ష్మి మరణవార్తను టీవీల ద్వారా తెలుసుకున్న కుటుంభ సభ్యులు రాజమండ్రిలో సమీప బంధువులను ఆరా తీసి నిర్ధారించుకుని నిశ్చేష్టులయ్యారు. మహాలక్ష్మి భర్త చిన్నంనాయుడు విశ్రాంత పోర్టు ఉద్యోగి, 1994లో విధుల నుంచి రిటైరయిన చిన్నంనాయుడు 2002లో మరణించాడు. వీరికి ఒక కుమారుడు నాగభీమకొండలరావు, ఇద్దరు కుమార్తెలు శ్రీదేవి, భాగ్యలక్ష్మి ఉన్నారు. కుమార్తెలు ఇద్దరూ వివాహితులు, పెద్ద కుమార్తె శ్రీదేవి, భర్తతో కలసి స్థానికంగా ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. చిన్నకుమార్తె భాగ్యలక్ష్మికి బీహార్‌కి చెందిన రైల్వే ఉద్యోగితో వివాహం కావడంతో అక్కడే స్థిరపడ్డారు. కుమారుడు నాగభీమ కొండలరావు వికలాంగ నిరుద్యోగి, కేవలం తల్లికి వచ్చే పింఛనుతో కుటుంబ పోషణ చేసుకునేవారు. ఇప్పుడు తల్లి మరణంతో వారు దిక్కులేని వారైపోయారు. ఈ దుర్ఘటన కె.ఆర్.ఎమ్.కాలనీలో విషాదచాయలు నింపింది. స్వతహాగా స్నేహశీలి అయిన మహాలక్ష్మి మరణాన్ని చుట్టుప్రక్కల ప్రజలను కూడా కంటతడి పెట్టించింది. మహాలక్ష్మి మృతదేహాన్ని మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చి, బుధవారం ఉదయం అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని నగరానికి తీసుకురావడానికి మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి ఆర్థికసాయం అందజేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక నాయకులు తమ సానుభూతి వ్యక్తం చేశారు. మృతదేహానికి స్థానిక మాజీ కార్పొరేటర్, వైయస్సార్సీపీ నాయకులు మొల్లి లక్ష్మి, అప్పారావు నివాళులు అర్పించారు.