ఇసుక మాఫియా చంపేసింది
• ఐదు నిండు జీవితాలను మింగిన ఇసుక గుంతలు
• పుష్కర స్నానానికి వచ్చి విద్యార్థుల మృత్యువాత
• ‘కృష్ణా’లో ఇసుక కోసం తవ్విన గుంతలో పడి జలసమాధి
సాక్షి, అమరావతి/చందర్లపాడు : సర్కారు నిర్లక్ష్యం, అధికార పార్టీ నేతల ధనదాహం.. ఐదు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి విగతజీవులయ్యారు. నదిలో నీరు లేనప్పుడు ఇసుక అక్రమ తవ్వకాల కోసం తీసిన భారీ గుంతలో పడి మరణించారు. పుణ్య స్నానాలు ఆచరిద్దామని వెళ్లిన ఐదుగురు స్నేహితులు నీట మునిగి ఒకేసారి మృత్యువాత పడడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇసుక నుంచి తైలం పిండుకోవడంలో ఆరితేరిన అధికార పార్టీ నాయకులే తమ బిడ్డలను పొట్టనపెట్టుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కృష్ణా జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీష్ (19), నందిగామ మండల పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పాశం గోపిరెడ్డి (19), నందిగామ పట్టణానికి చెందిన కమ్మవరపు హరిగోపి (20), కూచి లోకేష్ (20), వీరులపాడు మండల పరిధిలోని జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ (20) నందిగామలోని చైతన్య కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం కళాశాలకు వెళ్లారు. అయితే, యూనిఫాం వేసుకొని రాలేదంటూ యాజమాన్యం వారిని బయటకు పంపింది.
దీంతో పుష్కర స్నానం చేద్దామన్న ఆలోచనతో ద్విచక్ర వాహనాలపై మొత్తం 11 మంది చందర్లపాడు మండలంలోని ఏటూరుకు చేరుకున్నారు. లంక గుండా గుంటూరు జిల్లా సరిహద్దుల్లోని దిడుగు ప్రాంతానికి వచ్చారు. కృష్ణా నది పాయలో పుష్కర స్నానం చేయాలన్న ఉద్దేశంతో ఉదయం 11 గంటలకు పడవ రేవుకు సమీపంలో నదిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. లోతు తక్కువగానే ఉంటుందని భావించిన కూచి లోకేశ్ అందరికంటే ముందు నదిలోకి దిగాడు. తర్వాత హరీష్, గోపిరెడ్డి, హరిగోపి, నగేష్ లోపలికి వెళ్లారు. అయితే, నదిలో నీరు లేని సమయంలో ఇసుక కోసం విచ్చలవిడిగా సాగించిన తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ముందుగా దిగిన లోకేశ్ గుంతలోకి జారిపోవడంతో మిగిలిన నలుగురు అతడిని బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
గుంత లోతు 30 అడుగులకు పైగానే ఉండడంతో ఐదుగురు ఒకేసారి మునిగిపోయారు. దీంతో ఒడ్డున ఉన్న వారి మిత్రులు కూచి గోపీ, గద్దె వంశీ, బోడేపూడి వంశీ, గువ్వల కార్తీక్, దేవి వరప్రసాద్, ఎం.మనోజ్‌లు సమీపంలోనే ఘాట్ వద్ద అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్న కూచి లోకేష్ తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఈలోగా విషయం తెలుసుకున్న చందర్లపాడు ఎస్‌ఐ కె.దుర్గాప్రసాద్, ఎంపీడీఓ నాగార్జున శ్రీనివాస్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు గంట సేపటి తరువాత మృతదేహాలు లభ్యమయ్యాయి.
తప్పుదారి పట్టించే యత్నం
ఐదుగురు విద్యార్థులు పుష్కర స్నానాలకు వెళ్లి నదిలో పడి మృతి చెందడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. నిజానికి ఏటూరు వద్ద అధికారికంగా పుష్కర ఘాట్ లేదు. పుష్కరాల ప్రారంభం నుంచే ఇక్కడ అనధికారికంగా స్నానాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నేత లు, కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. భక్తులకు నది వద్ద అన్న ప్రసాదం, పులిహోర పొట్లాలు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పుష్కర స్నానాల కోసం ఏటూరు ఘాట్‌కు వెళ్లారు. అయితే, ఐదుగురు మృతి చెందడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అధికార పార్టీ నేతలు హడావుడిగా ఫ్లెక్సీలను తొలగించారు. జరిగిన ఘటనను విద్యార్థుల స్వయంకృతాపరాధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
తమ బిడ్డలు మృత్యువాత పడ్డారని తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంది గామకు తరలించేందుకు సిద్ధమయ్యారు. గూడ్స్ ఆటోలోకి ఐదుగురి మృతదేహాలను చేర్చారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు వాహనాన్ని అడ్డుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు.
ఒకేసారి ఐదుగురు మృత్యువాత పడినా, అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం చేయాలని చూడటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమించబోమని తేల్చిచెప్పారు. దీంతో సబ్ కలెక్టర్ సృజన జోక్యం చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా కృషి చేస్తానని సర్ది చెప్పారు. అనంతరం మృతదేహాలను నందిగామ మార్చురీకి తరలించారు.
చంద్రబాబు ఈతకు వెళ్లమన్నాడా?
‘‘పిల్లలందరూ నందిగామలో మా ఇంటి దగ్గర నుంచే పుష్కర స్నానాలకు వచ్చారు. నదిలో మునిగిన పిల్లలను కాపాడలేని పోలీసులు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? పుష్కరాలకు ప్రచారం ఎందుకు? ప్రాణాలు తీయడానికా! మాకు ఒక్కడే కొడుకు. ఇక మేము ఎవరి కోసం బతకాలి? వాడు లేని జీవితం మాకెందుకు. మమ్మల్ని తీసుకొనిపోతే బాగుండేది’’ అంటూ హరిగోపి తల్లి వాణి బోరున విలపిచింది. కుమారుడు మరణించాడన్న బాధతో ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్న ఆమెను పక్కనే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మీ పిల్లలను సీఎం చంద్రబాబు ఏమన్నా ఈతకు వెళ్లమన్నాడా? అని దబాయించారు. దీంతో మమ్మల్ని కూడా చంపడయ్యా అంటూ వాణి విలపించింది.
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
‘కృష్ణా’లో భారీ గోతులు ఉన్నాయని తెలిపినా పట్టించుకోని అధికారులు
పెదకూరపాడు: కృష్ణా నదిలో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, పుష్కరాలకు నీరు విడుదల చేయడంతో ఈ గుంతల్లోకి నీరు చేరిందని ‘సాక్షి’ ముందే ెహ చ్చరించింది. గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని దిడుగు, మల్లాది, మునగోడు గ్రామాల్లో కృష్ణానదిలో ఇసుక రిచ్‌ల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారని తెలియజేసింది. సోమవారం గుంటూరు జిల్లా ఎడిషన్ ఐదో పేజీలో దీనిపై సమగ్ర కథనాన్ని ప్రచురించింది. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. భక్తులు స్నానాలు చేసే ప్రదేశాల్లో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు నీట మునిగి మృతిచెందడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పెద్ద గుంత ఉండటం వల్లే..
‘‘ఐదుగురు నదిలోకి వెళ్తుంటే ఆపుదామని చూశాం. ఆలోగానే లోపలికి వెళ్లారు. ఒకరు కింద పడగానే మిగిలిన నలుగురు అతడి చేతులు పట్టుకొని లాగేందుకు యత్నించారు. పెద్ద గుంత ఉండడంతో నీట మునిగిపోయారు’’ - విజయకుమార్, తోటి విద్యార్థి
రక్షించేందుకు ప్రయత్నించా..
‘‘మేమంతా మంచి స్నేహితులం. పుష్కర స్నానం చేద్దామని వచ్చాం. మునిగిపోతున్న స్నేహితులను రక్షించేం దుకు ప్రయత్నించాను. ఇద్దరు నా కాళ్లు గట్టిగా పట్టుకోవటంతో మునిగిపోతాననే భయంతో ఎలాగోలా బయటపడ్డా. వారిని రక్షించలేకపోయా.’’ - వంశీ, విద్యార్థి
పడమర వైపు వెళ్లొద్దన్నాం
‘‘11 మంది ఇక్కడికి వచ్చారు. పడమర వైపు వెళ్లొద్దని వారికి చెప్పాం. అటూ ఇటూ ఆడుకుంటూ పడమర వైపునకు వెళ్లారు. వారు మునిగిపోతూ వేసిన కేకలు వినిపించాయి. పడవ వేసుకుని 15 మంది గజ ఈతగాళ్లం వెళ్లాం. అప్పటికే ఐదుగురూ నీట మునిగిపోయారు’’ - ఎస్.సత్యనారాయణ, ప్రత్యక్ష సాక్షి