రోడ్ టై.. | Road accident went to pushkarani people comming back | Sakshi
Sakshi News home page

రోడ్ టై..

Published Wed, Jul 22 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

రోడ్ టై..

రోడ్ టై..

తెల్లారితే చాలు ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం..ఈ వారం రోజుల్లో ఇవి మరీ ఎక్కువైపోయాయి. ఏం వినాల్సి వస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవల్సి వస్తోంది. పుష్కరాలు ప్రారంభమై 8రోజులైంది. ఈ ఎనిమిది రోజులూ వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోనో..లేదా పొరుగు జిల్లాలోనూ జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలామంది క్షతగాత్రులయ్యారు. రోడ్లమీద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడ్డం..తొందరగా గమ్యం చేరాలని వాహనచోదకుల మితిమీరిన వేగం..కొత్త మార్గాల మీద అవగాహన లేకపోవడం..కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కించడం..వాహనాలను పరిమితికి మించి జనంతో నింపేయడం లాంటి కారణాలు ఈ వరుస ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో సుమారు 22 మంది చనిపోగా 118 మంది గాయపడ్డారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున కేకోటపాడు మండలంలో వంతెన పైనుంచి వ్యాను కింద పడి నలుగురు మృత్యువాత పడ్డారు.
 
- వంతెన పైనుంచి టాటాఏస్ బోల్తా
- నలుగురు దుర్మరణం
- 28 మందికి గాయాలు
- పుష్కరాల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం
- రెడ్డివానిపాలెంలో విషాదం
కె.కోటపాడు :
పుష్కర స్నానాలు ముగించుకొని కొద్ది సేపట్లో గ్రామానికి చేరుకుంటారనగా అంతులేని విషాదం చోటుచేసుకుంది. రక్షణ గోడలేని వంతెనపై నుంచి టాటాఏస్ బోల్తాపడింది. కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం కూడలి వద్ద మంగళవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. 28 మంది గాయాల పాలయ్యా రు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రెడ్డివానిపాలెం వాసులు. బాధితులు, బంధువుల రోదనలతో కె.కోటపాడు ఆస్పత్రి మార్మోగిపోయింది. ఆదివారం రాత్రి టాటాఏస్ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది రాజమండ్రి వెళ్లారు.

తిరిగి వస్తుండగా స్వగ్రామానికి పది కిలోమీటర్ల దూరంలోని వారాడ సంతపాలెం కూడలివద్ద వంతెన పైనుంచి టాటా ఏస్ బోల్తాపడింది. ప్రమాదంలో రెడ్డివానిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ(62), వేపాడ మండలం సింగరాయి గ్రామానికి చెందిన కొల్లి సన్యాసమ్మ(58)లు సంఘటన స్థలంలోనే మృతిచెం దారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రెడ్డి సన్యాసమ్మ(60), రెడ్డి అచ్చియ్యమ్మ(63)లు చనిపోయారు. ఈ ప్రమాదంలో కాళ్లు,చేతులు విరిగిపోయిన ఆర్.ఈశ్వరమ్మ, ఎ.రాముడమ్మ, ఆర్.గణేష్, ఆర్.శ్రీలక్ష్మి, ఆర్.రాజేశ్వరి, ఆర్.లక్ష్మణరావు, ఆర్.సింహాచలం, రెడ్డి సింహాచలంనాయుడు, ఆర్. వేములమ్మ, ఆర్. లక్ష్మి, ఆర్.ఈశ్వరరావులకు కె.కోటపాడు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఆర్.భవాని, రెడ్డి సన్యాసమ్మ , ఆర్.చినదేముడు , ఆర్.సన్యాసమ్మ , అనపర్తి కీర్తన, అనపర్తి భరత్ , రెడ్డి కోటి , కొప్పు ముత్యాలరావు, అనపర్తి లక్ష్మి , ఆర్. ఈశ్వరమ్మ , ఆర్.సన్యాసమ్మ , ఎ.లక్ష్మి , ఆర్.అక్కమ్మ , కె.బుచ్చమ్మ , వి.కన్నమ్మ , ఎ.రాముడమ్మ , ఆర్.కోమలి (2)లు   కె.కోటపాడులో వైద్య సేవలు అందిస్తున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సంఘటన స్థలానికి ఉదయం ఐదున్నర గంటలకే చేరుకున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా దగ్గరుండి పర్యవేక్షించారు. 11 మందిని విశాఖపట్నం తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేశారు.మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించాలని వైద్యులను ఆదేశించారు. మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నక్కెళ్ల నాయుడుబాబులు పరామర్శించారు.

మృతులకు, బాధితులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. కె.కోటపాడు తహశీల్దార్ కె.సత్యారావు చనిపోయిన రెడ్డి సన్యాసమ్మ, రెడ్డి దేముడమ్మ, కొల్లి సన్యాసమ్మ, రెడ్డి అచ్చియ్యమ్మల దహన సంస్కారాలకు ఒక్కొక్కరికి రూ.8వేలు చొప్పున ఆయా కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబాలను స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రెడ్డి జగన్‌మోహన్, శ్రీకాంత్ శ్రీనులు పరామర్శించారు. చోడవరం సీఐ కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.   
 
వంతెనకు రక్షణ గోడ లేక..
వారాడ సంతపాలెం గ్రామ కూడలిలోని వంతెనకు పూర్తి స్థాయిలో రక్షణ గోడలు నిర్మించలేదు. ఇటీవల ఈ రోడ్డును విస్తరించారు. గతంలో కల్వర్టు అంచులకు సమానంగా తారురోడ్డు ఉండేది. రోడ్డు మార్జిన్‌ను వాహనదారులు గుర్తించేవారు. వేకువజామున పుష్కరయాత్రికులతో వెళుతున్న టాటాఏస్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ లేకపోవడంతో వాహనాన్ని అదుపుచేయలేకపోయారు. అది వంతెన పైనుంచి బోల్తాపడింది. వంతెన రక్షణ గోడలు ఎత్తుగా ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్న వాదన వ్యక్తమవుతోంది.
 
విషాద ప్రయాణాలు
- 15న ఎస్.రాయవరం ప్రాంతం కోనవానిపాలెం వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్ట్ వ్యాన్ ఢీకొట్టింది.  ఒకరు మృతి చెందగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- 18న ప్రత్తిపాడు టోల్ గేట్ వద్ద జీపును ఆర్టీసీ బస్సు ఢీకొట్టంది. ఎం.వరలక్ష్మి మృతి చెందింది. నలుగురు గాయపడ్డారు.
- అదే రోజు కత్తిపూడి వద్ద కల్లుపాకల ప్రాంత వాసి సంపంగి శ్రీనివాసరావు దుర్మరణం చెందాడు.
- వడ్డాది మార్గంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- 19న రాజమండ్రి నుంచి గాజువాక వస్తున్న కారు నక్కపల్లి దరి వేంపాడు వద్ద ఆటోను ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- అదే రోజు సామర్లకోట వద్ద లారీ, ఆటో ప్రమాదంలో కొత్తకోట ప్రాంత వాసి సన్యాసిరావు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు.
- యలమంచిలి హైవేలో ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
- ఈ నెల 20న మారికవలస జంక్షన్ వద్ద ఆటోను ఆర్టీసీ పుష్కర స్పెషల్ బస్ ఢీకొనడంతో 11 మంది మృత్యువాత పడ్డారు. ఆరుగురికి గాయాలయ్యాయి.
- అదే రోజు కశింకోట వద్ద రెండు బస్సులు ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. మరో ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు.
- చోడవరం మండలం తామర చెరువు వీధికి చెందిన వెంకటేశ్వర్లు రాజమండ్రి సమీపంలో ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు.
- 21న వారాడ సంతపాలెం వద్ద వంతెనపై టాటా ఏస్ అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు మృతి చెందారు. 28 మంది గాయపడ్డారు.
- నక్కపల్లి ఏరియా ఆస్పత్రి సమీపంలో ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement