
కెనోషా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్‌లో తాజా ఘటన చోటుచేసుకుంది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణిం చగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని కౌంటీ షెరిఫ్ డేవిడ్ బెత్ వెల్లడించారు. ఘటనకు ముందుగా నిందితుడు బార్‌లోనే ఉన్నాడని, అయితే అతన్ని బయటకు పంపడంతో తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామన్నారు. ఎవరిని చంపాలో నిందితుడు ముందుగానే నిర్ణయించు కొని వచ్చినట్లు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు చెప్పారు. దాడి చేసేందుకు ఒక హ్యాండ్‌గన్‌ను ఉపయోగించారని తెలిపారు. నిందితున్ని పట్టుకోవడానికి స్థానికులు సాయం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారులను మూసేసి తనిఖీలు చేపట్టారు.
ఒమహాలోనూ కాల్పులు..
ఒమహాలోని ఓ మాల్‌లోనూ ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటనానంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను సేకరించిన అనంతరం తిరిగి మాల్‌లోకి సందర్శకులను అనుమతించారు. నిందితుడు స్పష్టమైన లక్ష్యంతోనే వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ కాలికి సైతం గాయమైంది.