
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు.
వివరాల ప్రకారం.. అరిజోనాలోని కమలా హరీస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు. రాత్రిపూట ఆఫీసులో ఎవరూ లేని సమయంలో ఫైరింగ్ జరిగినట్టు తెలిపారు. కాల్పుల కారణంగా భవనంలో కిటికీలు, ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగుల కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డిటెక్టివ్ టీమ్స్.. కాల్పులు ఎవరూ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు.. కాల్పుల ఘటన నేపథ్యంలో డెమోక్రటిక్ ఆఫీసు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా పోలీసుల బలగాలను ఏర్పాటు చేశారు. కమలా ఆఫీసుపై కాల్పుల ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కూడా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా?