దుర్గమ్మ దర్శనానికి పుష్కర భక్తజనం
విజయవాడ : గోదావరి పుష్కరాలకు రాజమండ్రి, కొవ్వూరు తదితర ప్రాంతాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయప్రాంగణం కిటకిటలాడుతోంది. నాలుగు రోజుల కంటే గురువారం రద్దీ కాస్త తగ్గుముఖం పట్టడంతో భక్తులను అంతరాలయ దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోనే భోజనాలు చేస్తున్నారు.
ప్రత్యేక బస్సులు, మినీ వ్యానుల్లో వస్తున్న భక్తులు తమ వాహనాలను కనకదుర్గనగర్, భవానీపురం టీటీడీ స్థలంలో నిలుపుకుని దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో దుర్గాఘాట్‌కు చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి చేరుతున్నారు. రద్దీకి తగినట్టుగా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు భక్తులకు మైక్ ద్వారా పలు సూచనలు, సలహాలను ఇస్తున్నారు. ఈవో నర్సింగరావు గురువారం స్వయంగా మైక్ ప్రచార కేంద్రానికి చేరుకుని భక్తులకు సూచనలు చేశారు.
10వ రోజు ఆదాయం రూ.18.23 లక్షలు
పుష్కరాలను పురస్కరించుకుని 10వ రోజు దుర్గమ్మ దేవస్థానానికి రూ.18,23,501 ఆదాయం సమకూరింది. రూ.100, రూ.20 టికెట్ విక్రయాల ద్వారా రూ.7.53 లక్షల ఆదాయం వచ్చింది. 10వ రోజు 71 వేల లడ్డూలను విక్రయించారు. వివిధ సేవలు, కాటేజీల అద్దెల రూపంలో ఈ ఆదాయం సమకూరింది.