
మహాజాతరలా పుష్కరాలు
రూ.13.56 కోట్లతో {పతిపాదనలు
ఘాట్‌ల ఎంపిక పూర్తి చేసిన అధికారులు
410 మీటర్ల స్నానఘట్టాల నిర్మాణం
5 ఇన్‌ఫిల్టరేషన్ బావులు
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ఏర్పాటుకు సన్నాహాలు
మేడారం తరహాలో భారీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాలకు మేడారం మహాజాతర తరహాలో సకల ఏర్పాట్లు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చేయూల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పుష్కర ఘాట్‌ల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కిషన్ ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి ఇన్‌చార్జ్‌లుగా అధికారులను నియమిం చారు. ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ, స్పెషల్ ఎంఐ ఈఈలు గోదావరి పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించే నాలుగు చోట్ల స్నానఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదించారు. పుష్కర స్నానాలకు సంబంధించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాలుగు ప్రాంతాల్లో 410 మీటర్ల పొడవునా స్నానఘట్టాల నిర్మాణంతోటు ఇతర సదుపాయూలకు నీటి పారుదల శాఖ అధికారు లు రూ.13.56 కోట్లతో అంచనాలు రూపొం దించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ క్రమంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకోనున్నారుు.
2003లో 10 లక్షల మంది భక్తులు...
12 ఏళ్ల క్రితం (2003)లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. 12 రోజుల పాటు జరిగిన ఈ పుష్కరాల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. పుష్కరాల సందర్భంగా నీటి పారుదల శాఖ రామన్నగూడెం లాంచీల రేవు వద్ద తాత్కాలిక షెడ్లను మాత్రమే నిర్మించింది. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం వాహనాలు రెట్టింపు సంఖ్యల్లో పెరిగిపోవడంతో స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం లేకపోలేదు. దీనికి తోడుగా వచ్చే మార్చి నాటికి గోదావరిపై నిర్మిస్తున్న ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు జరిగే అవకాశాలున్నాయి. మన జిల్లా మీదుగా ఖమ్మం, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు వెళ్లే వారు ఈ రహదారిపై ప్రయాణిస్తారు. గత పుష్కరాల సమయంలోనే వరంగల్-ఏటూరునాగారం ప్రధాన రహదారిలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రహదారుల అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత అనుభవాల దృష్ట్యా పుష్కరాలకు తరలివచ్చే అశేషజనవాహినికి ఇబ్బందులు తలెత్తకుండా స్నానఘట్టాలు నిర్మించేందుకు అధికారులు ముందస్తుగా అంచనాలు సిద్ధం చేశారు. జూలైలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈసమయంలో గోదావరి వరద ఉదృతంగా ఉంటే పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తుల కోసం స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మిస్తున్నారు. మేడారం తరహాలో బ్యాటర్ ఆఫ్ ట్యాప్స్‌కు నిరంతరం నీటి సరఫరా చేసేందుకు స్నాన ఘట్టాల ప్రాంతాల్లో ఐదు ఇన్ ఫిల్టరేషన్ బావులు నిర్మించాలని అధికారుల ప్రతిపాదనల్లో ఉంది.
స్నానఘట్టాలు ఇలా...
రామన్నగూడెం : ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద లాంచీల రేవు ఉంది. ఇక్కడి నుంచి గోదావరి అవతలి ఒడ్డుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు లాంచీలు నడిచేవి. 2003 పుష్కరాలు రావడంతో తొలిసారి ఈరేవులో సిమెంట్ మెట్లు నిర్మించారు. ఈమెట్లకు పైభాగంలో స్నానాలు చేసేందుకు మొదటిసారిగా ప్రయోగాత్మకంగా నల్లాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్లకు అదనంగా మరో 10మీటర్లు స్నానఘట్టాలు నిర్మించేందు కు నీటి పారుదల శాఖ ప్రాతిపాదించింది. అప్పటి పుష్కరాల్లో స్నానఘట్టాలు, నల్లాల ఏర్పాటు కోసం రూ.12లక్షలు వ్యయం చేశారు. ప్రస్తుతం రూ.22.53లక్షలు కేటాయించారు.
ముల్లకట్ట : ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గ్రామ సమీపంలో 163 జాతీయ రహదారి అభివృద్ధిలో భాగంగా గోదావరి నదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతోంది. పుష్కర సమయానికి రహదారిపై రాకపోకలు ప్రారంభమవుతాయని భావిస్తున్న అధికారులు... ఈ బ్రిడ్జికి రెండు వైపులా 100 మీటర్ల చొప్పున స్నానఘట్టాల నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ స్నానఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌తోపాటు గోదావరిలో రెండు ఇన్‌ఫిల్టరేషన్ బావులను నిర్మించనున్నారు. ఇందు కోసం రూ.6.84 కోట్లతో అంచనాలు రూపొందించారు.
మంగపేట : మంగపేట మండల కేంద్రానికి అనుకుని ఉన్న గోదావరి నది ఒడ్డున నూతనంగా 100 మీటర్ల స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, దుస్తులు మార్చుకునేందుకు కంపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ ఒక ఇన్‌ఫిల్టరేషన్ వెల్‌ను నిర్మిస్తున్నారు. వరంగల్ నుంచి భద్రాచలానికి పోయే ప్రధాన రహదారి మధ్యలో మంగపేట ఉండడం వల్ల ఇక్కడకు పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముంది. గత పుష్కరాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయలే దు. ప్రస్తుతం ఇక్కడ స్నానఘట్టాలు నిర్మించేందుకు రూ.22.52 లక్షలు కేటాయించారు.
మల్లూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీహేమచల నర్సింహస్వామి దేవాలయం మంగపేట మండలంలోని మల్లూరులో ఉంది. గోదావరి పుష్కరాల సందర్భంగాపుణ్య స్నానాలకు వచ్చే భక్తులు ఈక్షేత్రాన్ని దర్శించే అవకాశాలున్నాయి. దీంతో ఈగ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున సుమారు 100మీటర్ల స్నానఘట్టాలు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. మల్లూరుకు వెళ్లే భక్తులు ఏటూరునాగారం వెళ్లకుండా గోదావరిలో స్నానాలు చేయడంతోపాటు దర్శనాలు చేసుకునే వీలుకలుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనుంది. ఇక్కడ నిర్మాణాల కోసం రూ.22.52లక్షలు కేటాయించారు.
ముల్లకట్ట వద్ద రెండు, రామన్నగూడెం, మంగపేట, మల్లూరు స్నానఘట్టాల సమీపంలోని గోదావరి నదిలో మూడు ఇన్‌ఫిల్లరేషన్ వెల్స్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.20.58 లక్షలు ప్రతిపాదించారు. అందులో స్నానఘట్టాల నిర్మాణానికి రూ. 11.34 కోట్లు, క్లోరినేషన్‌కు రూ. 23.17లక్షలు, మహిళల దుస్తులు మార్చుకునేందుకు రూ.24లక్షలతో డ్రస్సింగ్ రూములు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.75లక్షలు, ఇతరత్ర ఏర్పాట్ల కోసం రూ.79.25లక్షలు కేటాయించారు.
సౌకర్యాల కల్పనకు రూ.13.56కోట్లు
గోదావరి పుష్కరాల సందర్భంగా నాలుగు ప్రాంతాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు స్నానఘట్టాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మాణంతోపాటు సదుపాయాల కోసం రూ.13.56కోట్లతో ప్రాథమికంగా అంచనాలు రూపొందించాం. అందులో స్నానఘట్టాల నిర్మాణానికి రూ. 11.34కోట్లు, 5 ఇన్‌ఫిల్టరేషన్ బావుల కోసం రూ.20.58లక్షలు, క్లోరినేషన్‌కు రూ. 23.17లక్షలు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు రూ.24లక్షలతో డ్రెస్సింగ్ రూములు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కోసం రూ.75లక్షలు, ఇతరత్రా ఏర్పాట్లకు రూ.79.25 లక్షలు కేటాయించాం. ఈమేరకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాం. బడ్జెట్‌లో పుష్కరాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినందున ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే పనులు ప్రారంభిస్తాం. - పద్మారావు, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ