సోకులకే ప్రాధాన్యం
పుష్కర ఏర్పాట్లలో అంతా తానే అయిన వైనం
సేఫ్టీ కన్నా సోకులకే ప్రాధాన్యతనిచ్చిన సీఎం
సమీక్షల మీద సమీక్షల నిర్వహణ
అంతిమంగా దారుణ వైఫల్యం
హైదరాబాద్: గోదావరి పుష్కరాల ఏర్పాట్లను అన్నీ తానై పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరిగిన దుర్ఘటనకు ఎవరినీ బాధ్యులుగా చేయలేని స్థితిలో ఉన్నారని అధికార యంత్రాంగం పేర్కొంటోంది. ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల్లో ఏ ఒక్క అధికారికి కూడా పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణ అధికారాలను అప్పగించలేదు. మంత్రులతో పాటు అధికారులతో కమిటీల మీద కమిటీలను ఏర్పాటు చేశారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రే దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున ప్రచారం పొందాలనే యావతో గోదావరి పుష్కరాల హైపును స్వయంగా చంద్రబాబు నాయుడే పెంచారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతీ రెండు రోజులకూ రాజమండ్రి వెళ్లి చంద్రబాబు సమీక్షలను నిర్వహించారని, పుష్కర ఏర్పాట్లలో ఉండాల్సిన అధికార యంత్రాంగం ఆ సమీక్షలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చిందని, స్వయంగా ఏర్పాట్లపై ఆలోచించి అమలు చేసే తీరికే తమకు లేకుండా చేశారని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పుష్కర ఏర్పాట్లలో ప్రాధాన్యతను ఇవ్వాల్సిన పారిశుద్ధ్యం, సెక్యురిటీ, సేఫ్టీ అంశాలను విస్మరించారని, ఎంత సేపు లేజర్ షోలు, వెలుగుల డెకరేషన్‌ల ఏర్పాటుకే సీఎం ప్రాధాన్యాత ఇచ్చారని అదికార యంత్రాంగం పేర్కొంటోంది.
సమన్వయం, ప్రణాళిక లేమి...
తొలుత సాంస్కృతిక కమిటీ అంటూ పరకాల ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఆ తరువాత పరకాలను కాదంటూ మురళీ మోహన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ విధంగా పలు కమిటీలను ఏర్పాటు చేయడం ఆ తరువాత మార్పులు చేయడం జరిగింది. ఇలా ఏర్పాటు చేసిన వాటిల్లో ఒక కమిటీకి మరో కమిటీకి మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షించే అధికారం సీఎం పేషీలో ఎవరికీ ఇవ్వకపోవడం జరిగాయి. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన నిత్య హారతికి జనం రాకపోవడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరా మంగళవారం తెల్లవారుజామునే పుష్కర ఘాట్‌కు లక్షల సంఖ్యలో జనం చేరుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోక సీఎం పుష్కరఘాట్‌లోనే ఐదుగంటల సేపు గడపడం, సీఎం పూజలు పూర్తికాగానే జనాలను ఒక్కసారిగా వదలడంతో దారుణం జరిగిపోయింది. బాబు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో పుష్కర ఏర్పాట్లో ఉన్న అధికారులు కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే సీఎం ఏమంటారోననే భయంతో ఏ అధికారీ జవాబుదారీగా పనిచేయలేదని, సీఎం తీరే ఈ సంఘటనకు కారణమని వారు పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు.