
పుష్కరాలను కేసీఆర్ అపవిత్రం చేశారు
2019 ఎన్నికల్లో నా నాయకత్వంలోనే టీడీపీ పోటీ: రేవంత్‌రెడ్డి
మద్దూరు: గోదావరి పుష్కరాలను సీఎం కేసీఆర్ అపవిత్రం చేశారని టీటీడీపీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరులో మంగళ వారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ వదిన మూడు రోజుల క్రితం మరణించిం దని, ఇంట్లో ఎవరైనా మరణిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారం 12 రోజులపాటు శుభకార్యాలకు దూరంగా ఉండాలన్నారు. కానీ, కేసీఆర్ ఇవేమీ పట్టించుకోకుండా పుష్కరాలను ప్రారంభించడం రాష్ట్రానికే అరిష్టమని, దీనిపై రాష్ట్రంలోని పండితులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల పనులు చివరిదశలో ఉన్నాయని.. రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తే, ఆ పనులు పూర్తయి జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. అయితే, గత ప్రభుత్వాలు చేపట్టిన ఈ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తే కమీషన్లు రావని కేసీఆర్ వీటి జోలికెళ్లడంలేదని రేవంత్ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు కోసం రూ.35 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందో తెలపాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టకపోతే భారీస్థాయిలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తన నాయకత్వంలోనే పోటీ చేస్తుందని, ఘన విజయం కూడా సాధిస్తుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.