రూ.వందల కోట్లు కృష్ణార్పణం | Hundreds of crores were going as gambling | Sakshi
Sakshi News home page

రూ.వందల కోట్లు కృష్ణార్పణం

Published Tue, Oct 4 2016 3:53 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

రూ.వందల కోట్లు కృష్ణార్పణం - Sakshi

రూ.వందల కోట్లు కృష్ణార్పణం

సర్కారు అవినీతిలో కొట్టుకుపోయిన పుష్కర ఘాట్లు.. రోడ్లు!
వేసిన రోడ్లు గుంతలమయం.. కొన్ని చోట్ల రోడ్లే మాయం..
ఇంకొన్నిచోట్ల సొంత రియల్‌ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు
ప్రభుత్వ అండతో అధిక అంచనాలతో పనులు మంజూరు
ప్రతి పనిలోనూ స్థానిక పచ్చ నేతలకు కమీషన్లు
పుష్కరాలు జరిగింది 135 గ్రామాలు, ఒక నగర ప్రాంతంలోనే
లోటు బడ్జెట్‌లోనూ రూ.1472.39 కోట్లు ఖర్చు..
సరాసరి ఊరికి రూ.11 కోట్లు

 
సాక్షి, అమరావతి: ఒక్కొక్క ఊరికి రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ ఊరి రూపురేఖలే మారిపోవాలి. కానీ పుష్కరాల సందర్భంగా రూ.1472 కోట్లు ఖర్చుపెట్టినా కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లో ఆ మేరకు పనుల ఆనవాళ్లు కనిపించడంలేదు. నామినేషన్లపై పనులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు అరకొర పనులతో కనికట్టు చేసేశారు. కొన్ని చోట్ల ఉన్న రోడ్లపైనే కంకరపోసి బిల్లులు చేయించుకున్నారు. మరికొన్నిచోట్ల రోడ్లు వేయకుండానే వేసినట్లు చూపించేశారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసేశారు. ఘాట్ల నిర్మాణంలో ఎలాంటి నిబంధనలూ పాటించకుండా కంకరపోసి టైల్స్ అతికించేశారు. పుష్కరాలు ముగిసి నెలరోజులైనా మరికొన్ని చోట్ల ఘాట్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల మంది ప్రజల భక్తి విశ్వాసాలే పెట్టుబడిగా వందల కోట్ల ప్రజాధనాన్ని పుష్కరాల పనుల పేరుతో తెలుగు తమ్ముళ్లు దోచేసుకున్నారు. పుష్కరాల పనులు జరిగిన ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయం సచిత్రంగా స్పష్టమైంది.
 
రూ.1472 కోట్ల పనుల ఆనవాళ్లేవీ?
 రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా కృష్ణా పుష్కరాల పనులకోసం రూ.1349.37 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీనికి తోడు రాష్ట్రంలోని వివిధ ఆలయాల ఆస్తులకు సంబంధించిన కామన్ గుడ్ ఫండ్ నుంచి మరో రూ.123.02 కోట్లు దేవాదాయ శాఖ ఖర్చు చేసింది. మొత్తంగా పుష్కరాలకోసం రూ.1472.39 కోట్లు ఖర్చు చేయగా... అందులో రూ.1186.83 కోట్లతో రోడ్లు వంటి వివిధ నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల మాదిరి ఇతర అభివృద్ధి పథకాల్లో భాగంగా అక్కడ మరికొన్ని నిధులతో అదే సమయంలో జరిగిన అభివృద్ధి పనులు వీటికి అదనం.
 
గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని 135 గ్రామాల(శివారు గ్రామాలతో కలిపి)తో పాటు విజయవాడ నగరంలోనే రూ.1472.39 కోట్ల వ్యయంతో పుష్కర పనులను చేపట్టారు. అంటే ఒక్కొక్క ఊరికి సరాసరి రూ.11 కోట్లు వ్యయం. కానీ కృష్ణా తీరం వెంట ఉన్న ఆ గ్రామాల్లో రెండు మూడు నెలల కిందట ఉన్న సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీలున్న చోటల్లా టీడీపీ నేతలే నామినేషన్ ద్వారా పనులను దక్కించుకొని తూతూ మంత్రంగా పూర్తిచేయడంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధీ కనిపించడంలేదు. మిగిలిన చోట్ల పనులకు వాస్తవాని కన్నా అధికం మొత్తం అంచనాలతో మంజూరు చేశామంటూ టెండరు ద్వారా పనులు పొందిన వారి నుంచి స్థానిక అధికార పార్టీ నేతలు కమీషన్లు కొట్టేశారు.
 
నెలకే గుంతలు... లేదంటే పగుళ్లు  
పుష్కరాలకు జలవనరుల శాఖ గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మొత్తం రూ. 334 కోట్ల ఖర్చుతో 188 ఘాట్లు, ఘాట్ల వద్ద ఫ్లాట్ ఫారం పనులను చేపట్టారు. గుంటూరు, కృష్ణా,  కర్నూలు జిల్లా కలెక్టర్లు డిసెంబరు, జనవరి నెలలలోనే ఘాట్ల నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో గానీ వాటికి అనుమతులు మంజూరు చేయలేదు. టెండర్లు ప్రక్రియ మిగిలింది కేవలం రెండు నెలల సమయమే. ప్రభుత్వమే పనులు మంజూరు చేసిందే ఆలస్యం చేయడంతో కాంట్రాక్టర్లు కూడా తాము చేసే పనుల్లో నాణ్యత పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఆఖరిరోజు వరకు పనులు చేస్తూ వచ్చారు.

సిమెంట్ పని అంటే కనీసం వారం రోజుల పాటు నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ... పుష్కరాల ముందు రోజు కూడా చాలా ఘాట్లలో పనులు చేపట్టారు. దీంతో ఆ ఘాట్ల పుష్కరాలు జరుగుతున్న రోజుల్లోనే పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల ఘాట్ల వద్ద సిమెంట్ ప్లాట్‌ఫారాలు కుంగిపోయాయి. ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా పుష్కరాల కోసం వేసిన రోడ్లన్నీ నెల రోజులకే గుంతలమయం అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement