పుష్కరాలను ఘనంగా నిర్వహించి, రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్న తపనకంటే తనకు పేరు ప్రఖ్యాతులు రావాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరించిన తీరువల్లే 29 మంది మరణించారు. పుష్కరాల పనుల్లో అడుగడుగునా చంద్రబాబు స్వార్థపూరితంగా వ్యవహరించారు.
ఒక మహాకార్యం తలపెట్టినప్పుడు అందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాని చంద్రబాబు మాత్రం క్రెడిట్ అంతా తనకే దక్కాలనే అభిప్రాయంతో తానే సర్వస్వంగా వ్యవహరించారు.
సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పనుల తీరు పరిశీలన.. ఇలా అన్ని పనులను చంద్రబాబే స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఉన్నతాధికారులు ఎవరూ ఏర్పాట్లలో లోపాలను సరిదిద్దడానికి సాహసించలేదు. ఒకవేళ లోపాలను ఎత్తిచూపితే చంద్రబాబు ఆగ్రహిస్తారేమోనని మిన్నకుండిపోయారు.
మహాకుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించాలని తలచి, రూ.1,685 కోట్లను కేటాయించి, పుష్కరాల కీర్తి అంతా తనకే దక్కాలని భావించి చివరకు దేవాదాయశాఖ మంత్రిని కూడా పక్కనబెట్టారు.
గోదావరికి ప్రతి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరాలు ఇవేనంటూ.. పుష్కరాల్లో స్నానమాచరిస్తే పాపాలన్నీ పోతాయంటూ హడావుడి చేశారు. మూడుకోట్ల మందికిపైగా భక్తులు హాజరవుతారని ప్రకటించారు.
సినీ మాయాజాలంతో నిర్వహించిన నిత్యహారతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ పీఠాధిపతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు సరి కదా నిత్యహారతి సక్సెస్ అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేశారు.
కుంభమేళాకన్నా గొప్పగా గోదావరి పుష్కరాలు నిర్వహించారని, చంద్రబాబు మాత్రమే ఇలాంటివి చేయగలరని ప్రచారం చేసుకోవడానికి పుష్కరాలపై డాక్యుమెంటరీ తీయించి, దాన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్‌లో ప్రసారం చేయించడం ద్వారా దేశ విదేశాల్లో చంద్రబాబు అంటే అబ్బో అనిపించుకోవాలని ఎత్తుగడ వేశారు.
ఇలా పుష్కరాలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు... ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో మాత్రం తనకేమీ సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా లేదూ..?
ఇదీ.. బాబు తీరు
Published Sun, Jul 19 2015 1:16 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement