బాబే కారణం
బాధ్యత వహిస్తూ ఎలాగూ రాజీనామా చేయరు
కనీసం జాతికైనా క్షమాపణ చెప్పండి
మృతులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 27 మంది మృతి చెందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని పీసీసీ నేతలు ఆరోపించారు. ఇందిరా భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో ఒకరిద్దరు చనిపోతే అందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు 27 మంది చనిపోతే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాజీనామా ఎలాగూ చేయరు! కనీసం జాతికి క్షమాపణ చెప్పాలని, తప్పు ఒప్పుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వీఐపీ ఘాట్‌నువదిలి సామాన్యులు స్నానాలు చేసే ఘాట్ వద్ద ముఖ్యమంత్రి నాలుగు గంటలపాటు తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు, స్నానాలు చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
గోదావరి పుష్కరాలకు రూ.1,600 కోట్లు వెచ్చిస్తున్నామంటూ ఆరు నెలలుగా మీడియాలో ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవుళ్లకు నిలయమైన చోట కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం ఎంతవర కు సబబు అని నిలదీశారు. విగ్రహం పెట్టకపోతే ఈ అనర్థం జరిగేది కాదన్నారు.
మృతుల రోదనలు వినిపించడం లేదా?: చిరంజీవి
పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి చెప్పారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాలనా అనుభవం లేని వ్యక్తి ప్రభుత్వ సలహాదారుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాదాసు గంగాధరం, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి పాల్గొన్నారు.
దుర్ఘటనపై సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 27 మంది మరణించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులంతా పాలుపంచుకోవాలని సోనియా గాంధీ ఆదేశించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. రాజమండ్రి దుర్ఘటనపై ఆరా తీశారు. పుష్కర యాత్రికులకు సహాయ సహకారాలు అందించేందుకు రాజమండ్రికి వెళ్లాలని సోనియాగాంధీ సూచించారు. దీంతో రఘువీరారెడ్డి, చిరంజీవి తదితర ముఖ్య నేతలు హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు.