అదే సీఎం వైఎస్ జగన్ చేశారు
అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు
పేదలకు ఇచ్చే స్కీములు పప్పుబెల్లాలు కావు
హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుంది?
చంద్రబాబు బతుకంతా రెవెన్యూ లోటే.. సంపద సృష్టించిందెక్కడ?.. బాబు
దృష్టిలో పేదలంటే ఐదేళ్లకోసారి ఓట్లమ్ముకునే జీవచ్ఛవాలు
ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్‌మేన్ చిరంజీవి: పోసాని కృష్ణమురళి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని, ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందని వైఎస్సార్‌సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదని, మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న విషయం అర్బన్ ఓటర్లు గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ నవరత్నాల సంక్షేమాన్ని పంచుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతతో కూడిన మంచి భవితను అందించారని తెలిపారు. హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకో సారి ఓట్లు అమ్ముకునే జీవచ్ఛవాల్లాంటి వారని చెప్పారు.
సంపద సృష్టిస్తాం అనే చంద్రబాబు.. ఆయన సీఎం అయినప్పటి నుంచి దిగేవరకు ప్రతి బడ్జెట్‌లో రెవెన్యూ లోటు కనిపిస్తుందని, మరి సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మానవత్వానికి నిలువెత్తు రూపమైతే, మోసానికి మారుపేరు చంద్రబాబు అని అన్నారు. పోసాని బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పేదలకు ఇచ్చే స్కీములు పప్పుబెల్లాలు కావు. అవి హ్యూమన్ క్యాపిటల్. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఖజానా సొమ్మును పేదలకు పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సబబు అని నన్ను కొందరు అడిగారు. సీఎం జగన్ ప్రభుత్వ ఖజానా ధనాన్ని పేద ప్రజలకు పంచకపోతే ఈ పాటికి చంద్రబాబులాంటి అవినీతిపరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనమైపోయుండేవారని నేను వారికి చెప్పాను.
ఎందుకంటే.. చంద్రబాబుకు పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మిగల్చడమే తెలుసు. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించేవారికి నా సమాధానం ఏమిటంటే.. ఎత్తైన సిమెంట్ స్తంభాలతో, పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీరాదు. మానవాభివృద్ధి జరగాలి. మనిషనేవాడు జీవచ్ఛవం స్థాయి నుంచి తానొక మనిషిని అని రోడ్డు మీదకొచ్చి చెప్పుకోగలగాలి. ఈ పరిస్థితి చంద్రబాబుకు చేతగానిది. చంద్రబాబుకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకొచ్చి, వారి ఓటుకు విలువ కట్టి, ఓటుకు నోటు పంచడమే’ అని చెప్పారు.
ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారు
‘ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్‌మేన్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్న బిజినెస్‌మేన్ కూడా ఆయనే. ఇప్పుడు తమ్ముడ్ని గెలిపించాలని ప్రజలనడిగే అర్హత చిరంజీవికి లేదు. ఆయనకు రాజకీయం, సినిమా ఒకటే. డబ్బు గానీ, అధికారం గానీ వస్తే చేద్దామని, లేకపోతే ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన ఖర్మేంటని 18 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా అమ్మేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి. తప్పు తెలుసుకోని రాజకీయ అనర్హుడు చిరంజీవి’ అని పోసాని దుయ్యబట్టారు.
అర్బన్ ఓటర్లంతా బాబు మోసాల్ని గుర్తుంచుకోవాలి
‘చంద్రబాబు చేసిన మోసాలను అర్బన్ ఓటర్లంతా గుర్తుంచుకోవాలి. సీఎం వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయరన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన ఇప్పటివరకు ఎవరినీ దగా చేయలేదు. సీఎం జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను అన్ని విధాలుగా పైకి తెచ్చారు. పెత్తందార్లకు సీఎం జగన్ నచ్చడేమో కానీ, పేదలపాలిట ఆయన దేవుడు. మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ కూడా రైతులు, పేదల పట్ల దేవుడై నిలిచారు కదా? అధికారంలోకి రాగానే రైతుల్ని రుణ విముక్తులను చేశారు.
అప్పుడు అందరూ ఆయన్ని అభినందించారు తప్ప పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని అనలేదు. ఇప్పుడు సీఎం జగన్ చేసిందీ అదే. ప్రభుత్వం ఉన్నది పేదలను ఆదుకోవడానికే అని నిరూపించారు. ధనవంతులు కొందరు వారి కులాల్లో పేదలను ఆదుకుంటుంటారు. వారి కులాల్లోని పేద పిల్లల చదువులకు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తుంటారు. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసి, వారి బతుకులు మారుస్తున్నారు.
కులం, మతం , ప్రాంతం, రాజకీయం అనేది చూడకుండా ప్రభుత్వ సొమ్మును పేదవాడికి పంచి వారి జీవనప్రమాణాల్ని పెంచడం మంచి సంప్రదాయం. ఓట్ల కోసమే సీఎం జగన్ పేదవాళ్లకు డబ్బులు అకౌంట్లలో వేశారనడం ముమ్మాటికీ తప్పు. గతంలో రూపాయిలో పావలానే పేదవాడికి చేరేది. మిగతాదంతా అవినీతిపరుల జేబుల్లోకి పోయేది. ఇప్పుడు పైసా అవినీతి లేదు. నాలాంటి ఎంతోమంది ధనవంతులకు పేదవాడిని ఆదుకోవాలనే మనసు రావడానికి సీఎం జగనే స్ఫూర్తి’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment