అభిప్రాయం
రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇరు వర్గాలూ జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రతిపక్ష కూటమి ముప్పొద్దులా జగన్‌పై విరుచుకుపడడమే వారి పంథాగా బరిలోకి దిగింది. వారి వైఖరి గమ నిస్తే ఎన్నికలకు ఒకటే అజెండా పెట్టుకున్నట్టున్నారు – జగన్‌ని వ్యతిరేకించడం! సిద్ధాంతపరంగా కాక కేవలం ఒక వ్యక్తిని వ్యతిరేకించడం ఏమి విధానం? పవన్ కల్యాణ్ వంటి వారైతే ‘జగన్ వ్యతిరేక ఓటు’ అని కొత్త నామ కరణం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే ఒక నిర్వచనం ఉంది. ‘జగన్ వ్యతిరేక ఓటు’ ఏంటి? జగన్ అమలు చేసిన సంక్షేమ వ్యతిరేక ఓటా?
మరి అదే వారి ఉద్దేశం అయితే ‘మేము ప్రభుత్వం నెలకొల్పితే జగన్ సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం’ అని చెప్పే ధైర్యం చేయగలరా? పైపెచ్చు వారు ‘సూపర్ సిక్స్’ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించారు. అంటే వీరు చేస్తే గొప్ప, జగన్ చేస్తే ఖజానా కుప్పకూలుటా? ఇదెక్కడి తర్కం? చంద్రబాబు నాయుడు ప్రతి సభలోనూ ‘ఈ దుర్మార్గుడు’ అని జగన్‌పై అక్కసు వెళ్లగక్కడం తనలోని కార్పణ్యానికి తార్కాణం. డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల డబ్బుని లక్షల కోట్ల రూపాయల మేర పేద ప్రజలకే చేర్చడం దుర్మార్గమా? అదే అయితే బాబు పదే పదే ‘నేను వస్తే ఆడబిడ్డకు 15,000 చొప్పున మీ బ్యాంకు ఖాతాలలో వేస్తాను అనే ‘దుర్మార్గ’పు హామీ ఎందుకు ఇస్తున్నారు?
అంటే, ‘జగన్ వ్యతిరేక ఓటు’ రాబట్టడానికి కూటమి దగ్గర ఉన్న ప్రణాళిక... అదే సంక్షేమం అనే మందుని కొత్త సీసాలో అమ్మదలచటమా? ‘జగన్ వ్యతిరేక ఓటు’ అంటే ఎక్కువగా యెల్లో మీడియా ప్రభావంతో నిజాన్ని చూడలేకపోతున్న వారి ఓటు. నిజానికి ‘జగన్ వ్యతిరేక ఓటు’ అనే నినాదంతో వెళ్ళడం లోనే భావదారిద్య్రం కనిపిస్తుంది. నిబద్ధత ఉన్న ప్రతిపక్షం అయితే వారు వేరేగా ఏమి చేస్తారో చెప్పాలి. 14 ఏళ్లు వెలగబెట్టి చేయని మేలు ఈ రోజు కొత్తగా చేస్తాము అంటే జనం నమ్మే పరి స్థితి లేదు. గత 10 ఏళ్లు కేంద్రంలో తిరుగులేని ఆధిక్యంతో ప్రభుత్వాన్ని నడుపుతూ కూడా ఆంధ్ర ప్రదేశ్‌కు ఇవ్వవలిసిన ప్రత్యేక హోదా ఇవ్వని బీజే పీతో కూటమి ఏర్పరిచి, ఈసారి గెలిచేది మళ్ళీ మోదీ కాబట్టి మమ్మలిని గెలిపించండి అనడం దివాళాకోరుతనానికి పరాకాష్ఠ.
ఈ మధ్య జరుగుతున్న సభల్లో చంద్రబాబు రైతులపై వల్లమాలిన ప్రేమ వొలకపోస్తుంటే జుగుప్స కలుగుతోంది. ‘ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోడానికి తప్ప పనికిరావు’ అని బాబు ఎద్దేవా చేయలేదా? ఆలూరు సభలో పత్తి రైతులకు మేలు చేస్తాను అని బాబు అంటుంటే అప్పట్లో ఇదే రైతుల ఇళ్లలోకి ప్రభుత్వమే చొరబడి బకాయిలకు బదులుగా వంట పాత్రలు, గిన్నెలు జప్తు చేసిన వైనం గుర్తుకొస్తుంది.
ఒక పక్క నోరు విప్పితే ఆడవారిని కించ పరిచి, హత్యారోపణలు ఎదుర్కొని మతి స్థిమితం లేదనే నెపంతో చట్టానికి దొరక్కుండా బయట పడ్డ బాల కృష్ణ, మరో పక్క సొంత పార్టీకి చెందిన బహుజన నాయకులను కాలరాస్తూ బాబు బినామీలు అయిన వారికి తన పార్టీ సీట్లు కట్టబెట్టిన పవన్ తారా శక్తి చాలక సరికొత్తగా చిరంజీవి కూడా కూటమి కుంపట్లో కాలు పెట్టారు.
చిరంజీవి అప్పట్లో ఒక బలమైన ప్రత్యా మ్నాయం కోసం కృషి చేసి, ఓర్పు లేక కేంద్ర మంత్రి పదవి కోసం కాంగ్రెస్ దరిచేరి, దాన్ని పూర్తిగా అనుభవించి ఇప్పుడు కాషాయ మాత్రలు మింగుతూ సీఎం రమేశ్ లాంటి వారి కోసం ప్రత్యేక వీడియో సందే శాలు ఇస్తున్నారు. ఇంకో అడుగు ముందు కేసి చంద్రబాబు తన తమ్ముడితో కలిసి కూటమి ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మేలు అని చెప్ప డంతో, అదే కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసిన పురందేశ్వరిలానే ఈయన కూడా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే ఫక్తు రాజకీయ కళాకారుడు అని తేలిపోయింది. ఇలాంటి విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని ప్రజలు తిరస్కరిస్తారని ఆశిద్దాము.
డా‘‘ జి. నవీన్
వ్యాసకర్త సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకులు ‘ naveen.prose@gmail.com
Comments
Please login to add a commentAdd a comment