రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, మంత్రిగా పవన్‌కళ్యాణ్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ నజీర్. చిత్రంలో ప్రధాని మోదీ
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
ఉదయం 11.33 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
మంత్రులుగా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, లోకేశ్
మరో 22 మంది మంత్రులుగా ప్రమాణం
హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు
చిరంజీవి, రజనీకాంత్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, మంత్రులుగా మరో 24 మంది బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. గన్నవరం ఐటీ పార్కు వద్ద కేసరపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముందుగా చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ సహా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రజనీకాంత్, చిరంజీవి సహా పలువురు సినీ స్టార్లు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, చంద్రబాబు దంపతులు ఆశీనులయ్యారు. వేదికకు ఎడమ వైపు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు కూర్చోగా, కుడివైపు ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు కూర్చున్నారు.
చంద్రబాబుతో ఉదయం 11.33 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం చంద్రబాబును వేదికపైనే ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖుల వద్దకెళ్లి చంద్రబాబు నమస్కారం చేశారు. చంద్రబాబు తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. అనంతరం పవన్ ప్రధాని, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు తన సోదరుడు, మెగా స్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు.
ఆ తర్వాత వరుసగా నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి. బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేశారు. చంద్రబాబు సహా 24 మంది దైవ సాక్షిగా ప్రమాణం చేయగా, ఎన్‌ఎండీ ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేశారు.
ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పదాలను ఉచ్ఛరించడంలో ముగ్గురు మంత్రులు తడబడ్డారు. వాసంశెట్టి సుభాష్ తడబాటుకు లోనై కొన్ని పదాలు పలకలేకపోయారు. కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్థన్‌రెడ్డి కూడా తడబాటుకు లోనయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు మంత్రివర్గ సభ్యులతో ప్రధాని మోదీ గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయన్ను ప్రత్యేకంగా సన్మానించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. అనంతరం పవన్ కళ్యాణ్ వేదికపై తన సోదరుడు ఉన్నారని చెప్పగా ప్రధాని మోదీ చిరంజీవి వద్దకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు.
మోదీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేతులను పైకి లేపి సభికులకు అభివాదం చేయడం విశేషం. చంద్రబాబు రజనీకాంత్‌ను చూపించగా మోదీ ఆయనకు నమస్కరించి పలకరించారు. వేదికపై ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, ఇతర కేంద్ర మంత్రులకు మోదీ అభివాదం చేశారు. ప్రమాణం చేసిన తర్వాత పలువురు మంత్రులు తనకు పాదాభివందనం చేయబోతుండగా ప్రధాని వారించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే ఆయన సమీపంలోని ఎయిర్‌పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఒడిశాకు పయనమయ్యారు.
హాజరైన ప్రముఖులు వీరే
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జితన్ రామ్ మంజి, చిరాగ్ పాశ్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనుప్రియా పాటిల్, రామ్‌దాస్ అథవాలే, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తదితరులు కూడా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment