కన్నీటి గోదారి...
పుణ్య తిథుల్లోనే భక్తుల రద్దీ
కొవ్వూరు నుంచి సాక్షి ప్రతినిధి : విశేష ప్రాశస్త్యం ఉన్న పుష్కరాలకు భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. మరోవైపు అధికారులు పుణ్య తిథులు, వాటి ప్రాశస్త్యాన్ని బట్టి రద్దీ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తిథి, నక్షత్రాన్ని దీనికి అనుగుణంగా ఉండే దేవతా గణాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
అధికారిక అంచనాలు ఇలా..
ఈ నెల 15వ తేదీ శివనక్షత్రం, 16వ తేదీ అమవాస్య కావడంతో పిండ ప్రదానానికి శ్రేష్టమైన రోజు, 17వ తేదీ దక్షిణాయన పుణ్యకాలం ఉండటం, 18 వారాంతం కావడం, 19వ తేదీ ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న మఖ నక్షత్రం కావడం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 20వ తేదీ పుబ్బ నక్షత్రం, 21వ తేదీ ఉత్తర, 22వ తేదీ హస్త నక్షత్రాలు కావడంతో భక్తులు సాధారణ సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీ గురువారం సప్తమి, చిత్త నక్షత్రం కావడంతో పుణ్యస్నాన ఆచరణకు యోగ్యమైన రోజు. 24వ తేదీ గురువారం అష్టమి, స్వాతి నక్షత్రం రోజున పుష్కర యాత్రికుల సంఖ్య సాధారణంగా ఉంటుంది. 25వ తేదీ శనివారం విశాఖ నక్షత్రం, ఆఖరి రోజుకావడంతో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది.
ఎప్పుడేం జరిగింది?
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన రాజమండ్రి పుష్కర్ ఘాట్ మంగళవారం తెల్లవారుజాము నుంచే జనసంద్రంగా మారింది. తొలిరోజు దాదాపు లక్ష మంది భక్తుల తరలివచ్చారు. వారిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ అధికారులు, పోలీసుల వైఫల్యం కారణంగా 27 మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎప్పుడేం జరిగిందంటే...?
►తెల్లవారుజామున 3 గంటల నుంచే పుష్కర్‌ఘాట్‌కు భక్తుల రాక.
► 5.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు.
► 5.50 గంటలకు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆగమనం.
► 6 గంటల నుంచి పుష్కరాల ప్రారంభోత్సవానికి వేదపండితుల మంత్రోచ్ఛరణలు.
► 6.28 గంటలకు సీఎం చంద్రబాబు, జయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానం చేశారు.
► 6.45 గంటల నుంచి చంద్రబాబు తన పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు.
► 7.30 గంటలకు చంద్రబాబు పుష్కరఘాట్ నుంచి బయటకు వెళ్లారు.
►8 గంటల వరకు పుష్కరఘాట్ వెలుపల చంద్రబాబు బట్టలు మార్చుకున్నారు.
► 8.30 గంటలకు పుష్కరఘాట్ నుంచి సీఎం కాన్వాయ్ బయల్దేరింది.
►8.30 గంటలకు పుష్కరఘాట్ మొదటి గేటును తెరిచారు. అప్పటివరకు నిరీక్షిస్తున్న భక్తులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు.
► 9 గంటలకు స్నానం చేసిన భక్తులు బయటకు వస్తుండగా.. బయట ఉన్న వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు
► 9.30 గంటలకు మూడు గేట్లు ఒక్కసారిగా తెరవడంతో భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది.
►9.30 నుంచి 10.30 వరకూ భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి.
► 10.30 గంటలకు భక్తులను నిలువరించేందుకు పోలీసులు, అధికారుల ప్రయత్నించారు.
►11 గంటలకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
► 11 గంటలకు అప్పటికే మృతి చెందిన వారిని ఒకచోటుకి తరలించారు.
►11.30 గంటలకు ఆక్టోపస్ (బ్లాక్ కమెండోల) బృందం రంగ ప్రవేశం చేసింది.
► 11.30 గంటల నుంచి భక్తులు ఘాట్‌లో ప్రవేశించడంపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు.
►12 గంటల నుంచి పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ తగ్గింది.
పుష్కరాల్లో మృతులు వీరే..
గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతిచెందారు. వీరిలో 24 మంది మహిళలు కాగా, ఇద్దరు పురుషులు, మరొక బాలుడు ఉన్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించాల్సి వుంది. మృతుల్లో 15 మంది ఉత్తరాంధ్రవాసులే ఉన్నారు.
మృతి చెందిన వారు..
1. దేశినీడి కృష్ణవేణి(52), వేమగిరి-రాజమండ్రి
2. బి.రాజ్యలక్ష్మీ(50), ఉండి-పశ్చిమగోదావరి జిల్లా
3. గొర్రెల మంగమ్మ(60), వెలమతోట- వైజాగ్
4. ఎ.గౌరి(16), వైజాగ్
5. పుట్టు నాగలక్ష్మీ(42), బలగ-శ్రీకాకుళం
6. పర్వతాల రాజేశ్వరి(32), పోలీస్ కాలనీ-నెల్లూరు జిల్లా
7. ఎల్.బి.పేరమ్మ(53), నెల్లూరు
8. లంబ తిరుపతమ్మ(40), కాశీపురం-శ్రీకాకుళం
9. ఎం.మహాలక్ష్మీ(65)-వైజాగ్
10. పాండవుల విజయలక్ష్మీ(61), చినముసలివాడ-వైజాగ్
11. మైగాపుల లక్ష్మణరావు(65), తాడేపల్లిగూడెం
12. ఎ.బయ్యారమ్మ(45)-వైజాగ్
13. పి.మీనాక్షి(65), జంషెడ్‌పూర్
14. ఎం.అనంతలక్ష్మీ(30), ధవళేశ్వరం
15. జడ్డు నరసమ్మ(50), సరసనపల్లి-శ్రీకాకుళం
16. బి.ప్రశాంత్‌కుమార్(15), బలగ-శ్రీకాకుళం
17. కొత్తకోట కళావతి(60), బొద్దూరు-శ్రీకాకుళం
18. కె.జానకమ్మ(55)-నెల్లూరు
19. పైలా పెంటమ్మనాయుడు(60), సరసనపల్లి-శ్రీకాకుళం
20. సి.రంగస్వామి(60), జయశ్రీనగర్-బెంగుళూరు
21. మట్టపర్తి సత్యవతి(55), ధవళేశ్వరం
22. ఎస్.అమ్మాయమ్మ(75), శ్రీకాకుళం
23. అమలాపురం పైడితల్లి(55), బొబ్బిలి-విజయనగరం
24. పుట్నూరి అమరావతి(45), ఆమదాలవలస-శ్రీకాకుళం
25. ఆదిపాక నారాయణమ్మ(60), కొత్తవలస, విజయనగరం జిల్లా
+ ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరూ మహిళలే.
గాయపడినవారు వీరే..
పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడినవారి వివరాలు: బిక్కిన వెంకటలక్ష్మి (రాజమండ్రి లాలాచెరువు), హరి కిరణ్మయి (పలాస), యండమూరి రత్నం (యానాం), సురేష్(విశాఖపట్నం), హనుమంతరావు (రాజమండ్రి), గనివాడ కృష్ణవేణి (విజయనగరం), ఇందిర (శ్రీకాకుళం), సత్యవతి (సింహాచలం), కన్నూరి బాబూజీ (తేజపురం-విశాఖ జిల్లా), శకుంతల (కృష్ణపురం), స్వర్ణలత (పలాస), రమాదేవి (రాజమండ్రి తిలక్ రోడ్డు) తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు 49 మంది స్వల్పంగా గాయపడ్డారు. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 150 మంది చికిత్స పొందారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం
ఒక్కసారిగా వెనుకవైపు నుంచి తోసివేశారు
మేము తెల్లవారుజామున వచ్చినా.. 8. 30 వరకూ ఘాట్‌లోకి రానివ్వలేదు. ఒక్కసారిగా భక్తులందరూ ఘాట్‌లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 20 మంది వరకూ వచ్చాం. తొక్కిసలాటలో మా బంధువులు పోట్నూరి అమరావతి, భరతం ప్రశాంతి, కొత్తకోట కళావతి మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. గాయాలపాలైనవారిని సకాలంలో హాస్పటల్‌కు తీసుకువెళ్లి ఉంటే కొంతమంది అయినా బతికేవారు.
- సొంగల తేజ, శ్రీకాకుళం
అంతమందికీ ఒకే ఒక్క అంబులెన్స్
సంఘటన జరిగిన సమయంలో పుష్కర ఘాట్‌లో ఒకే ఒక్క అంబులెన్స్ ఉండడంతో గాయాలపాలైనవారికి సకాలంలో వైద్య సేవలు అందించలేకపోయారు. దీంతో చాలామంది మృతి చెందారు. గాయాలపాలైనవారికి పట్టించేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవు. చచ్చిపోతున్నాం మంచినీళ్లు ఇవ్వమన్నా వినిపించుకున్న నాథుడు లేడు. ముఖ్యమంత్రి తన స్నానానికి భక్తులను బలి తీసుకున్నారు.
- జి.అప్పలనాయుడు, నరసన్నపల్లి, రేగిడి మండలం, శ్రీకాకుళం
సౌకర్యాలు సరిగా లేవు
పుష్కరాల రేవులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే ఇంత తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వీఐపీలకు వేరే ఘాట్ ఉన్నా సీఎం చంద్రబాబు ఇదే ఘాట్‌లో స్నానం చేయడంవల్ల స్నానం చేసేందుకు ఆలస్యమై, తొందరలో తొక్కిసలాట జరిగింది.
- వెంకటేష్, శ్రీకాకుళం జిల్లా
అమ్మ చనిపోయింది..
స్నానం చేసేందుకు మా అమ్మ, నేను, మా అబ్బాయి కలిసి వెళ్లాం. స్నానాల రేవులోంచి బయటకు వచ్చేవారు ఒకే దారి అవడంతో రద్దీ అధికమైంది. ఈ తొక్కిసలాటలో మా అమ్మ చనిపోయింది దేవుడా...
-జనపాల అరుణకుమారి, విశాఖజిల్లా .