మతాలకతీతంగా పుష్కరాలు: చంద్రబాబు
సాక్షి, అమరావతి : పుష్కరాలు మతాలకు అతీతమైనవని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పుష్కరమనేది నదికి కృతజ్ఞతలు తెలుపుకునే కార్యక్రమం కాబట్టి హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా మతాలకతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బుధవారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. రూ.123 కోట్లతో నిర్మించిన ఇన్నర్ రింగ్‌రోడ్డును ప్రారంభించారు. రూ.10.5 కోట్లతో ముస్లింల కోసం నిర్మించనున్న షాదీఖానాకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
ఒకవైపు కృష్ణానది, మరోవైపు నగరం మధ్యలోంచి పారుతున్న కాలువలు ఉండడం అదృష్టమని, త్వరలోనే కొత్త విజయవాడను చూస్తారని అన్నారు. ధనిక, పేద తేడా లేకుండా పుష్కరాలకు వచ్చే అతిథులను గౌరవించాలని, నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలంతా పుష్కరాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హజ్ యాత్రికుల కోసం త్వరలో విజయవాడ నుంచి జెద్దాకి నేరుగా విమాన సర్వీసులను తీసుకొస్తానని బాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ముసాఫిర్ ఖానా స్థానంలో ఐదంతస్తుల్లో నిర్మిస్తున్న షాదీఖానాను ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. కనకదుర్గగుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పుష్కరాలకు సిద్ధం కావడం లేదని, పనులు త్వరగా పూర్తిచేయాల్సిందిగా భద్రత ప్రమాణాల దృష్ట్యా ఒత్తిడి తీసుకురాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పుష్కరాల తర్వాత బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
రింగ్‌రోడ్డుతో గంట ఆదా!
ఇన్నర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడం తో హైదరాబాద్, చెన్నై జాతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలు ఇకమీదట విజయవాడ సిటీలోకి రాకుండా నేరుగా కోల్‌కతా జాతీయ రహదారిని చేరుకోవచ్చు. దీనివల్ల గంట సమయం కలసి వస్తుందని అంచనా. 2008లో దీనికి శంకుస్థాపన చేశారు.